చెరువు పక్కనున్న ఖాళీ జాగాలో మేతకు పశువుల్ని తీసుకెళ్లాడు సూరీడు. పచ్చిగడ్డి పరకలను తెంపుకుంటూ వాటిమానాన అవి మేస్తూ ఉంటే లక్ష్మితో కబుర్లకు కూర్చున్నాడు వాడు. చెరుగ్గడలు నమిలి తింటూ ఇద్దరూ నిన్న చూసిన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.

హీరో ఫైటింగులు దుమ్ము లేపేశాడని వాడన్నాడు.

‘ఆడి ముఖం. కొండముచ్చుకి కోటేసినట్టున్నాడు. ఈరోయిన్నుసూసేవా, ఎంతందంగా ఉన్నాదో. డ్యాన్సులయితే మరి సెప్పే అక్కర్నేద్దు. ఆయమ్మిని సూణ్ణానికే ఎల్తన్నారు జనాలు..’

‘చెస్, నెగేస్. ఏటున్నాది ఆయమ్మిలోన? ఇదో ఈ చెరువువార సెట్టుక్కాసిన మునక్కాయనాగున్నాదిగాని ఆడదాన్నాగుందేటి? రెండీతలకే సచ్చిపోద్దది. అదే ఈరోను సూడు, ఇంతింత లావు కండలూ ఆడూనూ. సూత్తేనే కష్టం సేసుకు బతికీవోడని తెలస్తన్నాది కాదేటి..’ అన్నాడు.

ఇంకా జట్టీ తెగేది కాదు.

లక్ష్మి చేతిలోని చెరుగ్గడతో వాణ్ని కొట్టింది. ఫట్ మని తగిలింది దెబ్బ.

‘అబ్బా’ అంటూ విదిలించాడు సూరీడు.

ఆ విదిలింపుతో తెలివొచ్చేసింది. ఉలిక్కిపడి చుట్టూ చూసుకున్నాడు. చెరువు లేదు, చెరువులో నీళ్లు లేవు, చెరువువారన ఖాళీ జాగా లేదు, అక్కడ తాను లేడు, లక్ష్మి అసలే లేదు.

తానున్నది పల్లెటూళ్లో కాదు, నగరంలో.

తల తిప్పి చూస్తే అక్కడున్నవి ఆవులూ ఎడ్లూ గేదెలూ దున్నపోతులూ కానేకావు. ఒకవైపు మోపెడ్లు, మరోవైపు కార్లు.

పైకి చూస్తే కనిపించింది ఆకాశంలో చుక్కలు కావు. అపార్ట్మెంట్ సెల్లారు లైట్లు.

తగిలింది లక్ష్మి విసిరిన చెరుగ్గడ కానేకాదు. పేపరబ్బాయి విసరగా పొరపాటున తగిలిన ఆనాటి పేపరు. (పొరపాటునేనా?)

దెబ్బ తగిలిన చోట చేత్తో రాసుకుంటూ లేచి నిలబడ్డాడు సూరీడు.

తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయంటారు.

తన కల నిజమవుతుందా?

ఊరుండి, ఊరు పక్కన చెరువుండి, చెరువులో నీళ్లుండి, కింద పొలాలు పండి, పశువులుండి, వాటికి మేత ఉండి, తనతో మాట్లాడటానికి పక్కనే లక్ష్మి ఉండి… ఇవన్నీ ఉండి ఉంటే తానెందుకు ఊరొదిలి వస్తాడు, ఈ అపార్ట్ మెంట్లో వాచ్ మేనుద్యోగంలో ఎందుకు కుదుర్తాడు?

అది కల. నిజమయ్యే అవకాశం లేని కల.

కనీసం కలలోనైనా వాటిని అనుభవించగలిగినందుకు వాడికి సంతోషమనిపించింది. కలొచ్చిందంటే అంతసేపు పడుకున్నాడనే కదా. ఊర్నుంచి వచ్చిన దగ్గర్నుంచి నిద్రకు కరువుగానే ఉంది వాడికి.

ఏ పూటా కంటి నిండా నిద్ర పోవడానికి కుదరదు.

ఆ మాట అనుకోగానే వాడికి చిన్నప్పుడు పచ్చ కామెర్లకు తిన్న పసరు మందు చేదేదో గుర్తొచ్చింది.

కడుపు నిండా తిండి.. దాని మాట సరేసరి. మనసు తీరా మాట్లాడ్డానికి లక్ష్మి.. లేనేలేదు. కనీసం రెప్ప వెయ్యడానికి నోచుకోని బతుకూ ఓ బతుకే?

ఇవన్నీ వాడి బుర్రలో గిరగిరా తిరిగాయి. నోట్లో ఏదో తిట్టుపదం ఊరింది. బయటికనలేదు.

‘పొద్దున్నే నారాయణా గోవిందా అనుకోకుంటా ఏటా లేవడం’ లక్ష్మి ఉంటే తిట్టేది.

ఏది ఉదయమో ఏది మధ్యాహ్నమో ఏది సాయంత్రమో ఏది రాత్రో – ఏది తెలుస్తోందిగనక?

పేపరువాడు విసిరితే పొరపాటున తగిలి సూరీడు లేచాడుగాని ఆకాశంలో సూర్యుడు రావడానికింకా గంటకు పైగా సమయముంది.

ఉదయం 5 గంటలు

505 వాళ్లమ్మాయికి పెళ్లి కుదిరింది. ఎన్ని షాపులు తిరిగినా ఆమెకు రిసెప్షన్ కు వేసుకోవలసిన ఘాగ్రా ఛోళీ కుదర్లేదు. తండ్రి ఇవ్వజూపిన బరువు ఎక్కువ కాబట్టే తగిన వరుడు కుదిరాడుగాని, తన బరువుకు వరుడు కాదుగదా, ఘాగ్రా కూడా దొరకదని ఆ పిల్లకు అర్థమయ్యింది. ఉదయాన్నే జాగింగుకు బయల్దేరింది. లిఫ్ట్ లో కిందికి దిగింది.

‘దయచేసి తలుపు ముయ్యండి, ప్లీజ్ క్లోజ్ ద డోర్…’ లిఫ్ట్ ఆమెను హెచ్చరించింది.

‘సూరీ గేటు తాళం తియ్యి…’ ఆమె సూరీడిని హెచ్చరించింది.

‘వచ్చే, వచ్చే..’ సూరీడు గేటు తాళం తీశాడు. ఆ అమ్మాయి చేతికున్న ఫిట్ బిట్ సెట్ చేసుకుంటూ వెళ్లిపోయింది.

సూరీడు చీపురు పట్టుకుని ఐదో ఫ్లోరుకు వెళ్లాడు. తుడవడం మొదలెట్టాడు. అందరూ లేవకముందే తన తుడవడం పూర్తికావాలి. ఎవరైనా లేచి చూశారంటే ‘శనిలాగా పొద్దున్నే చీపురుతో ఎదురొస్తావేంటి’ అని తిట్టుకుంటారని వాడికి తెలుసు.

ఐదంతస్తులూ తుడిచి కిందకు వచ్చేసరికి గంట పడుతుంది. నడుము లాగేస్తూ ఉంటుంది. కాస్త టీ తాగుదామని నీళ్లు పొయ్యిమీదకి ఎక్కిస్తాడు. నిద్ర లేకపోవడం మూలాన కళ్లు ఎర్రగా ఉంటాయి, మండుతూ ఉంటాయి.

ఉదయాన్నే వాకింగులకు బయల్దేరే మగాళ్లు, ఆడాళ్లు. పెద్దవాళ్లు, కుర్రవాళ్లు.

ఉదయం 6.30

వాడుకగా పాలపేకెట్లు వేయించుకుంటారు కొందరు, మరికొందరు ఇప్పటికీ పాలవాళ్లకు చెప్పి పోయించుకుంటారు. ఎవరినీ అపార్ట్ మెంట్ లోపలికి వదలడానికి వీల్లేదు. అందరినీ చూడాల్సింది సూరీడే. అతను అన్నీ పోగుచేసుకుని, ఏ ఇంటికి ఎన్ని పేకెట్లో, ఏ కంపెనీవో చూసి ఆరున్నర లోపే ఇచ్చెయ్యాలి. అప్పటికీ కొందరు అమ్మగార్లు, అయ్యగార్లు గునుస్తూనే ఉంటారు, ‘ఇంతసేపు అయిందేం, కాఫీ పడకపోతే బండి నడవదని తెలీదా…’ అంటూ.

వచ్చిన కొత్తలో సూరీడికి ‘అయ్యో’ అనిపించేది. ఇప్పుడు ఏమీ అనిపించడం లేదు. పైగా తాను పొయ్యి మీద పడేసిన టీ పొడి గుర్తొస్తుంది. కిందకెళ్లి రెండు చుక్కలు నోట్లో పోసుకుంటాడో లేదో, పైనుంచి పూజలు మొదలవుతాయి.

సూరీడికి ఆ శబ్దం చెవుల్లో గుయ్( మన్నట్టు ఉంటుంది.

దానికితోడు లిఫ్ట్ శబ్దం ఒకటి. ‘ప్లీజ్ క్లోజ్ ద డోర్…’ అంటూ మొత్తుకుంటూనే ఉంటుంది, పైకి కిందకీ అవిరామంగా తిరుగుతూనే ఉంటుంది.

‘దీనికీ నాకూ తేడా ఏటీ?’ అని వాడి ఆలోచన.

ఉదయం 7

కొన్ని ఫ్లాట్లలోంచి గణగణమంటూ గంటలు, ఒకటో రెండో చోట్ల జుమ్మంటూ శంఖనాదాలూ వినిపిస్తాయి. వాళ్లు పూజలకు పువ్వులు బజార్లో కొనితెచ్చుకుంటారు. మరికొందరు మాత్రం అపార్ట్ మెంట్ ముందు వేసిన మొక్కలనుంచే కోసివ్వమంటారు. ఆ డ్యూటీ సూరీడిదే.

కొందరికి నందివర్థనాలు, కొందరికి దేవగన్నేరు. కొందరికి రాత్రి రాలిపడిన పారిజాతాలు.

పువ్వులను ప్లాస్టిక్ బుట్టల్లోకీ, లేదా పాలిథిన్ కవర్లలోకీ వేస్తున్నప్పుడు సూరీడికి మళ్లీ తమ ఊరి చెరువు, చెరువులో అవతలి గట్టుకు దగ్గరగా పూసిన కలవపూలూ గుర్తొస్తాయి. ఉదయం ఈతకెళ్లి వాటిని కోసి ఆకుల్లో పెట్టి తీసుకొచ్చి పూజారిగారికిస్తే ఎంత సంతోషించేవాడు? ‘సూరిగా తప్పకుండా నీకూ లక్ష్మికీ పెళ్లవుతుందిరా’ అని నవ్వుతూ దీవించేవారు. ఇక్కడ పాలిచ్చినా, పూలిచ్చినా ఎవ్వరూ వాణ్నేమీ దీవించరు.

కొన్ని ఫ్లాట్లకు పనిమనుషులు రావడం మొదలవుతుంది.

ఉదయం 8

స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే పిల్లలు ఒక్కొక్కరుగా బయల్దేరుతారు. కొందరు ఆటోల్లో, కొందరు స్కూలు బస్సుల్లో, కొందరు సొంత వాహనాల్లో. ఒక్కోటీ రావడం బయ్యిమంటూ హారన్ కొట్టడం ఈ పిల్లలు అందులో ఎక్కి వెళ్లిపోవడం. వాచ్ మేనుగా చేరిన మొదట్లో ఆ దృశ్యం చూడటానికి గేటు దగ్గర నిలబడేవాడు సూరీడు. ముద్దుగా పొద్దుతిరుగుడు పువ్వుల్లా తయారయిన పిల్లలు నడుచుకుంటూ వెళ్లి ఆ వాహనాలను ఎక్కుతూ ఉంటే చూడటం బాగుండేది. ఊళ్లో తానూ సావాసగాళ్లూ జట్టుగా తుళ్లింతలాడుతూ ఆవులను తోలుకెళ్లే తొలి ఉదయాలు గుర్తొచ్చేవి.

కాని పోనుపోను, ఈ స్కూలుకెళ్లే పిల్లల్లో ఆ దినుసేదో కనిపించలేదు వాడికి. వాళ్లందరినీ క్షేమంగా ఎక్కించడం వాడి పూచీనే. ఆ తర్వాత ఒప్పుకొన్న బళ్లు, కార్లు తుడిచే పనిలో పడతాడు.

ఉదయం 9

కొందరు అయ్యగార్లు, ఇంకొందరు అమ్మగార్లు కూడా ఆఫీసులకు బయల్దేరతారు. ఆపాటికి వాళ్ల వాహనాలను తుడిచి శుభ్రంగా ఉంచాలి. ఎడతెరిపి లేకుండా లిఫ్టు పైకి కిందకి తిరుగుతూనే ఉంటుంది. ఎవరైనా అర నిమిషం వెయ్యకపోతే హెచ్చరిస్తుంది ‘దయచేసి తలుపు వెయ్యండి, ప్లీజ్ క్లోజ్ ద డోర్’ అని.

ఉదయం 10

స్నానం చేసి ఒక ఊదొత్తు వెలిగించుకొని వేంకటేశ్వరస్వామి పటం ముందు గుచ్చి దండం పెట్టుకుంటాడు సూరీడు. కళ్లు కరకరమంటూనే ఉంటాయి. కడుపులో ఇంత పడినా పడకపోయినా కళ్లకింత నిద్ర కావాలనిపిస్తోంది వాడికి.

రాజమండ్రి సైడు నుంచి వచ్చి సైకిలు మీద ఇడ్లీలు, అట్లు పెట్టుకుని తిరుగుతూ అమ్మేవాళ్లున్నారు. వాళ్ల దగ్గర రోజూ ఏదోకటి కొనుక్కుంటాడు పది రూపాయలిచ్చి. తిన్నాననిపించాడు. పనిమనుషులు వెళ్లిపోతారు, ఒకరోఇద్దరో వచ్చే వేళ అది.

ఉదయం 11

అప్పటిదాకా హోరెత్తిపోయిన అపార్ట్మెంట్ ఆపాటికి కాస్త నెమ్మదిస్తుంది.

ఊళ్లో దసరాలకు ఒకడు నల్లబట్టలేసుకుని తాటక వేషం వేసేవాడు. పిల్లలను భయపెట్టి, పెద్దవాళ్లు రూపాయో రెండో ఇస్తే పుచ్చుకుంటూ ఆ పదిరోజులూ అట్టహాసం చేసేవాడు. కాని వాడు కూడ పిల్లలంతా బడిలోకి వెళ్లాక చూసుకుని బడ్డీ దగ్గర ఆ తాటక ముసుగు తీసేసి గోలీ సోడా తాగేవాడు. ఈ అపార్ట్మెంట్ ఉదయం పదకొండుకు – ఆ తాటక వేషం వేసుకున్నవాడిలాగా అనిపిస్తుంది సూరీడికి.

ఆ సమయంలో లిఫ్టుకు కాస్త విరామం దొరుకుతుంది. సూరీడికి కాదు. అందరూ వెళ్లారనుకుంటే ఇక అమ్మగార్లు పనులు చెప్పడం మొదలుపెడతారు.

‘కూరలమ్మి వస్తుంది. నాలుగు కట్టలు పాలకూర, అరకేజీ బీరకాయలు తీసుకో…’

‘నేను బయటకెళుతున్నా, మా అత్తగారు వస్తారు తాళాలివ్వు…’

‘పండు సైకిలుకు గాలి తగ్గిపోయిందట, కాస్త చూసి గాలి కొట్టి పెట్టు…’

‘కేబులు వాడికి ఫోన్‍ చెయ్యి….’

‘నిన్న ఆరేసిన బట్టలు పక్క ఖాళీ జాగాలోకి పడిపోయాయి, అవి తెచ్చిపెట్టు…’

‘కొంచెం ఈ బట్టలు నర్సింగుకు ఇస్త్రీకిచ్చేస్తావా…’

‘టామీకి స్నానం చేయించాలి, కొంచెం సాయం చెయ్యి…’

తనకు వంద చేతులున్నట్టు, వంద రకాల పనులు చేస్తున్నట్టు అనిపిస్తుంది సూరీడికి. ఎండ ఎక్కుతున్నకొద్దీ, మారుతున్న వేడిని బట్టీ, ఊళ్లో ఆ సమయానికి తానేం చేసేవాడో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఉదయం సాయంత్రంగా ఎలాగ, ఎప్పుడు మారిపోతుందో తెలియదు.

రోజంతా స్విగ్గీ, జొమాటో కుర్రాళ్లు. అమెజాన్, ఫ్లిప్ కార్టుల కుర్రాళ్లు. నిరంతరం ఏదోకటి తెస్తూనే ఉంటారు. ఎవరో ఒకరికి డెలివరీ చేస్తూనే ఉంటారు. ‘అందరూ రోజూ కూరలూ కొంతారు, సరుకులూ కొంతారు, గ్యాసులూ వత్తాయి, అందరిళ్లలోంచీ చియ్…. అని కుక్కరు సౌండ్లూ ఇనపడతాయి, అయన్నీ ఎవురు తింతారు, మళ్లియన్నీ ఎవురికోసం?’ కొత్తలోనే కాదు, ఇప్పటికీ సూరీడికి ఆశ్చర్యమే.

‘రోజూ ఏటి కొనేత్తారో, బయటా, కంప్యూటర్లలోనా…’ వాడికి డౌటు.

వచ్చిన కొత్తలో ‘వాచ్ మేన్’ అంటే ఓ స్టూలు వేసుక్కూర్చుని వచ్చిపోయేవాళ్లని కనిపెట్టుకుని అపార్టుమెంటుకు కాపలా ఉండటమనే అనుకున్నాడు సూరీడు. ఊరుమ్మడి పాలేరుగా బతకడమని అనుకోలేదు. వచ్చినవీ రానివీ పనులు చెయ్యడమనీ అనుకోలేదు.

ఎంత చేసినా, మధ్యాహ్నం కాస్త కునుకు తియ్యగలనని అనుకున్నాడు. అదీ కుదరని పని అని తెలిసిపోయింది.

నెమ్మదిగా నిద్రాదేవత వరానికి వాడు దూరమయిపోతూ వచ్చాడు.

‘ఎప్పుడు చూసినా కళ్లెర్రగా ఉంటాయి, సరిగ్గా నడవడు, ఎప్పుడూ ఏదో ఆలోచనే… తాగుతాడో ఏమిటో ఖర్మ…’ అదీ వాడి వెనుక అపార్టుమెంటు వాళ్లనుకునే మాటలు.

సాయంత్రం 5 గంటలు

గోధూళి రేగే సాయంత్రాలు, పిట్టలు గూళ్లకు చేరే వేళ, పిల్లలు బళ్ల నుంచి ఇళ్లకొచ్చి వీధుల్లో ఆటలు, కూలి పనుల నుంచి వచ్చిన ఆడవాళ్లు చితుకులు రాజేసే శబ్దాలు, అన్నం ఉడుకుతున్న వాసన, మగవాళ్లు ఒకరోఇద్దరో తాగి వస్తే గొడవ – అబ్బో ఊళ్లో సాయంకాలమైందంటే సందడేసందడి.

అందువల్ల వచ్చినకొత్తలో సూరీడు నగరంలో కూడా ఆ వేళలో అపార్టుమెంటు పిట్టలున్న తోపులాగా మారుతుందేమోనని చూశాడు. మధ్యాహ్నం మూడు నుంచీ ఒక్కో ఫ్లాటు పిల్లలూ బడి నుంచి వెనక్కి వస్తారు. కొందరు పిల్లలు వచ్చేసరికి రాత్రి తొమ్మిదవుతుంది. ఉదయం ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిది వరకూ చదువుతున్నారంటే మరి పెద్ద చదువులే అయ్యుండాలి.

కాని వాళ్లొచ్చేటప్పుడు చూస్తే మాత్రం వాడి కడుపులో ఉడికిపోయినట్టవుతుంది.

వాళ్లు ఎలాగ వస్తారని? తోటకూర కాడల్లాగ.

వాడి ఊళ్లో ఒళ్లు తెలియనంత జ్వరం వచ్చి తగ్గిన తర్వాతో, దెయ్యం పట్టి విడిచిన తర్వాతో మాత్రమే పిల్లలు అలా ఉంటారు. ఏదైనా కొత్త విషయం నేర్చుకున్న పిల్లలు అలా వస్తారా?

ఊళ్లో గేదెనెక్కడం నేర్చుకున్న రోజు, సైకిలు తొక్కడం నేర్చుకున్న రోజు, దుక్కి దున్నడం నేర్చుకున్న రోజు, ఒక్కవరసలో గీతగీసినట్టు నాట్లు వెయ్యడం, చెయ్యి కోసుకోకుండా పైరు కొయ్యడం నేర్చుకున్న రోజు – ఎన్ని రోజులని? ఎంత సంబరమని? తాను కూడా పెద్దవాడయ్యాడని. తాను కూడా పెద్దవాళ్లలాగా అన్నీ చెయ్యగలడని. తానొక్కడే కాదు, సావాసగాళ్లలో ఎవరికేది వచ్చినా ఆ రోజు అందరికీ హుషారే.

మరి, వీళ్లు అలాగ రారేం?

సాయంత్రం 7. 8. 9

రాత్రి 10. 11. 12

అర్ధరాత్రి 1. 2. 3. 4

ఏవేవో పనులు. ఎంతెంతో దూరాలు. ఎక్కడెక్కడికో ప్రయాణాలు. అర్థరాత్రి అపరాత్రి అని లేదు.

212లో ఉండే ఇద్దరమ్మాయిలు క్యాబ్ పట్టుకుని రాత్రి తొమ్మిదికొస్తారు. ఫైవ్ఒన్ టూ ఫ్లాటమ్మగారు ఫ్లైటు దిగి రాత్రి పన్నెండుకొస్తుంది. టూనాట్‍ఫోరాయన బాగా తాగి మూడింటికొస్తాడు. ఫోర్ఒన్ ఫైవ్ వాళ్ల కుర్రాడు పబ్బుకెళ్లి ఉదయం నాలుగుకొస్తాడు. మరో ఫ్లాటాయన నైట్ డ్యూటీకెళ్లి నాలుగున్నరకొస్తాడు.

ఎవరు వచ్చినా గేటు తాళం తియ్యాలి. మళ్లీ వెయ్యాలి. లిఫ్ట్ శబ్దం భరించాలి. ‘ప్లీజ్ క్లోజ్ ద డోర్.. దయచేసి తలుపు వెయ్యండి…’

‘ఛస్… నెగేస్.. ఇదొకతి నా పేణానికి…’ ఎవరిమీదా చూపించలేని విసుగు లిఫ్టు మీద.

సూరీడి కళ్లు కరకరమంటుంటాయి. ‘దయచేసి రెప్ప వెయ్యండి…’ అన్నట్టు వినిపిస్తుంది వాడికి.

నిద్ర…. నిద్ర…. నిద్ర….. కావాలి. అదొక్కటే కోరిక.

మర్నాడుదయం తెల్లారుతోంది. సమయం 5 గంటలవుతోంది.

505 వాళ్లమ్మాయి ట్రాక్ సూట్ వేసుకుని షూలేసులు బిగించి కట్టి కిందకొచ్చింది.

‘సూరీ, గేటు తాళం తియ్యి…’

తాళం వెయ్యని గేటు అక్కడే ఉంది. సూరీడెక్కడున్నాడు?

ఊరికెళ్లే బస్సులో చివరి సీట్లో కూర్చొని ఉన్నాడు. నగరం పరిధి దాటాక చల్లటిగాలి కిటికీలోంచి ముఖానికి తగులుతుంటే కళ్లు మూసుకుని నిద్రపోతున్నాడు. కలలు కూడ దూరలేని గాఢమైన నిద్రలో ఉన్నాడు. ఊరొచ్చేకే బస్సు దిగుతాడు.