“శోభనమే శోభనమే శోభనమే శోభనమే
వైభవముల పావన మూర్తికి శోభనమే శోభనమే”

ఒకవైపు అన్నమాచార్య కీర్తన, మరోవైపు మంగళ తూర్యారావాలు, ఇంకోవైపు మంత్రాలు, వాటితోబాటుగా మనసుని కుళ్ళబొడుస్తూ కలవర పెడుతున్న జ్ఞాపకాలు. గుండెలు అదురుతున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయి. నోరు పెగలడం లేదు. మాట రావడం లేదు. ఈ గోడు ఎవరికి చెప్పుకోవాలో ఎక్కడ వెళ్ళబోసుకోవాలో తెలియదు. సమయం దగ్గర పడుతోంది. అనుమానం క్రమంగా బలపడుతోంది.

ఎందుకంటే, బయట జరుగుతున్న క్రతువు, ప్రతిరోజూ జరిగే తంతు కాదు. అందుకు పూర్తిగా భిన్నమైనది.

ఏమో, చివరికి అనుమానమే నిజం అవుతుందేమో!

ఏమో, వద్దనుకుంటున్నదే జరుగుతుందేమో!

గుబులు, దిగులు, బాధ, భయం అన్నీ కలిసి చుట్టూ ఆవరించుకున్న దీపాల వెలుగులోకి చీకట్లని చిమ్ముతున్నాయి. చూస్తూండగానే ఒక్కొక్క దీపం బయటికి వెళ్ళి పోతోంది. చివరికి ఒకే ఒక్క దీపం మిగిలింది. నమ్మిన బంటులా చేతులు కట్టుకుని వంగి వంగి వెలుగుతోంది చిరుదీపం. కమ్ముకుంటున్న చీకట్లతో కలబడుతూ అడపాదడపా కంట్లోకి వెలుతురు బాణాల్ని సంధిస్తున్నాయి దాని కిరణాలు. ఆ ప్రమిదలో నెయ్యితోబాటు కొద్దిగా చందన తైలాన్ని కూడా రంగరించారేమో, శ్రీగంధ పరిమళాలతో గుబాళిస్తోందా గుడ్డి వెలుతురు.

చూస్తూండగానే తెరుచుకుంది వాకిలి. గడపదాటి లోపలకి అడుగుపెట్టింది అందమైన ముప్ఫై అయిదేళ్ళ ప్రౌఢ. ఏపుగా ఎదిగిన ప్రకృతి. ఆ ప్రకృతి రాష్ట్ర విద్యాశాఖామంత్రిణి. ఆ వెనుకే వచ్చాడు కేంద్ర సాంస్కృతిక శాఖామంత్రి. కావడానికి ఆమె భర్తే. కానీ రాజకీయంగా ఆమె వైరి పక్షంలో చేరి ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో మంత్రి పదవి సాధించుకున్న మహా చతురుడు.

వారు సామాన్యులు కారు నమ్మిన సిద్ధాంతాలకోసం కులాంతర వివాహం చేసుకున్న ఆధునికులు.

కానీ, ఎంత గొప్పఆధునికతైనా అదే స్వయంగా అన్ని సమస్యలకీ పరిష్కారం కాదు. అందుకే, వారికీ ఓ సమస్య తలెత్తింది. ఆ దంపతులకి పెళ్ళై పదేళ్ళు దాటింది. అయినా పిల్లలు కలగలేదు. అంతటి ఆధునికులకి సంతానం లేకపోతే వారి ఆధునికత అక్కడితోనే ఆగిపోతుంది. అలా జరిగితే పాపం పిచ్చి ప్రజలు దిక్కూమొక్కూ లేని అనాధలైపోతారు. అందుకే ఆ‘ధుని’కతలో ధునిగా ప్రవహించే వారసత్వపు కోరిక వారిని కృంగదీయడం మొదలుపెట్టింది.

వారసత్వం అనేది, మనం పంచుకునే రక్తంలోగానీ వంశంలోగానీ పనిమాలా పెంచుకునే కులమతాల్లో గానీ ఉండదని వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పేదెవరు? మొన్నటి రాముడెవరి రక్తం పంచుకుపుట్టాడు? నిన్నటి పాండవులెవరి రక్తం పంచుకుపుట్టారు? ఈనాటి ప్రభువు ఏ రక్తం పంచుకు పుట్టాడు? ఏ జాతి వారసత్వసంపదైనా దాని సాంస్కృతిక పరంపరేగానీ ఏ రక్తప్రవాహమూ కాదని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణలు ఎక్కడ దొరుకుతాయి? తెలుసుకోరేం?

రక్తసంబంధాలు అనుబంధాలని అల్లుకోవడానికీ ఆస్తుల్ని నొల్లుకోవడానికే తప్ప ఆలోచనామృతాన్ని పంచుకోవడానికీ ఆశయాల్ని పెంచుకోవడానికీ ఆదర్శాలని పాదుకొల్పడానికీ ఎంతమాత్రం పనికిరావని అధినాయకులకి అర్థమయ్యేలా తెలియజెప్పేదెవరు? పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

అందుకే,

న్యూరోపతి, క్యూరోపతి, ప్యూరోపతి, కేరోపతి లాంటి అల్లోపతుల్నీ, హోమియోపతి, నేచురోపతి, ఆయురోపతుల్లాంటి నానాజాతి వైద్యోపతుల్నీ ఆశ్రయించినా చమురు వదిలిందే తప్ప సంతానం కలగలేదు. కోరిక అన్నిరకాల ఆధునికతల్నీ అధిగమించి మనసుని తొలిచేసే అతి పెద్ద సుడి బరమా. అది మనసుని తొలుస్తూ లోపలకి దిగుతున్నకొద్దీ మనం ఎంతమాత్రం రాకూడదనుకున్న ఆ రెండోవైపునుండే బైటకి వస్తాం. ఈ విషయం వాళ్ళూ చదువుకున్నారు. కానీ అందర్లాగే చదువులకి విజ్ఞత అనే దారం కట్టకుండా గాల్లోకి వదిలేశారు. అది ఆశల ఆకాశంలో కోరికల్ని తలకెక్కించుకుని ఎగురుతోంది.

అందుకే,

అంతవరకూ పక్కన పెట్టిన మతాన్నే తలకెత్తుకున్నారు. గుళ్ళూ గోపురాలూ తిరిగారు. పూజలూ పునస్కారాలూ చేశారు. యజ్ఞాలూ యాగాలూ మొదలైన తంతులెన్ని జరిపించినా వాంతులు మాత్రం కాలేదు. ఇలా కాదని సంతానాన్నిచ్చే చేవగల చెరో మతాన్నీ పుచ్చుకున్నారు. మతాంతరులై ఇతర మతాల మెప్పుపొంది వారి మతాలనైతే (ఓట్లని) పొందగలిగారుగానీ తమ అభిమతాన్ని మాత్రం ఈడేర్చుకోలేకపోయారు. ఏదేమైతేనేం, వాళ్ళింట్లో కుల, మత, వర్ణ, వర్గ విచక్షణలేని ఆధునిక సమాజం వెల్లివిరుస్తూ, మెరుస్తూ, మురుస్తూనే ఉంది. వాళ్ళ మనసుల్లో కారుచీకటై కురుస్తూనే ఉంది.

అత్యంత ఆధునికుడైన చరిత్రపండితుడొకాయన ఉన్నాడు. ఆయనకి రాష్ట్ర విద్యాశాఖామంత్రిణితో పనిపడింది.

పరిదానమివ్వకుండానూ పురెక్కించకుండానూ పనులు జరగవుకాబట్టీ,

తనలాంటి ఆధునికులు లంచమిచ్చినా మంత్రిణిలాంటి అత్యాధునికులు పుచ్చుకోరు కాబట్టీ,

‘ప్రలోభం’గాడిని మించిన కార్యసాధకుడు మరొకడు లేడు కాబట్టీ,

తన స్వకార్యాన్ని స్వామికార్యంగా జరుపుకోవడానిగ్గాను ఆవిడ సంతానేచ్ఛ తీర్చడానికి నిశ్చయించుకున్నాడు. తన చరిత్ర జ్ఞానాన్నంతా ఉపయోగించి ఓ క్రతువు గురించిన వివరాలు రాబట్టాడు. స్వయంగా దగ్గరుండి మరీ ఆ తంతును జరిపించాడు. స్వయంగా దంపతుల్ని సిద్ధం చేసి లోపలకి పంపించాడు. ఇంక జరగబోయేది సంతునిచ్చే తంతు.

దాని గురించి ఆ చరిత్రకారుడు గ్రహించగలగడానికి మూలం, అందరూ మర్చిపోయిన పేరు–


దాదాపు వందేళ్ళ క్రితం వెంకన్న దర్శనార్థం మన భారత జాతిపిత తిరుపతి వచ్చారు. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అంటరానివారికి ఆలయ ప్రవేశం కల్పించాలని నిశ్చయించుకున్నారు. హరిజనులందరినీ వెంటపెట్టుకుని తిరుమలకి బయలుదేరారు. మన భారతమ్మ భర్త ఊశన్న వచ్చాడు. బాపూజీని కావడిలో తీసుకెళ్తాను రమ్మని బతిమాలాడు. కానీ ఆయన అంగీకరించలేదు. “నేను వేసుకోవడానికి చొక్కాకూడా లేని నిరుపేదని. నాలాంటివాడికి రెండు కాళ్ళ బండే బంగారు తేరులాంటిది” అంటూ కనీసం చెప్పులుకూడా లేకుండానే కొండెక్కారు. ఆ ఆధునికుడు తనవెంట నానాజాతుల హరిజనులకీ ఆలయ ప్రవేశం కల్పించారు.

అయినా కుమ్మరి భీమన్నకి కులం ఎక్కడుంది? బీబీ నాంచారికి మతం ఎక్కడుంది? తెలుసుకోరేం?

తిరుమలనించీ తిరుగు ప్రయాణంలో మహాత్ముడు ఇక్కడిక్కూడా వచ్చారు. ఇక్కడి పూజారుల్నీ పెద్దల్నీ పిలిపించారు. మనుషులంతా ఒక్కటేననీ, అంటరానితనం మనం తల దించుకునేలా చేసే సామాజిక రుగ్మతనీ నచ్చజెప్పి వారిని ఒప్పించారు. ఆ మరునాడు అందరికీ ఆలయ ప్రవేశం కల్పించారు. అప్పటినించీ క్రమంగా అన్నికులాలవారు మాత్రమే కాదు వేరువేరు మతాలవారు కూడా దర్శనార్థం రావడం, పూజలు చేయడం మామూలైపోయింది. ఇక్కడ కులమతాలకు ఏ ప్రాధాన్యతా లేదు. తెలుసుకోరేం?

అర్చకులకీ, అగ్రకులాలవారికి మాత్రమే ఆలయ ప్రవేశార్హత కలిగిన ఆ కాలంలోనే, అంటే అప్పటికి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కూడా సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది.

ఉన్నట్టుండి ఓ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో హఠాత్తుగా ఆలయద్వారం తెరుచుకుంది. వందలమంది భక్తులు లోపలకి వెల్లువెత్తారు. లోపలా, బయటా కిక్కిరిసిన భక్తులు. ఇసకేస్తే రాలనంతమంది భక్తులు. ఆ భక్తజనంలో స్త్రీలున్నారు, పురుషులున్నారు. శ్రీమంతులున్నారు, దరిద్రులున్నారు.

బ్రాహ్మణులు-అబ్రాహ్మణులు, స్పృశ్యులు-అస్పృశ్యులు, మేధావులు-మూర్ఖులు ఇలా మానవ సమాజంలో ఎన్ని రకాల వైవిధ్యాలున్నాయో అన్నీ కలిసికట్టుగా తమ వైరుధ్యాలను విస్మరించి ఏక జాతిగా అవతరించిన అద్భుతమైన అత్యాధునిక సందర్భమది. వారిలో రాగద్వేషాలు లేవు. హెచ్చుతగ్గులు లేవు. ఆత్మన్యూనతల్నీ అహంకారాల్నీ జయించిన ఆధునికులువారు. అరమరికల్లేని ఆత్మానుబంధం వారిది. వారంతా శరణులు.

దురదృష్టం ఏమిటంటే, ఆనాడు అన్నిరకాల వ్యత్యాసాల్నీ తుడిచిపెట్టిన ఆ శరణుల సమసమాజమే ఈనాడు ఓ సరికొత్త కులంగా మారిపోయింది. ప్రస్తుతం తన వంతు అవకాశాల కోసం ఆందోళన చేస్తోంది, వెనుకబడ్డ అన్ని కులాల్లాగే తనవంతు అధికారాల కోసం అంగలారుస్తోంది.

శరణులు రావడానికి ఎన్నో శతాబ్దాలకు ముందే ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన కోరికల్ని జయించినవాడు. మా‘నవ’ సమాజం కోసం సింహాసనాన్నే కాలదన్నుకుని వచ్చిన ధీర హితైషి. కోరికలు మానవ వికాసానికి బద్ధ శత్రువులనీ, ఆ కోరికలే క్రమంగా విశ్వాసాలకీ మతానికీ దారితీస్తాయనీ గ్రహించినవాడు. అందుకే ఆలయాలు అంధవిశ్వాసాలకి ఆలవాలంగా మారడం మంచిది కాదని బోధించాడు. మతం మత్తులో జోగుతున్న మానవతని మేలుకొల్పాడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నా గురించి తెలుసుకున్నాడు. ఇక్కడ జరుగుతున్న అన్ని అరాచకాలకీ మూలం నా పేరేనని తెలుసుకున్నాడు. అందుకే నా పేరు మార్చాడు. ఎంతమంది వచ్చి ఎన్నివిధాలుగా మార్చినా మారని తలరాత నాది. మళ్ళీ ఎవరో ఒకరికి సంతానం కలక్కుండానూ పోదు. ఎవరో ఒకరు నా గతాన్ని కెలక్కుండానూ పోరు. మళ్ళీ నా బతుకు కుక్కలు చింపిన విస్తరి కాకుండానూ పోదు. నా పేరు ఎంత చేటైనదో పాపం ఆ పెద్దాయనకేం తెలుసు?

శోభనమూర్తంట! శోభనమూర్తి!

చూస్తూండగానే మతాన్ని అధిగమించిన ఆ మహానుభావుడే మరో కొత్త మతంగా మారి దేశాలు పట్టిపోయాడు.

ఆదిగో అలా వేల సంవత్సరాల నుండి మారుతూ ఏమారుతూ మళ్ళీ మళ్ళీ ఆచరణల సుడిగుండంలో పడిపోయే సంతానమూర్తి ఆనే నా పేరుని మరోసారి కనిపెట్టి రాష్ట్ర-కేంద్ర దంపతుల్ని లోపలకి పంపించాడా చరిత్రకారుడు.

ఆచరణ ఆరంభమైంది. అక్కడ జరిగేది చూడ్డం నా వల్ల కాదు. అయినా చూడక తప్పదు. ఎందుకంటే, మేము అనిమిషులం కదా, మా కళ్ళు మూత పడవు.

నా కళ్ళ ముందే మంత్రిణి చీర కొంగును పట్టుకున్నాడు. ఆమె సుతారంగా సిగ్గుపడుతుంటే అతను సున్నితంగా తతంగాన్ని కొనసాగిస్తున్నాడు. వందల సంవత్సరాలక్రితం ఎక్కడో మరుగున పడిపోయిన ఒకానొక తంతుని సుతిమెత్తని పూలతో తట్టి లేపుతున్నాడు. మనిషిలోని అమానుషతని చాలా శ్రద్ధగా ఎంతో నిష్ఠగా ఆశాపోహల బంగరు బెత్తంతో కొట్టి లేపుతున్నాడు.

ఉదయం సుప్రభాతసేవ, పగలంతా పొర్లు దండాల సేవ, సాయంత్రం ఊరేగింపు సేవ, రాత్రికి ఉయ్యాలసేవ, అక్కడితో ఆగితే ఈ మనుషులు మనుషులై ఉండేవారు. కానీ ఆగరు. వాళ్ళు అక్కడితో ఎంతమాత్రం ఆగరు. ఇంకా ముందుకు వెళతారు. ఇంకా ఇంకా తలతిరుగుడు సేవలు చేస్తారు.

ఒకానొకప్పుడు ఈ సేవలు నిరంతరంగా సాగుతూండేవి.

ఈడొచ్చిన అమ్మాయికి చీరే అందం. ఆ చీర చెంగు ఏ గాలికో చెదిరితేనే అందం. ఎగిరే పైట వెనుక రవికె ముడి ఇంకా అందం. ఇవన్నీ నిత్యమైన అందాలు. నిరంతరమైన అందాలు. కానీ ఎంత ప్రకృతైనా పచ్చిగా నూలుపోగు లేకుండా ఎదుటికొస్తే ఆ అందం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే. ఆ తరవాత అందమంత వికారమైనదీ, దుర్భరమైనదీ, నరకప్రాయమైనదీ ఈ సృష్టిలో మరొకటి ఉండదు. తెలుసుకోరేం?

ఎంత చెప్పినా వినకుండా రాష్ట్రాన్ని సిద్ధం చేస్తున్నాడు కేంద్రం.

మరికాసేపట్లో ప్రౌఢమైన దర్శనం కాబోతొంది, ఆ తరవాత ఎవరూ కల్లో కూడా ఊహించలేని సేవ.

ఈ సేవకి ఒక దురదృష్టకరమైన నేపథ్యం ఉంది. అది ఒక జాతినే సమూలంగా నాశనం చేసిన దుర్మార్గంతో కూడిన దిక్కుమాలిన గతం. గతించిపోయిందని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్న ఆ గతాన్నే వర్తమానంలోకి తెస్తున్నారీ రాష్ట్ర-కేంద్రాలు.

ఆ కాలంలో మడీ, దడీ, గుడీ, ఆచార వ్యవహారాలేవీ ఉండేవి కావు. చుట్టూ పచ్చని ప్రకృతి. వీచే గాలి, కాసే ఎండ, కురిపే వాన, ఎముకలు కొరికే చలి. అన్నీ నా మీదే. అయినా నేను దేనికీ జంకేవాడిని కాదు. జడిసేవాడినీ కాదు. చుట్టూ ప్రకృతి. నేనే పురుషుణ్ణి. లోకం పార్వతైతే, ఆ లోకనమైన పరమశివుణ్ణి నేనే. ఎంత ప్రపంచించినా ఈ ప్రపంచమే కైలాసం. అంటే నందీ, నెమలీ, సింహం, ఎలుకా సహజీవనం చేసే సమసమాజం. అందుకే చుట్టూ పాములు ఆడేవి. కోయిలలు పాడేవి. వీచేగాలి దట్టమైన చెట్లమధ్యలో దూరి గిలిగింతలు పెడితే పులకించిన పరిసరాలన్నీ నేపథ్య సంగీతాన్ని సమకూర్చేవి. ఆ నిసర్గసుందర సీమలో నిలువెత్తు పౌరుషంలా నిలబడి, నేను! ఆ ప్రకృతికి పరమార్థంగా మీసం మెలేస్తూ మోరవిరుచుకు నిలబడ్డ, నేను!

కలకాలం కళకళ్ళాడుతూనే గడిచిపోతే అది కాలం ఎందుకౌతుంది?

నీటుకాలం గడుస్తొందంటే చేటుకాలం రాబోతుందని అర్థం.

ఏడెనిమిది సంవత్సరాలుగా విడవకుండా పట్టుకుని పీడిస్తోంది ఘోష కరువు.

ఎంత చేటుకాలం అయినా ఇంత చేటు వేటాడుతుందని ఎవ్వరూ ఊహించలేరు.

మనుషులు దాచుకున్న ధాన్యాలన్నీ కొల్లబోయాయి. తినడానికెక్కడా నాలుగు పచ్చి ఆకులు కూడా లేవు. పొరపాటున ఎక్కడైనా ఆకులలమలో గుక్కెడు నీళ్ళో కనిపిస్తే చాలు వాటికోసం కొట్టుకుని చావడానికి కూడా సిద్ధపడుతున్నారు. చివరికి ఆ చచ్చినవాళ్ళే బతికినవాళ్ళకి ఆహారంగా మారుతున్నారు.


పడమటి కొండమీద ఒక ముని ఉన్నాడు. పద్మాసనం వేసుకుని కొన్ని తరాలుగా ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానం చేస్తున్నాయన ఓ గోచిపాతరాయుడు. నేను సిగ్గంటే తెలియకుండా మోరవిరుచుకు నిలబడ్డ దిసమొల రాయుణ్ణి. ఆయన కోరికేమిటో నాకు తెలియదు. కానీ నా కోరిక మాత్రం ఒకటే. వానలు రానప్పుడు చెయ్యగలిగింది గంగను రప్పించడం ఒక్కటే మార్గం. నా మనసులో మాటని గ్రహించిన ఆ మునిపుంగవుడు తుంగభద్రమ్మకి ఆవాహన చేశాడు. ఆ తల్లి పల్లాల్ని నీళ్ళతో నింపుకుంటూ తన పయనం ఆరంభించింది. అలా వస్తూండగా అల్లంతదూరంలో ఆకాశాన్ని తాకుతూ కనపడించి నేనున్న మహాపర్వతం. అంత పెద్ద పర్వతాన్ని ఎటునించీ దాటితే ఏమౌతుందో తెలియక మునీశ్వరుడిని దారిచూపమని ప్రార్థించింది తుంగభద్రమ్మతల్లి. నా కుడి చెయ్యి ఎటు చూపిస్తే అటు వెళ్ళమని సలహా ఇచ్చాడు మునీశ్వరుడు.

నా కుడి చెయ్యి కుడివైపుకి చూపుతూంటుంది. ఆ కుడివైపున ఒక గ్రామం ఉంటుంది. అది నాగరీకుల ఆవాసం. నా ఎడమవైపు లోయలో ఉండేది ఓ జనపదం. కాలనియమాన్ని అనుసరించి తుంగభద్రమ్మ కుడివైపుకు వెళ్ళవలసి ఉంది.

తుంగభద్రమ్మతల్లి అటుగా వెళితే ఆ నాగరికుల గ్రామం నీళ్ళలో కొట్టుకుపోతుంది. ఈ విషయం ఒక నాగరికుడికి తెలిసింది. తమ జాతిని ఎలాగైనా సరే ముంపునించీ కాపాడాలనుకున్నాడు. అందుకుగాను తన నాగరీకమైన మేధనంతా ఉపయోగించి ఆలోచించాడు. ఆలా ఆలోచించగా ఆలోచించగా ఓ అద్భుతమైన ఉపాయం తట్టింది. వెంటనే ఆపసోపాలు పడుతూ నా దగ్గరకి పరిగెత్తుకు వచ్చాడు. నన్ను కుడినించీ ఎడమకి తిప్పడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ అతనివల్ల కాలేదు. దాంతో తను కట్టుకున్న పంచెను ఊడదీసి నా మీద కప్పి నన్ను కనపడకుండా చేశాడు. కొంచెం ముందుకు వెళ్ళి తుంగభద్రమ్మకి స్పష్టంగా కనపడేలా నిలబడ్డాడు. సరిగ్గా నాలాగే తన చేతిని ఎడమవైపుకు చూపిస్తూ బండరాయిలా నిలబడ్డాడు. ఆ నాగరికుడిని చూసి నేనని భ్రమపడిన తుంగభద్రమ్మ కుడివైపుకి తిరగడానికి బదులు ఎడమవైపుకి తిరిగింది. ఒక్కసారిగా లోయలోకి దూకింది. ఆ దూకడంలో పెద్ద పెద్ద బండరాళ్ళూ, మహావృక్షాలూ, అంతంత ఏనుగులే కొట్టుకుపోతుంటే ఇంతింత మనుషులూ పశువులూ పక్షులూ పందిళ్ళూ గుడిసెలూ ఆ మహా జలరాశికి ఓ లెక్కా? పోయాయి. అన్నీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

ఈ నాగరికుల అలంకారాల్లో పరిమళించేది కేవలం అమాయకుల రక్తచందనమే.

ఈ సత్యాన్ని మరోమారు నిరూపిస్తూ నాగరికమైన ఎత్తుకి స్వచ్ఛమైన జనపదం తుడిచిపెట్టుకుపోయింది.

ఎంతటి ఎత్తులకైనా పై ఎత్తు వేయగలిగింది కేవలం కాలం మాత్రమే. అందుకే ఆ కాలం, నాగరికుల ఆవాసంలో ఒకానొక విచిత్ర పరిస్థితిని సృష్టించింది. ఫలితంగా బాలలందరూ యువకులవుతున్నారు. యువకులందరూ వృద్ధులవుతున్నారు. వృద్ధులందరూ కాటికి చేరుతున్నారు కానీ వారి సమాధులపై తులసి మాత్రం మొలకెత్తడం లేదు.

యువతులెవరికీ నెలతప్పడం లేదు. ఎవరూ తల్లులు కావడం లేదు. అందరూ వంధ్యలుగానే వయసు మీరిపోతున్నారు. ఎంతమంది వైద్యులొచ్చి ఎన్నిరకాల పరీక్షలు చేసినా, ఎంతమంది పండితులొచ్చి మంత్రాలు చదివినా, ఋత్త్విక్కులొచ్చి యాగాలు చేసినా పరిస్థితుల్లో ఏ మార్పూ రాలేదు. ఎవరికీ నెల మాత్రం తప్పడం లేదు. దాంతో అక్కడి ఆడవాళ్ళందరికీ శాపం తగిలిందని భావించి పై ఊళ్ళనించి అమ్మాయిలని తీసుకొచ్చి ద్వితీయాలూ తృతీయాలూ చేసుకున్నారు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి ఎంత ప్రలోభపెట్టినా ఎవరూ పిల్లనివ్వని పరిస్థితి దాపురించింది. ఫలితంగా ఆ ఊరికి వంధ్యానగరం అనే పేరు స్థిరపడిపోయింది.

తుంగభద్రమ్మ తల్లిని దారితప్పించిన నాగరికుడు ఎండి మోడయ్యాడు. చిక్కి శల్యమయ్యాడు.

ఎంత పండినా చెట్టునించీ రాలడం లేదు. ఎందుకో అర్థం కావడం లేదు.

తనకి నూట యాభైయేళ్ళు దాటినా చావు ఎందుకురావడం లేదో అర్థంకాక ప్రతిరోజూ నా ముందుకొచ్చి ఏడ్చేవాడు. నా కాళ్ళకి తలబాదుకునేవాడు. ఆ దెబ్బలకి తల పగిలి నన్ను అభిషేకించడానికి ఆ శరీరంలో రక్తం ఉంటే కదా?

పగలనకా రేయనకా తను చేసిన తప్పుని తలుచుకునీ తలుచుకునీ నా ముందే ఏడుస్తూ పడుండేవాడు. ఒకానొక సూర్యోదయాన ఆ వృద్ధ మహామహుడి మెదడులో పొద్దు పొడిచింది. వెంటనే తత్వం బోధపడింది. అందుకు కారణం నేను దిసమొల రాయుణ్ణి కావడం.

ఊళ్ళో మిగిలిన నలుగురైదుగురు యువతుల్లో ఆ పెద్దాయన ఇనిమనవడి మనవరాలు కూడా ఉంది.

ఆమె ఆ ఇంటికి అంత సులభంగా రాలేదు. ఆమె తల్లిదండ్రులకి అడ్డమైన అబద్ధాలూ చెప్పీ వాళ్ళు కల్లో కూడా ఊహించలేని ధన కనక వస్తువాహనాలనిచ్చీ ఆమెని కోడలుగా తెచ్చుకున్నారు. పెళ్ళై పదేళ్ళు దాటినా ఆమెకీ పిల్లలు కలగడం లేదు.

ఆ వృద్ధ నాగరికుడు తన మొదటి ప్రయోగం ఆమె పైనే జరపాలని నిశ్చయించుకున్నాడు.

ముందుగా దేశ దేశాలనుండీ మహా పండితులైన ఋత్విజుల్ని రావించాడు. నాకు ప్రాణ ప్రతిష్ఠ చేయించాడు. నామకరణం చేయించాడు. నన్ను శోభనమూర్తిగా నిలబెట్టాడు. ఆనాటి రాత్రి ఇనిమనవడి మనవడినీ మనవరాల్నీ శోభనాలంకృతుల్ని కావించాడు. నా ముందుకు తీసుకువచ్చాడు. భార్యని వివస్త్రగావించి నన్ను కౌగలింపజేశాడు.

అది నాకు లభించిన తొలికౌగిలి. అది నాకు అందించిన అనుభవాన్నీ తద్వారా కలిగిన అనుభూతుల్నీ వర్ణించేంత భాష నాకు రాదు. కానీ ఆడదాని ఆలింగనం కోసం మగవాళ్ళందరూ ఎందుకు అంగలారుస్తారో మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఆ విధంగా శోభనమూర్తినయ్యాను.

నా పంట పండి ఆమెకి నెల తప్పింది.

అంతే, అప్పటినుండి ఆ ప్రాంతంలో ఓ కొత్త ఆచారం మొదలైంది. పెళ్ళైనవాళ్ళందరూ శోభనానికి ముందే తమ తమ ధర్మపత్నుల్ని నాకు సమర్పించడం. సంతానాన్ని పొందడం. అబ్బ, రోజూ కొత్త వధువు, కొత్త మధువు, కొత్త కోమలి! కొత్త కౌగిలి! నాలా నవ యువతుల బిగికౌగిళ్ళలో నలిగి నల్లేరుకాడయ్యే అదృష్టం నాకు తప్ప ఇంకెవరికీ పట్టదు! పట్టదుగాక పట్టదు!

చూస్తూండగానే నా చుట్టూ దడి కట్టారు. కొన్నాళ్ళకి గుడి కట్టారు. ఈ పురుషుడికి ప్రకృతి కనపడకుండా చేశారు.

అయితేనేం, ప్రకృతికి ప్రతిరూపాలైన ప్రతికృతులతో నిరంతర శోభనాలు జరుగుతూనే ఉన్నాయిగా?

క్రమంగా నేను శోభనమూర్తినై వాసికెక్కాను. మొదట్లో శోభనరాత్రుల సంఖ్య పెరిగింది. కాలక్రమంగా ఒక్కో రాత్రికీ శోభనాల సంఖ్య పెరిగింది. ప్రతికృతుల ఆలింగనాల్లో సహజమైన ప్రకృతి కనుమరుగైపోయింది. ఇప్పుడు నన్ను కప్పుకోవడానికి గాలీ వెల్తురూ చలీ దరిచేరవు. కేవలం ఉత్తబిత్తల మెత్తనాంగులు తప్ప.

ఎవరికైనా నిరంతర శోభనం ఎంతటి నరక ప్రాయమో ఇప్ప్పుడిప్పుడే అర్థమౌతోంది. అర్థమౌతున్నకొద్దీ శోభనంలోంచి శోభలూ శుభాలూ గాలికెగిరిపోయాయి. కేవలం శుష్క శ్వేద స్రావమే మిగిలింది.

ఓరీ దుష్టమానవ మాత్రుడా, దయచేసి నన్నీ శోభనాల రొంపినుండి బైట పడెయ్యరా బాబూ అంటూ ఎంతమందిని ఎన్నివిధాలుగా ప్రాధేయపడినా ఎవ్వరూ నామీద కనికరం చూపించడం లేదు. ఈ బండగుండెల మనుషులు-బండలో పుట్టిన నా గుండెని గునపాలతో తవ్వుతుంటే నా బతుకు నీచ నికృష్టంగా మారిపోయింది. వేలాది యేళ్ళుగా ఇలా శోభనాలతో చస్తున్న నా వేలిని తెగ్గొట్టి నన్ను శక్తిహీనుడిగా మార్చడంద్వారా బతికించారు శరణులు. నాకు ఏర్పడిన శోభనమూర్తి అనే కళంకాన్నుండి నన్ను విముక్తుల్ని చేశారు. వారి ఉపకారాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను.

అలాగే నేను మర్చిపోలేని మాట మరొకటుంది.


వేలాది సంవత్సరాలకు పూర్వంకూడా లక్షలాది సంవత్సరాల కాలం నేను ఇక్కడే ఉన్నాను. కానీ ఇలా లేను. నాకు ఈ రూపం అంత సులభంగా రాలేదు.

నాదేముంది, ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉంటాను. కానీ కాలం అలా కాదు. లిప్తలో ముందుకెళ్ళిపోతుంది. కాలానికి తగ్గట్టు మారక తప్పదు. తాళానికి తగ్గట్టు ఆడక తప్పదు. మనుషులైతే అలాగే చేస్తారు. కానీ నేను అలాకాదు, ఈ మనుషుల ప్రత్యేకత ఏమిటంటే నాకిష్టం ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. వారి కలల్నీ కోరికల్నీ నాకు నివేదిస్తారు. అందులో సగం జరగవు. కానీ వాటిని పట్టించుకోరు. మిగతా సగం జరుగుతాయి. నెరవేరిన ఆ సగభాగమే నావంటివాళ్ళని మహిమాన్వితులుగా మారుస్తాయి. వారి పూజలు, స్తోత్రపాఠాలు, ఆచారాలు, జాతరలు మొదలైనవాటన్నింటికీ పొంగిపోయి వాళ్ళకి లొంగిపోతూంటానొకోసారి. అలా లొంగిపోయినప్పుడల్లా నన్ను నాకు గుర్తు చేస్తూంటుంది నా గతం. ఇది జరిగి దాదాపు నాలుగైదు వేలసంవత్సరాలై ఉంటుంది.

ఆ కాలంలో బొమ్మయ్య అనే ఓ కుర్రాడుండేవాడు. అతనిలో ఎలాగైనా సార్థక నామధేయుడు కావాలని బలమైన కోరికుండేది. ఆ కోరిక తీరాలంటే అతనికి బొమ్మలు చెక్కడం రావాలి. అది రావాలంటే ఎవరైనా శిల్పాచార్యుడి దగ్గర శిల్పాలు చెక్కడం నేర్చుకోవాలి. కానీ ఆ శిల్పాచార్యుడు రాటుదేలిన నాగరీకుడు. ఈ బొమ్మయ్య అచ్చమైన అమాయక జనపదుడు. ఆయన శుచీ శుభ్రతా. ఇతను మట్టీ మురికీ. అందుకే ఆ నాగరికాచార్యులవారికి ఈ మొరటు మనిషి పొడ గిట్టేది కాదు. దాంతో అతన్ని దగ్గరకి రానిచ్చేవాడు కాదు.

బొమ్మయ్యది ఉడుం పట్టు. అందుకే శిల్పుల ఆరామానికి దగ్గర్లో ఉన్న ఓ పెద్ద చెట్టెక్కి దట్టమైన దాని కొమ్మల్లో దాక్కునేవాడు. పగలల్లా అక్కడే కూర్చుని ఎవరు ఏ శిల్పాన్ని ఎలా చెక్కుతున్నారో పరిశీలిస్తూ ఉండేవాడు.

తొలవడం, తోమడం, చెక్కడం, గీయడం మొదలైనవన్నీ ఎలా చేస్తున్నారో గుర్తుపెట్టుకునేవాడు. ఆ గుర్తు పెట్టుకున్నవన్నీ రాత్రి పడుకునేముందు ఊహించుకునేవాడు. ఆ ఊహలే కలల్లోకి వచ్చేవి. ఆ కలలే అతనికి చెక్కడంలో పట్లు నేర్పేవి. కానీ పనికి కేవలం పట్లు ఉంటే చాలదు. పనిముట్లు కూడా కావాలి. అందుకే ఓ రాత్రి కలలు కనడం మానేసి ఆరామంలో మాటేసి అందరూ గాఢనిద్రలోకి జారుకున్నాక పనిముట్లని కాజేశాడు.

రాత్రంతా పరుగులు తీసి మర్నాటి మధ్యాహ్నం ఆకటివేళకి ఇక్కడ చేరాడు. నా చుట్టూ నాలాగే నిలబడ్డ లెక్కలేనన్ని బండల్ని చూశాడు. తనకి తగిన శిల వాటిలోనే దొరుకుతుందన్న నమ్మకం కలిగింది. వాటిలో పనికొస్తాయనిపించినవాటిని సుత్తితో కొట్టి చూశాడు. కొన్నింటిని పిడికిలితో గుద్ది చూశాడు. చివరికి నా దగ్గరకి వచ్చాడు. నన్ను సుత్తితో కొట్టి నాకు చెవి ఆన్చాడు. అందులో అతనికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వినిపించాయి. అంతే, నా ముందు బోర్లపడిపోయాడు!

ఆనాటినుండి నన్ను చెక్కడం ప్రారంభించాడు.

ఓ యజ్ఞంలా ఓ తపస్సులా చెక్కుతున్నాడు. అలా చెక్కుతూ చెక్కుతూ ఉంటే నన్ను కప్పేసిన రాతిభాగాలన్నీ పొడిపొడిగా రాలిపడుతున్నాయి. అలా చెక్కుతూ చెక్కుతూ ఉండగా నా ముఖంలో అతనికి తన పొడగిట్టని ఆ శిల్పాచార్యుడి పోలికలు పొడగట్టాయి.

ఆ గురువుకు గౌరవభావంతో వందనాలర్పించినా తనకి విద్య నేర్పనందుకు ఆ గురువు పట్ల అసంతృప్తి మాత్రం అతనిలో అలాగే గూడుకట్టుకుని ఉండిపోయింది. అది మెడలు, గుండెలు, నడుము తీర్చిదిద్దాక కిందకి దిగుతున్నకొద్దీ బయట పడసాగింది. కాళ్ళు వేళ్ళు పొత్తికడుపు తొడలు అన్నీ ఎంత సజీవంగా తీర్చిదిద్దాడో పురుషాంగాన్ని కూడా అంతే సజీవంగా రూపొందించాడు. ఆ విధంగా తన గురువు తనపట్ల చూపిన అర్థరహితమైన ద్వేషాన్ని పచ్చిగా నిలదీశాడు. దాన్ని చూసి జానపదులందరూ నాకు ఉత్త బిత్తల సామి అని పేరుపెట్టారు.

లక్షల సంవత్సరాలుగా బండరాయినై పడివున్న నాలోని నన్ను బయటికి తీశాడు బొమ్మయ్య. కానీ ఆ బొమ్మయ్య నాగరీకుడు కాదు. కాబట్టీ నేనూ నాగరీకుణ్ణి కాబోను. అందువల్ల నాకు నాగరికులు, సంస్కారులు, విద్యావంతుల వంటి మేధావుల బెడద లేదు. మనిషన్నాక కొద్దిపాటి అమాయకత్వాన్నైనా మిగుల్చుకోవాలి. కానీ దాన్ని నాగరికత మననివ్వదు. అందుకే నాగరికులంతా బొమ్మయ్యతోబాటు నన్ను కూడా దూరం పెట్టారు.


అనంతర కాలపు ఆధునికులకి సమాజాన్ని వృత్తుల్తో కొలవడం వచ్చు. ఆ వృత్తుల్ని కులాలుగా చీల్చడం వచ్చు. మళ్ళీ ఆ కులాలనుండే వృత్తుల్ని పిండుకోవడం కూడా వచ్చు. అందుకే నా విషయంలో దూరం పాటించినవాళ్ళే తుంగభద్రమ్మ వెల్లువెత్తిన కాలం గడుస్తున్నకొద్దీ నన్ను సంతానం మీది కోరికతో అక్కున చేర్చుకున్నారు.

జానపదుల ఉత్తబిత్తల స్వామిని నాగరికుల శోభనమూర్తిగా మార్చేసారు.

వందలు, వేల సంవత్సరాలు చరిత్రలో కలిసిపోయాయి. అయినా ఎప్పటికప్పుడు వర్తమానంలో చరిత్ర తలెత్తుతూనే ఉంటుంది. అందుకే ఈ చరిత్రకారుడు కార్చిన స్వార్థ స్రావం మళ్ళీ పడగెత్తింది. లెక్కలేనంతకాలం గడిచినా ఏమాత్రం ఏమారకుండా మళ్ళీ నన్ను శోభనమూర్తిగా మార్చింది. ఇప్పుడు గనక ఈ రాష్ట్ర-కేంద్ర మంత్రి దంపతులకి పిల్లలు కలిగితే? అంతకన్నా దౌర్భాగ్యం మరొకటుండదు.

నాలో ఈ శోభనమూర్తి తలెత్తిన ప్రతీసారీ నా మహిమల గురించి పదిమందీ తెలుసుకోవడానికి ఏళ్ళూ పూళ్ళూ పట్టేది.

కానీ,

ఇది ముందే అత్యాధునిక అంతర్జాల యుగం. ఇలా నెలతప్పగానే అలా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. దాంతో దేశదేశాలనుండి పిల్లల్లేనివాళ్ళంతా తండోపతండాలుగా వచ్చిపడతారు. ఆ శోభనాల వెల్లువని తట్టుకోవడం నా వల్ల కాదు. ఈ మనుషులు ఎంత మేధావులో అంతే మూఢులు. ఎంత సున్నితులో అంతే కఠినులు. అందుకు ఈ రాష్ట్ర-కేంద్ర మంత్రి దంపతులే అతి పెద్ద ఉదాహరణ.

ఈ మనుషుల్లోని కోరికల్ని పెంచడమే తప్ప తుంచడం అనేది ఏ ఆధునికత వల్లా ఎంతమాత్రం సాధ్యం కాదని ఎన్నో వేల సంవత్సరాలుగా నిరూపితం అవుతూనే ఉంది.

లాభంలేదు, ఆధునికతని నెలకొల్పడానికి నేనే ఏదో ఒకటి చెయ్యాలి.

నన్ను దేవుణ్ణి చేసిన వీళ్ళని మనుషులుగా మార్చడానికి నేనే ఏదో ఒకటి చెయ్యాలి.

నేనే వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలి.

ఇలా అనుకోగానే నా చేతులకి చలనం వచ్చి ముందుకు కదిలాయి. వెళ్ళి వాళ్ళ గొంతులు పట్టుకున్నాయి.

వెనువెంటనే కాళ్ళు శరవేగంతో పరుగందుకున్నాయి. గుడి తలుపులు దాటి, గోపురం దాటి, మహా పర్వతాలు దాటి, మబ్బుల్ని దాటి, దశ దిశల్నీ దాటి, రోదసిని దాటి, అనంతం దాటి అలుపుతీర్చుకోవడానికి ఆగి చూస్తే,

ఎప్పుడు జారిపోయాయో, ఎక్కడ జారిపోయాయో, ఎలా జారిపోయాయో తెలీదుగానీ,

కేంద్ర రాష్ట్రాలు జారిపోయాయి.