నేను వంటింట్లో పనిచేసుకుంటూ క్రీగంట గమనిస్తున్నాను. ఆవిడ తన బట్టలు మొత్తం బీరువాలోంచి తీసి సూట్ కేసులో సర్దేసుకుంటోంది. గత ఏడాదిగా ఆవిడ ఇంట్లో కట్టుకునే బట్టలు కొన్ని బీరువాలో వదిలేసివెళ్తోంది.

యాహూ! నేనకున్నది నెరవేరింది. ఎగిరి గంతెయ్యాలన్పించింది. పక్కనే గట్టుమీద ఆన్చేసి పెట్టిన నా సెల్‍లో వస్తున్న హుషారైన పాటకి స్టెప్స్ వేస్తూ రెండు నిమిషాలు నాట్యం చేసాను.

అసలిదంతా ఎక్కడ మొదలైందంటే–

ఊరికోసం ఆ పనిచెయ్యాలి, ఈ పనిచెయ్యాలి అంటూ ఉండుండి సిటీకి వచ్చేస్తూ ఉంటుంది. అరవైదాటిన ఈ వయసులో కూడా ముసల్దానికి ఎంత ఓపికో! అన్నట్టు ముసలాళ్లని ముసలాళ్లనకూడదట కదా, పెద్దవాళ్లనాలట. గాడిద,గుడ్డేంకాదూ.

వేళకి వండి వడ్డిస్తూంటే శుభ్రంగా తిని తిరుగుతూంటుంది. నేను చేసిన పొరపాటేంటంటే మా అమ్మకి వీవర్స్ పోయింట్లో చీరలు కొన్నప్పుడల్లా ఆవిడకీ కొనడం. ఎందుకిన్ని చీరలు, డబ్బు వేస్ట్ చెయ్యకమ్మా అంటూనే సింగారించేస్తుంది. పదేసి వేలుపోసి నేను కొనుక్కునే డ్రెస్సులూ, పిల్లలకి కొనే కాస్ట్లీ బట్టలు పల్లెటూళ్లో ఏనాడూ చూసి ఉండదేమో “బట్టలు ఇంతంత ఖరీదా?” అని నోరెళ్లబెడుతుంది. అక్కడికి ఆవిడ సొంతసొమ్మేదో మేం ఖర్చుపెట్టేస్తున్నట్టు. చందు సంపాదిస్తున్నాడు. నేనూ, పిల్లలూ ఎంజాయ్ చేస్తున్నాం. అదేం చిత్రమో, ఆవిడ కడితే రెండువందల రూపాయల చీరైనా రెండు వేల చీరలా కన్పిస్తుంది.

ఆవిడ వస్తున్నట్టు ఫోనొస్తే చాలు చందు స్టేషనుకి కారేసుకెళ్లి తీసుకొస్తాడు. చెప్పినా వినడు. ఎక్కడుండేవాళ్లని అక్కడే ఉంచాలి అంటే ఆవిడని కారుల్లో తిప్పి అక్కర్లేని భేషజాన్ని నేర్పిస్తున్నాడు. ఆవిడ ఒప్పుకోకపోతే మా ప్రేమ పెళ్లి జరిగేది కాదంటాడు.

వచ్చిన మహాతల్లి పనిచూసుకుని వెంటనే వెళ్తుందా అంటే వెళ్లదు. పొరపాటున ‘ఉండు’ అంటే నెల్లాళ్లు ఉండిపోతుంది. ‘వీళ్లేదో మాటవరసకి అన్నార్లే’ అనుకోదు. నాకు ఆవిడ ఉన్నంత కాలం ఒంటి మీద తేళ్లూ, జెర్రులూ పాకుతున్నట్టుంటుంది. చందూకి చెప్పినా వినడు కాబట్టి నేనే ఒక ఉపాయం ఆలోచించేను.

ఆవిడతో ముభావంగా ఉండాలని, పిల్లల్ని కూడా వీలైనంత దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాను.

పధ్నాలుగేళ్ల నా చిన్నకూతురు నేను చెప్పినట్టే వింటుంది కానీ, బి.టెక్ చేస్తున్న నా పెద్దకూతురు తీరిక దొరికితే చాలు ఆవిడ దగ్గరచేరి కబుర్లు చెప్తూ ఉంటుంది. అందుకే ఒకరోజు దాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని “నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మీనాన్న నిన్ను కొట్టేలా చేసిందెవరో తెలుసా? ఆవిడే!” అన్నాను.

“అవునా!” అని ఆశ్చర్యపోయి చూసింది.

నిజానికారోజుల్లో ఆవిడ మా ఇంటికొచ్చేదే చాలా అరుదు. ఇంకా ఏమేం చెప్తే దానికావిడ మీద ద్వేషం పొంగిపొర్లుతుందో అవల్లా చెప్పేను. అలాంటివి జీవితకాలమంతా మరచిపోకూడదన్నాను. దాంతో కోపం వచ్చినప్పుడల్లా నేనెన్నిసార్లు చితకబాదేనో అవన్నీ మరచిపోయింది. నిజానికి చందు పిల్లల్ని కొట్టడు.

పెద్దదాని పుట్టుకకి వచ్చిన మా అమ్మమ్మ పదేళ్లపాటు మా దగ్గరే ఉండిపోయింది. రిటైరయ్యేక మా నాన్న, అమ్మ కూడా మా దగ్గరకే వచ్చేసారు. పదిహేనేళ్ల తర్వాత మేం విల్లా కొనుక్కున్నప్పుడు మా కమ్యూనిటీ గేటుకి దగ్గర్లో ఉన్న అపార్టుమెంట్స్ లో రెండు పడకగదుల ఫ్లాటొకటి తీసుకుని దాంట్లో ఉంచేం. పిలిస్తే పలికేటంత దూరమే. రోజూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చిపోతుంటారు. వాళ్లు తినేవి దంపుడు బియ్యం. అన్నం ఒకటే వండుకుంటారు. కూరలు నేనే పంపిస్తాను. కన్న తల్లిదండ్రుల్ని పెద్దవయసులో ఈ మాత్రం చూసుకోకపోతే ఎలా?

సరే, అసలు కథలోకి వస్తే,

ఆవిడ రాగానే నవ్వుతూ పలకరించబోయింది. తను తెచ్చిన పూతరేకులు, కోవాలు లాంటివి తెచ్చి వంటింట్లో పెట్టింది. ఇదివరకు ఎన్నోసార్లు బూజుకట్టించి డస్ట్ బిన్లో పడేసినా ఆవిడకి బుద్ధిరాదు. నా పిల్లలు మోడరన్ గా పెరుగుతున్నారు. పిజ్జాలు, బర్గర్లు తప్ప తినరు. నేను మొహం తిప్పుకొని పనులు చక్కబెట్టుకోసాగేను.

ఆవిడ చిక్కటి పాలల్లో ఇన్ స్టెంట్ బ్రూ కలుపుకొని కాఫీ తాగుతుంటుంది. ఆవిడ అర్థం చేసుకోవాలని నేను రూపాయి బ్రూ సాషే ఒకటి తెచ్చి స్టవ్వు గట్టుమీద పెట్టేను. ఇంట్లో ఎవరం కాఫీ, టీలు తాగం కాబట్టి మా ఇంట్లో కాఫీ పొడి, టీ పొడి ఉండవు. ఆవిడ తను తెచ్చుకున్న యాభై గ్రాముల బ్రూపేకెట్ విప్పి సీసాలో పోస్తోంది. నాకు అర్థమైపోయింది. ఈవిడ మళ్లీ పెద్ద మజిలీనే ప్లాన్ చేసుకొచ్చిందని. నాకు చివ్వున కోపం తన్నుకొచ్చింది. కాని అరిచి సాధించేదేమీ ఉండదని నాకు తెలుసు. ఆవిడలాగా మౌనంగా ఉంటూనే దేన్నైనా సాధించాలి.

పల్లె అలవాట్లప్రకారం ఆవిడకి ఉదయం ఎనిమిదికల్లా టిఫిను, మధ్యాహ్నం పన్నెండుకి, రాత్రి ఏడుగంటలకి భోజనం కడుపులో పడిపోవాలి. అక్కణ్నుంచి నరుక్కురావడం బెస్ట్ కదా. అందుకే టిఫిను పదకొండుకి, లంచ్ మూడున్నరకి, డిన్నరు రాత్రి పదికి సిద్ధం చెయ్యడం మొదలుపెట్టేను. నిజానికి సిటీలో మా ఒరిజినల్ టైమింగ్స్ కూడా అవే. ఆకలికి ఆగలేక మనిషి నాలుగో రోజుకే డీలా పడిపోయింది. చందూకి చెప్పినట్టుంది. రోజూ ఒక మిల్క్ బ్రెడ్డ్ తెచ్చి టేబుల్ మీద పెడుతున్నాడు. చందు అటు ఆఫీసుకెళ్లగానే దాన్ని నేను మేడమీదికి పట్టుకెళ్లిపోతున్నాను.

నేను చెప్పిన ప్రకారం మా చిన్నమ్మాయి ఆవిడ కూర్చుని లేచిన కుర్చీని, సోఫాని పాతగుడ్డతెచ్చి ఆవిడ ఎదురుగానే తుడుస్తోంది. ఆవిడకి జుట్టు బాగా రాలిపోతున్నట్టుంది తలదువ్వుకొని నేలమీద వెంట్రుకల్ని తీసే లోగానే అది వచ్చి ‘అమ్మా, నాకు వెంట్రుకల్ని చూస్తే ఎలర్జీ’ అని వాష్ బేసిన్ దగ్గరకి పరుగెత్తి రాని వామిట్‍ని అభినయిస్తోంది. ఒకరోజు తన హెయిర్ బేండ్ పోయిందని రోజంతా వెతికి అదేమో చూస్తానని ఆవిడ జుట్టుకి పెట్టుకున్న బేండు తీయించింది. అక్కడితో ఆగకుండా ఆవిడ బేగ్ వంపించి వెతికింది. ఆవిడ లోపలేం ఫీలవుతోందో తెలీదుకాని నవ్వుతూనే సూట్ కేస్ కూడా విప్పి చూపించింది. వంచిన కళ్లు ఎత్తి చూడలేదు.

మా కాలనీలో డ్రైనేజి పైపువర్క్ జరుగుతోంది. ఆరోజు మా ఇంటితో సహా మూడిళ్లవాళ్లకి సాయంకాలం నుంచి రేపు ఉదయం వరకు నీళ్లవాడకం ఆపమని చెప్పేరు. ఆవిడ మధ్యాహ్నం పడుకుని లేచి వాష్ బేసిన్ దగ్గరకి వెళ్లబోయింది. నీళ్లు వాడకూడదని చెప్పేను. వంటింటి టేప్ లో ఓ గ్లాసు నీళ్లు పట్టుకుని గేటుబైటికి నడిచింది. నీళ్లు పుక్కిలించి రోడ్డుమీద ఉమిసింది. నేను వెనక నుంచి “ఏంటాపని, పిల్లలు నడిచేచోట” అని అరిచేను. తుళ్లిపడి నావేపు చూసి “మరెక్కడికెళ్లను?” అంది. రోడ్డుకవతలివేపు వేలు చూపించి ఎదుటివరసలో ఉన్న నా ఫ్రెండు లావణ్య ఇంటికి నాకు బాత్రూంకి అర్జెంటై పరుగెత్తేను. నేను తిరిగొచ్చేసరికి సోఫాలో ఓమూల కూర్చుని పైటచెంగుతో కళ్లొత్తుకుంటోంది. నేను కసరడం మంచి పనైంది అని సంతోషించేలోగా ఆవిడ ఫోన్ రింగైంది. “అవును, తెలిసింది, ఎంత మంచి మనిషాయన ఎంత బాగా పలకరించేవారు. నాకు దుఃఖం ఆగట్లేదు” అని చెప్తోంది.

వయసు మళ్లిన రచయిత ఒకాయన కాలం చేసేడట. దానికీవిడ ఏడుపు. అన్నట్టు ఈవిడ కూడా కథలూ కాకరకాయలూ ఏవో గిలుకుతూ తన మాలోకంలో తనుంటుంది. ఆవిడ వచ్చిందని తెలిస్తే చాలు అభిమానులు, స్నేహితులు అంటూ ఎవరెవరో దిగిపోతుంటారు. ఇల్లేదో ఆవిడ సొంతమైనట్టు వచ్చినవాళ్లని భోజనానికి ఆపేస్తుంది. ఊళ్లో ఆవిడ ఎన్ని దానధర్మాలు చేసుకున్నా నాకనవసరం. అందుకే ఒకట్రెండు సార్లు చూసి ఆవిడెదురుగా చందూకి ఝలక్ ఇచ్చేను. “ఏంటి చందూ ఈ న్యూసెన్స్? ఇంట్లో ఉండమంటావా, మా పుట్టింటికి వెళ్లిపోమంటావా? అత్తసొమ్ము అల్లుడు ధారపోసినట్టుంది. ఆవిడకేం పోయింది. వండిపెట్టేవాళ్ల పనైపోతుంది. వయసుమీరగానే సరికాదు. ఎదుటివాళ్ల కష్టం తెలిసి మసలుకోవాలి” అంటూ. మొదటిసారి ఆవిడ ముఖం అవమానంతో పాలిపోవడం చూసి భలే ఆనందపడ్డా ను.

రాత్రి భోజనానికి ముందు నాతో నెమ్మదిగా అంది “ఈ వయసులో నేను రాత్రంతా బాత్ రూంకి వెళ్లకుండా కష్టం, రోడ్డవతల ఖాళీస్థలంలోకి వెళ్లనా?”

నేను ఎగతాళిగా నవ్వేను. “ఇదేమైనా మీ ఊరు అనుకుంటున్నారా? సి.సి. కెమేరాలున్నాయి. ఎలాగో ఆపుకోవాలిమరి” నవ్వు ఆపుకోలేక మేడమీదికి పరుగెత్తేను. దొరికింది బకరా. “ఆవిడకేదో యూరిన్ ప్రోబ్లమ్ ఉన్నట్టుంది. రాత్రికి ఆపుకోలేదట. మనబెడ్ ఎక్కడ ఖరాబు చేస్తుందో ఖర్మ!” చందూతో అన్నాను.

“పిల్లల్తోబాటు మీ అమ్మ వాళ్లింటికి పంపించకపోయావా, రాత్రికి అక్కడే ఉండేది” అన్నాడు. నేను విననట్టు అటు తిరిగి పడుకున్నాను.

ఆ రాత్రి అన్నం తినలేదనుకుంటాను. ఆవిడవంతు అన్నం కుక్కర్లో అలాగే ఉండిపోయింది. చందు కిందికి వచ్చేక ఆవిడకి కూడా విన్పించేలా విసుక్కున్నాను. “అంతంత రేట్లు పోసి కొన్న బియ్యం.వండి పారబోసుకోవడం, మరోపక్క చచ్చీచెడీ వండే కష్టం ఎవరికీ తెలీడం లేదు”

పంతానికి ఆ అన్నంలో పెరుగు కలిపి మధ్యాహ్నం ఆవిడకదే పెట్టేను.

కిందగదిలో ఉన్న పెద్ద స్ప్రింగ్ మంచం, దానిమీది ఖరీదైన ఫోమ్ పరుపు తన సొంతమే అన్నంత హాయిగా ఆవిడ నిద్రపోతూంటే నాకు కసి ఆగదు.

ఆ రాత్రి ఆవిడ తిన్న వెంటనే మంచమెక్కి నిద్రలోకి జారుకుంది. నా ప్లాను అమలు చెయ్యడానికి అదే అదను.

ఒక గిన్నెతో నీళ్లు పట్టుకెళ్లి ఆవిడ కాళ్ల సందులో వంపేసి వెంటనే వంటింట్లోకి వచ్చేసేను. నిమిషాల్లో ఆ గదిలో లైటు వెలిగింది. ఆవిడ బట్టలు దులుపుకొంటూ బైటికొచ్చింది. నేను అప్పుడే నింపిన నీళ్ల సీసాలు పట్టుకుని పైకి వెళ్లడానికి మెట్లెక్కబోతున్నాను.

“చిన్న పాప వాటర్ బాటిలేమైనా నా మంచం మీద పెట్టిందా అమ్మాయీ, నీళ్లు ఒలికిపోయాయి” అంది. తను ఒళ్లు తుడుచుకునే టవల్ తీసి దుప్పటినీ పరుపునీ గబగబా తుడుస్తోంది. నేను ఒకే ఒక్క నిమిషంలో మాచిన్నదాన్ని చెయ్యి పట్టుకుని కిందికి లాక్కొచ్చి ఆవిడ ముందు నిలబెట్టేను. “చెప్పు, నీళ్లు ఈవిడమీద ఒంపేసేవా?” అని అరిచేను.

నిజంగా కొట్టేస్తాననుకొని భయపడి అది “లేదమ్మా నేనెప్పుడొచ్చేనిక్కడికి?” అంటోంది.

“అయ్యో మాటవరసకన్నాను, పిల్లని భయపెట్టెయ్యకమ్మా, పోనీలే నీళ్లేకదా అవే ఆరిపోతాయిలే” అంది. “నీళ్లే అయితే ఫర్వాలేదు” అన్నాను ఆవిడ నడుంమీంచి కిందికి ఎగాదిగా చూస్తూ, ఒక్కసారిగా తెల్లబోయి నా వైపు అయోమయంగా చూసింది. ఎక్కడ తగలాలో అక్కడ తగిలిందనే అన్పించింది. ఆ రాత్రి ఆవిడకి నిద్రపట్టదు. నేను హేపీగా నిద్రపోయేను.

మర్నాడు చందు కిందికొచ్చేవేళకి పనమ్మాయిచేత ఆవిడ మంచం మీది దుప్పటి తీయించేసి, పరుపుని డెట్టాల్ క్లాత్తో తుడిపిస్తున్నాను. ఆవిడ హాల్లో ఓమూల కుర్చీలో కళ్లు మూసుకుని ధ్యానంలో ఉన్నట్టు కూర్చుంది. ఏమాటా పైకి తేలదు. మొదట్నుంచీ ఆవిడ బట్టల్ని వేరుగా ఉతికించి, మా బట్టల్నుంచి దూరంగా ఆరబెట్టించినా, అసలు తన బట్టల్ని ఉతికించకపోయినా ఏమీ పట్టించుకోనట్టే ఉంటుంది.

మా చిన్నదానికి ఆవిడ జానపద కథలు చెప్పడం, జియోగ్రాఫిక్ ఛానల్లో యూనిమల్స్ ని చూపించడం చేసేది. పిల్ల క్రమంగా ఆవిడకి దగ్గరకావడం మొదలుపెట్టింది. అలాంటి పిచ్చి పిచ్చి కథలు చెప్పి పిల్లను చెడగొట్టొద్దని, జంతువుల్ని చూపి భయపెట్టొద్దని వార్నింగిచ్చేను.

మరోసారి, ఊళ్లో ఆవిడకి తెలిసిన ఒకామె ఎవరో ఫోన్ చేసి హుషారుగా అరిచి చెప్తోంది. “అమ్మగారూ, మీదయవల్ల నా కొడుక్కి ఉద్యోగం వచ్చింది. లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు. పెళ్లికూడా కుదిరింది. ఇదంతా నా అదృష్టం అమ్మగారూ, మీ ఆశీర్వాదబలం” అంటూ.

“కొడుకు సంపాదన ఆమెకి అదృష్టం ఎలా అవుతుంది, అదంతా కోడలికి చెందుతుంది కదా” అన్నాను.

ఏదో చెప్పాలని నోరు తెరిచింది కానీ చెప్పలేక గుటకలు మింగింది.

పిల్లలు ఎగ్జిబిషన్‍కి వెళ్దామని సరదాపడుతుంటే బయలుదేరేం, ఆవిడెప్పుడూ మడత నలగని చీరలో ప్రెష్ గా ఉంటుంది. కాబట్టి చందు పిలవగానే వచ్చి కారెక్కింది. ఒకసారి ఏదో మూవీకి ఆవిడనీ తీసుకొస్తానంటే నేను మానేస్తానన్నాను. అప్పట్నుంచి చందు రమ్మన్నా ఆవిడ మాతో బైటికి రాదు. ఇవాళ మాత్రం “నేను చెప్పులు కొనుక్కోవాలి, ఊళ్లో చుట్టుపక్కల పిల్లలకి హెయిర్ క్లిప్స్ కొనాలి” అంది చందుతో.

చందు మమ్మల్ని ఎగ్జిబిషన్ గేటు దగ్గర దించేసి తన పనిమీద వెళ్లేడు. లోపలికెళ్తూనే ఒకషాపుముందు స్టూలు చూపించి “మీరు నడవలేరు. ఇక్కడ కూర్చోండి” అన్నాను. అక్కడికి దగ్గర్లో చెప్పులు, హెయిర్ క్లిప్స్ లేవు. రెండు గంటల తర్వాత మేం తిరిగి వచ్చేసరికి ఆవిడ అక్కడే కూర్చుని దిక్కులు చూస్తోంది. దాహం వేసి కొనుక్కున్నట్టుంది చేతిలో సగం తాగిన వాటర్ బోటిల్ ఉంది. నాలుగడుగులు నడిచేక చెప్పు సవరించుకుంటూ బోటిల్ పట్టుకోమని నా చిన్నకూతురు కిచ్చింది. వెంటనే దాని చేతిలోంచి నేను ఆ బోటిల్ తీసుకుని నేలమీద పెట్టి ఫట్ మని ఫుట్ బాల్ ని తన్నినట్టు ఒక్కతన్ను తన్నేను. అదెళ్లి ఎక్కడో పడింది. అంతరంగంలో ఆవిడకా తన్ను నడుం మీద తగిలి ఉంటుంది. బాధతో మొహం క్షణాల్లో వడిలిపోయింది.

దారిలో మాచెల్లెలి ఇంటిదగ్గర ఆగి వాళ్లకి కొన్ని చెప్పుల జతలు, హెయిర్ క్లిప్స్ ఇచ్చేను ఆవిడ చూడాలని. గమనించనట్టే కూర్చుంది. మా చెల్లీ వాళ్లతో నవ్వుతూ మాట్లాడింది.

ఆవిడ ప్రయాణం రేపనగా చందూని ప్రిపేర్ చేసి కిందికి తీసుకొచ్చేను. చందూని ఎక్కడ నొక్కిపెట్టాలో నాకు తెలుసు. పిల్లలు అతని గొప్ప వీక్ నెస్, వాళ్ల మెడ మీద చాకు పెట్టేనంటే ఏం చెప్పినా వింటాడు. థేంక్స్ టు టి.వి. సీరియల్స్.

ఆవిడ టి.వి. లో న్యూస్ ఒక్కటే చూస్తుంది. ఆ టైంలో నేనొచ్చి ఛానల్ మార్చేస్తాను. ఆవిడ లేచి గదిలోకెళ్లిపోతుంది. దీన్ని చందూకి ఎలా చెప్పాలో అలా చెప్పి తీసుకొచ్చేను. నేను ఛానల్ మార్చగానే ఆవిడ లేచి వెళ్లబోయింది. “ఎందుకెళ్లిపోతున్నావ్, కూర్చో” అని చందు అసహనంగా అరిచేడు. ఆవిడ చందువైపు షాక్ తిన్నట్టు చూసి తిరిగి సోఫాలో కూలబడింది. నాకు తెలుసు ఆవిడ వీక్ నెస్ చందు అని. అందుకే అట్నుంచి నరుక్కు రావడం.

నేను టి.వి. ని మ్యూట్లో పెట్టేను.

“నువ్వు రోజూ ఇలాగే చేస్తున్నావట. తను రాగానే లేచెళ్లిపోవడం, దానికి తను ఎంత బాధపడుతోందో తెలుసా?” అన్నాడు. ఆవిడ నావైపు అయోమయంగా చూసింది.

“ఈ విల్లా కొన్నాక రమకి మేం నలుగురం తప్ప ఇంకెవరున్నా నచ్చడం లేదు. అందుకే తన పేరెంట్స్ ని కూడా వేరే ఇంట్లో పెట్టింది. నువ్విలా వచ్చినప్పుడల్లా తను చాలా డిస్టర్బ్ అయిపోతోంది. అయినా నీకోసం అన్నీ చేస్తోంది. ఆ ఇరిటేషన్ కి తన హెల్త్ పాడైపోతుందేమోనని భయం వేస్తోంది. నీకు ఇక్కడే ఉండాలన్పిస్తూంటే చెప్పు. అక్కడ నువ్వున్న ఇల్లు, నీపేర ఉన్న అరెకరం భూమి అమ్మేసి ఇక్కడే ఒక సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ కొంటాను. నీకు ఎలాగూ ఫేమిలీ పెన్షను వస్తుందికదా అది నీ ఖర్చులకి సరిపోతుందనుకుంటాను. చాలకపోతే ఏమైనా అవసరం పడితే నేనిస్తాలే” అన్నాడు. ఒకప్పుడు “ఈ కింది బెడ్రూం మేం వాడటం లేదులే, నీకిష్టం వచ్చినన్ని రోజులు ఉంటూ ఉండు” అన్న చందూనే.

ఆవిడ పెదవులమీద నవ్వుకాని నవ్వొకటి కదలాడింది.

“చందూ నేను తిండికి లేక నీ ఇంటికి రావడం లేదురా, మిమ్మల్ని చూడాలని మనసాగక వస్తున్నాను. నిజానికి రమ, పిల్లలు నా నుంచి అంత దూరంగా ఉంటున్నందుకైనా నేనీ ఇంటికి రాకూడదు, నాకు తెలుసు. ఏంటో వెర్రి మనసు, చెప్పినా వినదు, నాకీ వయసులో ఈ ఒంటరి జీవితంలో కొత్త ఇల్లు, తెలీని మనుషుల మధ్య జీవితం అవసరమా? నీది ఎంత పెద్ద విల్లా అయినా నాదిక్కడ స్వతంత్రం లేని జైలు జీవితమే. దానికి తోడు ఎన్నెన్ని అవమానాలు! నేను రమని ఏమీ తప్పుపట్టను. ఆ అమ్మాయి సంస్కారం అది. నిన్ను కన్నప్పుడు పడ్డ మూడు రోజుల బాధ, నా ప్రాణం పోయినా నిన్ను బతికించమని డాక్టర్లను వేడుకున్న క్షణాలు, ఆ రోజుల్లో బడిపంతులుకి వచ్చే కొద్దిపాటి జీతంతో మరో బిడ్డపుడితే నీకు న్యాయం చెయ్యలేమేమోనని మేం తీసుకున్న నిర్ణయం, నీమీదే ప్రాణాలు నిలుపుకొన్న ఒక తెలివి తక్కువ తనం – అవును తెలివితక్కువ తనమే. ఎదుటివాళ్లని ఆత్మన్యూనతకి గురిచేసి సంతోషించడం- ఇదా, నేను నీకు నేర్పిన సంస్కారం? మా బాధ్యత తీర్చుకున్నాక మిమ్మల్ని వదిలెయ్యాలని, మేం మీకు భారం కాకూడదని తెలుసు. ఆర్థికంగా వెలుసుబాటు లేని పెద్దవాళ్లు రోడ్డున పడుతున్నారనీ తెలుసు. ఇంకెప్పుడూ మీ ఇంటికి రానులే. బాధపడకమ్మా రమా! ఇల్లు మీ నలుగురికే పరిమితమని ముందే తెలిస్తే వచ్చేదాన్నికాదు, నువ్వు ఏ నాడూ అత్తమ్మా అని పిలవనప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాలి కదా! నిజానికి నా వయసు వాళ్లు ధైర్యంగా ఉండాల్సింది ఇలాంటి సందర్భాల్లోనే” ఆ కళ్లల్లో ఊరుతున్న నీటిని బలవంతంగా ఆపుకొంటోంది. “మీ ప్రవర్తనలేవీ బైటికి చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతూ కూడా మీగురించి గొప్పగా చెప్పుకొంటున్న జనరేషన్ మాది” అంది.

“అదికాదు, ఈ వయసులో నువ్వక్కడ ఎప్పుడెలా ఉంటావో అని కన్‍సర్న్” నీళ్లు నములుతూ చందు ఏదో చెప్పబోయాడు, వినకుండా ఆవిడ లేచి గదిలోకెళ్లిపోయింది.

థేంక్ గాడ్, ఇంకో నాలుగేళ్ల తర్వాత ఈవిడకి కాలో చెయ్యో వంగితే చాకిరీ ఎవడు చేస్తాడు?

ట్రెయినుకింకా రెండు గంటల టైముందనగా చందు కారు బైట పెట్టేడు. ఎప్పట్లాగే ఆవిడ పిల్లలిద్దరికీ చెరో ఐదువేలు చేతుల్లో పెట్టింది.

ఆవిడ కారెక్కబోతూండగా గంట క్రితం వచ్చి ఇంట్లో ఉన్న మా అమ్మ బైటికొచ్చి, “బాబూ చందూ, ఆవిడగార్ని ఎమ్.ఎమ్.టి.ఎస్. ఎక్కించేసి వచ్చెయ్ నాయనా! పెద్ద స్టేషను వరకూ వెళ్లకు. నువ్వసలే ఆకలికి ఆగలేవు” అంది.

వెనక్కి తిరిగి చూసి నవ్వీ నవ్వక నవ్విన ఆవిడ పెదవుల మీద విరిసిన భావమేమిటో నాకు అర్థం కాలేదు.

ఆ! ఏమిటైతే మనకెందుకులే?

నాకేం భయం? నేను ఆడపిల్లల తల్లిని.

థేంక్ గాడ్!