అనగనగా ఒక నేను. ఆ నేనుకి ఒక కుడి చెయ్యి. ఆ చేతికి ఐదువేళ్ళు. వాటిలో చిటికెనవేలి పక్కనున్నదానిపేరు అనామిక. అంటే పేరు లేనిది. ఆ పేరులేని వేలికి ఒక ఉంగరం. ఆ ఉంగరమే వేళ్ళ సామ్రాజ్యానికి కిరీటం. మకుటం ఉన్నవాడే మహారాజు. పైగా అది బంగారు కిరీటం. బంగారమంటే సువర్ణం. అంటే వర్ణాలన్నింటిలోనూ మేలిమి వర్ణం. అన్ని విలువలకంటే మేలిమి విలువ. నేను నా వేలికి ఉంగరం పెట్టుకుని ఊరేగినంతకాలం దానికి ఏ సమస్యా రాలేదు. “లేని” రాజ్యానికి “ఉండే” ఏకైక చక్రవర్తిలా మిలమిలా మెరిసిపోతూండేది.

కాశీకి వెళ్ళినప్పుడు నా కుడిముంజేతికి ఓ రాగికంకణం చేరింది. అది థళథళథళా మెరిసిపోతూండటాన్ని గమనించింది ఉంగరం. ఆ కడియం మెరుపు చూసిన ఉంగరానికి ఒకటే కడుపు మంట. ఆ మంటతో రాత్రంతా రగిలిపోయింది. అలా రగులుతూ రగులుతూ నిద్రంతా పాడు చేసుకుని కడియాన్నే చూస్తూ గుడ్లనీళ్ళు కుక్కుకుంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ చివరికి ఆ ఏడుపుగొట్టు మొహంతోనే ఏ తెల్లవారుజామునో మగతలోకి జారుకుంది. మెలకువ వచ్చేసరికి చూస్తే ఏముంది? తెల్లగా తెల్లారిపోయింది. నేను దినపత్రిక చదవడం పూర్తి చేసుకుని బడికి సిద్ధమయ్యేవేళ ఉంగరానికి కడియం గుర్తొచ్చింది. చూస్తే ఏముంది, అది ముక్కుపొడుం రంగులోకి మారిపోయి మడ్డిమడ్డిగా ఉంది.

దాన్ని చూడగానే ఉంగరంలో మళ్ళీ ఆభిజాత్యం మోరవిరుచుకుంది. అందుకే వయ్యారంగా కులుక్కుంటూ, వెటకారంగా వెర్రి సైగలు చేస్తూ పడీ పడీ నవ్వింది.

ఉంగరం వెక్కిరింపు నవ్వుల్ని చూసి ఉడుక్కోవడానికీ దాన్నెలా లొంగదియ్యాలా అని ఆలోచించడానికీ ఈ కడియం రాజూకాదు, దీనికి కిరీటమూ లేదు.

ఉంగరం నవ్వినంతసేపూ నవ్వి అహాన్ని సంతృప్తి పరుచుకున్నాక అంది, “రాగి రాగే-బంగారం బంగారమే”


స్నానం చేస్తున్నప్పుడు చూసుకుంటే కడియం మరీ గబ్బుగబ్బుగా కనిపించింది. దాన్ని అప్పటికిప్పుడు తీసి పడేద్దామంటే చాలా బిగుతుగా ఉంది. ఆ స్నానాలగదిలో ఒంటిచేత్తో దాన్ని తియ్యడం సాధ్యం కాదు. మనం వదిలించుకోలేనిదాన్ని ఏంచెయ్యాలి? కాస్త బింకం నటిస్తూ కొంచెం బెట్టు చూపిస్తూ మెల్లగా మాటలూ చేతులూ కలపాలి. ఆనక క్రమంగా దాంతో రాజీపడి రాజీవ నేత్రులమైపోవాలి.

కడియాన్ని చేతికుంచుకోక తప్పదని నిర్ధారణ అయిపోగానే దాన్ని ఏదో విధంగా మెరిసేట్టు చేసి మురిసిపోవడమే మంచిదనే ఆలోచన వచ్చింది. అది మెరవాలంటే దాన్ని తోమాలి. దేంతో తోమాలబ్బా అని చుట్టూ చూశాను. “మరక మంచిదే” అనే మహత్తర సత్యాన్ని లోకానికి చాటిచెప్పిన ఉతుకుడు పొడుం కనిపించింది. మరకే కాదు మురిక్కూడా మంచిదే అనుకుంటూ కడియాన్ని ఉతుకుడు పొడితో ఎడాపెడా అరగ తోమేశాను. దెబ్బతో కడియం మళ్ళీ థళథళథళా మెరిసిపోవడం మొదలు పెట్టింది.

కడియం మెరుపుల్ని చూసి మళ్ళీ కిర్రెక్కిపోయింది ఉంగరం. అందుకే, ఎంతమెరిసినా నీ మెరుపు సాయంత్రందాకానే. సందెపొద్దుల్లో నిన్ను చూసి ఎవరైనా “ఏంట్రా నీ కడియం కూడా నీ మొహంలాగే జిడ్డోడుతోందని వెక్కిరించేవరకే నీ బడాయి. మండిందంటే నిన్ను తీసి ఊరవతలకి గిరాటేస్తాడు జాగ్రత్త” అని కడియాన్ని వెటకరించింది. అంతటితో ఊరుకుంటే అది అనామిక చక్రవర్తి ఎందుకవుతుంది? అందుకే నన్ను మధ్యలోకి లాగుతూ, “ఏం గురూ, నువ్వు ఎవర్ని పడేసినా చూస్తూ చూస్తూ నన్ను మాత్రం పారేసుకోలేవుగా?” అంది. ఆ మాటల్లోని వ్యంగ్యానికి నాకు ఒళ్ళుమండి కడియాన్ని వెక్కిరిస్తాననుకుంది. కానీ నేనా ఉంగరానికి మద్దతుదారుణ్ణి కాదుకదా, అందుకే నాకు కడియం మీద కోపం రాలేదు. ఆ ఉంగరం అమాయకత్వానికి మాత్రం చచ్చేంత నవ్వొచ్చింది. ఆ నవ్వుని చూసి నేను కూడా తనకి వత్తాసు పలుకుతున్నాననుకుంది ఉంగరం. అందుకే కడియం వైపు చూస్తూ వెక్కిరింతగా అంది, “రాగి రాగే-బంగారం బంగారమే”


కాంతినిబట్టి కడియం రంగులు మారుస్తూ ఉంటుంది. ఇంట్లో మందారం ఎరుపు. బయటమంకెన ఎరుపు. నీరెండలో చింత చిగురు రంగు, కళాశాల దగ్గరకొచ్చి చూస్తే, చురచురలాడే లేత చురుకెండలో మావి చిగురు వర్ణం. బారెడు పొద్దెక్కేవేళ గంధం మెరుపు. ఇలా వైన వైనాలుగా ప్రకాశిస్తున్న దాని వన్నెలు చూస్తుంటే నా రాగి కడియం ప్రకృతికి ప్రతిరూపంలా కనిపించింది.

నాకు తెలియకుండానే ఎదురొచ్చినవాళ్ళ దృష్టి ఆ కడియం మీదపడేలా దాన్ని పదే పదే సద్దుకుంటున్నాను. దాన్ని, అంటే సద్దుకోవడాన్ని కాదు, కడియాన్ని గమనించినవాళ్ళు, మీ చేతికి కడియం బాగా నప్పిందంటూ పొగుడుతుంటే, గర్వంతో నా గుండెలు ఉప్పొంగుతుంటే, కడియం తనని తాను చూసుకుని మురిసిపోతుంటే, ఉంగరం కుళ్ళి కూరాకవ్వడం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

తరవాత పాఠాల్లో పడి కడియం మాట మర్చిపోయాను. మధ్యాహ్నం భోజనం వేళ చూద్దును కదా ఆ కడియానికి అమ్మోరు పోసినట్లుగా ఒళ్ళంతా మచ్చలు. ఆ మచ్చల కడియాన్ని చూడలేకా తీసి పారెయ్యలేకా చేతిని కోసెయ్యలేకా బిక్కమొహం వేసుకుని దిక్కుతోచక నిలబడిపోయాను. నా పరిస్థితిని గమనించిన ఉంగరం నావైపు జాలి చూపులు చూడ్డం మొదలెట్టింది.

నా అదృష్టం కొద్దీ అదే సమయంలో ఆపద్బాంధవుడిలా కనిపించారు గణితాచార్యులవారు. నన్ను చూడగానే ఏదో తేడా కనిపించినట్టుందాయనకి. అందుకే ఓసారి తేరిపార చూశారు. బొబ్బలెక్కిన కడియం కనిపించింది.

“రాగి కడియాన్ని వేసుకోవడం కంటే దాన్ని అందంగా ముచ్చటగా కనిపించేలా చూసుకోవడం కష్టం. అందుకే అంటారు, రాగి తిన్నవాడు బలవంతుడు, రాగిమానుకింద కూర్చున్నవాడు బుద్ధిమంతుడు, రాగి కడియం పెట్టుకున్నవాడు శ్రద్ధాళువు అని. కాబట్టీ దాన్ని ఎప్పటికప్పుడు శ్రద్ధగా చూసుకుంటూ ఉండాలి. అడ్డమైన సబ్బుబిళ్ళలతోనూ తోమెయ్యకూడదు” అంటూ తన రాగి పాండిత్యాన్నంతా నాపై ప్రయోగించి సంతృప్తిపడ్డాడు. చివరిగా లోహాల్ని మిలమిలా మెరిసేలా చేసే రసాయనాల్లేని స్వచ్ఛమైన ప్రాకృతిక తోముడు పొడి గురించి చెప్పాడు. అంతేకాదు, తనే స్వయంగా వాళ్ళ అంగడిలోంచీ “పీతల్ థళ్ థళ్” అనే పొడిని తెప్పించి ఇచ్చాడు. వెంటనే ఆ పొడితో తోమాను. ఇలా తోముతూండగానే ఆలా మెరవడం ప్రారంభించింది కడియం. ఆ మెరుపుని చూడగానే దాన్ని తీసిపారేద్దామనే ఆలోచన వాయిదా పడింది.

కడియం మెరుపులు చూసింది ఉంగరం. గట్టిగా ఏడిస్తే పరువు పోతుందనుకున్నట్టుంది. అందుకే లోలోపలే ఉడికిపోవడం మొదలెట్టింది.

పైకి మాత్రం డాంబికాన్ని ప్రదర్శిస్తూ అంది, “రాగి రాగే-బంగారం బంగారమే”


పీతలపొడితో తోమడం. కడియం మెరిసిపోవడం. నేను మురిసిపోవడం. ఉంగరం ఏడవలేక అలిసిపోవడం దినచర్యగా మారిపోయింది. ఒకరోజు మా చరిత్రోపన్యాసకుడు రాగి అంటే సహజ సిద్ధమైనదనీ దాన్ని సహజమైన చింతపండుతో తోమాలే తప్ప పొడుల్తో తోమకూడదన్నాడు. “మీ ఊరి పేరు కడియం. మీ ఇంటిపేరు కడియం. మీది కడియాల గోత్రం. మీది కడియపు సంస్కృతి. అలాంటి మీరు మీ కడియపు వారసత్వంలోని గొప్పదనాన్ని నిలబెట్టాలే తప్ప ఇలా అడ్డమైన పొడుల్తోనూ తోమడం ద్వారా దాని ప్రాభవాన్ని తగ్గించకూడదు” అంటూ సలహా ఇచ్చాడు. ‘నా గురించి నాక్కూడా తెలియని ఇన్ని విషయాలు మీకెలా తెలిశాయి ఆచార్యా?’ అని అడిగితే, “మా చరిత్రోపన్యాసకుల పనే అది మిత్రమా” అంటూ నవ్వేసి చక్కాపోయాడు.

మర్నాటినించీ పొడుల్తో తోమడం మానేసి కేవలం చింతపండుతో మాత్రమే తోమడం మొదలెట్టాను. నిజమే, రాగి కడియాన్ని చింతపండుతో తోమితే ఆ స్వారస్యమే వేరు. గమనిస్తున్నకొద్దీ కడియం మార్చే రంగుల హంగులూ పొంగులూ కేవలం సమయాన్నిబట్టి మాత్రమే కాకుండా కాలాన్నిబట్టి కూడా మారుతూంటాయని అర్థమైంది. కొత్తచింతపండుతో తోమామనుకోండి, పీతలపొడితో తోమినప్పటికంటే మిలమిలా మెరిసిపోతుంది. అప్పుడు మన ఉంగరం మొహం చూడాలీ, కందగడ్డని మించి ఎర్రబారిపోతుంది. అయినా దానికి ఎక్కువసేపు ఏడ్చే పని ఉండదులెండి, ఎందుకంటే ఆ మెరుపు కొద్దిసేపే. నేను కళాశాలకి చేరేటప్పటికి మెరుపు తగ్గి లేత పసుపులో అరగదీసిన గంధం రంగు స్థిరపడుతుంది. అప్పటినించీ అది వన్నెల విసనకర్ర అయిపోతుంది. చలవగదిలో ఉన్నంతసేపూ దానికి కిలం పట్టదు. కిలం పట్టనంతసేపూ దాన్ని మించిన వయ్యారాలు పోవడం పదహారేళ్ళ పడుచులవల్ల కూడా కాదు.

వేసంకాలంలో పొడిమెరుపు. వర్షాకాలంలో తడిమెరుపు. శీతాకాలంలో తడిపొడి మెరుపు. ఇలా కాలాల్నిబట్టి కూడా దాని మెరుపుల్లో అపారమైన వైవిధ్యం కనిపిస్తుంది.

మనపాటికి మనం రాగి వైభవాన్ని గురించి మాట్లాడుకుంటూంటే ఉంగరం మాత్రం ఉడుక్కుంటూ ఒకటే రొద పెడుతోంది,

“రాగి రాగే-బంగారం బంగారమే”


ఆరోజు కళాశాల ఉపన్యాసకుల విశ్రాంతిగదిలో ఉండగా తెలుగు పండితులవారు సంగీతాచార్యులని ఓ మాట అడిగారు, “అయ్యా సంగీత విద్వాంసా, ఈ రాగి కడియానికి రాగి అనే పేరెందుకు వచ్చిందంటారు?”

పాపం సంగీత విద్వాంసులకి ఎప్పుడైనా పాటలు పాడే అవకాశం వస్తుందేమో గానీ, మాటలు ఆడే అవకాశం రావడం చాలా అరుదు. అందుకే రెట్టించిన ఉత్సాహంతో విజృంభించారు, “సంగీతం పలికించే వాయిద్యాల్లో కొన్ని తంత్రీవాయిద్యాలున్నాయి. మొదటిసారిగా ఈ లోహాన్ని తీగలా సాగదీసి బిగించి చూశారు. ఆ తీగని మీటినప్పుడు ఏదో స్వరం వెలువడుతుందనే విషయాన్ని గ్రహించారు. అప్పటినుండి రాగితో రాగాల్ని పలికించగలిగారు. రాగాల్ని పలికించేది కాబట్టీ దాన్ని “రాగి” అన్నారు. కానీ రాగి తీగలకంటే శ్రావ్యంగా సంగీతాన్ని వినిపించే ఇత్తడి తీగల్ని కనిపెట్టిన తరవాత రాగి మరుగున పడిపోయింది. కానీ, రాగి అనే పేరు స్థిరపడిపోయింది. కాబట్టీ దాన్నిప్పుడు ఎవరూ మార్చలేరు”

తెలుగు పండితులవారు నావైపు చూస్తూ చిరునవ్వుతో అన్నారు, “చూశారా, కడియాలవారూ, మీ చేతి కడియం సామాన్యమైనది కాదు. రాగి మన ప్రకృతిలోని రంగులన్నింటినీ ప్రదర్శిస్తుంది కాబట్టీ దాన్ని వర్ణం అని కూడా అంటారు. వర్ణమంటే రంగు మాత్రమే కాదు, అక్షరం కూడా. అక్షరమంటే క్షరం లేనిది. శాశ్వతత్వాన్ని కలిగినది అని అర్థం. నిజమే కదా, బతుకు ఉన్నంతకాలం భావనలుంటాయి. భావనలున్నంతకాలం భాషా ఉంటుంది. అలాగే మీ కడియమూ కడియాలవారి వంశమూ నిరంతరంగా వర్ధిల్లుతూంటాయి, “అంటూ చెప్పుకుపోతున్నారు. అంతలోనే సామాజికాధ్యాపకులు, “మీరు వర్ణం అంటే గుర్తొచ్చింది. అసలు వర్ణాలు లేకపోతే మీ భాష ఎలా ఉండదో అలాగే మా సమాజమూ ఉండదండి బాబూ, వర్ణ చిత్రాల్లో రంగులెన్ని ఉన్నాయో ఏ చిత్రకారుడూ చెప్పలేడు. భాషలో ఎన్ని పదాలున్నాయో ఏ భాషాపండితుడూ చెప్పలేడు. అలాగే మన సమాజంలో కూడా ఎన్ని వర్ణాలున్నాయో ఎవరూ చెప్పలేరు. అంతరించేవి అంతరిస్తూనే ఉంటాయి. అవతరించేవి అవతరిస్తూనే ఉంటాయి. అదే మన భారత సమాజంలోని వైవిధ్యం. ఆ వైవిధ్యాల మధ్య సమన్వయాన్ని సాధించడంలో మనం ఎప్పుడూ ముందే ఉంటాం, మీ ముంజేతి కంకణం చెబుతున్న సామాజిక సత్యం అదే. భాషైనా, భావమైనా, రంగైనా హంగైనా కేవలం వైవిధ్యాలు మాత్రమే. వాటిని వైరుధ్యాలుగా భావించి రూపుమాపాలని ప్రయత్నిస్తున్నకొద్దీ అవి మరో కొత్త రూపంలో తలెత్తుతూనే ఉంటాయి, “అంటూ వివిధ శాస్త్రాల మధ్య సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేస్తూ ఉండగానే, మానవ సంబంధాల శాస్త్రాచార్యులవారు, “రాగి అంటేనే అనురాగం. అది లేకపోతే మానవ సంబంధాలే ఉండవు. ఆ మానవ సంబంధాలని ఎప్పటికప్పుడు ఉన్నతీకరిస్తుంది కాబట్టే రాగి సర్వోత్తముడు. విరాగి ఉత్తముడు. బైరాగి అమాయకుడు. అందుకే సిక్కులు తమ గురువును రాగి అని సంబోధిస్తారు” అంటూ మానవ సంబంధాలని ముడివేసే రాగరాగిణి అయిన అనురాగ వీణని పలికిస్తూ తన్మయత్వం అనుభవిస్తున్నాడు.

అక్కడ అందరూ తలోరాగాన్నీ ఆలపిస్తూ రాగి గుణగణాల్ని కీర్తిస్తున్నారు. కానీ వాటన్నిటి వెనుక తంబూర శ్రుతిలా వినిపిస్తోంది ఆరున్నొకటో రాగం. అది ఉంగరానిది.

రాగి మాత్రం విరాగిలా చూస్తోంది. దాని వైరాగ్యం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే దానికి మిడిసిపడటమూ రాదు. జారిపడటమూ రాదు. తోమితే మెరుస్తుంది. లేకపోతే ఊరుకుంటుంది. అదో పెద్ద మౌనానందస్వామి. అయినా సరే దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాను. “నీ గురించి ఇంతమంది మేధావులు, పండితులు, జ్ఞానులు ఇన్నేసి విధాలుగా మెచ్చుకుంటూంటే కనీసం వారికి కృతజ్ఞతైనా చెప్పవేం? వారి పాండిత్యాన్ని గౌరవిస్తూ వారికి ఓ చిరునవ్వైనా ప్రసాదించవేం? ఇన్ని ఉన్నదానికి ఇంత ఉదాసీనం పనికిరాదు. ఇప్పుడైనా ఉంగరాన్ని ఎదిరించు. సవాలు చెయ్యి. పోటీపడు. గెలిచి చూపించు. నీ స్థాయేమిటో నిరూపించు.

ఊహూ, దానిలో ఉలుకూలేదు. పలుకూ లేదు.

అందుకే దాని తరఫున నేను వకాల్తా తీసుకున్నాను. ఉంగరం వైపు చూస్తూ ఓ మాటన్నాను. అది వినగానే, “ఇంత చదువుకున్నావు. ఇంత జ్ఞానాన్ని సంపాదించావు. పిలవని పేరంటానికెళ్తే పేడబూరెలు తినాల్సొస్తుందనే విషయం కూడా తెలీదు. ఇంక ఆ చదువెందుకు? ఆచార్యుడనే పదవెందుకు?” అంటూ ఇగటంగా నవ్వింది.

అంతే కాదు, నేనన్నమాటతో నన్నే తిప్పికొట్టింది, “రాగి రాగే-బంగారం బంగారమే”


నాలో నేనున్నాను. ఆ నేనుతో ఇంకో నేనున్నాడు. నాలో ఉన్న నేనుగాళ్ళ సంఖ్య ఎంతో నాకైతే లెక్కతెలీదు. కానీ, ఉంగరం అహంకరించిన ప్రతిసారీ నాలోంచి ఒక్కో నేను గాడు నిద్రలేస్తున్నాడు. ఒక్కొక్కడూ ఒక్కో పండితుడిని సమర్థిస్తున్నాడు. ఆ పండితుడు చెప్పిన నిజాల్ని ఎప్పటికప్పుడు పరీక్షించి నిగ్గుతేలుస్తున్నాడు.

మా శాఖలో ఉండేదే ముగ్గురం. అందులో ఒకాయన కూతురి పెళ్ళి కోసం శలవు పెట్టారు. ఇంకొకాయన అఖిలభారత ఆచార్యుల సంఘానికి అధ్యక్షుడు. ఆయన వచ్చినా రాకపోయినా అడిగే ధైర్యం ఎవరికీ లేదు. కనీసం నేను కూడా వెళ్ళకపోతే బాగుండదు. అందుకనే నీరసంగా ఉన్నా ఓపిక చేసుకుని కళాశాలకి వెళ్ళాను. కానీ పదకొండయ్యేసరికి జ్వరం ప్రకోపించి కుర్చీలో కూర్చోవడం కూడా కష్టమైపోయింది. దాంతో శలవు చీటీ రాసుకుని ప్రాంశుపాలుని గదిలోకి వెళ్ళాను.

వేళకాని వేళలో వెళ్ళిన నన్ను చూడగానే కూర్చోమన్నారు మా ప్రాంశుపాలుడు. ఆయన వైద్యాచార్యులు. అందుకే నాలో ఏదో తేడా వుందని గమనించారు. చూపుల్ని నా కడియం పైకి సారించారు. కాసేపు పరీక్షగా చూశారు. ఆ తరువాత నన్ను చూసి, “మీకు జ్వరంగా ఉంది. దాదాపు నూట రెండు పైనే. ఇంత జ్వరం పెట్టుకుని అసలెందుకొచ్చారు? ముందు ఇంటికెళ్ళి చారన్నం తినేసి ఈ మాత్రలు వేసుకుని విశ్రాంతి తీసుకోండి. కానీ నిద్రపోవద్దు” అంటూ మాత్రలు రాసిచ్చారు.

నా జ్వరం విషయం ఎలా తెలిసిందో అర్థం కాక నేను తికమక పడ్డం గమనించారాయన. అందుకే అడక్కుండానే చెప్పారు, “మనం చెప్పలేని ఎన్నో విషయాల్ని మన కడియాలు చెప్పేస్తాయి. ప్రస్తుతం మీ కడియం రంగు మీలో పెరిగిన ఉష్ణోగ్రత గురించి చెప్పింది. రాగి ప్రత్యేకతే అది. ఎప్పటికప్పుడు ప్రకృతికీ వాతావరణానికీ పరిస్థితులకీ ప్రదేశాలకీ అనుకూలంగా స్పందిస్తుంది. ప్రస్తుతానికీమాత్రం చాలుగానీ, ముందు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి” అంటూ నన్ను పంపించేశారు.

మా ప్రాంశుపాలుని మాటలు వినగానే నాలో మరో కొత్త నేనుగాడు హఠాత్తుగా మేనువిరుచుకున్నాడు. వాడు ఉంగరం వైపు చూస్తూనే మండిపడ్డం మొదలెట్టాడు, “ఎండావానా చలీ జ్వరం ఏదీ లేదు. రంగు మారదు, తుప్పట్టదు, కిలం ఊరదు, ప్రకృతిలో దేనికీ స్పందించదు, పగలూ రాత్రీ ఉదయం సాయంత్రం దేనికీ జవాబివ్వలేదు. దీనికే ఇంత పొగరుంటే మన రాగికెంతుండాలి?” అంటూ మొదలెట్టాడు.

ఉంగరం పడీ పడీ నవ్వుతూ అంది, “ఏది కనిపిస్తే దానికల్లా సలాం కొడుతూ, ఎవరేం చెప్పినా గంగిరెద్దులా తలాడిస్తూ, రంగులు మారుస్తూ, మాటలు, మతాలు, అభిమతాలూ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఏ ఎండకాగొడుగు పట్టేవాళ్ళెప్పటికీ జనాల్లో మార్పు తీసుకురాలేరు. అది తీసుకురాలేనివాళ్ళు ఎప్పటికీ రాజులవ్వలేరు. స్థిర చిత్తం. ఏక వర్ణం. తదేక దృష్టి. ఒకే మాట-ఒకేబాణం. అవి లేనివాళ్ళెంతమందున్నా వాళ్ళల్లో ఏ ఒక్కరూ ఎప్పటికీ ప్రభువులు కాలేరు. ఈ కడియంలాగా” అంటూ కడిగి పారేసి ఎప్పట్లాగే తన ధోరణిలో ముక్తాయించింది, “రాగి రాగే-బంగారం బంగారమే”


విలువైనవాటి విలువ, ఆయా విలువల్ని పెంచేవాళ్ళవల్ల పెరుగుతుందే తప్ప వాటి స్వయం ప్రతిభతో కాదు. ఈ విషయం ఉంగరానికి అర్థం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు నాలోని అర్థశాస్త్ర నిపుణుడు. ఉంగరం వెటకారంగా నవ్వుతూ అంది, “నీది అర్థశాస్త్రమేగానీ పూర్తి శాస్త్రం కాదు. కాబట్టీ నీలాంటి అరకొర పండితుల మాటల్ని బుద్ధుండే రాజులెవరూ లక్ష్యపెట్టరు”

ఉంగరం మాటలు వినగానే అర్థశాస్త్ర నిపుణుడి నోరు మూతపడిపోయింది.

ఉన్నట్టుండి హఠాత్తుగా పైకి తోసుకొచ్చాడు నాలోని స్వర్ణాచార్యుడు. పట్టరాని కోపంతో ఉంగరాన్ని హెచ్చరించాడు, “చివరిసారిగా చెబుతున్నాను. మర్యాదగా నీ అహాన్ని వీడి రాగి ఔన్నత్యాన్ని అంగీకరించు. లేదా నువ్వు నామరూపాల్లేకుండా పోతావు”

“నాలుగు రూకలకి నగలను మలిచే నీకే ఇంతుంటే అన్నింటికంటే విలువైనదాన్ని నాకెంతుండాలి. నన్ను తయారుచెయ్యడమే నీ గొప్ప అని మిడిసి పడుతున్నావేమో. వెళ్ళి మీ అమ్మనడుగు, ఏ తల్లైనా పిల్లల్ని కనగలదేగాని వారి భవిష్యత్తుని కనలేదు. నువ్వు నన్ను తయారు చెయ్యగలవేగానీ నా విలువని నిర్ణయించలేవు”

“అమ్మగురించి చులకనగా మాట్లేడేవాళ్ళెవ్వరికీ ఈ భూమ్మీద స్థానం లేదు” అంటూ కడియానికి సైగ చేశాడు స్వర్ణాచార్యుడు. ఆ కడియం బంగారాన్ని ఆభరణంగా మార్చడంద్వారా దాని ఉనికిని నిలబెట్టిన తన సహోదరుడికి సైగ చేసింది.

నాలోని నేనులందరూ సచేతనామృత నవరాగాల్ని ఆలపిస్తున్నారు. అహంకారుల గుండెలు గుబులెత్తేలా సింహాలై గర్జిస్తున్నారు. చూస్తూండగానే వాటన్నిటి చుట్టూ రంగుల మేఘాలు కమ్ముకుంటూ వర్ణరంజితమైన విప్లవాన్ని తీసుకొస్తున్నాయి. దాని తాలూకూ ప్రతిధ్వనులు సృష్టి ఆద్యంతం ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఆ ప్రకంపనలు అంతవరకూ తపస్సు చేసుకుంటూ కూర్చున్న రాగి చెవుల్లో పడగానే కళ్ళు తెరిచింది. నేనులందరి నినాదాలకీ ప్రతిస్పందిస్తూ ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంది.

అంతే!

ఉంగరానికి ఆకారాన్నిస్తూ అందులో కలగలిసి ఉండే కొద్దిపాటి రాగి విరుపుకు ఉంగరంలోని బంగారం తునాతునకలై పొడిపొడి రేణువులుగామారి సముద్రం ఒడ్డున ఇసకలో చెల్లాచెదురుగా రాలిపోయింది. బాలభానుని లేత కిరణాల వెలుగులో సాగర తీరంలోని ఇసకంతా బంగారంలా మెరిసిపోతోంది. అందులో ఏది ఇసక రేణువో ఏది బంగారు కణమో అర్థం కావడం లేదు. ఏ అయస్కాంతమో తెచ్చి ఆకర్షిద్దామంటే ఆ బంగారానికి కనీసం ఇనుమంత ఆకర్షక బలం కూడాలేదు.

నాలోంచీ సరికొత్త నేనుగాడొకడు పిడికిలి బిగించాడు. మళ్ళీ అనామికగా మారిపోయిన ఉంగరం వేలిని చూస్తూ స్పష్టంగా ప్రకటించాడు, “రాగి రాగే-బంగారం బంగారమే”