అనగనగా ఒక నేను. ఆ నేనుకి ఒక కుడి చెయ్యి. ఆ చేతికి ఐదువేళ్ళు. వాటిలో చిటికెనవేలి పక్కనున్నదానిపేరు అనామిక. అంటే పేరు లేనిది. ఆ పేరులేని వేలికి ఒక ఉంగరం. ఆ ఉంగరమే వేళ్ళ సామ్రాజ్యానికి కిరీటం. మకుటం ఉన్నవాడే మహారాజు. పైగా అది బంగారు కిరీటం. బంగారమంటే సువర్ణం. అంటే వర్ణాలన్నింటిలోనూ మేలిమి వర్ణం. అన్ని విలువలకంటే మేలిమి విలువ. నేను నా వేలికి ఉంగరం పెట్టుకుని ఊరేగినంతకాలం దానికి ఏ సమస్యా రాలేదు. “లేని” రాజ్యానికి “ఉండే” ఏకైక చక్రవర్తిలా మిలమిలా మెరిసిపోతూండేది. కాశీకి వెళ్ళినప్పుడు నా కుడిముంజేతికి ఓ రాగికంకణం చేరింది. అది థళథళథళా మెరిసిపోతూండటాన్ని గమనించింది ఉంగరం. ఆ కడియం మెరుపు చూసిన ఉంగరానికి ఒకటే కడుపు మంట. ఆ మంటతో రాత్రంతా రగిలిపోయింది. అలా రగులుతూ రగులుతూ నిద్రంతా పాడు చేసుకుని కడియాన్నే చూస్తూ గుడ్లనీళ్ళు కుక్కుకుంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ చివరికి ఆ ఏడుపుగొట్టు మొహంతోనే ఏ తెల్లవారుజామునో మగతలోకి జారుకుంది. మెలకువ వచ్చేసరికి చూస్తే ఏముంది? తెల్లగా తెల్లారిపోయింది. నేను దినపత్రిక చదవడం పూర్తి చేసుకుని బడికి సిద్ధమయ్యేవేళ ఉంగరానికి కడియం గుర్తొచ్చింది. చూస్తే…