“రేయ్ మునసామీ..”
“అత్తా..”
“బండి కట్టరా..”

ఆ సమయానికి నేను కారు కడిగే పనిలో ఉన్నాను. బాడుగలకి వెళ్లడానికి బద్ధకించిన రోజున కారు కడిగే పని పెట్టుకుంటాను. సుబ్బరంగా షాంపూ గట్రా వేసి కడుగుతాను. లోపల పట్టాలన్నీ తీసి దాదాపు ఉతికినంత పన్జేసి ఆర బెడతాను. ఇక కారుని ఆరడానికి వదిలేసి, ఎంచక్కా మళ్లీ బండితీసే మూడ్ వచ్చేదాకా రెస్టు తీసుకుంటాను. ఒకసారి నేను రెస్టు తీసుకోదలచి, బద్దకించిన తర్వాత, బ్రహ్మరుద్రాదులు వచ్చినా నాతో స్టీరింగు పట్టించలేరు. కానీ వరాలత్త సంగతి వేరు. అయినా సరే, ‘బద్దకించానత్తా, ఇవాల్టికి వదిలేయ్’ అంటే, ఏ రిక్షానో మాట్లాడుకుని వెళ్లిపోతుంది. ‘ఇప్పుడేమంత నీకు అర్జంటు పని? రేపెళ్దాంలే’ అంటే తన ప్రోగ్రాము మార్చుకుంటుంది. మరే సాకు చెప్పి తప్పించుకో జూసినా, ‘తప్పకుండా రావాల్సిందే’ అనదు. ‘వస్తున్నా’ అనేసి, ఓ గంటన్నర దాకా కారు సుబ్బరంగా కడుక్కుని నిక్కుతూ నీలుగుతూ వెళ్లినా కూడా, ఏమీ అనదు. కానీ, ఎందుకో ఆ గొంతు వినగానే గబుక్కున బండి కట్టేయాలని ఉడుకెత్తింది.

కారు మీద అక్కడక్కడా చుక్కలుచుక్కలుగా గుమ్మరించిన షాంపూని తుడిచి, బయటేసిన పట్టల్ని దులిపి లోపల సర్దేశా. డ్రాయరు మీద తెల్లలుంగీ చుట్టి, దండెంమీద చేతికి దొరికిన చొక్కా తీసి తొడుక్కున్నా. ‘వొచ్చేప్పుడు సరుకులు తెండి’ అనే పెళ్లాం మాటల్ని చెవినేసుకోకుండా, యివ్వబోయిన సంచి అందుకోకుండా, క్షణాల్లో బండి తీసి వరాలత్త వాకిట్లో పెట్టా.

వరాలత్త. మా వూళ్లో కొందరికి మామ్మగారు, కొందరికి అత్త, అమ్మ, పిన్ని, పెద్దమ్మ, అక్క, దారమ్మట వెళ్లే ప్రతివాడికీ ‘యేండీ’! ఆ పదాన్ని పిలుపు పక్కన కలపడం తెలీని నాకు మాత్రం ఉత్త వరాలత్త.

ఏటవాలుగా యెర్ర పెంకు నేసిన వసారాలోంచి కాస్తంత తల వంచుతూ వాకిటిలోకొచ్చి నిలబడింది వరాలత్త. పడమట పతనమైపోడానికి పరుగెత్తుతున్న సూరీడింకా ఎర్రబడలేదు. కానీ వరాలత్త మొహం ఎర్రగా కణకణ మండుతున్నట్టుగా ఉంది. పెంకులకప్పు వాటం వల్ల వచ్చిన ఎరుపు నీడ కాదు. కట్టుకున్న కుంకుమ రంగు నేతచీర మీద పడిన ఎండ మెరుపు కాదు. లోపలినుంచి వస్తున్న మంట మొహంలో కనిపిస్తోంది. ఇంతకు ముందు పిలుపులో కూడా అదే వినిపించింది. అందుకే నిల్చున్నపళంగా బండి తెచ్చి నిలబెట్టాను.

ముందువైపు డోరు తీసి నిల్చున్న నేను సంచులు, లగేజీకోసం వసారాలోకి చూస్తే, బాబూరావు గారు! ఇప్పుడే వచ్చినట్లు, ఇంకా ఆఫీసు వేషంలోనే ఉన్నారు. దుస్తులు మార్చుకునే ప్రయత్నం మధ్యలోనే ఉన్నట్టున్నారు. చొక్కా రెండు బొత్తాములు విప్పి ఉంది. ఇన్‍షర్ట్ ఇంకా తీయనేలేదు. ఈలోగా వరాలత్త బయల్దేరిపోయినట్లుంది. ఉరుములేకుండానే. తగాదా పడ్డారా ఏంటి ఖర్మ? ఛ! ఛ! బాబూరావు గారికి అంత లేదు. సిగరెట్ ఫ్యాక్టరీలో మేనేజర్ ఆయన. మొహం మీద చిరునవ్వు ఎప్పటికీ చెరగనివ్వని నిమ్మళమైన మనిషి. ఇప్పుడు మాత్రం కంగారుగా చూస్తున్నారు. అత్తతో ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నట్లున్నారు.

విసవిసా వెళ్లి ముందుసీట్లో కూర్చుంది. “అత్తా చెప్పులైనా వేసుకోలే” దంటూ, తేవడానికి వసారాలోకి వెళ్లబోయాను. “ముందు బండి తీయ్” గద్దించింది. పరుగున వచ్చి స్టార్ట్ చేశాను. దుమ్ము రేపుకుంటూ కదిలాం. వీధిలోంచి రోడ్డెక్కబోతుండగా “మామిడాడ” అంది.

నేనింకేం అడగలేదు. అడుక్కంటా తొక్కాను.


నా పేరు మీకు తెలుసు. నేను గోదారమ్మ కొడుకుని. నాకు రెండు ఊర్లున్నాయి. ఒకటి- తిరుపతి పక్కన పల్లె, రెండు- బిక్కవోలు అనే బిరుదాంకినవోలు. గోదారిజిల్లాలో కాకినాడకు దగ్గర్లో వుంటుందది. నా అసలు ఊరుపేరు అచ్చంగా నాకు తెలీకపోవడం వల్ల పాతికేళ్లకు పైబడి, నేను బిక్కవోలు అల్లుడిగానే బతుకుతున్నాను. ఇదెలా జరిగిందంటే, ఈనాటికి రెండు పుష్కరాలకి ముందు పుష్కరాలకి మా అమ్మా నాన్నా నన్ను తీసుకొచ్చారు. రాజమండ్రి రేవులో తప్పిపోయాను. అప్పటికి నాకు అయిదారేళ్లు. మాదెంత చిన్న పల్లె అంటే, దాని పేరు కూడా తెలియదు నాకు. తిరుపతి దగ్గర్లో ఉంటుందని మాత్రం తెలుసు. మా వూళ్లో బడిలేదు. అమ్మ, నాయిన అనే పదాలు తప్ప వాళ్ల పేర్లు కూడా తెలీదు. అలాంటి కష్టంలో, ఓ చెట్టు కింద ఏడుస్తూ కూచోని, వరాలత్త కంటబడ్డాను. ముందు నాకు తినడానికి పెట్టి, ఏడుపు ఆపించింది. మా అమ్మానాన్నల్ని పట్టుకోడానికి, అప్పటికి చేయగలిగిన ప్రయత్నమంతా చేసింది. పొద్దు వాలినాక నాకంటె కొంచెం పెద్దోళ్లయిన తన పిల్లల్తో పాటు నన్ను కూడా బిక్కవోలుకు తెచ్చేసింది. ఏదోనాటికి ఆచూకీ తెలియకపోతుందా అని రాజమండ్రి పోలీసులకి అడ్రసు కూడా ఇచ్చే వచ్చింది. కానీ నెలలు గడిచిపొయినా నన్ను వెతుక్కుంటూ ఎవరూ రాలేదు.

“ఊరైనా తెలియకుండా ఏం జేసేదిరా? యిక్కడే వుండిపోతావా” అంది

“వుంటానత్తా” అన్నాను. అప్పటికి బెరుకుపోయింది. అన్ని రోజుల్లో ఏడిచే అవసరం కూడా రాలేదు నాకెప్పుడూ. ఊరి వాళ్లో, అత్త బంధువులో నన్ను కొత్తగా ఇంట్లో చూసినప్పుడు ‘ఎవ’రని ఆరా తీసేవాళ్లు. ‘గోదారమ్మ కొడుకు. మొన్న పుష్కరాలకి నా కప్పజెప్పింది’ అనేది.

అత్త యింట్లోనే వుండేవాణ్ని. నన్ను ఇక్కడి బళ్లోనే వేసింది. ‘ఎందు’కంటే చెప్పలేను. కానీ నాకు పెద్దగా చదువబ్బ లేదు. వరాలత్త ఏమీ పురమాయించకపోయినా నాకు తగిన పన్లన్నీ ఎగబడి చేస్తుండేవాడిని. చదువు- కథలూ, పురాణాలూ పుస్తకాలు చదవడం వరకూ వచ్చింది. పదోతరగతి ఫెయిలైన తర్వాత, కట్టి మళ్లీ రాయమంది అత్త. ‘నాకొద్దు. నేనింక చదవను’ అన్నాను. ఏ కళనుందో ఊరకుండిపోయింది. బాబూరావు గారితో అప్పుడప్పుడూ పొలానికెళ్తుండేవాడిని. అక్కా, అన్నా కాలేజీలకు యెళ్లొస్తావుంటే యింటి పన్లన్నీ చూసుకునే వాడిని. ‘బతుకు దొర్లే విధాయకం యిది కాదురా బాబూ’ అంటూ కారు మెకానిక్ షెడ్ లో పనికి కుదిర్చింది వరాలత్త.

కొంచెం పెద్దోడినైనాను. వరాలత్త పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసేసింది. ఈ లోగా నేను కారు డ్రైవింగు కూడా నేర్చుకున్నాను. ‘నీ బండిని ఒక దార్లో పెట్టాల్రా’ అని పదేపదే అంటుండేది. ఆ రోజుల్లో బాబూరావు గారు పన్చేసే సిగరెట్ ఫ్యాక్టరీ లో ఒక పెద్దాయిన రిటైరై, యిక్కడంతా ఖాళీ చేసుకుని ఉత్తరాదిలో సొంతూరికి వెళ్లిపోతున్నాడు. ఆయన అమ్మకానికి పెడితే, బాబూరావు గారు ఇంటికొచ్చి వరాలత్తను పర్మిషను అడిగాడు ‘కొనుక్కుందాం’ అని! ‘చాల్లెండి. మనం తిరిగే పాటికి సొంతానికి కావాల్సొచ్చిందా?’ అని తిప్పికొట్టింది. అంతలోనే ఏదో ఆలోచన మెరిసినట్టు, ‘బేరం మాటాడండి. కొందాం, మునసామి చేతిలో పెడితే వాడి బతుకేదో బతుకుతాడు’ అంది. బాబూరావు గారు కాదన్లేదు. అసలు వరాలత్త మాటకి ఆయన ఏనాడూ ఎదురనడం కూడా నేను చూళ్లేదు. నా పేర్నే కొన్నారు. అలా నేను, అద్దెకు తిప్పుకునే అంబాసిడరు కారు ఓనర్నయ్యాను. ఆనక కొన్నాళ్లకు కొత్త ఇండికా కొన్నాను.

ఆ ఊళ్లోనే ఓ పిల్లను చూసి పెళ్లి కూడా చేసింది. ఇంటెనకాల, పెరటి కావల కొంత నేల బంజరుగా ఉంటే దాన్ని తీర్చి ఇల్లు వేసుకోమంది. ఆ జాగా, ఇంటిని మాత్రం నా పెళ్లాం పేరుతో రిజిస్టరు చేయించింది. గోదారమ్మ కొడుకుగా అడుగుపెట్టిన నాకు వరాలత్త పెట్టిన బతుకు ఇదంతా. ‘బండి కట్టరా’ అంటే ఉన్నపళంగా బయల్దేరకుండా ఎలా ఉంటాను?

వరాలత్త నిండైన మనిషి. అరవై దాటుండొచ్చు. కానీ, దిట్టంగా ఉంటుంది. నుదుట పావలా కాసంత కుంకం బొట్టు. ప్రతివారమూ రాసుకునే పసుపు ఛాయతో నిండుగా కళకళలాడుతూ ఉంటుంది. మెడలో పుస్తెలతాడుకు తోడు నల్లపూసలూ, దిట్టమైన కాసులపేరూ, చెవులకు రాళ్ల కమ్మలూ, ముక్కుకు హంస బేసర. యివన్నీ ఒక ఎత్తు. వీటిని మించి, రెండు చేతులకూ చెరొక డజను గాజులు వేసుకుని ఉంటుంది- ఎప్పుడూ. మొత్తం రెండు డజన్లూ బంగారం గాజులే! వాటి మధ్యలో ఎన్నడూ మట్టిగాజులు తొడగ్గా నేను చూళ్లేదు. అంతకు మించి నగల పిచ్చి ఉండేది కాదు, అత్తకి! ఇన్ని ఉన్నాక ఇంకో పిచ్చి కూడా ఉంటుందా? అని మీకు అనిపించొచ్చు. కానీ సందర్భాన్ని బట్టి తమ తాహతు తెలియడానికి మెడలో రకరకాల బంగారం గొలుసులేసుకునే వాళ్లు నాకు తెలుసు. అత్త అవన్నీ ఎరగదు. వంటి మీద వున్నవి తీసి పక్కన పెట్టగా నేను చూళ్లేదు. ఏవెలా ఉన్నా, వరాలత్త గాజులు మాత్రం నాకు చిత్రంగా అనిపిస్తుండేవి. అత్త బంధువుల్లో కూడా అంతకంటె మిక్కుటంగా సంపద ఉండేవాళ్లు కూడా అన్నేసి గాజులు వేసుకునే వాళ్లు కాదు. పైగా వాటిని, మధ్యలో మట్టిగాజుల్తో కలిపి వేసుకునేవాళ్లు, వరాలత్త అలా కాదు. అదే నాకు చిత్రం. ఎపుడైనా సరదాగా అడిగేవాణ్ని.

“యిన్ని గాజుల పిచ్చేందత్తా నీకు?” అని.

“అది కాదురా యెదవా, బంగారం లక్ష్మీదేవిరా” అంటూ మొదలెట్టేది. “అందురూ పుస్తెలతాడూ, నల్లపూసలూ మాత్రం అయిదోతనం అంటారు గానీ, గాజులు కూడా అయిదో తనమేరా! కాని రోజులొచ్చి, ఆడది మిగిలిపోయిన నాడు మట్టి గాజులు తొడిగి పగలగొడతారందుకే! అందుకే, ‘పగిలిపోయే మట్టిగాజులే నేను యేసుకోను. పగలగొట్టే రోజనేది రాకుండా చూసుకో సామీ’ అని దేవుడికి ప్రతిరోజూ మొక్కుకుంటా. మిన్ను విరిగి పడినా, ఏనాటికీ చేతుల్లోంచి వీటిని తియ్యంది కూడా అందుకే’ అని, ఆ బంగారం గాజుల వెనుక ఉన్న ప్రేమలు, బంధాలు, నమ్మకాల కథ చెప్పేది.

యిదంతా వరాలత్తకు ఒక చెంప. రెండో చెంప కబుర్లు వేరే ఉన్నాయి.

బాబూరావు గారి తరహా వేరు. సిగరెట్ ఫ్యాక్టరీ కాకుండా ఆయన్ను ఆకట్టుకునేవి మూడే. పుస్తకాలు, సినిమాలు, షటిల్ బ్యాడ్మింటనూ. ఆ ప్రపంచంలోంచి ఆయన ఎన్నడూ బయటకు తొంగిచూడడం కూడా తెలియదు నాకు. మహా అయితే ఎప్పుడైనా పొలం గట్టుదాకా వెళ్లొస్తుండేవారు. అది కూడా ఏదో వ్యాపకం కోసం అన్నట్లుగానే తప్ప, ఏనాడూ పట్టుమని సేద్యం చేసింది లేదు. ఉన్నవన్నీ కౌలుకివ్వడమే. ఇంటిపట్టునే ఉండే వరాలత్త మాత్రం చాలా గట్టి. కౌలు బేరం మాటాడ్డం నుంచి వసూళ్ల దాకా, వచ్చిన సొత్తుని భద్ర పరచడం, ఆస్తుల్ని పెంచడం అంతా అత్తే చూసుకునేది. అత్త వడ్డీ వ్యాపారం చేసేది. వడ్డీ, వసూళ్ల దగ్గర చాలా నిక్కచ్చిగా ఉంటుందని పేరు. అత్త చేత్తో సొత్తు అప్పు తీసుకున్నవాడు నష్టపోయింది లేదు. అత్త హస్తవాసి చాలా మంచిది. ఆ మాటే నేనంటే, ‘ఇందులో హస్తవాసి ఏముందిరా? తీసుకున్నోడు ఎగేయకుండా తీర్చాలని అనుకుంటాం. తీర్చేగలిగేలాగా వాడు బాగుపడాలని నిండు మనసుతో దేవుణ్ని కోరుకుంటాం. అంతే! మనం చేసేది వ్యాపారం. ధర్మానికేమైనా యిస్తున్నామా?’ అనేది. అత్త అలా తేలిగ్గా తీసి పారేస్తుంది గానీ, ఆమె ధర్మదేవతే అని నమ్మేవాళ్లు మా బిక్కవోలులో చాలా మందే ఉన్నారు. ఊరుమ్మడి జనానికీ కాదు గానీ, తాను ఎరిగిన మనుషుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అత్త చూసుకునేది. గతిలేని రోజుల్లో పండగలొస్తే, ఎందరికి బట్టలు కొనేదో! ఎందరు పెళ్లికూతుళ్లకి తనకు తోచినంత బంగారం పెట్టేదో! ఇవేవీ డబ్బు లెక్కల పద్దుల్లో ఉండేవి కాదు. బాబూరావు గారికి కాదు కదా, చివరికి వడ్డీ వసూళ్లకు వెళ్తుండే ఆమె కొడుక్కి కూడా తెలియవు. వడ్డనకైనా ఆమెది దొడ్డ చెయ్యే. నిరతాన్నదానం చేస్తుంటుందని కాదు. కానీ, ఆ వీధిలో ఏనాడూ ఎవ్వడూ పస్తు పడుకునే పరిస్థితి ఉండేది కాదు. అన్నిటినీ మించి మరో సంగతి చెప్పాలి.

బిక్కవోలులో ఒక చిత్రమైన ఆచారం ఉండేది. పెళ్లి జరిగితే, తొలిరోజు అడుగుపెట్టిన కొత్త కోడలికి ఆ యింట భోజనం పెట్టరు. ఏదో దోషంగా యెంచేవాళ్లు. ఆ కొత్త దంపతులిద్దరూ తొలిరోజు తమ బంధువులు, స్నేహితులు, పరిచయస్థుల్లో ఎవరో ఒకరి ఇంట్లో భోజనాలు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి రావాలి. ఇది రివాజు. ఊరందరికీ కాకపోయినా, తన పరిచయస్తులు, బంధువుల్లో ఎవరింట పెళ్లి జరిగినా, ఆ రోజు ఆ దంపతుల్ని వరాలత్త తన యింటికే తీసుకువచ్చేది. తానే స్వయంగా వండి వడ్డించేది. కొత్త బట్టలు పెట్టి వారి యిళ్లకు సాగనంపేది. అందుకే అయినవారందరికీ, ఊరందరికీ కూడా వరాలత్త అంటే ఎంతో ప్రేమ, యిష్టం.

అత్త గురించిన ఆలోచనలు ముసురుకుని ఉండగానే, గొల్లల మామిడాడ సెంటర్లోకొచ్చాను. మేతనించి మళ్లిన పశువుల్ని ఊరవతల కొట్టాల్లో కట్టేసి, పితికిన పాలతో సైకిళ్ల మీద యిళ్లకు వెళ్తున్నారు రైతులు. మామిడాడ అంటే మామూలు ఊరు కాదు. పోలవరం డ్యాము ఆగిపోతందని సర్కారే గనక వొచ్చి అడిగిందంటే, అవసరమైన మొత్తం సొత్తూ యీ ఒక్క వూరినించి సర్దుబాటు చేసేయగలరు. కాపోతే రెండురూపాయల వడ్డీ గవర్నమెంటోళ్లకి గిట్టుతుందో లేదో మరి! ఆ లెవిల్లో వడ్డీవ్యాపారాలు నడిపిస్తుంటారు.

“రాజయ్య ఇంటికి” అంది. అనుమానంగా “అత్తా?” అన్నాను. నిజమేనా అన్నట్టు. “మిరపకాయల రాజయ్య” స్పష్టంగా అంది. గాభరాపడ్డాను. ఆ కిరాతకుడి ఇంటికి ఇప్పుడెందుకు వెళ్లాల్సి వచ్చినట్టు! యేం జరుగుతుంది యిక్కడ? బండిని రాజయ్య ఇంటిముందు ఆపుతూ, కాళ్లతో సీటు కింద తడిమి చూసుకున్నాను. యేదో పని పడి నిన్న అక్కడ పెట్టిన పెద్ద యినప రెంచి అక్కడే వుంది, భద్రంగా.


మిరపకాయల రాజయ్య అసలు పేరు రాజారెడ్డి. పుట్టుకతో కలిగినోడు కాదు. గుంటూరు పక్క పిల్లను పెళ్లిజేసుకున్నాడు. ఆలొచ్చిన వేళ వాడికి అదృష్టం పట్టింది. అత్తగారి ఊరివైపునుంచి మిరపకాయల లోడ్లు తెచ్చి యిక్కడ చుట్టుపక్కల వూళ్లన్నీ తిరిగి చిల్లర వ్యాపారులకు అమ్మడం మొదలెట్టాడు. నెమ్మదిగా నాలుగు డబ్బులు చేరాయి. వాటిని చక్రవడ్డీలకి తిప్పాడు. లక్షలు కోట్లయ్యాయి. మిరపకారు చిరాకేసింది. బామ్మర్దిని పిలిపించి, వాడినిక్కడే సెటిల్జేసి, మిరపకాయల వ్యాపారం వాడి చేతిలో పెట్టాడు. అచ్చంగా వడ్డీల మీదనే బతకడం, ఆస్తులు కూడెయ్యడం మొదలెట్టాడు. నిజానికి వరాలత్త చేసేది కూడా అదే. ఎవరైనా సరే, ‘అవసరం’ పడ్డ వారికే అప్పు యిస్తారు. కానీ వరాలత్త- అడిగేవాడి అవసరమేంటో విచారించి, తీర్చగల తాహతును గమనించి, దాన్ని బట్టి ఇచ్చేది. వ్యవహారం నిలకడగా ఉండేది. రాజయ్య అలా కాదు. కేవలం రాతకోతల్ని, తాను ఇరుకున పెట్టగల, వాడి బలహీనతల్ని చూసి యిచ్చేవాడు. తరచూ తేడా వచ్చేది. తాను పోషించే మనుషుల్ని ప్రయోగించి వసూలు చేసేవాడు. రక్తమాంసాలతో సహా పీల్చేస్తాడని పేరు. యిప్పుడు వరాలత్త, యీ కూపం వాకిట్లోకి ఎందుకు వొచ్చినట్టు?

ఆ ఇంటివద్ద కారు ఆగేప్పటికీ, వరాలత్త మొహం జేవురించుకునే ఉంది. దిగి డోరు తీసి పట్టుకున్నాను. దిగింది. మామూలుగా అయితే వరాలత్తను ఎవరింటికైనా తీస్కెళ్తే, నేను లోపలికెళ్లను. గడప కివతలే ఉండిపోతాను. కానీ యివాళ ఎందుకో అత్త వెనకే, యింట్లోకి అడుగుపెట్టాను. వాడి మనుషుల కోసం చూశాను. అరుగు మీద ఇద్దరు చింతపిక్కలాడుతున్నారు. పరవాలేదు, ఈ యిద్దరినీ నేనొక్కణ్నీ సంబాళించగలను. గడప మీద కాలు పెట్టిందో లేదో వరాలత్త, అంత దూరం నుంచి చూసి పరుగున వచ్చేశాడు రాజయ్య. “అక్కా, అక్కా, ఏంటండీ మీరు? యీ వేళప్పుడు ఇలా వచ్చారేంటండీ? కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ని కదా?” అంటూ! మొహం వెలవెల పోతోంది. ఊహించని విపత్తు ఏదో హఠాత్తుగా వచ్చి పడినట్లుగా ఏదో తెలియని భయం వాడి మొహంలో కనిపిస్తోంది.

“పనిమీద వచ్చాన్రా” అంది వరాలత్త.

“అదేంటండీ? మీరు పురమాయించండి.” నీళ్లు నముల్తూ “దాహం పట్రా” అని కేకేశాడు.

వాళ్లావిడ ఓ గ్లాసుతో మజ్జిగ తెచ్చి, “బావున్నారాండీ, వదినా” అంది వరాలత్తకు అందిస్తూ. ఆమె అందుకోలేదు. వద్దన్నట్లుగా చూసింది. నాకు ఓ చెంబుతో నీళ్లు తెచ్చింది. నేను అందుకుని, పట్టుకుని పక్కనే నిల్చున్నాను. హాలంతా శల్యపరీక్ష చేస్తున్నట్లుగా అన్ని మూలలకూ పట్టిపట్టి చూస్తోంది వరాలత్త.

“కూర్చోండి అక్కా” పైపంచెతో ఓ కుర్చీ దులిపాడు రాజయ్య. ఆమె కూర్చున్నాక, తను ఎదురు కుర్చీలో కూర్చుని, “చెప్పండక్కా. మీరు రావాల్సినంత పనేం వొచ్చిందండీ?” అన్నాడు.

“డబ్బుకి- మర్యాద తెలియదు సరే, మానం తెలియని రోజులొచ్చాయి గనక”

వాడికి అర్థమైపోయింది ఆమె ఎందుకు వచ్చిందో. “అక్కా అదీ, అదీ, ఆర్నెల్లుగా వడ్డీలు కూడా కట్టకుంటే…” నీళ్లు నముల్తున్నాడు. నాకే ఏమీ అర్థం కావడం లేదు.

“అయితే..”

“మిల్లు నాకే ఇచ్చేయమంటే యిన్లేదక్కా యెదవ. అందుకనీ..”

“నీ అప్పుకి మిల్లు రాసిచ్చేసి వాణ్ని పెళ్లాం పిల్లల్తో అడుక్కుతినమన్నావా?”

“బుద్ది రావాలక్కా, అందుకే..” రాజయ్య మాట కూడా విసురుగానే వచ్చింది.

“వాడి పీక కోసి తెచ్చుకోరా!” వరాలత్త మాటలో ఉరుముకి రాజయ్య బిత్తరపోయాడు. “వాడి కాళ్లకి గొలుసులెయ్. కాడి మెడమీద పెట్టు. అరక దున్నించు. అంతేగానీ, ఆడకూతుర్ని ఎత్తుకొస్తావా? సిగ్గులేదా?” తనను తాను తమాయించుకుంటూ మాట్లాడుతోంది వరాలత్త.

బయటి యిద్దరూ తటాల్న లేచారు. రాజయ్య కనుసైగ అందుకుని గడపకు ఆవల, అరుగుమీదే ఆగిపోయారు. నేనూ తయారుగా ఉన్నాను. చేతిలో నీటిచెంబుంది. యిది చాలు, తలలు పగుల్తాయి. కేసైతే బాబూరావు గారు చూసుకుంటారు.

వెనకగదిలోంచి సన్నగా వెక్కుతున్న చప్పుడు వినిపిస్తోంది. రాజయ్య బెరుకు బెరుగ్గానే భార్య కేసి చూశాడు. ఆమె ఆ గదిలోకి వెళ్లి ఓ అమ్మాయిని వెంటబెట్టుకుని హాల్లోకి వచ్చింది. వంటింటి తలుపు పక్కగా నిల్చున్నారిద్దరూ. ఓణీలో ఉంది, ఎవరా పిల్ల? కళ్లు చికిలించి చూశాను. మా ఊరి రైసుమిల్లు సత్తిరెడ్డి కూతురు! నాకు నెమ్మదిగా సంగతి అర్థమవుతోంది.

కొన్ని క్షణాల నిశ్శబ్దం. శబ్దానికి ఒకటే అర్థం ఉంటుంది. కానీ నిశ్శబ్దానికి అనేకం ఉంటాయి! వరాలత్తలో రౌద్రంగా, రాజయ్యలో భయంగా, వాడి భార్యలో జుగుప్సగా, ఆ పిల్లలో దుఃఖంగా, నాలో ఆవేశంగా, అరుగు మీద ఉన్నవారిలో బహుశా ఆశ్చర్యంగా. ఆ నిశ్శబ్దం తాండవిస్తోంది. దాన్ని భంగపరుస్తూ వరాలత్తే పూర్తి శాంతంగా అంది.

“ఎంతయిందేంటి?”

లిప్తపాటు ఆగి, చెప్పకపోతే ఏమవుతుందోనని భయపడ్డట్లుగా, “వడ్డీలతో కలిపి నాలుగు లక్షలకు పైనే..” అని నసిగాడు రాజయ్య.

వరాలత్త ఆ పిల్లకేసి చూసి “యిటు రామ్మా” అంది. ఎవరూ ఏం మాటాళ్లేదు. ఆ పిల్ల అడుగులో అడుగేసుకుంటూ వరాలత్త కుర్చీకి వెనగ్గా వచ్చి నిల్చుంది. బాగా ఏడ్చి కళ్లు ఉబ్బినట్లున్నాయి. ఓణీకొంగుతో తుడుచుకుంటోంది.

“వడ్డీ వ్యాపారం అంటే గుణకారాలు, కూడికలే కాదురా. భాగారాలూ తీసివేతలూ కూడా ఉంటాయి. సొత్తులు హెచ్చవతన్నాయి, జమవతన్నాయి అనుకుంటున్నావేమో, మనసులు సగమవతన్నాయి. మనుషుల్ని లెక్కలోంచే తీసేస్తన్నారు”

“నువ్వు హామీ అంటే, నేనిక వాడిజోలికెళ్లనక్కా”

“థూ!” పిడుగుపడ్డట్టుగా కుర్చీలోంచి లేచి నిల్చుంది వరాలత్త. ఆ వెనకే రాజయ్య.

“ఆడబిడ్డ మానం తెలియని వాడు మానం లేనోడే. నీ దగ్గర మళ్లీ హామీనా? యిదిగో యిప్పుడే తీర్చేస్తున్నా” తన కుడిచేత్తో ఎడమచేతికి ఉన్న బంగారు గాజుల్ని పట్టుకుంది వరాలత్త.

“అదేంటక్కా? అదేంటక్కా? వొద్దక్కా అలా చేయొద్దండీ” రాజయ్య దురపిల్లిపోతున్నాడు. వాడి భార్య పరుగున వచ్చింది. వరాలత్త రెండు చేతులూ పట్టుకుంది. “వదిన గారూ, వద్దండీ, తప్పయిపోయిందండీ” వలవల ఏడుస్తోంది. అప్పటికే ఆ చేతి గాజులన్నీ తీసేసింది. వాటిని అలాగే పట్టుకుని, కుడిచేతికి ఉన్నవీ తీస్తోంది.

“శుక్రవారం పూట, నట్టింట్లో మంచిది కాదండీ, వదినగారూ” రాజయ్య భార్య బతిమాలుతోంది. “మంచీ చెడూ శుక్రవారం పూట ఆడకూతుర్ని చెరబట్టి తెచ్చిన మొగుడికి చెప్పలేక పోయావేం” మెత్తగానే అంటోంది వరాలత్త.

అన్నీ తీసి అక్కడ పెట్టింది. “ఒక్కోటీ తులం మించే. ఇరవైనాలు గ్గాజులు. దొంగ చేతిలో పెట్టినా అయిదు లక్షలు చేస్తాయి. ఉంచు. అణా పైసల్తో సహా లెక్క రాయించు. రెండ్రోజుల్లో సొత్తు పంపిస్తా. యివి తిరిగిచ్చేయ్”

మొత్తం రెండు చేతులకూ ఉన్న రెండు డజన్ల బంగారు గాజులు. అయిదోతనానికి గుర్తుగా, మెరుగు పట్టడానికి కూడా ఎన్నడూ బయటకు తీయని గాజులు జీవం కోల్పోయినట్లుగా ఉన్నాయి. అక్కడ, రెండు కుర్చీలకు మధ్యలో ఉన్న బల్ల మీద.

వరాలత్త చేతులు మొండిగా, బోసిగా, దృఢంగా ఉన్నాయి. యిప్పుడే, నెత్తుటి మరకలు లేని యుద్ధం గెలిచినట్లుగా!

మళ్లీ అదే నిశ్శబ్దం. అనేకానేక భిన్నార్థాలతో! వరాలత్తలో నిమ్మళంగా, రాజయ్యలో బెరుకుగా, వాడి భార్యలో ఏడుపుగా, ఆ పిల్లలో ఆనందంగా, నాలో అనుమానంగా, అరుగు మీద ఉన్నవారిలో బహుశా అవమానంగా ఆ నిశ్శబ్దం తాండవిస్తోంది. దాన్ని మళ్లీ భంగపరుస్తూ, వరాలత్తే మరింత శాంతంగా అంది రాజయ్య భార్యతో.

“శుక్రవారపు పొద్దు. ఇంటికి ఇద్దరు ఆడబిడ్డలొచ్చినారు. పో, వెళ్లి కుంకుమ తీసుకురా”

రాజయ్య భార్య తేరుకుని, కళ్లు తుడుచుకుని, కదిలి దేవుడి గదిలోంచి భరిణ తెచ్చి అత్తకి బొట్టు పెట్టి కాళ్లు మొక్కింది. తనకూ పెట్టిన తర్వాత ఆ పిల్ల, ఆమె కాళ్లు మొక్కింది. రాజయ్య నిట్రాటలా ఉండిపోయాడు. మేం ముగ్గురం బయటకు కదిలాం.


‘సిరికిం’ జెప్పకుండా, ‘చక్రమూ శంకూ’ ఎత్తుకోకుండా బయల్దేరిన విష్ణుమూర్తిలాగా, చెప్పులైనా వేసుకోకుండా వరాలత్త బయల్దేరింది యిందుకన్నమాట.

“కబురు నేను సగం చెప్పకముందే ఉరికి వెళ్లిపోతివి. ఎంత టెన్షను ఉంటుందని? పెట్టెన్నర కాల్చానిప్పటికి” కారు ఇంటి ముందు ఆగగానే వసారా వాలుకుర్చీలోంచి బాబూరావు గారు లేచారు, సిగరెట్ కింద పడేస్తూ. లోపలికెళ్లాం. ఆయనే లోనికెళ్లి చెరో గ్లాసూ నీళ్లు తెచ్చి యిచ్చారు. నీళ్ల గ్లాసు అందుకుంటున్నప్పుడు గమనించినట్లున్నారు.

“గాజులతోనే సరిపెట్టావా? వడ్డీ కింద చీవాట్లు కూడా వడ్డించావా?” నవ్వారు.

వరాలత్త కూడా నవ్వింది. చిన్నప్పటినుంచీ నేను ఎరిగిఉన్నట్లుగా, హాయిగా నవ్వింది.

“అయిదు లక్షల దాకా పడొచ్చు. రెండ్రోజులని చెప్పొచ్చాను. ఆ పని చూడండి”

ఆయన మళ్లీ వసారా కుర్చీలోకి వెళ్లిపోయారు. అత్త కుర్చీ పక్కనే కింద కూర్చున్నాను.

“నాకిదేం నచ్చలేదత్తా. గాజులు నీ అయిదోతనం అంటా వుంటావే, వాటిని తీసేస్తావా? అది కూడా, మిల్లులో వొచ్చిందంతా పేకాట క్లబ్బులకీ, పెద్దాపురానికీ తగలేసే ఆ సత్తిరెడ్డి లాంటి ఎదవకోసం” ఇప్పుడు మేఘాలన్నీ తెరపించాయి గనుక నా అభిప్రాయం చెప్పేశాను.

నా నెత్తిమీద ఒక మొట్టికాయ వేసింది.

“వాడి ఇంటిదైతే ఏంటి? నా ఇంటిదైతే ఏంటి? ఆడ కూతుర్రా! బంగారాన్ని మించి, బతికుండే లక్ష్మీదేవి. నా అయిదోతనం దాన్ని కాపాడితే అంతకంటె భాగ్యమా”

నిండుగా నవ్వుతోంది వరాలత్త, బోసిగా ఉన్న చేతుల్తో!