దోనెల. విశాఖ జిల్లాలో మాడుగులకు మారుమూలగా వున్న ఓ గిరిజన గ్రామం. రాత్రి ఎనిమిదవుతోంది. డిసెంబరు నెల కావడంతో చలి ఎముకల్ని కొరకడం మొదలుపెట్టింది. ఆ ఊరికి ఆనుకుని పారే రాయిగెడ్డ ఒడ్డునగల వేపచెట్టు కింద కొందరు గ్రామస్తులు చలిమంట కాగుతూ పిచ్చాపాటిలో పడ్డారు. ఊరు ఏడింటికల్లా సద్దుమణిగిపోయినా వాళ్లు చలిమంట ముందునుంచి లేవలేకపోతున్నారు.

“మళ్లా ఎలచ్ఛన్లు వొత్తున్నాయంట” చెంగయ్యదొర వైపు చూసి అన్నాడు బాలేసు.

చెంగయ్యదొర ఏమీ అనలేదు.

“ఎలచ్ఛన్లు వొత్తే ఏటొరుగుతాది మనకి? అయ్యి వత్తుంతాయి. పోతుంతాయి. ఎన్నొచ్చి ఎళ్లినా మన మర్రిపాడుకాడ సెక్కుడాము ఎవుళూ కట్టీది నేదుగద. అక్కడ బిటీసోడు కట్టిన ఆ రాతికట్టే మనకు దిక్కు” మంటకి వేడిక్కిపోయిన మోకాళ్ళను పాముకుంటూ నిట్టూర్చాడు బాలేసు.

వెంకటేశులు అందుకుని “అచ్చంగా మన గిరిజన గ్రేమాలు ఓ పదుంతాయి. పిట్టంతేసి గ్రేమాలు. ఏ గ్రేమం సూసినా యిరవయ్యేసి ముప్పయ్యేసి ఓట్లుంతయి. మొత్తం వోట్లు ఎయ్యిలో సగంకాడికి కూడవు. ఆటికోసం నాయకులకి ఆలోసనెందుకు వుంతాదిరా. తక్కవ నోములు నోసి ఎక్కవ పలం రమ్మంతే వత్తాదా? అంతేపర! త్కవ ఓట్లేసి ఎక్కవ పయోజకం ఆశిత్తే అది కూడుతాదేటి? ఇక మర్రిపాడు డాము వూసు ఎత్తకండి” కసురుకున్నట్టు అన్నాడు.

“వోరి కొడకా! ఓటు యిలువ నీకేం దెలుసునురా. ఒక్క ఓటు తలరాత మార్చిస్తదిరా! అందుకే ఏ వోటూ వదలరు మారాజులు. మనదేశంలో శానామంది సదుంకున్నోళ్లకే తెల్దురా ఓటు యిలువ. కానీ మన అమాయక గిరిజనులకి ఓటంతే పేణంరా. ఎవుళూ నయా పైసా యియ్యకపోయినా ఈ కొండలూ, కోనలూ ఎక్కీ దిగీ ఓటేసొత్తాం మనం. ఓటేసి పయోజకం నేకపోయినా మన బాద్దెతకొద్దీ మనం ఏత్తన్నం. బాద్దెతలేన్ది మారాజులకేరా!” అన్నాడు చెంగయ్యదొర. ఒకమాటకి మరో మాట పేరుకుని వారి మాటలు వేడెక్కుతున్నాయి. ఇంతలో చితుకులు కాలిబూడిదై చలిమంట చల్లబడింది. పశ్చిమాన పాడేరు కొండలమీదుగా చంద్రుడు పొద్దు పొడిచాడు.

“పదండ్రోయ్‌ యిళ్లకు పోదాం. యిక రాయిగెడ్డ సెక్‌డాముకోసం కలలు గనడం మానీయండ్రా. ఆ గెడ్డకాడ సెక్‌డాము కట్టాలంతే మళ్లీ బిటీసోడు భారద్దేశానికి రావాల్సిందేరోయ్‌” లేచి పంచె కంటుకున్న దుమ్ము దులుపుకుంటూ ఇంటిదారి పట్టాడు చెంగయ్యదొర.

“అదేటి సెంగయ్యమావా! అంత మాటనేసినావ్‌. మనోళ్లు కట్టనేరా?” ఆశ్చర్యంగా అడిగాడు బాలేసు.

“వోరె! అనుభగంలేని పిల్ల కుందేలివి. మన మారాజులు హామీలమీదనే ఏళ్లూ పూళ్లూ కాలం ఎళ్లదీసేత్తార్రా. మర్రిపాడు సెక్‌డాము కట్టిత్తామని ఎన్ని పార్టీలోలొచ్చి ఎన్ని ఎలచ్ఛన్లలో సెప్పనేదు. ఏది కట్టినారేటి? మనోడైవడైనా అక్కడ సెక్‌డాము కట్టెత్తే అతగోనికి ఘనంగా సన్మానం పెట్టేత్తానురా. ఈ రాజికీయాలు నీకర్థంకావుగానీ ముందర రోడ్డు సూసుకుని నడువు” అని జాగ్రత్త చెప్పాడు చెంగయ్య. అతడలా మాట పూర్తి చేశాడో లేదో బాలేసు రోడ్డుమీద పైకి లేచివున్న రాయిని తన్నుకుని బొక్కబోర్లా పడ్డాడు.

“సెప్పినాను కదరా! ముందర రోడ్డు సూసుకుని నడువుమని” అని నొక్కి పలుకుతూ బాలేసుని లేపి “సూడు. ఎలా కనబడ్తన్నాయో పైకిదేలిన రాళ్లు. మసక సీకట్లో దాడి సేయిడానికి మనపైన శత్రువులు ఎత్తిన కత్తుల్లా! నల్లోడి పనితనంరా ఇది. వొప్పుడో తెలుగురేడు పార్టీ అధికారం సేసిన కాలంలో యేసిన రోడ్డు ఇది. యేసిన సమత్సరానికే రాళ్లు దేలిపోనాది. ఇది తారు రోడ్డని మన బుడ్లోళ్లకి తెలవనే తెలవదు. ఆనమాలు నేకుండా పోనాది మరి! యిక్కడే వుందిరా నల్లోడికి తెల్లోడికి తేడా. తెల్లదనంకి, నల్లదనంకి వున్నంత తేడా వున్నాదిరా ఆళ్లిద్దరికీ” అని అంటుండగా బాలేసు నొప్పి పుట్టిన కాలును పాముకుంటూనే “ఏంది మావా ఆ తేడా?” చెప్పమన్నాడు.

“నడిరేతిరి మాటలు నిద్రకు సేటురా. పో, పో, పోయి తొంగో!” అని చలికి భయపడి చేతుల్ని చంకలో దోపుకుని వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాడు చెంగయ్య.


రాయిగెడ్డ. ఆ గెడ్డపైన మర్రిపాడు జంక్షన్‌వద్ద ఒక రాతికట్టు వుంటుంది. దోనెల, వంతలమామిడి గ్రామాల దారులు రెండూ ఈ రాతికట్టు దగ్గరే కలుస్తాయి. ఇక్కడినుంచే ఆ గ్రామాల ప్రజలు పై వూళ్ళకు రాకపోకలు సాగిస్తారు. అటు దోనెలలోగానీ, ఇటు వంతలమామిడిలోగానీ పాఠశాలలు లేవు. ఆ గ్రామాల పిల్లలు ఈ గెడ్డ దాటుకుని ఐనాడ వెళ్లి చదువుకోవాలి. వర్షాకాలమొచ్చిందంటే చాలు, గెడ్డ ఉప్పొంగి జరజరమని పారుతుంది. ఎన్నో రోజులపాటు పిల్లలు స్కూళ్ళకు పోవడం కుదరదు. గెడ్డ శాంతిస్తేనే చదువులు. ప్రస్తుతం డిసెంబరు మాసం కావడంతో గెడ్డ పల్చగా ప్రవహిస్తోంది. బడి పిల్లలు ఆడుతూ పాడుతూ గెడ్డ దాటుతున్నారు. ఇంతలో ముందొక జీవు, వెనకొక జీవు వేసుకుని మందీ, మార్బలంతో ఒక పెద్ద కారు గెడ్డవద్దకు వచ్చింది. పిల్లలు గెడ్డ దాటుతున్నారని కూడా ఆగలేదు. రయ్యిన దూసుకుపోయింది. నీరంతా తుప్పున తుళ్లి పిల్లల బట్టలను తడిపేసింది. అభం, శుభం తెలియని పిల్లలు కేరింతలు కొట్టారు.

వాహనాలు దోనెల గ్రామంలో దర్జాగా ఆగాయి.

“దొరా! మాకేం జేసినారని మళ్లొచ్చి వోట్లడుగుతన్నారు? మాకేం సిగ్గునేక మళ్లీ ఓటేత్తాం దొరా? ఎన్నికలొత్తే మాకాడికొత్తారు. ఓట్లేయించుకుంతారు. ఆనక ఇక పత్తా వుండరు. దేనికిబావూ మేవు ఓట్లేయాలి? మీరేదన్నా గ్రేమానికి మంచి సేత్తే, అది సూసి ఓటేత్తాం. ఇయ్యాల్టిదాకా ఏదీ సెయ్యనేదే? మా వూరికో తార్రోడ్డునేదు, బడి నేదు, కరెంటు బల్బు నేదు”

“ఒరేయ్‌! చెంగయ్యా! మన రాష్ట్రం విడిపోయి మనకి చాలా కష్టాలొచ్చీసాయిరా. మనదగ్గర డబ్బు లేదు. అంతా హైద్రాబాదులోనే వుండిపోయింది. అవతల కేంద్రం రాజికీయాలమీన రాజికీయాలు చేసీసి మనకి మొండిచేయి చూపెట్టిందిరా! అప్పుల్లో కూరుకుపోయాం మనం. ఏటి చెయ్యిడానికీ చేతిలో చిల్లిగవ్వ లేదు” బాధగా అన్నారు అన్నంనాయుడు.

“అయ్యన్నీ మాకెందుకు దొరా! మీ రాజికీయాలు ఏనాడు తీరువుగా ఉన్నాయి గనకన? వొప్పుడూ ఇదే ఏడుపుగదా తమరిలాంటోళ్లది!” పెదవి విరిచాడు చెంగయ్య.

చెంగయ్యదొర చుట్టుపక్కల గిరిజన గ్రామాలకు పెద్దన్నలాంటోడు. దొరకాని దొర! కొండదొర! నాలుగు విషయాలు తెలిసినోడు. అతడి మాటే ఆ చుట్టుపక్కల చెల్లుతుంది. అతడ్ని పట్టుకుంటే చాలు, గిరిజన గ్రామాలన్నీ తమ గుప్పెట్లో వున్నట్లే! ఆ విషయం అన్నంనాయుడికి బాగా తెలుసు. అందుకే, “ప్రోబ్లమ్స్‌ అలగొచ్చిపడ్డాయి. ఏం చేస్తాం? సర్లేగానీ చెంగయ్యా! ఏంగావాలో అడుగు. ఈసారి తప్పక చేస్తాను” నమ్మబలికాడు అన్నంనాయుడు.

“దొరా! మీ మాటలకేంగానీ, ఎలిపోండి. వోట్లూ గీట్లూ ఏవీ ఎయ్యం. ఓటేసినా ఎయ్యకపోయినా ఒకటే బతుకులు మాయి. ఎల్లిరండి”

“అలగనేస్తే ఎలాగరా. మీ గ్రామానికేటి కావాలో అడుగు. తక్షణం చేత్తాను” చెంగయ్య చేతులు పట్టుకుని అడిగారు అన్నంనాయుడు.

“ఎన్నికల తరవాత సేత్తానని సెప్పకండి మరి. అధికార పార్టీ ఎమ్మెల్యీగా వున్నారు గాబట్టికి అడుగుతన్నాను. తచ్ఛనం మర్రిపాడు జంక్ఛన్‌కాడ రాయిగెడ్డపైన రాతికట్టు తీసేసి దాని స్థానంలో సెక్‌డాము కట్టించండి. మా పిల్లలు బడికి పోడానికి మా కట్టంగా వున్నాది. వర్సాకాలమొత్తే శాన. గెడ్డ ఎప్పుడు పొంగి మా పిల్లల్ని గెద్దలా తన్నుకుపోతాదోనని మహ భయింగా వున్నాది”

“సరేరా! తక్షణం చెక్‌డామ్‌ శాంక్షన్‌ చేయించేస్తాను” అని చెప్పి గ్రామస్తులకు వంగి వంగి నమస్కారాలు చేసి ఎమ్మెల్యే అక్కడ్నుంచి చిత్తగించారు.

గ్రామస్తులు దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. మర్రిపాడు వద్ద రాయిగెడ్డపైన చెక్‌డ్యామ్‌ శాంక్షన్‌ అయ్యింది. అయ్యిందే తడవుగా పనులు కూడా ప్రారంభమైపోయాయి. మామిడి పూత పూసి, ఆ పూత పెసర గింజంత పిందె కట్టేసరికల్లా చెక్‌డ్యామ్‌ లేచిపోయింది. గిరిజన గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఎన్నికలొచ్చాయి. పోయాయి. మాడుగులకు మళ్లీ అన్నంనాయుడే ఎమ్మెల్యే అయ్యాడు. రుతువులు యధాప్రకారం మారుతున్నాయి. వర్షాకాలమొచ్చింది. ఇంతకు మునుపులా గెడ్డ పొంగుతుందన్న భయంలేదు. పిల్లలు సుడులు తిరుగుతున్న నీళ్లను వెక్కిరిస్తూ నిర్భయంగా రాయిగెడ్డ దాటేస్తున్నారు.

ఆ సంతోష సమయంలో బాలేసు “నువ్వొక మాటనినావ్‌, గురుతుందా?” అని చెంగయ్యని అడిగాడు.

“యేటిదిరా అది? గురుతురాట్నేదు, సెప్పు” అన్నాడు చెంగయ్య.

“మర్రిపాడు సెక్‌డాముని బిటీసోడే వచ్చి కట్టాలా. మనోళ్లు కట్టనేరా అని నానంటే, అలగ్గాని ఎవుడైనా కడితే కట్టినోనికి సనమానం సేత్తానన్నావు. గురుతుందా?” ఆత్రంగా అడిగాడు.

“ఓస్‌! అదట్రా. అలాగే కానిత్తానురా..అదెంతమాట!” తమకింత మేలు చేసిన అన్నంనాయుడికి సన్మానం చేయాలని నిశ్చయించాడు చెంగయ్య. ఊరంతా “అలాగే సేద్దాం” అన్నారు. తమ వంతు చందాలిస్తామన్నారు.


“నాయుడూ! స్టడీ టూర్‌ క్యాన్సిలయ్యిపోయీలా వుందయ్యా”

“ఎందుకు రాఘవాచారీ?” అర్థంకాక అడిగారు ఎమ్మెల్యే అన్నంనాయుడు.

“ఆ ప్రతిపక్ష పార్టీవాళ్లు నానా యాగీ చేస్తున్నారయ్యా”

“ఎందుకు యాగీ”

“అసలే కరువుతో రైతులు విలవిలలాడుతుంటే అధికారపార్టీ ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలేమిటని, టూర్‌కయ్యే ఖర్చు 60 కోట్లూ కరువు రైతులకు ఇస్తే వాళ్లకి ఎందుకైనా పనిచేస్తాయని గగ్గోలు పెడుతున్నారు”

ఆయనింకా ఏదో చెప్పబోతుండగా అన్నంనాయుడు అడ్డుపడి “ఏంటయ్యా! కరువు! ఏంటి కరువు! కరువు కొత్తగా వచ్చిన కరువా? ఏళ్లనాటి శనిలా పట్టిన కరువు! ఈ కరువు వాళ్లు అధికారంలో వున్నప్పుడు లేదా? అప్పుడు వాళ్లు విదేశీ టూర్లకు వెళ్లలేదా? ఇప్పుడు మనం వెళితే తప్పయిపోతుందా? అంత పార్టీ ఫీలింగ్‌ పనికిరాదు. ప్రతిపక్షంలో వున్నామని ప్రతిదాన్నీ వ్యతిరేకించడమే. ఇంతకీ మరి మన సీఎం ఏమంటున్నాడు?” ఆవేశంగా అడిగారు.

“ఏమంటాడు? ప్రతిపక్షాల గోల చూసి ‘టూర్‌ క్యాన్సిల్‌ చేసుకోండయ్యా’ అంటున్నాడు” చెప్పాడు రాఘవాచారి.

“కుదరదు. కుదరదని చెప్పు. అధికారంలో వుండగానే అన్నీ చూడాలయ్యా! ఇంకెప్పుడు చూస్తాం? అయినా మనం ఆయా దేశాల్లో అభివృద్ధి నమూనాలను పరిశీలించడానికేగా వెళుతున్నాం” అసహనంగా అన్నారు.

“అలాగని మనవాళ్లు అంటే ‘ఆ।. మాగొప్ప అభివృద్ధి!” అని సాగదీస్తున్నారు వాళ్లు. సరే. ప్రతిపక్షాలతో ఎప్పుడూ వుండే గొడవలేగా ఇవి. గంటకో, గడియకో తెలుస్తుంది పర్యటన వుందో లేదో. వుంటాను” అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు రాఘవాచారి.

ఇంతలో పి.ఎ. లోనికి వచ్చి “సార్‌! మీకోసం దోనెలనుండి చెంగయ్య దొరట. వచ్చాడు. పంపమంటారా?” అని అడిగాడు. పంపమన్నారు అన్నంనాయుడు. రాఘవాచారినుండి మళ్లీ ఫోనొచ్చింది. విదేశీ పర్యటన ఖరారయ్యిందని రాఘవాచారి చెప్పాడు. ఆ ఫోను మాట్లాడాక తనను కలవడానికి వచ్చిన మనిషిని చూసి “ఏంటి చెంగయ్యా! ఇలాగొచ్చావు?” అని పలకరించారు.

చెంగయ్య చేతులు పిసుక్కుంటూ “ఏంనేదు అయ్యా. తమరికి మాదో సిన్న యిన్నపం. మా గూడెపోళ్లు తమరికి సనమానం సెయ్యాలంతన్నారు. తమరు కాదనగూడదు” నసిగాడు.

“నాకు సన్మానం ఎందుకు? ఊరుకోండి. మీకేం పన్లేదా?” ఎమ్మెల్యే నవ్వారు.

“కాదనకండయ్యా! ఎవుళూ సెయ్యంది తమరు సేసినారు” ఒత్తిడి చేశాడు చెంగయ్య.

“అదికాదు, నేను ఈ నెలంతా ఇండియాలో వుండను. విదేశాలకు వెళ్త్తున్నాను” చెప్పారు ఎమ్మెల్యే.

“పోనీ తమరొచ్చినాకే ఎట్టుకుందారి” అన్నాడు చెంగయ్య.

“అలగయితే ఆగస్టు 16న పెట్టుకోండి. మరి సన్మానంలో నాకు ప్రత్యేకంగా ఏటి వండిపెడతారేంటి? అడవికోళ్లు కోస్తారా? జీలుగు కళ్లు పోస్తారా?” నవ్వారు ఎమ్మెల్యే.

“రండయ్యా! మా సంతోసంకొద్డీ తమరిని సంతోసపెడతాం”

అన్నంనాయుడి వద్ద శెలవు తీసుకుని తనతోపాటు వచ్చిన గ్రామస్తులను వెంటబెట్టుకుని తిరుగు ప్రయాణమయ్యాడు చెంగయ్య. అన్నంనాయుడి ఇంద్రభవనంలాంటి ఇంటిని వెనక్కి తిరిగి చూసి “మన ఎమ్మెల్యేకాడ బోలెడు డబ్బుంతాదే. గోరమెంటు ఏపాటి జీతం ఇత్తాదో?” అని ఓ గ్రామస్తుడు శంకరం నోరెళ్లబెట్టాడు.

“ఓరి పిచ్చోడా! మన ఎమ్మెల్యేలకి గవరమెంటు జీతాలేపాటిరా? ఆళ్లకు మద్యం యాపారం, స్కూళ్ల యాపారం, ఆసుపత్రుల యాపారం, ఇంకా శానా, శానా యాపారాలుంతాయిరా” చెప్పాడు చెంగయ్య. “అన్నట్టు మర్సిపోనానురోయ్‌. మన ఎమ్మెల్యేదొర కాంట్రాట్టరు కూడాన్రా. ఈ సుట్టుపక్కల కాంట్రాట్టులన్నీ ఆయనగోరే సేత్తాడు. సిన్నా పెద్దా ఏ కాంట్రాట్టూ సేయిదాటిపోనియ్యడంట. మన సెక్‌డాము కట్టింది కూడా ఈయనేరా” చెప్పాడు. దారిపొడుగునా ఎమ్మెల్యే ఊసులే చెప్పుకుంటూ వాళ్లు ఇంటిముఖం పట్టారు.

ఆ మరుసటి రోజు ఎమ్మెల్యే అన్నంనాయుడు హైదరాబాద్‌ వెళ్లి అక్కడ్నుంచి దక్షిణ అమెరికా, రష్యా, లండన్‌, స్విట్జర్‌లాండ్‌, స్కాండినేవియా తదితర దేశాలు చుట్టిరావడానికి పయనమై వెళ్లిపోయాడు.


సన్మానం రోజు, ఆగస్టు 16 దగ్గర పడింది.

చెంగయ్య మాడుగులకు వెళ్లి షామియానాకు, వంటవాళ్లకు బజానా ఇచ్చాడు. ఫోటో స్టూడియోకి వెళ్లి రెండు ఫోటోలకు ఫ్రేములు కట్టించాడు. కావలసిన సామగ్రి కొనుక్కుని వచ్చాడు.

“ఎందుకు సెంగయ్యా! అన్నంనాయుడికి సనమానం? ఆ సెక్కుడాము కట్టి మనల్ని ఈరకంగా ఉద్దరించినాడనా సనమానం? ఎందుకు సనమానం? సెప్పు” చెంగయ్యను నిలదీశాడు గ్రామస్తుడు వెంకటేశులు.

“అవును, ఎందుకు సెంగయ్యా సనమానం? ఎందుకు సనమానం?” అంటూ గ్రామస్తులు గొంతు కలిపి అడిగారు.

చెంగయ్య నోరు మెదపలేదు.

“పలకవేటి సెంగయ్యా! వొప్పుడూ నీ మాటని మేవు కాదనిందినేదు. కానీ వుప్పుడు నువ్వు సేత్తన్న ఈ కార్యాన్ని మాత్రం మేవు మెచ్చవు” కినుక వహించాడు మరో గ్రామస్తుడు అప్పారావు.

గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలబడ్డారు. చెంగయ్య ఒక్కడూ మరొక తాటిపై నిలబడ్డాడు.

ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. తెల్లారకముందునుండే మర్రిపాడు జంక్షన్‌వద్ద చెంగయ్య, బాలేసు, శంకరం, మరికొంతమంది ఏర్పాట్లలో మునిగిపోయారు. గ్రామస్తులెవరూ వారికి చేయి సాయం అందించడానికి పోలేదు. అక్కడ రోడ్డుకు వారగా ఖాళీ స్థలంలో టెంట్లు, కుర్చీలు వేశారు. రెండు పెద్ద బల్లలు పరిచి దానిమీద ఎర్ర తివాచీ వేశారు. చెంగయ్య ఒక మూల స్టూలు వేసి దానిమీద ఫ్రేము కట్టించుకుని వచ్చిన రెండు ఫోటోల్ని ఉంచి వాటికి పూలమాలలు వేశాడు. ఆ ఫోటోల్ని చూసి బాలేసు పరుగు పరుగున గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకి చెప్పి వచ్చాడు. గ్రామస్తులలో ఒకడూ, ఒకడూ, ఆ ఒకడికి మరొకడు తోడై మొత్తంగా ఆ ఫోటోలు చూడ్డానికి కదిలివచ్చారు.

చెంగయ్య ఎమ్మెల్యే రాకకోసం ఎదురుచూస్తున్నాడు.

విదేశీ టూర్‌నుండి తిరిగి వచ్చేసిన ఎమ్మెల్యే అన్నంనాయుడు హుషారుగా దోనెల గ్రామానికి బయలుదేరాడు. దుమ్ము రేగ్గొట్టుకుంటూ కారు మట్టి రోడ్డుపై పరుగులు తీస్తోంది. “ఇంతకుమునుపైతే వర్షాకాలంలో మర్రిపాడు జంక్షన్‌ వద్ద వాహనాలు నిలిపేయాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేదు. మనం డాము కట్టేసాంగా. నేరుగా దానిమీదే దోనెలకు పోవచ్చు” గర్వంగా అన్నారు ఎమ్మెల్యే తన పి.ఎ.తో. అక్కడ సన్మానంలో తనకు చేయబోయే ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే ఆలోచనలలో వుండగా మర్రిపాడు జంక్షన్‌వద్ద కారుకు సడెన్‌ బ్రేకు పడింది! “ఏం జరిగింది?” అని ఆదుర్దాగా డ్రైవర్‌ని అడిగారు ఎమ్మెల్యే. డ్రైవర్‌ వెర్రి మొహం వేసుకుని ఎమ్మెల్యేవైపు చూశాడు. కళ్లముందర దృశ్యానికి ఎమ్మెల్యే భృకుటి ముడిపడింది. కిందికి దిగారు.

“అదేందిరా. మొన్ననే కదా కట్టాం. అప్పుడే కొట్టుకుపోయిందేటిరా ఈ చెక్‌డాము?” ఆశ్చర్యపోతూ నోట్లో నోట్లో గొణుక్కున్నారు అన్నంనాయుడు. మనిషి మాత్రం బయటపడలేదు. గంభీరంగా మొహంపెట్టి ఒకపక్క విరిగి కొట్టుకుపోయిన డ్యామ్‌ను పరిశీలిస్తున్నారు. రాతి కట్టూ పోయె. సెక్కుడామూ పోయె. ఇప్పుడు అక్కడ మట్టి కూడా లోతుగా కోరుకుపోయి గెడ్డ సుడులు తిరుగుతోంది. ఆ గెడ్డను దాటడానికి ఇప్పుడు ఏమాత్రం అవకాశం లేకుండాపోయింది. గెడ్డకు అడ్డంగా పెద్ద పెద్ద తాటి మానులు పడేసి వుంచారు. “గెడ్డ దాటడానికి కాబోలు” అనుకున్నారు ఎమ్మెల్యే. కొట్టుకుపోయిన డ్యామ్‌ అవతలవైపు టెంట్లు వేసి వున్నాయి. అక్కడ చాలా మంది జనం గుమిగూడి వున్నారు. “ఆ టెంట్లు ఎందుకు వేశారు?” అని ఆలోచనలో పడిపోయి, అక్కడే నిలబడి వాటివైపు చూస్తుండిపోయారు. ఎమ్మెల్యేకు ఎటూ పాలుపోలేదు.

దాటడానికి గెడ్డకు అడ్డంగా వేసుకున్న తాటి మానులపైనుండి ఒకరి చేయి మరొకరు పట్టుకుని ఇవతలకు వచ్చారు చెంగయ్య, బాలేసు, శంకరం, వెంకటేశులు.

“అలా సోద్యం సూత్తా నిలబడిపోనారేటయ్యా! ఈ గెడ్డ దాటి అవతల ఒడ్డుకి వచ్చేత్తే అక్కడ సనమానం సేస్తామయ్యా” చెప్పాడు చెంగయ్య. అన్నంనాయుడికి చెంపమీద చెళ్ళుమని కొట్టినట్లయింది.

“రండి బాబూ! రండి” అని చెయ్యిపట్టుకుని తీసుకెళ్ళబోయారు గ్రామస్తులు. ఎస్కార్ట్‌ వచ్చి వాళ్ళని అడ్డగించింది. ఎమ్మెల్యేని కారులో కూర్చోమని చెప్పి తోడ్కొని పోబోయారు. చెంగయ్య అడ్డుపడి, “వొక్క నిమసం దొరా! సిన్న మనవి. అది ఇనీసి ఎళ్లిపోండి. మేవు మిమ్మల్ని అడ్డుకునేంత బలమంతులం కాదు దొరా! మా జాతిలో ఈరోజున నూరుమంది అల్లూరి సీతారామరాజులు పుట్టినా మేవు తమబోటి పెద్దల్ని అడ్డగించనేం. కానీ దొరా” ఆగాడు చెంగయ్య.

ఎమ్మెల్యే ఆగాడు. చెమర్చిన కళ్లను చెంగయ్య తుండుగుడ్డతో తుడుచుకుని “దొరా! అదుగో కొట్టుకుపోయిన ఈ గెడ్డ అవతలి ఒడ్డున టెంట్లు ఏసినాం సూడండి. అయ్యెందుకు ఏసినామో తెలుసునా దొరా! తమరికి సనమానంకోసం కాదు దొరా! మా గ్రేమం కోల్పోయిన బిడ్డల వర్థంతి సభ దొరా! మొన్న వర్సాలకి. తమరు కట్టిన సెక్‌డాము మా పిల్లకాయల్ని పొట్టనబెట్టుకుని పోనాది దొరా! సెక్‌డాముమీదంట నడుత్తా దాంతోపాటే గెడ్డలో కొట్టుకుపోనారు దొరా ఇద్దరు పిల్లకాయలు! ఆ పుణ్ణెమంతా తమరిదే దొరా!”

అక్కడ నిలువలేక ఎమ్మెల్యే కారులోకి ఎక్కబోయారు. “ఇంకొక్క నిమసం దొరా. ఎళ్లిపోదురు” అని కాళ్మమీద పడ్డాడు చెంగయ్య. ఎమ్మెల్యే కాళ్లు కదలలేదు.

చెంగయ్య చెబుతూ “దొరా! ఆ సెక్‌డాము ఎన్నేళ్ల కలో తెలుసునా దొరా? ఇందిరాగాంధీ రాజ్జిమేలినకాడినుంచీ కంటన్నాం దొరా ఆ కలని! ఇన్నేళ్ల తరోత మీ దయసేత నెరవేరినాదీ అనుకుంతే. మా గ్రేమాన్ని సీకటి చేసేసింది దొరా! మా బిడ్డల బతుకులు మట్టిపాలు జేసేసింది. దొరా! నాకు తెలవక అడుగుతన్నానూ. ప్రెజల సొమ్మంతా దోచీసి, కూడెట్టీసుకుని తినీ తిండి ఎలాగ అరుగుతాది దొరా తమరంటోళ్లకి? దొరా! నాను తెల్లదొరల్ని సూసినోడ్ని దొరా! రాయిగెడ్డకి ఆ పేరెందుకొచ్చినాదో తెలుసునా దొరా? ఆ మాయదారి గెడ్డ పొంగినప్పుడు రాళ్లను కూడా ఎత్తుకుని పోయేదంట దొరా! అంత ఉధృతం దానిది! బిటీసోడు ఆడి అవసరాలకి ఇవతలకి రానానికీ, అవతలకి పోనానికీ గెడ్డ అడ్డుగుందని దానిమీన రాతికట్టు కట్టినాడు. ఆడి సేతి సలవో ఏమోగానీ ఆకాడ్నుంచి గెడ్డకు ముకుతాడు యేసినట్టు అయిపోనాది. మా తాత ఈ నేలపైని తిరుగాడినప్పుడు కట్టినారంట దాన్ని. మా నాయన కాలంసేసిన్నాటికి కట్టు కొద్దిగా సెదిరింది. నాకాడికొచ్చీసరికి రాళ్లు పైకి తేలినాయి. అంతే దొరా! ఎన్ని తుపాన్లొచ్చినా కట్టు మాతరం కొట్టుకుపోనేదు ఈయాల్టికీ. ఆ రాళ్లే మా బతుకులకి ఆసరా అవుతన్నాయి దొరా! ఎలాగంతావా ఆ రాళ్లు కూడా నేకపోతే కొట్టిన కట్టెలు, కొండ పంట యాడికని అట్టుకెళ్లి అమ్ముకోగలం సెప్పు? మాకు యేరే దారేది? రాకపోకలు బందయితే మా బతుకులు ఎల్లేది ఎలాగ? దొరా! సెక్‌డాము కట్టండి దొరా! కట్టండి దొరా! అని ఎన్నిమార్లు అడిగినాం మీసంటోళ్లని? సివరాఖరికి తమరు దయతలసినారు. బిటీసోడు కట్టిన రాతికట్టును తవ్వీసి కొత్తగా సెక్‌డాము కట్టినారు. కానీ ఆ సెక్‌డాముకు మాయందు దయనేకుండా పోనాది దొరా. ఒక్క గాలివానకు కొట్టుకుపోనాది. కొండ నాలిక్కి మందడిగినాం. ఉన్న నాలికని కూడా ఊడగొట్టీసినారు దొరా!

“తమరు జ్ఞాన పభువులు! పపంచికం సుట్టొచ్చినోళ్లు! బిటీసోడు కట్టిన కట్టడాలు తమరు శానా సూసుంతారు. తమరెప్పుడైనా ఇసాకపట్నంలోని పెద్దాసుపత్రి కేజీహెచ్‌కి పోనారా? నా పిచ్చిగానీ, అసుమంటి ఆసుపత్రికి తమరెందుకు పోతారు. నాకు యాచ్చిడెంటు అయినపుడు తీసుకెళ్లి ఆ ఆసుపత్రిలోనే పడేసినారు. ఆ ఆసుపత్రి భవంతి బిటీసోడు కట్టినదే దొరా! ఆ! గుర్తొచ్చినాది. ప్రెజల కట్టాలు పరీస్కరించేద్దామని సెప్పి అక్కడికి కూతేటు దూరానున్న కలెట్టరాఫీసుకి శానాసార్లు పోయుంతారు. ఏదో గొడవమీద నర్సీపట్నం తాలుకాఫీసుకీ పోయుంతారు. సూసినారా దొరా! బిటీసోడు కట్టిన ఆ భవంతులు ఎంత దిట్టంగా కట్టినాడో! దేశంలో ఆళ్లు కట్టిన భవంతుల్లో కాలేజీలు నడిపిత్తన్నారు. ఖజానాలు నడిపిత్తన్నారు. ఆడు పోసిన రోడ్డు పిక్క తేలడం నాను సూన్నేదు. ఏళ్లకు ఏళ్లు అయ్యి మనకు దారిచ్చినాయి. మరి తమరసంటోళ్లు పోత్తన్న రోడ్లు ఆర్నళ్లకే పిక్కదేరిపోతన్నాయేటి దొరా? యేటి తక్కవైనాది దొరా మనకాడ? గోడలకు కొట్టిన సున్నం ఆరకముందే కట్టిన భవంతులు, వంతెనలు బీటలు తీసెత్తన్నాయంట. నీరుగారిపోతన్నాయంట. కొన్నయితే పాపం కాయనేక కూలిపోతన్నాయంట! అక్కడా, యిక్కడా పేపర్లంట సూత్తానే వున్నాం దొర సిత్రాలు! జాతి నిర్మాణం ఎంత సక్కగా సేత్తన్నారు దొరా! బిటీసోడు సొంతానికి ఏదీ ఈడ కట్టుకోనేదు దొరా. దేశం వదిలెళ్లిపోతే పరాయోడికి ఉండిపోద్దని ఆడు తలపెట్టుకోలేదు. కట్టిందేదో కుదుమట్టంగా కట్టినాడు. న, పర బేదం సూన్నేదు. ఆడు సేసింది అన్నాయమే అయినా సేసిన పనిలో నిజాయితీ వున్నాది దొరా. తమరు సేత్తన్న అన్నాయంలో అన్నాయమే వున్నాది దొరా! పరాయివోడే అంత నీతి పాటిత్తే, సొంతోడు ఇంకెంత నీతి పాటించాల?ఒకపాలి ఆలోసించు దొరా! శెలవు దొరా!” రెండు చేతులూ జోడించి ఎమ్మెల్యేకి నమస్కరించి, ఆ చేతులతో మొఖం కప్పేసుకుని మోకాళ్లపై కూలబడి కుమిలిపోయాడు చెంగయ్య.

ఆ అరణ్య రోదన చూడలేక సూరీడు పడమటి కొండలమాటుకి వెళ్లిపోయాడు. దోనెలని చీకటి కమ్మేసింది.