పూడూరి రాజిరెడ్డి

పూడూరి రాజిరెడ్డి

పూడూరి రాజిరెడ్డి: సొంత ఊరు ఒకప్పటి కరీంనగర్ జిల్లా వేములవాడ దగ్గరి నర్సింగాపురం. బీయెస్సీ పూర్తి చేసిన తరువాత కొన్నాళ్ళు ఈనాడు దినపత్రికలో పనిచేశారు. సాక్షి దినపత్రిక మొదలైనప్పటినించీ అందులో పనిచేస్తున్నారు. ఇప్పుడు సాక్షిలో సాహిత్యం శీర్షిక నిర్వహిస్తున్నారు. 2009 లో “మధుపం: ఒక మగవాడి ఫీలింగ్స్”, అన్న పుస్తకాన్నీ, 2013 లో కొన్ని సమూహాలు, కొన్ని ప్రదేశాల అనుభవాలను “రియాలిటీ చెక్” అన్న పేరుతో పుస్తకంగా వెలువరించారు. 2017లో “చింతకింది మల్లయ్య ముచ్చట” అనే కథల సంపుటి వెలువరించారు. త్వరలో “ఆజన్మం” అనే కథల సంపుటి ప్రచురించబోతున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. ఎప్పటికైనా సొంతఊరికి వెళ్ళి క్షేత్ర వ్యవసాయంతో పాటు సాహితీ వ్యవసాయం కూడా చేయాలని ఉంది. మొదటి బహుమతి పొందిన వీరి కథ కొండ

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి: స్టార్ మా తెలుగు చానెల్‌లో రచయితగా పనిచేస్తున్నారు. ఈటీవీ కన్నడవాహినిలో పనిచేసినప్పుడు కన్నడంలో కూడా రచనలు చేశారు. ముప్ఫై కథలకి వివిధ పోటీల్లో బహుమతులు పొందారు. వలసదేవర నవలకి గాను అమెరికన్ తెలుగు అసోసియేషన్‌వారి తొలి నవలల పోటీలో మొదటి బహుమతి పొందారు. త్వరలో “నూటొకటో మార్కు” అనే కథాసంపుటం ప్రచురించబోతున్నారు.రచయిత కాకముందూ, తరవాతా కూడా జీవితాన్నే తప్ప సాహిత్యాన్ని చదవకపోవడమే తన బలమూ, బలహీనత అని నమ్ముతారు. రెండవ బహుమతి పొందిన వీరి కథ రాగరాగిణి, విశిష్టరచనగా ఎంపిక అయిన వీరి కథ నాగరి’కథ’


కె. ఎ. మునిసురేష్ పిళ్లె

కె. ఎ. మునిసురేష్ పిళ్లె

కె.ఎ. మునిసురేష్ పిళ్లె: శ్రీకాళహస్తిలో పుట్టి హైదరాబాదులో స్థిరపడ్డారు. రాయడం ఆసక్తి, ఆదరవు. పాత్రికేయం ప్రధాన వ్యాసంగం. అందులో ఇమడలేకపోయిన సంగతులు మెలిపెట్టినప్పుడు రచనా వ్యాసంగానికి పూనుకుంటారు. కవిత, నవల, వ్యంగరచన, కార్టూన్లలో కూడా ప్రవేశం ఉంది. మధురాంతకం రాజారాం కథ “పొద్దుచాలని మనిషి” వీరికి స్ఫూర్తి నిస్తుంది. మూడవ బహుమతి పొందిన వీరి కథ వరాలత్త గాజులు

వి-రాగి

వి-రాగి

ఎక్కువగా “వి-రాగి” అన్న కలం పేరుతో రచనలు చేసిన వీరి అసలు పేరు ఉండవల్లి సూర్యచంద్ర రావు. నివాసం రాజమండ్రి సమీపంలోని కొంతమూరు. నలభై ఏళ్లకు పైగా కథలూ, కవిత్వం రాస్తున్నారు. అనేక తెలుగు దినపత్రికల్లో సంపాదక విభాగంలో పనిచేసి, సాక్షి దినపత్రికలో సీనియర్ సబ్ఏడిటర్‌గా కొద్దినెలల క్రితమే పదవీ విరమణ చేశారు. 500 కి పైగా కవితలూ, 100 కి పైగా కథలూ రాశారు. మానవుల మానవీయ ప్రయాణం ప్రారంభం కావలిసి ఉందనీ, ఆ ప్రయాణానికి వాళ్ళని మానసికంగా సన్నద్ధం చేయడానికి దోహదపడే ఏ రచనైనా స్ఫూర్తిదాయకమేననీ, ఆ రచయితలు స్ఫూర్తిదాతలేననీ భావిస్తారు. మూడవ బహుమతి పొందిన వీరి కథ ఈ గాయమెంత తియ్యనో


“వసుంధర” కలంపేరుతో సంయుక్తంగా రచనలు చేసే వీరు దంపతులైన డాక్టర్‌  జొన్నలగడ్డ రాజగోపాలరావు(శాస్త్రవేత్త), రామలక్ష్మి (గృహిణి). దాదాపు అన్ని రకాల సాహితీ ప్రక్రియల్లో రచనలు చేసి, అన్ని వయసుల తెలుగు పాఠకులకీ చిరపరిచితులు అయినవారు. వేలాది కథలు, నవలలు, కవితలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు రచించారు. కొన్ని రచనలు సినిమాలుగా వచ్చాయి. టీవీ, ఆకాశవాణిలో కూడా ప్రసారం అయ్యాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు విలువైన సలహాలు ఇస్తూ “సాహితీవైద్యం” అనే వినూత్నమైన శీర్షిక 1992 నించీ రచన మాసపత్రికలో నిర్వహిస్తున్నారు. వీరి కథ అంతకుడు.

సింహప్రసాద్

“సింహప్రసాద్” అనే కలం పేరుతో రాసే వీరి అసలు పేరు సీ.వీ.ఎన్. ప్రసాద్.  నివాసం హైదరాబాదు. పశ్చిమగోదావరి జిల్లాలోని మల్లవరంలో రైతు కుటుంబంలో పుట్టారు. ఇండియన్ బ్యాంకులో సీనియర్ మేనేజరుగా పనిచేసి 2001 లో పదవీ విరమణ చేశారు. 1973 నించీ కథలు రాస్తున్నారు. 370 కథలు, 62 నవలలు, రెండు నాటికలు, కొన్ని కవితలు ప్రచురించారు. అనేక రచనలకు బహుమతులు అందుకున్నారు. వీరి కథ బతకనీ.

కె. వరలక్ష్మి

కె. వరలక్ష్మి

కె. వరలక్ష్మి: నివాసం తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట. ఇప్పటి వరకూ 140కి పైబడి కథలు, నాలుగు నవలలు, రేడియో నాటికలు, కవితలు రాశారు. 5 కథాసంపుటాలు, ఒక కవిత్వసంపుటి ప్రచురించారు. సాహిత్య ప్రక్రియలన్నిటిలోనూ కథ అంటే ఇష్టం. కథ జీవితాన్ని ప్రతిబింబించాలని, నేలవిడిచి సాము చెయ్య కూడదని భావిస్తారు. బోధనపై ఉన్న ఇష్టంతో కొన్నాళ్ళు చిన్నపిల్లలకోసం ఒక బడి నడిపారు. వీరి కథ శత్రువు.

అరుణ పప్పు: ఉత్తరాంధ్రలో పుట్టారు. గణితంలో ఎం. ఎస్‌.సీ. చేసినా తెలుగు చదవాలనీ, రాయాలనీ వున్న అభిలాష వల్ల చేపట్టిన వృత్తి పాత్రికేయం. దాదాపు పన్నెండేళ్ళు హైదరాబాద్ ఈనాడు దినపత్రికలో, ఆంధ్రజ్యోతి వారపత్రికలో పనిచేసి, ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీలో కమ్యూనికేషన్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. సంఘటనలు, మలుపులు కన్నా, పరిస్థితులను బట్టి మానవ స్వభావం ఎలా మారుతుందన్నది పరిశీలించడానికీ, కథల్లో చెప్పడానికీ ఇష్టపడతారు. వీరి కథ దయచేసి రెప్ప వెయ్యండి.


జగన్‌మిత్ర

జగన్‌మిత్ర

జగన్‌మిత్ర కలం పేరుతో రచనలు చేసే వీరి అసలు పేరు కిలపర్తి జగ్గారవు. స్వగ్రామం విశాఖపట్నం దగ్గర  వేపాడ. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో చదువు, ఉద్యోగం. అంతరిక్ష సంస్థ ఉద్యోగులకు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల, చెన్నై ప్రాంత ప్రజలకు డాక్టరుగా సేవలు అందించారు. సీనియర్ సిటిజెన్ కావడం వల్ల అవకాశాలు పరిమితమైనా పలు సేవా కార్యక్రమాలలో చేతులు కలుపుతూ ఉంటారు. వీరి కథ ఆపద్బాంధవులు.

ఎండపల్లి భారతి

ఎండపల్లి భారతి

ఎండపల్లి భారతి: సొంత ఊరు చిత్తూరు జిల్లా మదనపల్లె పక్కన దిగువబురుజు అనే పల్లె. చిత్తూరు జిల్లా మాండలికంలో కథలు రాస్తుంటారు. కిందటి సంవత్సరం వీరి కథలతో “ఎదారి బతుకులు” అనే కథా సంపుటి విడుదల అయ్యింది. ఇంకా అనేక కథలు   వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథ అదవబతుకు.


వెంకటమణి ఈశ్వర్

వెంకటమణి ఈశ్వర్

వెంకటమణి ఈశ్వర్‌: సొంతఊరు విశాఖ జిల్లాలోని చీడికాడ. జర్నలిజం చదివి, ప్రజాశక్తి దినపత్రికలో పనిచేశారు. మహాత్మాగాంధీ, జయప్రకాశ్ నారాయణ్, వినోబా భావే తదితరుల వల్ల ప్రభావితులై, 2008లో “పార్టీరహిత రాజకీయం” అనే పత్రిక స్థాపించి, నాలుగేళ్ళపాటు నడిపారు.  2013 నించీ “సెంటర్ ఫర్ డెమొక్రటికక్ సొసైటీ” అనే సంస్థ స్థాపించి దాని కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. వీరి కథ పౌరసన్మానం.