“రేయ్ మునసామీ..” “అత్తా..” “బండి కట్టరా..” ఆ సమయానికి నేను కారు కడిగే పనిలో ఉన్నాను. బాడుగలకి వెళ్లడానికి బద్ధకించిన రోజున కారు కడిగే పని పెట్టుకుంటాను. సుబ్బరంగా షాంపూ గట్రా వేసి కడుగుతాను. లోపల పట్టాలన్నీ తీసి దాదాపు ఉతికినంత పన్జేసి ఆర బెడతాను. ఇక కారుని ఆరడానికి వదిలేసి, ఎంచక్కా మళ్లీ బండితీసే మూడ్ వచ్చేదాకా రెస్టు తీసుకుంటాను. ఒకసారి నేను రెస్టు తీసుకోదలచి, బద్దకించిన తర్వాత, బ్రహ్మరుద్రాదులు వచ్చినా నాతో స్టీరింగు పట్టించలేరు. కానీ వరాలత్త సంగతి వేరు. అయినా సరే, ‘బద్దకించానత్తా, ఇవాల్టికి వదిలేయ్’ అంటే, ఏ రిక్షానో మాట్లాడుకుని వెళ్లిపోతుంది. ‘ఇప్పుడేమంత నీకు అర్జంటు పని? రేపెళ్దాంలే’ అంటే తన ప్రోగ్రాము మార్చుకుంటుంది. మరే సాకు చెప్పి తప్పించుకో జూసినా, ‘తప్పకుండా రావాల్సిందే’ అనదు. ‘వస్తున్నా’ అనేసి, ఓ గంటన్నర దాకా కారు సుబ్బరంగా కడుక్కుని నిక్కుతూ నీలుగుతూ వెళ్లినా కూడా, ఏమీ అనదు. కానీ, ఎందుకో ఆ గొంతు వినగానే గబుక్కున బండి కట్టేయాలని ఉడుకెత్తింది. కారు మీద అక్కడక్కడా చుక్కలుచుక్కలుగా గుమ్మరించిన షాంపూని తుడిచి, బయటేసిన పట్టల్ని దులిపి లోపల సర్దేశా. డ్రాయరు మీద తెల్లలుంగీ…