జన్మతః తెల్సావైనట్టి సాహితీలక్ష్యాలు సాధించడంలో తెల్సా కథ, నాటికల పోటీ ఒకటి. తెల్సాకి ముఖ్యమైన యితర లక్ష్యాలున్నాయ్. వాటి గురించి మరొకచోట ప్రస్తావించాను.
1997 లో లాసేంజలస్లో తానా (TANA) సభలప్పుడు అమెరికానుండి మొట్టమొదటిసారిగా నవలల పోటీ పెట్టడంతో ఆరంభించి, 1999-2003 మధ్య అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) వారి ద్వైమాసిక పత్రిక “అమెరికా భారతి” సంపాదక వర్గంగానూ, 2006 లో లాసేంజలస్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభలప్పుడు కథలు, కవితలు, నవలలు, నాటకాలు అన్నింటా పలుమార్లు పోటీలు నడిపించి, బహుమతులు ఇచ్చి, వాటిని “కబురు”లో ప్రచురించి ప్రోత్సహించడం, ఇప్పుడు తెల్సా నిర్వాహకులుగా కథ, నాటకరచనలలో పోటీ పెట్టి రచయితలకు మరో అవకాశం యివ్వడం వరకూ తెల్సా బృందానికి పాత్ర, అనుభవం ఉన్నాయి. అయితే ఇతఃపూర్వం నడిపించిన పోటీలన్నింటా మధ్యవర్తులుగా మాకు వార్త, ఆంధ్రజ్యోతి పత్రికలు సహకరించాయి. ఈ సారి పోటీప్రకటన ముద్రించడం వరకు మాత్రమే సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సారంగ వెబ్పత్రిక వారి సహకారం కోరాం. సాంఘికమాధ్యమాలు కల్పించిన అవకాశం ఈ మార్పుకు దోహదం చేసింది. ఎప్పటికప్పుడు రచయితలకు సమాచారం అందించడం, వచ్చిన రచనలు తొందరగా పరిశీలించడం, ఎన్నికైన రచనల గూర్చిన సమాచారం ఆయా రచయితలకు తెలియజేయడం, వారివారి పారితోషికాలు వారికి చేరెయ్యడం- ప్రతిదీ సుళువుగా చెయ్యగలిగాం. ఆయితే అన్నీ మేమే చెయ్యాల్సిరావడంతో, చదవవలసిన రాశి పెరిగింది.
ఈ పోటీలో పాల్గొన్నవారిలో ఎందరో కొందరు మమ్మల్ని పరీక్ష చెయ్యడానికి రచనలు పంపిస్తారని మాకు ముందే తెలుసు. అయినా ఎవరు రాశారనే విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టి, ఏం రాశారనేది మాత్రమే పరిశీలించి మా ఎన్నిక చెయ్యడం జరిగింది. అందరూ మా ఎన్నిక ఆమోదిస్తారనే అత్యాశ మొదట్నుండీ లేదుగాని, మేం చిత్తశుద్ధితో వ్యవహరించామన్నది, మాకు గుణగణ్యవివక్ష వున్నది అన్నది ఒప్పుకుంటారని ఆశించడం అత్యాశ అనుకోవటం లేదు. ఒప్పుకోకపోయినా బాధపడేదీలేదు.
ఇక పోటీలో బహుమతులకై ఎన్నుకోబడిన కథల విషయంలో రెండుమాటలు.
జీవనోపాధి లేమి, యువతలో పనికిమాలిన చదువులవల్ల అలముకున్న పనిలేనితనాన్ని, తరతరాలుగావచ్చే వృత్తికి పనికిరానితనాన్ని, ఎదిగినకొడుకు కదలనికొండలా, గుదిబండలామారి, నైరాశ్యానికీ, నిరాసక్తతకీ, నిర్లిప్తతకీ బానిసై కళ్ళముందే క్షీణించిపోతుంటే, కారణం అర్థంచేసుకోలేక, నేరం ఎవరిదో, దేనిదో తెలియక గుండెలవిసిపోయే వ్యధతో కుమిలే తండ్రి కొండ కథలో నేటి అభివృద్ధిపంథాలోని డొల్లతనానికి ప్రతీక.
ఏది అసలుసిసలువిలువ అన్నవిషయం, తరతరాలుగా చెలామణీ అవడంవల్ల పటాటోపాన్ని పటాటోపంగా గుర్తించలేకపోవడం, విలువైనవస్తువుగా పేరొందేవాటికీ, ఆపేక్షింపబడేవాటికీ, కొలవబడేవాటికీ విలువకల్పించే మూలధాతువును గుర్తించలేనితనం అనేవి తాత్వికంగా, రసవత్తరంగా, వినోదాద్మకంగా ఇదీ అదీ అని విపులీకరించకుండా, చెప్పీచెప్పని మార్మికతతో చెప్పడంలో రాగరాగిణి కథ రచయిత సాహితీలాఘవాన్ని తెలియజేస్తుంది.
‘మనిషితనం’ అనేదాన్ని మించిన విలువ లేదని, డబ్బుతో మలినం చెయ్యకూడని సాంప్రదాయాలు, నమ్మకాలు వుంటాయని చూపే ఓ సామాన్య స్త్రీ కథనం వరాలత్త గాజులు. అసామాన్యమైన భాషామాధుర్యం, తెలుగుదనం ఒలకబోస్తుంది.
ముష్టివాళ్ళ బతుకుల్లో ప్రేమలు-అసూయలు-స్నేహాలు-హింస చక్కని నుడికారంలో సున్నితంగా, హృద్యంగా చెప్పిన తీరు ఈ గాయమెంత తియ్యనో కథకి తెచ్చిన వన్నె అపారం. కథ చివర్లో లక్ష్మి చేత “ఇద్దరం కలిపి ఆడిని సంపేద్దాం, సరేనా?” అనిపించడంలో స్త్రీ-పురుష సంబంధాలలో స్త్రీకి మాత్రమే సాధ్యమౌతుందా అనిపించే ‘అంకిత’ భావం సూచిస్తారు రచయిత.
రాగరాగిణి లాగానే నాగరి’కథ’ కూడ ఒక తాత్విక కథనమే. కథ పేరులోనే రచయిత నాగరికత నేతిబీరకాయ అని సూచించారు. మరొకచోట ఆ’ధుని’కతలోవున్నది ధుని మాత్రమేనని యాగీచేస్తారు. ఈ కథలో ‘కోరిక’ కీలకపాత్ర. వెర్రితలలు వేస్తుందన్నది అభియోగం. పతనానికి కారణం. ఎంతటి నవనాగరికులమని, ఆధునికులమని అనుకునేవారూ, తీరనికోరికలెదురయ్యేసరికి తరతరాలనాటి మౌఢ్యాన్నే ఆశ్రయిస్తారు. విజ్ఞానం ఎదగచ్చు, విజ్ఞత పెరగదు. ఎందరు సంస్కర్తలు, ఎన్నిమార్లు మానవతాకేతనాన్ని ఎగరేసినా పరాత్పరుని ప్రకృతిగా, సత్యం, శివం, సుందరంగా చూపినా మళ్ళీమళ్ళీ కోరికదే విజయం. లాలస ఉప్పెనౌతుంది. ఆ వరదలో అన్నీ కొట్టుకు పోతాయ్. అమాయకత్వానికి ఆశ్రయంగా, హద్దుమీరని కోరికకి ఆలవాలంగా ఉండే జనపదం ఉనికిని విశృంఖలమైన కోరికతో వికృతమైన ‘నాగరీక’జీవనం ముంచివేస్తుంది. దేవుడ్ని తన అవసరాలకు బానిసచేసి బంధిస్తుంది. మతం చట్రంలో బిగిస్తుంది.
మూర్తి కలం ఉబికి ఉబికి పారుతుందీ కథలో. భావసాంద్రత, నర్మగర్భత్వం, ‘ప్రతీక’త్వం పుష్కలం. పలుమార్లు చదివితేగాని రచయిత ఆంతర్యం చిక్కదు. చిక్కినట్టే చిక్కి దొరక్కుండా పోయినా ఆశ్చర్యంలేదు. ఈ కథ చదువుతుంటే “The past is never dead. It is not even past”, అన్న William Faulkner మాటలు గుర్తొస్తాయ్. దాంతోపాటు గతంలో ఓ స్వర్ణయుగం ఉండేదనుకునే జనబాహుళ్యపు భ్రమకూడా తలపుకు రావచ్చు.
మేం ఎన్నుకున్న ఈ బహుమతి రచనల్లోను, ఇతరరచనల్లోనూ విస్తృతమైన ఇతివృత్తాలు కనిపిస్తాయ్. మేం కోరినట్టే సమకాలీన తెలుగుజీవితాల్ని అస్తవ్యస్తంగాకదుపుతూ, అస్థిరంచేస్తూ, కలవరపరుస్తూన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను సాంప్రదాయవారసత్వవిలువలుగా, విశ్వాసాలుగా సంక్రమించిన జీవనసరళితో, భావజాలంతో ఎట్లా సమన్వయం చేసుకోవాలో ఏ విధంగా లొంగదీసుకోవాలో, ఎలా సర్దుకుపోవాలో తేల్చుకోని సమాజనికి అద్దం పడుతున్నాయ్ రచనలు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అస్థిరతే తెలుగుజీవితాల్ని మరింతగా కమ్మిందనే నిజాన్ని బయటపెడ్తున్నాయ్. తెలుగు కథ సుష్టుగా, పుష్ఠిగా వుందని తెలియజేస్తున్నాయ్. ఈ పోటీలో గుర్తింపు పొందిన రచనలు, రాబోయేకాలంలో ఎన్నో సంకలనాలలో కనిపిస్తాయ్ అని నమ్ముతున్నాం.
ఇక నాటకాల విషయంలోకొస్తే, కథారచనలో వున్న పట్టుకనిపించలేదు. ఇతివృత్తం అత్యయికతని బట్టి, సంఘం మొత్తం ఠక్కునలేచి నిలబడి పట్టించుకోవలసిన సమస్యని ఆసక్తికరంగా ప్రస్తావించడాన్ని దృష్టిలోపెట్టుకుని పిపాస నాటికను ఎన్నుకున్నాం. కొన్ని అనవసరమైన మాటలు తొలగించి మరింత బిగువుగా, అనవసరమైన నాటకీయత లేకుండా, కీలకమైన ప్రశ్నల సమాధానాలు ప్రేక్షకులకే వదిలివుండాల్సిందనిపించి పారితోషికం కొద్దిగా తగ్గించాం. విపరీత వ్యక్తులు, అంజలి నాటకాల్లో కూడా ఇటువంటి అవకాశమే కనబడింది. ఆయితే అన్ని నాటకాలు ప్రదర్శన యోగ్యంగా, ఇతివృత్త వైశిష్ట్యంతో వున్నాయి. మరింత ఆలోచించి కాస్తంత తిరగరాస్తే, నాటకాలు మూడూ ఇంకా బాగుంటాయ్. వివరంగా మా వ్యాఖ్యలు రచయితలతోనే పంచుకుంటాం. ప్రచురణకై మేం అంగీకరించని వాటిలో కూడా, తిరగరాతతో ప్రదర్శనానుకూలత పెరగగల నాటకాలు మరిన్నివున్నాయ్. తీరుబడిని బట్టి ఆయా రచయితలను సంప్రదిస్తాం.
విజయవంతంగా పోటీ జరిపించడంలో సింహభాగంపాత్ర పోషించిన పద్మకీ, అతినిశితమైన తనమేధస్సును అడిగినప్పుడల్లా ఎరువిచ్చిన బాపారావుకీ నా ప్రత్యేక అభివాదం.
మురళి చందూరి
తెల్సా అధ్యక్షుడు
“గతి-సంగతి “ద్వారా కథలు, నాటకాల ఎంపిక ప్రక్రియ మరియు ఆయా కథలు, నాటకాల మూల ఇతివృత్తం లీలగా స్పృశిస్తూ, ఎందుకు బహుమతికి అర్హమైనవో తెలిపారు. అలాగే కథలు, నాటకాలు రాయాలనుకునేవారికీ కొన్ని విషయాలు గ్రహింపుకు వచ్చే అవకాశం ఉంది. ఏమైనా మీ ప్రయత్నం అభినందనీయం. మీ సాహిత్య సేవకు జేజేలు!!
–గోలి గురుప్రసాద్,
రిటైర్డ్ లైబ్రేరియన్, (కవి &రచయిత)
ఖమ్మం.
కథలకు వేసిన బొమ్మలు ఎంత బావున్నాయో, కానీ వారి పేరు లేదు. వారికి ???
మురళి చందూరిగారికి
నమస్తే
ఒక రచయిత పుట్టుకకి ఏ ఒక్కరూ కారణం కాకపోయినా ప్రతిఒక్కరూ కారకులే. కానీ ఒక రచయిత ఎదుగుదలకు కొండరు మాత్రమే కారకులవుతారు. అలాంటి కారకుల్లో మీరొకరని చెబితే అది పొగడ్త కాదు.మీ విశ్లేషణ చూసిన తరువాత నాలోకి నేను మళ్ళీ చూసుకున్నాను. విచిత్రం ఏమిటంటే నాలో నేను తప్ప అందరూ కనిపించారు. కాబట్టీ ఇప్పుడు వెతుక్కోవడం మొదలుపెట్టాలి.
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
ఎన్నికైన కథలపై సమీక్ష బాగుంది. సమీక్ష చదివితే ఆ కథలు ఎందుకు ఎంపికయ్యాయో తెలిసేలా వుంది. రాయబోయే రచయితలకు కొత్త కథలు స్ఫురింపజేసేలా వుంది. ఇద్దరి రచయితల పేర్లు మాత్రమే తెలుస్తున్నాయి. తక్కిన రచయితల పేర్లూ.ప్రస్తావించి వుంటే సముచితంగా వుండేది.
ఇది మంచి ప్రయత్నమ్.. విదేశాల్లో ఉండి తెలుగు భాష ను పరిరక్షించాలన్న మీ తపన గొప్పది