ముందు బయటికి పోదామనే అనుకున్నాడు లింగయ్య. దేనికో తెలియని వ్యతిరేకతతో కైకిలి పద్దులేవో గిలుక్కుంటూ పెద్దపీట మీద కూర్చున్నాడు. అరుగంచుకు గంపకింద కమ్మివున్న కోడి నిశ్శబ్దంగా ఆయన ఏకాగ్రతను చెదరగొడుతూనే ఉంది. గంప పక్కనే ఉన్న చిన్న అడ్డగుల్లలో కొన్ని బొగ్గులు పోసి, మూణ్నాలుగు కొడవళ్లు పెట్టి ఉన్నాయి.

ఏటవాలుగా కదిలిన నీడ వల్ల ఎవరో వస్తున్నట్టు అనిపించి తలెత్తాడు లింగయ్య. ఆ నీడతో పాటే వచ్చిన మాట ఎవరిదో తెలిసి, అలవాటైన పట్టనితనంతో మళ్లీ చేతివేళ్లు లెక్కపెట్టుకోసాగాడు.

“చిన్న పటేలుకు ఇంకా పొద్దు వొడిశినట్టు లేదు”

పరాచికాన్ని చెంపల్లో దాచుకుంటూ వస్తున్న ఆ మనిషి అడుగులు దగ్గరవుతూనే గంప కింది కోడి రెక్కలు కొట్టుకుంది. చిన్న వాకిట్లోకి వస్తూనే అలవాటుగా ‘చాకలోన్నవ్వా’ అనవలసినవాడిని ఆ రెక్కల చప్పుడు కొద్దిసేపు ఆపింది. మాట కలపడానికి ఆ చప్పుడు ఒక సాకుగా ఉన్నప్పటికీ లింగయ్య ముఖంలో కనబడని ప్రసన్నత నోరు తెరవనీయలేదు. లోపలికి కేకేసి, బదులివ్వాల్సిన ఇంటావిడ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు.

అక్కర్లేని పని ముందటేసుకున్న లింగయ్య కొద్దిసేపు బిగుసుకోవడానికి ప్రయత్నించినా, తన అవస్థ నుంచి దృష్టి మరల్చుకోవడానికి వీలుగా ఎదురుగా నిలుచున్న విగ్రహం లాంటి మనిషి మాటలకు పురిగొల్పుతుండగా, కాపీని పక్కన పెట్టి పీటపక్కనే ఉన్న గూట్లోంచి బీడీల కట్టను చేతిలోకి తీసుకోబోయాడు. గోరు పక్కని తోలు ఎప్పుడు చీలిందో– చూపుడువేలు సుళుక్కుమంది. తోలును అందినమేరకు కొరికేసుకున్నాడు. “ఔరా ఘట్టా, నీ చిన్నబిడ్డకు ఖాయమాయెనా?”

బీడీల కట్టను చూడగానే తీర్పాటంగా అరుగంచుకు కూర్చున్నాడు ఊళ్లో తన ఎత్తు కారణంగా ఘట్టయ్య అని పిలవబడే మైసయ్య. “పురాగ్గాలేదు పటేలా. ఆళ్లు ఇల్టానికి ఒప్పుకుంటలేరు”

సాయమానులో ఏదో పనిలో ఉన్న చంద్రమ్మ తనకు వినబడింది నిర్ధారించుకోవడానికి ముందటింట్లోకి వచ్చింది. పెద్దపీట వైపు తల తిప్పి చూసి– “ఓ పటేలా, ఇంక నువ్వు వోనేలేదా? దయ్యమోల్నే కూసున్నవ్‌” అని, మైసయ్యతో “మొన్న లంగ కాటగలిపినవ్‌” అనుకుంటూ మళ్లీ లోపటికి పోయింది– “పెద్ద బొందులది నాది, ఏమున్నా నీ పెండ్లం ఆ సన్నపు బొందులది నా ముల్లెల గడుతది, అది ఎవతిదో ఏం పాడో” అని చదువుకుంటూ. అరుగంచు వైపు లింగయ్య విసిరిన బీడీల కట్ట, అగ్గిపెట్టె కొంతదూరం జంటగా ప్రయాణించి, కిందపడేటప్పుడు విడిపోయినై. వాటిని దుత్త పట్టుకోవడం మీద దృష్టి నిలిపిన మైసయ్య అగ్గిపెట్టెను అందుకుని, కిందపడిన కట్టకోసం వంగినవాడల్లా కొంచెం తల లేపి– “దానికి చెప్త…” జవాబు వినే ఉద్దేశం లేనట్టుగా వెళ్లిపోయిన ఆ గొణుగుడుకు “తియ్యిండ్రవ్వా” అన్నమాటను నోట్లోనే మింగేశాడు.

నేలను రాసుకుంటున్న చద్దరును తల మీద కుడిచేత్తో ఎత్తి పట్టుకుని, గౌషను తొడగక తలాపిన చోటంతా నల్లబడిన మెత్తను భుజం మీద వేసుకుని, జారిపోతున్న లుంగీని ఎడమచేత్తో ఆపుకోవడంలో సతమతమవుతూ నిద్రకళ్లతో వాకిట్లోంచి ఇంట్లోకి వస్తున్న కొడుకు వైపు తల తిప్పకుండా చూపును శూన్యంలో ఆపాడు లింగయ్య. మోకాళ్ల దాకా పీలగా కనబడుతున్న కాళ్లను అనుసరిస్తున్న మైసయ్య చూపు ఇటు మార్చుకునేదాకా ఆగి, “ఆదెనట, వానికి అక్కణ్నే భూమి బాగున్నదటనా?” అన్నాడు.

“నౌకరే పటేలా” ఇంకా మట్టిపనితో పనేమిటన్నట్టుగా మైసయ్య గొంతు ధ్వనించింది. “ఆళ్లకు ఇల్టం అంటే చిన్నతనమట.” ఆ మాట నోట్లోకి వస్తున్నప్పుడే పైకి అనకూడదనుకున్నాడు గానీ తనతో నిమిత్తం లేనట్టుగా గొంతులోంచి జారివచ్చింది. తెలియకుండానే తన ప్రయోజకత్వం చాటుకోవాలన్న ఆరాటం లోలోపల ఉందేమో.

మూడూ, మూడున్నర దశాబ్దాల క్రితం– ముగ్గురు అన్నదమ్ములు పంచుకుంటే భూమి ఎవరికీ ఏమీ రాదని ఈ ఒంటిబిడ్డయిన చంద్రమ్మకు, అప్పుడు చంద్రకళ, లింగయ్యను ఇల్లరికం తోలాడు లింగయ్య తండ్రి. కళ్లు మూసుకోవడం ద్వారా చెవులకు తాళం వేసుకోవడానికి లింగయ్య చేసిన ప్రయత్నంలో బీడీ పొగ కొద్దిసేపు నోట్లోనే నిలిచి బయటికి వచ్చింది.

వేరే మాటల కోసం ఆత్రపడినట్టుగా మైసయ్య, “హైదరబాదుల ఏదో ఆపీసుల పని చేస్తడట” అన్నాడు.

లింగయ్య నిదానంగా– “ప్రవేటే కావచ్చు”

లింగయ్య అంత నెమ్మదిగా మైసయ్య చెప్పలేదు. “ఏ కాదట, గవుర్నమెంటేనట.”

లింగయ్య నిలువుగా తలాడించాడు. “ఊహు. ఎంత పగారు?”

చెప్పాడు మైసయ్య.

పసలుకు ఎన్ని పుట్ల వడ్లు పండితే ఆ లెక్క నిండుతుందా అనేదానిచుట్టూ లింగయ్య ఆలోచన తిరుగుతోంది.

‘సిగ్గుండాలె కాపుదనపోడు ఇంతసేపు పండుటానికి’ అని లోపల కొడుకును గదమాయిస్తూ వస్తున్న చంద్రమ్మ అడుగుల చప్పుడుకు సిద్ధమవుతున్నట్టుగా, కూర్చున్నవాడు లేచాడు మైసయ్య. తాగుతున్న బీడీ కింద పడేసి, అన్నం వేయించుకోవడానికి వీలుగా భుజాన వేసుకున్న పాత ధోవతి మూట విప్పుకున్నాడు. ఇప్పుడు భార్య ఏ అవతారంలో రాగలదో ఒక ఊహ ఉన్న లింగయ్య ఒంట్లో ఏదో అసౌకర్యం ప్రవేశించింది. దానికి సాక్షిగా ఉండలేక, బీడీని పీట కిందికి పడేసి, తల వంచుకుని, నెరిసిన తల వెంట్రుకలను ఎడమచేత్తో పూర్తిగా వెనక్కి దువ్వుకుంటూ కూర్చున్నాడు.

చాకలాయనకు పెయ్యి మీదివి కూడా వేయడానికి వీలుగా చీర, లంగా విడిచి, పాతధోవతిని లుంగీలా చుట్టుకుని వచ్చింది చంద్రమ్మ. పళ్లెం నిండా కొప్పురంగా తెచ్చిన అన్నాన్ని చాకలి మూటలో వేస్తూనే మొగుడి వైపు తలతిప్పి– “అంబటాళ్లకు నెత్తి వట్టుకోవడితివి, దరిద్రం” లింగయ్య చేసేదిలేక తలెత్తాడు. గొంతు నెమ్మది చేసుకొని, “కొడుకు ఊకె నాటుకోడీ నాటుకోడీ అంటుండు; బట్టలు కుంటకాడ ఏశచ్చి కొంచెం కోశిచ్చిపో.”

ఊరిలో చికెన్‌ సెంటర్లు వచ్చిన తరువాత, మైసయ్యకు ఇలాంటి పని తగలడం లేదు. బట్టలు కూడా ఇంకా కొన్ని ఇండ్లు వదులుకోలేనివి మాత్రం ఉతుకుతున్నాడు. “ఇల్టం గిల్టం అని జూడకు. నీ మాట మన్నించి ఇల్టమచ్చినా వాళ్లెట్లా హైదరావాదులనే ఉంటరు. మంచి సమందం, ఖాయం జేసుకో” అని తనకు ఇదిరవకే తెలిసివున్న గతానికి భవిష్యత్తును జోడించి సలహా ఇచ్చింది చంద్రమ్మ. “అప్పటివరకు చిన్నబిడ్డను దోలు, ఇంత కూర తీసుకపోతది. అత్తదా, హైదరావాదని టయిలు గొడుతదా?”

అన్నింటికీ కలిపి ఒకటే జవాబు అన్నట్టుగా “సరేనవ్వ” అన్నాడు మైసయ్య.

“ఘట్టయ్య వచ్చెవారకు ఆ కొడండ్లు సరిపిచ్చుకరాపోవయ్యా” మాటను వెనక్కి విసిరేసి, చంద్రమ్మ లోపలికి వెళ్లిపోయింది.

“కొడండ్లు ఎందుకయ్యా గిప్పుడు మరే?”

“కొన్ని మక్క కర్రలు అగ్గి దలిగినై.”

బట్టల్లోంచి ఒక లంగాను బయటికి తీసి, దాని బొందుతో మిగతా బట్టల మూతులను ఈ లంగాతో కూడా కలిపి దగ్గరగా ముడేసి, ఇంక వెళ్లిపోయేమాటగా తెలియని ఉల్లాసంలో ఉన్న మైసయ్య అడిగాడు: “చిన్న పటేలుకు మళ్లెక్కన్నన్న పిల్లను జూస్తిరా?”

తనతో నిమిత్తం లేనట్టుగా లింగయ్య గొంతులోంచి మాట జారివచ్చింది. “ఇగ మీ ఇండ్లళ్ల జూస్తెనే! వ్వాని కొడుకును మాటుగడ్డల్ల వెట్ట.”

మైసయ్య చిన్నబుచ్చుకున్నాడు. ఇంక ఆ సంభాషణకు అతుకు పడే అవకాశం వెంటనే దొరక్క, కట్టుకున్న మూటనే మళ్లీ సవరించుకుని, “ఊరు తిరుక్కొని వస్తనవ్వ” అని ఇంట్లోకి కేకేసి, బయటికి నడిచాడు.

అదే పెద్దపీట మీద కాసేపు నడుమెత్తుకుని కూర్చుని, నిస్సత్తువగా లేచాడు లింగయ్య. అత్తామామల విడి ఫొటోలను ఒకటిగా చేసిన ఫొటోకు వేసిన మెరుపు దండలో మెరుపు పోయి దండ మాత్రం మిగిలివుంది. మామ కింద ‘బుచ్చి రామాయ్య’ అని రాసివున్న అక్షరదోషాన్ని తెలియకుండానే అలవాటుగా చదివాడు. ఒత్తిపట్టినట్టుగా నిల్చోవడం వల్ల కాళ్లమీద మోపలేని బరువు పడినట్టయ్యింది. మనసులోని ఒత్తిడికి శరీరం కూడా బరువు పెంచుకున్నట్టుంది. తేలిగ్గా ఎట్లా నిలబడాలో తెలిసీ మరిచిపోతుంటాడు. చిలక్కొయ్యకు వేసివున్న అంగీని యాంత్రికంగా ఒంటికి తగిలించుకున్నాడు. పాదాల చప్పుడుకు మరోసారి కుయ్యిమంది కోడి. అడ్డగుల్లను చేతిలోకి తీసుకుని, నీలంరంగు స్లిప్పర్లు వేసుకుని, గడప దాటుతున్నప్పుడు ఇంట్లోంచి కొడుకును భార్య బతిమాలుతున్న మాటలు వినబడుతున్నాయి. “లెవు బిడ్డా, పోయి మొకం గడుక్కపో.”

సాయమానులో అరమత్తులో చిన్నపీట మీద పొడుగ్గా కాళ్లు చాపుకొని కూర్చున్నాడు బుచ్చిరెడ్డి. నడుస్తున్నప్పుడు కాళ్లకు అడ్డం పడుతున్నట్టుగా విసుగు ముఖం పెట్టి, సోలతో బియ్యాన్ని గిన్నెలోకి కొలుచుకుంది చంద్రమ్మ. “పో, పాశి నోరు వెట్టుకొని.”

మైసయ్య వాకిట్లోకి వచ్చినప్పుడు బుచ్చిరెడ్డి నిద్రేం పోలేదు. పొద్దున లేవగానే తండ్రి ముఖాన్ని తప్పించుకోవడానికి చద్దరు నలువైపులా బిగించుకొని పడుకుంటాడు. తండ్రి చేనుకాడికి పోయేదాకా ఆగి నెమ్మదిగా లేస్తాడు.

చంద్రమ్మ బియ్యం కడిగిన నీళ్లు బయట చెట్టు మొదట్లో పారబోసి వచ్చి, గిన్నె పొయ్యి మీద పెట్టింది. కాళ్లు దగ్గరికి ముడుచుకుని, చేతులు కింద ఆనించి ఒళ్లు విరుచుకుంటూ లేచాడు బుచ్చిరెడ్డి. వంగి పనిచేస్తూవున్న తల్లి వెనక్కి వెళ్లి, పొట్టను రెండు చేతులతో అమిరేట్టుగా పట్టుకుని– “ఛీ ఏం గావురం ఇది? మొల్లికాయవా?”– వీపు మీద తలవాల్చి, ఏదో గొణిగాడు. “రొట్టెలా? నీకు మానం లేదు. పనికోవద్దా? మాపటి జాముల జేసుకుందం.”

బుచ్చిరెడ్డి కొంత చదివాడు. ఆ చదివిన మేరకు హైదరాబాద్‌లో కొన్ని రోజులు పనిచేశాడు. ఆ ఉద్యోగం పోయిన సమయంలోనే అతడి ఆయువుపట్టు ఎక్కడో దెబ్బతింది. మస్కట్‌ పోవడానికి ప్రయత్నించి డబ్బులు ఇంట్లో సర్దుబాటు కాక పోలేకపోయాడు. చదువుకోనివాళ్ల పనిగా తలచి వ్యవసాయంలో కుదురుకోలేదు. ఊర్లో కైకిలికి వెళ్లడమేమో నామోషీ. నెమ్మదిగా అట్లా జరుగుతోందని అతడు గ్రహించేలోపే ఇంటిదగ్గరే ఉండిపోవడం మొదలైంది. బయటికి వెళ్లడానికి జేబు ఖర్చులు తండ్రిని అడగలేడు. బయటికీ వెళ్లక, ఇంట్లోనూ తోచక నెమ్మదిగా నిద్రను ఆశ్రయించాడు. సాధన చేస్తే నిద్ర కూడా లొంగుతుంది. నిద్ర మరింత నిద్రను పెంచుతుంది. పొద్దున కొంచెం అన్నం తిని పడుకుంటే సాయంత్రం దాకా. ఆచ్ఛాదన లేని వీపు మీద నులక అచ్చులు పడేవి. ఒక్కోసారి అదే నిద్ర సాయంత్రం నుంచి, రాత్రిలోకి కూడా సాగేది. తల్లి పిలిచీ పిలిచీ వదిలేసేది. ఆ మత్తులో రాత్రి భోజనం చేయబుద్ధయ్యేది కాదు. ఒక్కోసారి ఏ అర్ధరాత్రో లేచి గిన్నెల అడుగులు దేవుకుని తినేవాడు. మొత్తం పద్దెనిమిది గంటలు పడుకునే ఉండేవాడు. స్నానం ఎప్పుడో ఒకసారి. మొదట్లో స్నానం అనేది ఒకటి రోజూ ఉంటుందని తెలిసినట్టు ఉండేవాడు. బయటికి వెళ్లినప్పుడు కదా స్నానం? దేనికైనా ప్రారంభంగానో, ముగింపుగానో కదా స్నానం? ఏ ఆదీ అంతంలేని నిద్రలో ఏ బిందువు దగ్గర స్నానం చేయాలి? వాకిట్లో మంచం వేసుకున్నప్పుడు వర్షం పడితే అదే స్నానం. ఇంత లండుతనం ఎందుకంటూ ఓ రోజు కొడుకు వీపు మీద ముల్లుగర్ర విరిగేట్టు కొట్టాడు లింగయ్య.

మొదట్లో ఎప్పుడైనా పెళ్లిళ్లకో దేనికోసమో బయటికి వెళ్లేవాడు బుచ్చిరెడ్డి. ఏం చేస్తున్నావన్న ప్రశ్న ఎదురయ్యేది. అది న్యూనతలోకి జార్చేది. దాంతో ఆ వెళ్లడమూ మానుకున్నాడు. మొదట్లో అసలు నిద్ర పట్టేది కాదు. అసహనంగా దొర్లుతూనే ఉండేవాడు రాత్రీ పగలూ. ఖాళీగా ఉన్న వయసు. దిగువ రకం పుస్తకాలు ఏవో చదివేవాడు. అవి పుట్టించే ఉద్రేకానికి మంచం కోడుకు యవ్వనాన్ని నొక్కుకునేవాడు. ఇంకెవరూ తన దగ్గరికి రాకుండా ఒక్కోసారి బట్టలు మొత్తం విప్పేసి ఈల వేసుకుంటూ పడుకునేవాడు. బాధ్యత లేకపోవడం కన్నా బాధ్యత లేనట్టుగా కనబడటం లింగయ్యను ఇంకా వెర్రెత్తించేది. లింగయ్య వ్యతిరేకత పెరిగినాకొద్దీ బుచ్చిరెడ్డి మరింత మొండిపడ్డాడు. ముఖాముఖి తేల్చుకోవడానికి దిగితే, నేనేమీ చెయ్యను, ఏం చేస్తావో చేసుకో అనేంతదాకా పోతే ఇంక చేయగలిగేదేమిటి? తన పెద్దరికం నిలబడాలంటే దీన్ని తేల్చకుండా ఒక మబ్బుపొరలాగా ఉంచడం తప్ప దారి కనబడలేదు లింగయ్యకు.

ఎప్పుడూ పడుకునే ఉండటం వల్ల క్రమంగా బుచ్చిరెడ్డి కండరాలు బిగుసుకు పోయినై. చెంపలు పీక్కుపోయినై. తెలియకుండానే తిండి తగ్గిపోవడం వల్ల బక్కతనం వచ్చేసింది. కొన్ని నెలల తర్వాత ముఖంలోకి ఒక పిచ్చికళ ఏదో వచ్చి చేరింది. అది ఆ ఉన్న ఒకరిద్దరు స్నేహితులు కూడా వచ్చి కలవనంత దూరం చేసింది. తన వయసు వాళ్లకు ఒక్కొక్కరికీ పెళ్లిళ్లు అయి వాళ్లు మరింతగా జీవితంలోకి ప్రయాణిస్తూవుంటే అతడు మంచపు బొరియలోకి ముడుచుకుంటూ పోయాడు. తనైనా ఇప్పుడు సరైన కారణం చెప్పలేడు– ఒక రోజు లేచి చూస్తే, మళ్లీ మామూలుగా ఊళ్లో తిరగడం అసాధ్యం అని అతడే నమ్మే స్థితికి వచ్చేశాడు. ఇంక ఏదీ జరగడానికి వీలు లేనంతగా అతడి జీవితం నిలిచిపోయింది.

అడ్డగుల్ల తీసుకుని గడప దాటిన లింగయ్య, బయటికి వెళ్తున్నవాడే ఉన్నట్టుండి దిశ మార్చుకుని, ఇంటిపక్కన వున్న చిన్న సందులోంచి ఇంటి వెనకాలే ఉన్న కొట్టంలోకి నడిచాడు. సమతలంగా ఉన్న ఒక రాయి మీద అడ్డగుల్ల పెట్టాడు. అక్కడక్కడా మొలిచిన కంపను చూసుకుంటూ జాగ్రత్తగా ఎనుగు వైపు నడిచాడు. కొట్టంకు ఆనుకునివున్న బయటి మట్టిబాట మీద మనుషులెవరూ రావడం లేదని చూసుకుని, ఒంటేలుకు కూర్చున్నాడు. లేచి, ధోవతి దులుపుకొంటుండగా ఓ కాలేజీ అమ్మాయి ఒంటి పైట వేసుకుని సెల్‌ఫోన్లో నవ్వుతూ పోతోంది. అటే పిసికి బొంద పెట్టబుద్ధయింది. రండలకు ఇకయికలు పకపకలు.

కొలిమి కాడ కమ్మరి లక్ష్మీపతి ఊరికే, ‘అవునే నింగన్నా, కొడుకు సంగతి ఏందే మరి?’ అంటాడు, ఊరిలో చాలామంది పిలిచినట్టుగా లింగయ్యను నింగయ్య చేస్తూ. లక్ష్మీపతి కాకపోతే గొడ్డలి పదును కోసం వచ్చే బ్రహ్మయ్య. బ్రహ్మయ్య కాకపోతే ఉత్తగనే కొలిమి తిప్పుకుంటూ కూర్చునే శంభయ్య. అందులో హేళన ఏమీ వుండదు. కానీ లోకం అడుగుతుంది. నిన్నా అడిగింది, రేపూ అడుగుతుంది. లోకం ఎప్పుడు అడగలేదు? ఇవ్వాళ ఒక్కరోజు తప్పించుకునేది కాదు. ఇందాకటి అడ్డగుల్లను రాయిమీది నుంచి తీసుకుంటున్నవాడే పొడి దగ్గు వినబడి సాయమాను వైపు చూశాడు లింగయ్య. వంద మందిలో ఉన్నా భార్య దగ్గును పోల్చుకోగలడు. చిన్న గొంతు సవరింపు. కొన్నేళ్ల సావాసం తర్వాత ఎదుటివారి ఉమ్మేతీరును కూడా చెవులు పసిగడతాయి. చంద్రమ్మ సాయమానులోంచి రెండు మూడు కట్టెలు తెచ్చి బయటి రాళ్లపొయ్యి దగ్గర వేసింది. అది దేనికోసం జరుగుతున్న ఏర్పాటో తెలిసిన లింగయ్యను మళ్లీ నిస్సత్తువ ఆవహించింది. ఏదో తెలియని శక్తి నిర్దేశిస్తున్నట్టుగా అడ్డగుల్లను కిందపెట్టి, తను రాయిమీద కూర్చున్నాడు.

ఎడ్లు అమ్మడానికి ముందు మిగిలిపోయిన గడ్డికుప్ప ఎండుకు ఎండీ వానకు తడిచీ ఒక పక్కకు ఒరిగిపోయి రంగుమారింది. దాని దగ్గర పాలవిందెలు తిరుగుతున్నాయి. కొట్టపు ఒకపక్క ఒరిగించిన నాగలి నొగ నేలమీద ఆనే చోటి నుంచి జానెడు ఎత్తు చెదలు పట్టింది. ఒకట్రెండు కంపచెట్లు మనిషి ఎత్తయినాయి. అక్కడినుంచి ఇంటి వెనకాలి జాలాడి, నీళ్ల కోసం కట్టిన హౌజు, రెండు కానుగచెట్లు కనబడుతున్నాయి. భార్య ఈసారి గ్యాసునూనె ముంత తెచ్చింది. కట్టెలు పేర్చి, చిన్న పిడకను గ్యాసునూనెలో ముంచి అగ్గిపెట్టెతో అంటించి, పొయ్యిలో పెట్టింది. పొగ పైకి లేస్తోంది. ఆ పొగ తనలో ఏదో రాజేసినట్టయి బీడీ కోసం జేబులో చేయిపెట్టాడు. చూపుడు వేలు మళ్లీ సుళుక్కుమంది. తోలును అందినమేరకు కొరికేసినా ఎదురుగా రుద్దుకున్నప్పుడు నొప్పి తెలుస్తూనేవుంది.

ఒంటికి తువ్వాలు చుట్టుకుని, పళ్లు తోముకుంటూ వచ్చిన బుచ్చిరెడ్డి, బండమీది నాచుకు కాలు జారి సొలిగినట్టయి నిలదొక్కుకున్నాడు. హౌజులోని నీళ్లతో ముఖం కడుక్కుని, కట్టుకున్న తువ్వాలే విప్పి తడుచుకుని, దాన్ని తల మీదినుంచి పోతున్న దండెం మీద వేశాడు. చెడ్డీ మీద నిలుచున్న మూడు పదుల కొడుకును చూస్తున్నాడు లింగయ్య. ఇంక కదిలించుటానికి వశం గాని కొండనా అది? ఈ దోషంలో నా పాపం ఎంత? కొడుకు చాలాసార్లు చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. కానీ వాడికి చచ్చిపోయేంత శక్తి గూడా లేదు. మళ్లీ ఆత్మహత్య చేసుకుని కాదు, ఏదో జరగాలి; పాము కుట్టడమో, పిడుగు పడటమో. మళ్లీ తప్పు తప్పని చెంపలు వేసుకునేవాడు.

పెళ్లయిన కొత్తలో ఈ అత్తామామల ఇంట్లో లింగయ్య ఏనాడూ భార్య దగ్గర పూర్తిగా పురివిప్పుకోలేకపోయాడు. ధోవతి ఎత్తినప్పుడల్లా వెనక అత్త నిలబడ్డట్టే అనిపించేది. వేడి తీర్చుకోవడానికి స్నానం చేసేముందు కరెంట్‌ మోటారు ధారకు అలాగే నిలబడేవాడు. ఏడాది తిరిగేసరికి సంతానాన్ని ఆశించే ఇంట్లో అతడి మగిటిమి ప్రశ్నార్థకమయ్యింది. ఆఖరికోసారి తిరుపతికి పోయినప్పుడు భార్యను ఒక రావిచెట్టు దగ్గరి గుబురులోకి గుంజుకెళ్లాడు. ఎంత నిజమోగానీ తిరిగి వచ్చాకే భార్య నీళ్లు పోసుకుంది. అదే ఈ శాపానికి కారణమైందా?

అడుగంతా నల్లబడిన గిన్నెతో తెచ్చిన ఉడుకు నీళ్లను చంద్రమ్మ ఇత్తడి బకెట్‌లో పోసింది. ఆవిర్లు పైకి లేచాయి. బుచ్చిరెడ్డి కాళ్లు ముడుచుకుని సలుపరాయి మీద కూర్చున్నాడు. వేడిగిన్నెను మోసిన బనీను బట్ట వెచ్చదనాన్ని కొడుకు రెండు కళ్లకు అద్దింది చంద్రమ్మ. వీళ్లకింకా చిన్నతనం పోలేదని నవ్వుకున్నాడు లింగయ్య. పొద్దుటినుంచీ రేగుతున్న తెలియని అలజడిలో ఇది క్షణకాల సానుకూల స్పందన కలిగించింది. మగవాడి వంద అనుభవాలను మించే జన్మనిచ్చే అనుభవం ఆడమనిషిని జీవితంతో మరింత దగ్గర చేస్తుందా? ఆ రోజు ఈ ఇంటికి దూరంగా ఉన్న ఆ ఆకుపచ్చటి కొండ ఏవో సంకెళ్లను ఫెటీల్మని తెంపేసింది. ఆ తెగింపులో పుట్టిన తమకంలో కేంద్రం దొరక్క తన్నుకులాడుతుంటే తన మెత్తదనాన్ని సంపూర్ణంగా అదిమింది. ఆ మెత్తదనం తర్వాత్తర్వాత ఎట్లా పెళుసుబారిపోయింది?

బుచ్చిరెడ్డి పుట్టినప్పుడు పండులా ఉండేవాడు. వీడు పిలిస్తే చందమామ కూడా ఆడుకునుటానికి దిగొస్తాడని మురిసిపోయేది అత్త. కొడుక్కు తండ్రి పేరు పెడదామనుకున్నాడు. కానీ ఆమె సాగనీయలేదు. ఇల్లరికానికి ఇంకెవరూ ముందుకురాకగానీ పాకనాటి బిడ్డకు లక్కమారి మనిషిని చేసుకోవడానికి అత్తకు ఇష్టమే లేదు. బుచ్చిరెడ్డి ఏదైనా చిన్నతప్పు చేసినా అల్లుని సాలె వచ్చింది అనేది ముసలావిడ. ఆమె ఉన్నన్నాళ్లూ లింగయ్యను బతకలేక వచ్చినోడిలాగే చూసింది. చంద్రమ్మలో కూడా తల్లి స్థిరపరిచిన గౌరవమే నాటుకుపోయింది. అతడిని మానసికంగా తగ్గించడం ద్వారా వాళ్లు పెరిగేందుకు ప్రయత్నించేవాళ్లు. ఏదో ప్రత్యేకంగా అంటారని కూడా కాదు, మన మనిషి కాదని తెలిసినట్టు ఉంటారు. ఆ తెలిసినట్టు ఉండటంలోనే సగం ప్రాణం తోడేసినట్టవుతుంది. ‘ప్చో’ అని పెదవి విరిచినా మనసు చివుక్కుమనేది. తాను ఎవరూ అన్న సోయిని గాలికి విడిచి బతకడం ఇక లింగయ్యకు చేతకాలేదు. జీవితంలో ఇమిడిపోవాలని వచ్చి ఇరుక్కుపోయానని అనుకునేవాడు. నిద్రలో కూడా కాలివేళ్లను గట్టిగా బిగించినట్టే పడుకునేవాడు. మామ పోయినప్పుడు దినాల నాడు ఒగ్గోళ్లు చెప్పిన మల్లన్న కథలో– మొటాటి, పాకనాటి, గోనె, చిట్టెపు, గుడాటి, లక్కమారి రెడ్లు ఆరుగురూ అన్నదమ్ములూ, లక్కమారి రెడ్డి చిన్న తమ్ముడూ అని చెప్పిరే. మరి ఒకే తల్లి సంతానంలా చూసిన రోజులున్నాయా? అత్త ఉంటే ఇప్పుడేం చేసేది? మనవడికి మున్నూరు కాపు సంబంధాలు కూడా రావడం లేదు.

అప్పటి ధోవతిలోనే ఉన్న చంద్రమ్మ కొడుకు పెయ్యంతా రాస్తూ స్నానం చేయిస్తోంది. ‘బుచ్చీ’ అని కొడుకును లాలించి ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకుంటాడు లింగయ్య. కానీ ఆ సంబంధం ఎక్కడో గడ్డగట్టుకుపోయింది. కొడుకు ఓసారి సైకిల్‌ నేర్చుకుంటూ పడినప్పుడు మోచేయి కొట్టుకుపోయింది. దెబ్బ చూపిద్దామని ఎప్పటినుంచి ఉగ్గబట్టుకుని ఉన్నాడో, తండ్రి రాగానే బావురుమన్నాడు. ఇంకా చిన్నోడిగా ఉన్నప్పుడు– పులిలా ఇద్దరూ పంజాలు విసురుకుంటూ, ఖాహ్‌ ఖాహ్‌ ఖాహ్‌ అని గాండ్రించుకుంటూ, ముఖమంతా వంకలు తిప్పుకుంటూ ఆడుతూ అందులోనే లీనమైనట్టు నటిస్తే– ‘మనిషైపో నానా, మనిషైపో’ అని సగం ఏడుస్తూ, సగం నవ్వుతూ భయపడ్డాడు. ఉత్త పిరికోడు. ఒకసారి ఏదో గ్యాంగులీడరు డ్రెస్సు కావాణ్నని వేములవాడ అంతా తిప్పించాడు. నాకు ఇది కావాలీ అని వాడు అడిగి ఎన్నేండ్లయింది? తీరా బస్సు ఉరుక్కుంటూ దిగుతూ పడి ఆ అంగీ ప్యాంటును మేరాయన రప్ఫు చేయరాకుండా చినగ్గొట్టుకున్నాడు. లింగయ్యోసారి ధోవతి మీదికి తెల్లది కాకుండా రంగు అంగీ కుట్టించుకున్నాడు, ఎవరో మస్కట్‌ పోయినవాళ్లు బట్ట ఇస్తే. రంగు అంగీలు వేసే అలవాటులేని వాడవడంతో అది ఎబ్బెట్టుగా అనిపించి వేసుకోకుండా సందుగులో పెట్టేశాడు. ఎప్పుడు చూశాడో, ధోవతి మీది కోసమే ప్రత్యేకంగా కుట్టే కత్తిరింపు చీలిక కనబడకుండా టక్కులో మాయం చేసి దాన్ని కాలేజీకి వేసుకుపోయాడు. ఆ తెలివి ఎక్కడ తెల్లారింది? భూముంది! నీళ్లు లేవన్నట్టుగానీ ఒక్క పసలు కచ్చితంగా పండినా వానీయమ్మ బతకలేనోడెవ్వడు? ఈ ప్రైవేటు ఉద్యోగాల్లో వాడు వద్దన్నా మనమే బంజెయ్యాలె, మనం వద్దనుకున్నా మనమే బంజెయ్యాలె.

ఆరిపోయిన బీడీని పారేసి లింగయ్య విరామంగా కాళ్లు చాపుకున్నాడు. ఈలోగా మైసయ్య వచ్చాడు. బట్టలో చుట్టివున్న కత్తుల్ని కింద పెట్టి, మొత్తం విదిల్చినట్టుగా కానుగచెట్టు రాల్చిన ఆకుల్ని ఎదురుకొచ్చి పొయ్యిలో వేసి, గొగ్గికాళ్ల మీద కూర్చుని కట్టెలను ఎగేసి బీడీ ముట్టించాడు. ముందు గుప్పుమని చెట్టెత్తు లేచింది పొగ. మంట మండటంతో క్రమంగా మాయమైంది. రెండు కానుగచెట్లలో ఒకటి ఈ మాయ ఎప్పుడు జరిగిందో తెలియనట్టుగా కొత్తగా వస్తున్న లేతాకులతో ఆకుపచ్చగా కళకళలాడుతోంది. ఎక్కడైనా ఒకటీ అరా ఇంకా రాలాల్సిన గోధుమవర్ణపు కాయలున్నాయి. కొత్త జీవాన్ని చూస్తున్న ఉత్సాహంతో దాని కొమ్మల మీద పిట్టొకటి ఎగురుతూవుంది. దానిపక్కనే ఉన్నదానికి మొత్తం ఉడిగిపోయిన పసుపురంగు మచ్చల ఆకులే కనబడుతున్నాయి. ఇంకా దీనికి వసంతమే వచ్చినట్టు లేదు. వెనకా ముందు ఎంతసేపు? అనుకున్నాడు లింగయ్య.

స్నానం అయిపోతుండటం చూసి లేచి, మైసయ్య ధోవతి గోచీని మళ్లీ బిగించుకున్నాడు. మెడలోని తువ్వాలను నెత్తికి చుట్టుకున్నాడు. కోడిని తేవడానికి ఇంట్లోకి వెళ్లాడు. బుచ్చిరెడ్డి చెడ్డీ కిందికి గుంజేసి దండెం మీది తువ్వాల ఒంటికి చుట్టింది చంద్రమ్మ. పిర్రలు లోపటికి ఒత్తుకుపోయి ఉన్నాయి. బలహీనంగా తూడ్చుకుని, కానుగచెట్ల సమీపంలోని ఎండపొడకు నిల్చున్నాడు బుచ్చిరెడ్డి. కొక్కొక్కొక్కొ… మైసయ్య రెక్కలను అదిమిపట్టుకుని కోడిని తెచ్చాడు. నాటుకోడి పుంజు. చంద్రమ్మ దాన్ని తన చేతుల్లోకి మార్చుకుంది. బట్టలో చుట్టిన కత్తి తీయడానికి మైసయ్య వంగాడు. రెక్కలు గట్టిగా కొట్టుకుంటున్న కోడిని పట్టుకోవడంలో చంద్రమ్మ సతమతమవుతోంది.

పొద్దుటి ఎండ పెరుగుతోంది. ఆకాశంలో మబ్బులు కదలక నిల్చుండిపోయినట్టుగా ఉన్నాయి. తనకు సంబంధం లేని దృశ్యాలను ఇంతసేపూ చూస్తున్నట్టుగా కూర్చున్న లింగయ్య మళ్లీ అదే అడ్డగుల్లను చేతిలోకి తీసుకున్నాడు. కాళ్లల్లో బరువు పడకుండా లేవడానికి ప్రయత్నించాడు. వెళ్తూ నాగలికి పట్టిన చెదలును వదిలించే ఉద్దేశంతో నొగను కాలితో చిన్నగా తన్ని సందువైపు అడుగులు వేశాడు. ఈ శబ్దం వచ్చిన వైపు ఏమరపాటుగా చూసిన చంద్రమ్మ, వడిగా నడుస్తున్న భర్త అలికిడిని నోరెళ్లబెట్టి చూసి, “హవ్వ! ఇంకా ఈణ్నే పన్నావు; కుయ్యి లేదు కుసుక్కు లేదు; నీ నల్లికుట్లతనం పాడుగాను” అంది.

పూనకం వచ్చినవాడిలా గిరుక్కున వెనక్కి తిరిగాడు లింగయ్య. ఆమె వైపు ఉరుక్కుంటూ నడిచాడు. ఆ వస్తున్న తీరుకు ఇద్దరూ శిలల్లా నిలబడిపోయారు. రెక్కల్ని కోడి బలంగా ఆడిస్తూవుంది. ఏం జరుగుతున్నదో అర్థం కాక బుచ్చిరెడ్డి అయోమయంగా చూస్తున్నాడు. “లంజె, నీకిప్పుడు కోడికూర తినబుద్దయితున్నాది” అంటూ అడ్డగుల్లలోని కొడవలిని కుడిచేతిలోకి తీసుకున్నాడు లింగయ్య. ఎడమచేతిలోని అడ్డగుల్ల, అందులోని మిగిలిన కొడవళ్లు, బొగ్గులు తెలియకుండానే కిందపడిపోయాయి. ఒక లక్ష్యం లేకుండా వేసిన వేటు, చంద్రమ్మ చేతుల్లోని బలం సన్నగిల్లడంతో ఎగురుతున్న కోడి మీద పడింది. పడిపోతున్న వాహనం దేన్నో ఆపినట్టుగా అచేతనంగా మోకాళ్లను దగ్గరకు గుంజుకున్నాడు మైసయ్య. తెలియని భయంతో బుచ్చిరెడ్డి గట్టిగా దవడపళ్లు ఒత్తుకున్నాడు. తన యావజ్జీవితం సిద్ధపరచని ఈ అనుభవానికి చంద్రమ్మ అట్లే కొయ్యబారిపోయింది. కోడి కీయ్‌ కీయ్‌ మని అంతటా బీభత్సంగా దూకుతూ, రక్తం ఓడుతుండగా కొట్టంలోకి ఎగిరి గిలగిలా కొట్టుకోసాగింది.

ఒక వెర్రి ఆవేశంలో ఉన్న లింగయ్య శరీరం అప్పటికే వణుకుతోంది. శ్వాసవేగం పెరిగింది. తల దిమ్మెక్కినట్టయింది. కొడవలి చేతిలోంచి కిందకు జారింది. భూమ్మీద పట్టుదొరకనట్టుగా కాళ్లు కూలబడుతున్నాయి. గాలికి కానుగచెట్ల ఆకులు రాలుతున్నాయి. ఆకాశంలో మేఘాలు నెమ్మదిగా కదిలిపోతున్నాయి. కళ్లు మూసుకుపోతున్నాయి. ఆకుపచ్చ పసుపు గోధుమ వర్ణాలన్నీ అలుక్కుపోతున్నాయి. కోడి తన్నుకులాట క్రమంగా బలహీనమవుతోంది. కానుగ పరిమళం తేలివస్తోంది. “పటేలా” “నానా” “పటేలా” అంతరంగపు ఏ లోతుల్లోనో బొయ్యిమని తిరుగుతున్న వందల శబ్దాల్లోంచి ‘నానా’ అన్న పిలుపును అతడి చెవులు వడగట్టుకుంటున్నాయి. పట్టుచీర కట్టుకున్న చంద్రకళ అతడి చేయిని మురిపెంగా పట్టుకుని కొండ దిగుతోంది.