“శోభనమే శోభనమే శోభనమే శోభనమే వైభవముల పావన మూర్తికి శోభనమే శోభనమే” ఒకవైపు అన్నమాచార్య కీర్తన, మరోవైపు మంగళ తూర్యారావాలు, ఇంకోవైపు మంత్రాలు, వాటితోబాటుగా మనసుని కుళ్ళబొడుస్తూ కలవర పెడుతున్న జ్ఞాపకాలు. గుండెలు అదురుతున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయి. నోరు పెగలడం లేదు. మాట రావడం లేదు. ఈ గోడు ఎవరికి చెప్పుకోవాలో ఎక్కడ వెళ్ళబోసుకోవాలో తెలియదు. సమయం దగ్గర పడుతోంది. అనుమానం క్రమంగా బలపడుతోంది. ఎందుకంటే, బయట జరుగుతున్న క్రతువు, ప్రతిరోజూ జరిగే తంతు కాదు. అందుకు పూర్తిగా భిన్నమైనది. ఏమో, చివరికి అనుమానమే నిజం అవుతుందేమో! ఏమో, వద్దనుకుంటున్నదే జరుగుతుందేమో! గుబులు, దిగులు, బాధ, భయం అన్నీ కలిసి చుట్టూ ఆవరించుకున్న దీపాల వెలుగులోకి చీకట్లని చిమ్ముతున్నాయి. చూస్తూండగానే ఒక్కొక్క దీపం బయటికి వెళ్ళి పోతోంది. చివరికి ఒకే ఒక్క దీపం మిగిలింది. నమ్మిన బంటులా చేతులు కట్టుకుని వంగి వంగి వెలుగుతోంది చిరుదీపం. కమ్ముకుంటున్న చీకట్లతో కలబడుతూ అడపాదడపా కంట్లోకి వెలుతురు బాణాల్ని సంధిస్తున్నాయి దాని కిరణాలు. ఆ ప్రమిదలో నెయ్యితోబాటు కొద్దిగా చందన తైలాన్ని కూడా రంగరించారేమో, శ్రీగంధ పరిమళాలతో గుబాళిస్తోందా గుడ్డి వెలుతురు. చూస్తూండగానే తెరుచుకుంది వాకిలి. గడపదాటి లోపలకి…