తెల్సా కథలపోటీకి మాకు దాదాపుగా 150 కథలు వచ్చాయి. చేతివ్రాతలో ఉన్నవీ, హామీపత్రం లేనివీ, ఫాంటు కారణంగా మేము చదవలేకపోయినవీ మినహాయించగా, 139 కథలు పోటీకి పరిశీలించాము. చేయి తిరిగిన రచయితలే కాక, తొలిప్రయత్నంచేసిన రచయితలతోసహా ఎంతోమంది ఆసక్తితో పాల్గొనడం సంతోషం.

తెలుగులో పూర్తిగా ఎలక్ట్రానిక్‍గా జరిపిన కథలపోటీ ఇదే మొదటిది కావచ్చు. ఎలక్ట్రానిక్‍గా ఈమెయిల్‍ ద్వారా మాత్రమే రచనలు స్వీకరించడం వల్ల కొద్ది గంటలలోపే రచయితలకి వారి కథ మాకు చేరినట్లు తెలియచేయగలిగాము. కొందరు రచయితలు ఒకటికన్నా ఎక్కువ రచనలు పంపారు. కొందరు రచయితలు తమ కథలకి మార్పులు చేర్పులు చేసి, కొద్దిరోజుల తరువాత రెండవ ప్రతి పంపారు. యూనికోడు వర్డ్ ఫార్మాటులో పంపిన రచనలని మాత్రమే స్వీకరిస్తామని ప్రకటించినా, చాలా మంది రచయితలు యూనికోడు కాని ఇతర ఫాంటులో కూడా టైపు చేయించి పంపారు. అటువంటి రచనలు పీ.డీ.యఫ్ ఫార్మాటులో ఉంటే వాటిని కూడా పరిశీలించాము. మేము పరిశీలించలేని ప్రతి కథారచయితకీ వారి కథని ఎందుకు పరిశీలించలేమో స్పష్టంగా తెలియచేసాము. కొందరు రచయితలు తిరిగి యూనికోడులో టైపు చేయించి పంపారు.

చాలా కథలమీద, ముఖ్యంగా నాటికలమీద టీవీ సీరియళ్ళ, సినిమాల ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. జీవితానుభవంతో రాసిన కథలకన్నా, జీవితం గురించి తగినంత అవగాహన లేని కథలు ఎక్కువ రావడం విచారకరం. భాష,శిల్పం, శైలి, పాత్రచిత్రణ విషయంలో కొందరు కథకులు శ్రద్ధ తీసుకోలేదు.

ఈ క్రింది కథలు బహుమతులకి ఎంపిక చేసాము. ముందు మేము అనుకున్నట్లు కాక, మూడవ బహుమతికి రెండు కథలు ఎంపిక చేసాము. మరొక కథని విశిష్టరచనగా ఎంపిక చేసాము. మరొక ఏడు కథలు సాధారణ ప్రచురణకి ఎంపిక చేసాము. మొత్తం ₹1,25,000 పారితోషకం ఇస్తున్నాము. రెండవ బహుమతికి ఎన్నుకున్న కథ, విశిష్టరచనగా ఎన్నుకున్న కథ ఒక రచయితవే కావడం విశేషం.

ఏడు సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు: ఒక్కొక్కదానికి ₹5,000 పారితోషికం

  1. అంతకుడు – వసుంధర
  2. బతకనీ – సింహప్రసాద్
  3. ఆపద్బాంధవులు – జగన్ మిత్ర
  4. అదవబతుకు – ఎండపల్లి భారతి
  5. దయచేసి రెప్ప వెయ్యండి – అరుణ పప్పు
  6. పౌరసన్మానం – వెంకటమణి ఈశ్వర్
  7. శత్రువు – కే.వరలక్ష్మి

ఈ కథలని మా వార్షికోత్సవసమయానికి ఇక్కడ ప్రచురిస్తాము. నిబంధనల ప్రకారం మా వెబ్‍సైటులో ప్రచురించిన తర్వాతే రచయితలు వేరోచోట ప్రచురించుకోవచ్చు.

ఇవి కాక ఈ క్రింది ఏడు కథలనీ మేము త్వరలో ప్రచురించబోయే ఆన్‍లైన్ వెబ్‍పత్రికలో సాధారణ ప్రచురణకి ఎంపిక చేసాము. వెబ్‍పత్రిక ప్రచురణకి 3-4 నెలలు పట్టవచ్చు. అప్పుడు మేము ఆయా రచయితలని సంప్రదించి వారికి పారితోషకం పంపుతాము. అంతవరకూ ఆగదలచని రచయితలు తమ కథలని వేరే పత్రికలకి పంపదలచుకుంటే, మాకు తెలిపితే మా ఎంపికలోంచి తీసివేస్తాము.

  1. ఆత్మసాక్షిగా – సుంకోజీ దేవేంద్రాచారి
  2. చారు-అన్నం – కడయింటి కృష్ణమూర్తి
  3. ధరిత్రి – సలీం
  4. విశ్వాసం – బాడిశ హన్మంతరావు
  5. శిక్ష – సలీం
  6. సింగిడి – వాగుమూడి లక్ష్మీరాఘవరావు
  7. కొలిమి- ఎస్. నాగేందర్

కథలపోటీ ముగిసినందువల్ల, ఏ విధమైన ప్రచురణకీ ఆమోదించని కథల రచయితలు తమ కథలని వేరే పత్రికలకి పంపుకోవచ్చు.

పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ధన్యవాదాలు. పోటీ ప్రకటనని ప్రచురించిన సారంగ వెబ్‍పత్రిక వారికీ, ప్రకటన తయారీకి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన “ఛాయ” మోహన్‌బాబు గారికీ, ప్రకటనని ఫేస్‍బుక్‍లో, ఇతర వాట్స్ఆప్ గ్రూపుల్లో ప్రచురించి, ప్రచారం కల్పించిన మిత్రులందరికీ మా ధన్యవాదాలు. పోటీ ప్రకటనని తమ దినపత్రికలలో ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి దినపత్రికల యాజమాన్యాలకు, సంపాదకులకు కూడా మా ధన్యవాదాలు.

తెల్సా బృందం
మురళి చందూరి, పద్మ ఇంద్రగంటి, బాపారావు కొచ్చెర్లకోట