కొవ్వూరు వైపున గుంకుతున్న సూర్యుడి మీదున్న మబ్బుతునక. గోదారిని విడిచిపెట్టలేక; విడిచిపెట్టక చేసేది లేక అలుముకున్న బెంగలాగుంది. అటు వైపు నుంచి తాకుతున్న వాలు కిరణాలతో ఎర్రబారిన కెరటాలు. ఇష్టమైన మగవాడు మెత్తగా నిమిరినప్పుడు సిగ్గుతో కందిన ఆడదాని బుగ్గల్లా ఉన్నాయి. మొన్న పొద్దున్న పుష్కరాలరేవులో షాంపూతో తలస్నానం చేశాక మిలమిల మెరిసిన లక్ష్మి చెంపలు జ్ఞాపకమొచ్చాయి నాకు. వంటి రంగు నలుపైతేనేం, ఓ కాలు చచ్చుబడితేనేం, నాలాగే బిచ్చమెత్తుకుని బతుకుతుంటేనేం. పున్నమి వెన్నెల్లో గోదారిలా, రంగురంగుల కరెంటు లైట్ల కాంతి పడుతుండగా వింతగా మెరిసే జల్లుస్నానఘట్టపు ధారల్లా దాని ముఖంలోని కళే వేరు. అది గుర్తుకు రాగానే గుండెల మీద బరువైన మల్లెల బుట్ట పడ్డట్టయింది. ఎవరో ముసిలావిడ వేసిన రెండురూపాయల బిళ్లలోనూ లక్ష్మి ముఖమే కనిపించింది. వారం రోజుల క్రితం ఊర్వశీ హాల్లో సినిమా చూసినంతసేపూ తెర మీద హీరోయిన్‌ ముఖంలో నాకు కనిపించిందీ లక్ష్మి ముఖమే. కరెక్టుగా గుర్తు లేదు గానీ, ఆరేడునెలలుగా పుష్కరాలరేవు మెట్ల మీద కూర్చుని అడుక్కుంటున్నా, కోటగుమ్మం సెంటర్లో సుబ్బాయమ్మ చేపల పులుసుతో పెట్టే భోజనం తింటున్నా, బీడీ కాలుస్తున్నా, ఎప్పుడైనా చీప్‌ లిక్కర్‌ తాగుతున్నా, వరద…