కొవ్వూరు వైపున గుంకుతున్న సూర్యుడి మీదున్న మబ్బుతునక. గోదారిని విడిచిపెట్టలేక; విడిచిపెట్టక చేసేది లేక అలుముకున్న బెంగలాగుంది. అటు వైపు నుంచి తాకుతున్న వాలు కిరణాలతో ఎర్రబారిన కెరటాలు. ఇష్టమైన మగవాడు మెత్తగా నిమిరినప్పుడు సిగ్గుతో కందిన ఆడదాని బుగ్గల్లా ఉన్నాయి. మొన్న పొద్దున్న పుష్కరాలరేవులో షాంపూతో తలస్నానం చేశాక మిలమిల మెరిసిన లక్ష్మి చెంపలు జ్ఞాపకమొచ్చాయి నాకు. వంటి రంగు నలుపైతేనేం, ఓ కాలు చచ్చుబడితేనేం, నాలాగే బిచ్చమెత్తుకుని బతుకుతుంటేనేం. పున్నమి వెన్నెల్లో గోదారిలా, రంగురంగుల కరెంటు లైట్ల కాంతి పడుతుండగా వింతగా మెరిసే జల్లుస్నానఘట్టపు ధారల్లా దాని ముఖంలోని కళే వేరు. అది గుర్తుకు రాగానే గుండెల మీద బరువైన మల్లెల బుట్ట పడ్డట్టయింది. ఎవరో ముసిలావిడ వేసిన రెండురూపాయల బిళ్లలోనూ లక్ష్మి ముఖమే కనిపించింది.

వారం రోజుల క్రితం ఊర్వశీ హాల్లో సినిమా చూసినంతసేపూ తెర మీద హీరోయిన్‌ ముఖంలో నాకు కనిపించిందీ లక్ష్మి ముఖమే. కరెక్టుగా గుర్తు లేదు గానీ, ఆరేడునెలలుగా పుష్కరాలరేవు మెట్ల మీద కూర్చుని అడుక్కుంటున్నా, కోటగుమ్మం సెంటర్లో సుబ్బాయమ్మ చేపల పులుసుతో పెట్టే భోజనం తింటున్నా, బీడీ కాలుస్తున్నా, ఎప్పుడైనా చీప్‌ లిక్కర్‌ తాగుతున్నా, వరద గోదారి కెరటాల్లా మనసు నిండా లక్ష్మి జ్ఞాపకాలే. ఏ ముహూర్తాన అదంటే ఇష్టం పుట్టిందో గానీ, అప్పట్నుంచీ ఆలోచనలన్నీ పుష్కరాలప్పుడు గోదారి రేవులకు క్యూ కట్టిన జనంలా దాని వైపే నడుస్తున్నాయి. నా బతుకునావకు తీరం ఆమేననీ, లంగరు ఆమె ప్రేమేననీ అనిపిస్తోంది. అదేమో నన్నసలు ఓ మగాడిగా కాదు కదా, సాటి ముష్టివాడిలా కూడా చూసినట్టుండదు. బిచ్చం పడే టైమయిపోయి, బువ్వ తినేసి, పడుకోవడానికి ఆనం కళాకేంద్రం వెనక వీధిలో దామెర్ల రామారావు ఆర్ట్‌ గ్యాలరీ దగ్గర ఫుట్‌పాత్‌కు వెళ్లే సమయంలో ఎప్పుడైనా పలకరించాలని ఆశపడ్డా ఆ కిట్టిగాడితో వికవికలూ, పకపకలాడుతూ, వాడిని అంటిపెట్టుకుని డెక్కుతూ నడుస్తుందే తప్ప నన్ను ఓరకంట కూడా చూడదు. గాలిలో గూటీబిళ్ల మాదిరి దూసుకుపోయేలా విలన్‌ని తన్నిన సినిమా హీరోలా కిట్టిగాడ్ని తన్నాలని అనిపించని రోజు లేదు. అది నా వల్ల కాదు కదా. పిండిని కర్రతో ఒత్తి చపాతీ చేసినట్టు తిరిగి వాడే నన్ను సాఫు చేసేయగలడు. వెధవకి రెండు కాళ్లూ పోలియోతో ఈనెపుల్లల్లా అయిపోతేనేం. మిగతా మనిషి పాత బ్రిడ్జి స్తంభమంత గట్టిగా ఉంటాడు. నాకో కాలు ఉంటేనేం. మనిషినంతా కలిపినా వాడి ఓ జబ్బకు చాలను. వాడు చంక కర్రలతో ఒక్కటిచ్చినా నాకు చావు మూడొచ్చు. పైగా ఎప్పుడు చూసినా ఎవరి మీదో పగబట్టిన కొండచిలువలా ఉంటుంది వాడి ముఖం. వాడి ముఖంలోకి తిన్నగా చూడాలంటేనే ధైర్యం చాలదు. ఇంక ఎప్పుడూ వాడి నీడలా ఉండే లక్ష్మితో మాట కలిపి, మనసు చెప్పడమా? అలా చేస్తే కాళ్ళూ, చేతులూ కట్టేసుకుని వరద గోదాట్లో దూకినంత దుస్సాహసమే. ఆ భయంతోనే స్పీడ్‌బోటులా లక్ష్మి వైపు దూసుకుపోతున్న నా మనసు చేతల్లోకే కాదు. వీలైనంత వరకూ చూపుల్లోకి కూడా రాకుండా బలవంతంగా లంగరేస్తున్నాను.

“ఏరా! నారిగా! నిత్యారతి అయిపోయింది. పురాణకాలచ్చేపమూ అయిపోయింది. యింకా ఇక్కడే అంటుకుని వున్నావు. ఓవర్‌టైమ్‌ చేసి, బాగా సంపాయించి, పండక్కి బొమ్మనలో కొత్తబట్టలు కొందామనేంట్రా?” హాస్యమాడుతూ వచ్చాడు సింహాచలం. నా ముందున్న తువాలు నాలుగు కొసలూ కలిపి, మూటలా కట్టి లేవబోతుంటే కొంచెం వంగి, కన్నుగీటుతూ, చెవిలో మెల్లగా “కొత్త బట్టలు నీక్కాదులేరా. లచ్చికి” అంటూ పగలబడి నవ్వాడు. సింహాచలానికి ఏ అవకరమూ లేకపోయినా 70 ఏళ్ళ వయసే అడుక్కోవడానికి అర్హత. చూస్తే తిండి తిని ఏ నెల్లాళ్ళో అయ్యుంటుందన్నంత డోక్కుపోయి కనిపిస్తాడు గానీ ఆగస్టు గోదారంత చలాకీగా ఉంటాడు. నాతోనే కాదు. తోటి బిచ్చగాళ్ళందరితో ఏ మాత్రం సంకోచం లేకుండా పరాచకాలాడతాడు. వాటిలో బూతులు ఎక్కువగా ఉన్నా అందరూ గలగలా నవ్వుతారే తప్ప తప్పు పట్టరు. లక్ష్మితో ముడిపెట్టి నాతో ఆడిన హాస్యం ఆకలితో పేగులు రగిలిపోతున్న వేళ తిన్న బిర్యానీ అంత రుచిగా అనిపించింది. నా ముఖంలోకి తన్నుకొచ్చిన ఆనందాన్ని కనిపెట్టేశాడు ముసిలోడు. “మాటకే ఇంత మురిసిపోతన్నావే. రేపు నిజంగానే అది నీకు మొగ్గితే ఊళ్ళోకెల్లా పేద్ద ఒటేళ్ళో మందు పార్టీయే ఇచ్చేత్తావురొరే. చాల్చాల్లే కాత్త తగ్గించు. ఏ మూలుండో ఆ కిట్టిగాడు పసిగట్టాడనుకో రెండో కాలు కూడా నీది కాకుండా పోద్ది. పదపద!” అంటూ ముందుకు నడిచాడు. లక్ష్మి అంటే నాకిష్టమని ముసిలోడితో ఒక్కగానొక్కసారైనా నోరిప్పి చెప్పలేదు నేను. అయినా నీటిలోపల దాగిన చేపను దేవుకొచ్చే వలలా నా మనసు ఎప్పుడో కనిపెట్టేశాడీ దేవాంతకుడు. అయినా మంచోడు. మేమిద్దరమూ ఉన్నప్పుడే ఆ ఊసెత్తి పరాచకమాడతాడు. “ఊరుకో పెద్దయ్యా!” అంటూ సిగ్గుపడుతూ అతడి వెంట నడిచాను.


రాజమండ్రిలో పుష్కరాలరేవు, గోదావరి రైల్వేస్టేషన్‌, చుట్టుపక్కల అడుక్కునే వాళ్ళందరికీ ‘ఒంటికాలి బక్కనారిగాడి’ గానే తెలిసిన నాకు అమ్మానాన్న పెట్టిన పేరు నరేష్‌. ఇప్పుడు ఎవరైనా ‘నరేష్‌’ అని పిలిచినా నన్ను కాక ఎవరినో అనుకునేంతగా ‘నారిగాడి’గా స్థిరపడిపోయాను. ఏటిపట్టునున్న కాటవరం మా అసలు ఊరు. నాన్న రాజూ, అమ్మ అనసూయా కూలిపనులకు వెళ్ళేవారు. ఒకేఒక్క సంతానం కావడంతో నేనేది అడిగినా కాదనే వారు కాదు. నేనేం చేసినా కోప్పడే వారు కాదు. నేను ఏడో తరగతి చదువుతుండగా నాతో పాటు చదివే సురేష్‌ వాళ్ళ నాన్న టీవీఎస్‌ మోపెడ్‌ కొన్నాడు. ఓసారి సురేష్‌ వాళ్ళ నాన్నతో కలిసి ఆ బండి మీద వెళుతుండగా ఎదురైన నన్ను చూసి చాలా గీరగా నవ్వాడు. మండుటెండా, గాలివానా ఒక్కసారే విరుచుకుపడ్డట్టు నాకు ఉక్రోషం, దుఃఖం పొంగుకొచ్చాయి. పరిగెత్తుకుంటూ ఇంటికి పోయాను. అప్పుడే పనిలోంచి వచ్చినట్టున్నారు. నాన్న తాటాకింటి అరుగు మీదున్న చాపపై నడుం వాల్చి ఉంటే, అమ్మ పెరట్లోని పొయ్యి మీద స్నానానికి నీళ్లు కాస్తోంది.

నేను తిన్నగా నాన్న దగ్గరకెళ్ళి భుజం పట్టి లాగుతూ “నానా! మనం యెంటనే టీవీఎస్‌ మోటర్‌ సైకిల్‌ కొనుక్కోవాలి. దా. కొనుక్కొచ్చేద్దాం” అన్నాను.

సంగతేంటో అర్థం కాని నాన్న “ఏమైందిరా అబ్బిగా? ఈ ఊపేంట్రా?” అయోమయంగా అన్నాడు.

“ఆ సూరిగాడోళ్ళు కొనుక్కున్నారు. మనమూ కొనేసుకోవాలి నానా!” అన్నాను.

“ఒరే! ఆళ్ళ నాన కూరగాయల యాపారం చేత్తాడు. మేమా రెక్కల మీద బతికేవోళ్లం. ఆళ్ళతో మనకు సాపత్యమేంట్రా?” బుజ్జగింపుగా అన్నాడు. అమ్మ వచ్చి మా మాటల్ని మురిపెంగా వింటోంది. వాళ్ళ వల్ల కాకపోవచ్చు కానీ, నేను నిజం విమానం కావాలని మారాం చేసినా మా అమ్మకి సంతోషం కలిగించే ముచ్చటే.

“ఆళ్ళ నానతో కలిసి బండి మీదెళ్తా నన్ను చూసి నవ్వాడు నానా ఆ సూరిగాడు. ఆ మాత్రం బండి మనం కొనుక్కోలేమా? యెంటనే కొనెయ్యి నానా!” నా మాటను ఒప్పుకుని తీరాలన్నంత నిశ్చయంగా అన్నాను.

“అబ్బిగాడు అంత ముచ్చట పడతన్నాడు కదా. తల తాకట్టు పెట్టయినా కొనవయ్యా! అవసరమైతే నా రెండు గాజులూ అమ్మెయ్యి!” తిరణాలలో బెలూన్‌ కొనమన్నంత తేలిగ్గానే అంది అమ్మ.

ఏమనుకున్నాడో, ఏం లెక్కలు వేసుకున్నాడో ఏమో. “అలాగేలేరా అబ్బిగా! ఇంకో వారమాగి మనమూ కొనుక్కుందాం బండి” అన్నాడు నాన్న.

“మా నాన మంచోడు. మా అమ్మ మంచిది” ఆనందం పట్టలేక వాళ్ళిద్దరికీ ముద్దుల మీద ముద్దులు పెట్టేశాను.

అన్నట్టే అమ్మ గాజులు ఇచ్చింది, నాన్న వారం తిరక్కుండానే రాజమండ్రి వెళ్లి కొంత డబ్బు కట్టి వాయిదాల పద్ధతిపై టీవీఎస్‌ మోపెడ్‌ కొనుక్కొచ్చాడు. అమ్మ బండికి దిష్టి తీసి, కుంకుమ, పసుపు బొట్లు పెట్టి, నిమ్మకాయలు కట్టే వరకూ ఉగ్గబట్టుకుని ఉన్నాను. ఆ తతంగం పూర్తయిన వెంటనే నన్ను బండెక్కించుకుని ఊరంతా తిప్పమన్నాను నాన్నను. సూరిగాడి ఇంటి ముందు నుంచైతే రెండుసార్లు తిప్పించాను.

ఇంటి చూరున నిలిపిన టీవీఎస్‌ మోపెడ్‌ను చూస్తే కథల్లోని రాజు గారి పంచకళ్యాణి గుర్రంలా కనిపించింది. అదే అమ్మానాన్నల పాలిట యముని దున్నపోతు అని ఆ మర్నాడే తెలిసింది. బండి మీద రాజమండ్రి వెళ్ళి సినిమా చూడాలన్న నా ముచ్చటను తీర్చుకోవడానికి ముగ్గురం బయల్దేరాం. బొబ్బిల్లంక, తొర్రేడుల మధ్య వెనుక నుంచి మృత్యువులా దూసుకువచ్చిన ఇసుక లారీ అమ్మానాన్నల్ని పొట్టన పెట్టుకుంది. అంతటితో కడుపు నిండనట్టు నా కుడికాలును నమిలేసింది. అమ్మానాన్నల ప్రేమరాజ్యంలో యువరాజరికం అనుభవించిన నాకు కాలం అవిటితనాన్నీ, ఆకలినీ మిగిల్చింది. కొన్నిరోజులు అన్నం పెట్టిన అయిన వారు కూడా తర్వాత బరువు వదిలించుకునే చిట్కాగా ఈసడించడం మొదలు పెట్టారు. ‘ప్రమాదంలో కాలికి బదులు కడుపు పోతే ఈ ఆకలి బాధ ఉండేది కాదు కదా!’ అనుకుంటూ రాజమండ్రి చేరాను. నారిగాడినై ఎనిమిదేళ్లుగా ముష్టెత్తుకుంటున్నాను.


మహా శివరాత్రి. పుష్కరాలరేవులో తెల్లవారుజాము నుంచే రద్దీ మొదలైంది. ఎక్కడెక్కడి నుంచో కొత్త బిచ్చగాళ్ళు కూడా రేవు బయట చేరారు. రోజూ ఎలా ఉన్నా ఇలాంటి సందర్భాల్లో భక్తుల సంఖ్యే కాదు, మా బిచ్చగాళ్ళ జనాభా కూడా రెట్లురెట్లుగా పెరుగుతుంది. అలాగని రేవులో చేరి అడుక్కుంటే బయటకు గెంటేస్తారు. పండగైనా, పబ్బమైనా, సాచే చేతులు ఎన్ని పెరిగినా చచ్చినట్టు రేవు బయట భక్తులు వచ్చీపోయే దారికి అటూఇటూ బిచాణా వేయాల్సిందే. ఇన్నేళ్ళ అనుభవంలో ఇదంతా క్షుణ్ణంగా తెలుసు గనుక నేను మూడుగంటలకే లేచి రేవుకు వచ్చేశాను. భక్తుల దృష్టిలో విధిగా పడి, పుష్కలంగా ముష్టి గిట్టుబాటయ్యే జాగాను ఎంచుకుని, తువాలు పరిచి చతికిలబడ్డాను. సమయం గడిచే కొద్దీ మా వరుస మరీ చిక్కనవుతోంది. మేం ఒకళ్లనొకళ్ళు ఒరుసుకుని కూర్చోవలసి వచ్చింది. ‘అమ్మా!అయ్యా!’ అనే మా అరుపుల్లో ఎవరి అరుపు ఏదో గుర్తు పట్టడం కష్టమైనట్టే, భక్తులు వేసిన నాణేలు ఇటు నుంచి అటూ, అటు నుంచి ఇటూ దొర్లుతూ ఎవరు వేసిన ముష్టికి ఎవరు హక్కుదారులో తెలియక పేచీ పడే పరిస్థితి వచ్చింది.

అలాంటి సమయంలో వచ్చింది లక్ష్మి. వచ్చీరాగానే నా భుజం మీద చెయ్యేసి, బలంగా నెడుతూ. “జరగరా నారిగా!” అంది. అంటూనే నా పక్కన ఉన్నోడు తిట్టుకుంటున్నా వాడినీ ఓ నెట్టు నెట్టి, ఇద్దరి మధ్యా చతికిలబడి, గుడ్డ పరిచింది. ఫిడేలు తీగల్ని కమాను ఒత్తినట్టు లక్ష్మి భుజం నా భుజాన్ని ఒత్తుకుంటోంది. ఆమె సొట్టకాలు దాదాపు సాంతం నా సొట్టకాలిపైనే ఆన్చింది. పెళ్ళప్పుడు పెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ జీలకర్రాబెల్లం ఉన్న చేతులను ఒకరి తల మీద ఇంకొకరు హత్తినట్టనిపించింది నాకు. అటూ ఇటూ ఒదుగుతున్నప్పుడు ఆమె ఊపిరి నా ముఖాన్ని గోరువెచ్చగా తాకుతోంది. జరిగిందీ, జరుగుతున్నదీ నిజమా, కలా అన్న అనుమానం కలిగింది. లక్ష్మి నా పక్కన కూర్చోవడం గోదారి పుష్కరాల రేవు మెట్లెక్కి, కోటగుమ్మం సెంటరు దిక్కుకు ప్రవహించినంత విడ్డూరంలా ఉండొచ్చు గాక. వేలాదిమంది రణగొణల సాక్షిగా, నా మనసు మూలిగే తీపి మూలుగుల సాక్షిగా ఇది పచ్చి నిజం. కాదు, కాదు. ‘పండంటి’ నిజం. పండులో పురుగు దూరినట్టు అంతలోనే నాలో ‘ఇంతకీ ఆ కిట్టిగాడెక్కడ?’ అన్న శంక.

“లచ్చిమే! మీ కిట్టిగాడేడీ?” వణుకూ, పులకా కలగలిసిన గొంతుతో అడిగాను.

“తాగుబోతెదవ. రేపు సివరాత్తిరిరా. పొద్దున్నే రేవుకు పోవాల్రా అన్జెప్పినా ఇనకుండా పూటుగా తాగి ఇంకా అక్కడే పడున్నాడు. ఏరా! నేనిక్కడ కూసోడం నీకిట్టం లేదా. అయితే చెప్పు ఎళ్లిపోతా” అంది లక్ష్మి.

ఈ క్షణంలో పరవళ్ళు తొక్కిన గోదావరి మరుక్షణంలో ఇగిరిపోతుందన్నంత కంగారు పుట్టింది.

“వద్దొద్దు. ఇప్పుడిక్కడి నుంచి లేత్తే. నీ బిచాణా నడిరోడ్డు మీద పరవాల్సిందే. పర్లేదులే. కూసో” అన్నాను.

మా ముందు నుంచి వందలువేలుగా భక్తులు రేవులోకి వెళుతూనే ఉన్నారు. వాళ్ళంతా పాపికొండల నడుమ నుంచి వచ్చే గోదారి నీటిలో తలమునకలేస్తుంటే. నేనిక్కడ ఒడ్డున ‘తీపి’కొండలను ఒరుసుకుని వచ్చే కానరాని తేనె ఏటిలో ఉక్కిరిబిక్కిరవుతున్నాను. ఎంత జుర్రినా మొహం మొత్తకుండా, ఇంకా ఇంకా కావాలనిపిస్తున్న ఆ విందును ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం భక్తుల రద్దీ తగ్గే వరకూ ఆరగిస్తూనే ఉన్నాను. అప్పటికి లక్ష్మి గుడ్డ మూటగట్టుకుని, లేచి “ఎళ్తాన్రా నారిగా!” అంది. కలలోంచే బదులిస్తున్నట్టు “ఊ” అన్నాను. నా ఎదరున్న గుడ్డ మీద ఎంత సొమ్ము చేరిందో లెక్కపెట్టొచ్చు. కానీ. నా హృదయానికి దక్కిన పెన్నిధిని ఎలా లెక్కపెట్టగలను?


ఇంతకన్నా పెద్ద పండగేముంటుంది నాకు? ఈ శివరాత్రే నాకు సంబరాల సంక్రాంతి. నాలుగు ఔన్సుల చీప్‌ లిక్కరేసి, సుబ్బాయమ్మ చేపలపులుసుతో పెట్టిన భోజనం తిని ఈలేసుకుంటూ రాత్రి ఎనిమిదన్నరవుతుండగా మా అడ్డా చేరాను. రోజూ నేను పడుకునే చోట పక్క సర్దుకుంటుంటే ‘టక్కుటక్కు’మంటూ కర్రల చప్పుడు. చూడబోతే కిట్టిగాడు. మసక వెలుతురులో వాడి ముఖం ఎలా ఉందో కనిపించకపోయినా బూతులతో మొదలైన వాడి మాటలే వాడి రౌద్రాన్ని కళ్ళకు కట్టించాయి. ఆ వెంటనే మెరుపులా గాల్లోకి లేచి, పిడుగులా నా వీపుపై పడ్డ కుడి చంకకర్ర వాడి క్రౌర్యాన్ని రుచి చూపించింది. పక్కటెముకలు విరిగినంత బాధ కలిగి “చంపేస్తున్నాడు బాబోయ్‌!” అని అరిచాను.

“గట్టిగా గాలేత్తే కొట్టుకుపోయే అరిపేద నాకొడకా! లచ్చిమి పక్కన కూసోని, దాని కాలి మీద కాలేత్తావా నీకెంత దైర్నంరా! నేనేం చూళ్లేదనుకున్నావు కదా నా కొడకా. అది నా మనిసిరా! ఇంకో సారి దాని జోలికొత్తే నీ పీనుగ గోదాట్లో తేలతాది!” తిడుతూనే మరోసారి చంకకర్రెత్తి ముఖం మీద కొట్టాడు. “అమ్మా!” అంటూనే నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి, కాలు తూలి కూలబడ్డాను ఎగ ఊపిరితో

ఉక్కిరిబిక్కిరవుతూనే సింహాచలం ఉరుక్కుంటూ వచ్చాడు.

“బక్కపీనుగను ఇంకా కొట్టావంటే సచ్చిపోతాడు. నీకు పున్నెముంటంది వదిలెయ్‌రా కిట్టిగా!” అంటూ వాడిని పక్కకు లాగాడు. వాడు బూతులు తిడుతూ, నన్ను చంపుతానని బెదిరిస్తూ కర్రలు ‘టక్కుటక్కు’మనిపిస్తూ వెళ్లిపోయాడు. మా వాళ్ళలో కొందరు వచ్చి “దెబ్బలు గట్టిగా తగిలాయా? అయినా. ఈ ఎదవ సంగతి తెలిసీ ఆ సొట్టదాని జోలికి ఎందుకెళ్ళావురా పిచ్చి సన్నాసీ!” అంటూ నన్ను పరామర్శించారు. ఒకడు “ఈ ఆయింట్‌మెంట్‌ రాత్తా. నెప్పులు తగ్గుతాయి” అని రాస్తే, మరొకడు తన దగ్గరున్న క్వార్టర్‌ సీసాలోని రెండు ఔన్సుల చీప్‌లిక్కరూ తాగించాడు.


వంటికి తగిలిన దెబ్బల బాధ. ఆయింట్‌మెంటూ, చీప్‌లిక్కర్లతో తగ్గినా, గుండె పుండులా సలుపుతూనే ఉంది. కిట్టిగాడు నన్ను కొడుతుంటే సింహాచలంలాగే లక్ష్మి కూడా అడ్డమొచ్చి, తనంతట తానే వచ్చి నా పక్కన కూర్చున్న సంగతి వాడికి చెప్పాల్సింది. సింహాచలం అడ్డమొచ్చేటప్పటికే నాకు దెబ్బలు తగిలాయి. అయినా సరే, ఆమె వచ్చి ఆ మాట అనుంటే, నాకు ఆయింట్‌మెంట్‌ కన్నా, లిక్కర్‌ కన్నా నొప్పి తగ్గించి ఉండేది. గుండెకీ సలుపు ఉండేది కాదు. ఇంత జరిగినా ఇటువైపు తొంగి చూడలేదంటే ఆ కిట్టిగాడు నన్ను చంపేసినా ఆమెకేం పట్టదన్న మాట! మధ్నాహ్నం వరకూ నేను రుచి చూసిన తేనె అంతా కుంకుడురసంలా చేదుగా మారినట్టనిపించింది.

దుప్పటి ముసుగులోంచి తల బయటికి పెట్టి రెప్పలు వాలని కళ్ళతో చీకటి అలుముకున్న చెట్ల కొమ్మల్లోకి చూస్తున్నాను. గోదావరి రైల్వేస్టేషన్లో ఏదో బండి, ఆగి బయల్దేరినట్టుంది. ఆ బండిని బట్టి టైము రెండు దాటి ఉంటుంది. ఈ రాత్రికింక నిద్ర పట్టదు. అమ్మానాన్నా గుర్తొచ్చారు. నా బాల్యం, వాళ్ళ ప్రేమా గుర్తొచ్చాయి. కళ్ల నుంచి ధారలు కట్టిన నీరు చెంప మీది గాయాన్ని చురుక్కుమనిపించింది.

దగ్గరలో నెమ్మదిగా ఎవరిదో అడుగుల చప్పుడు. నా దగ్గరే ఆగింది. ఎవరో నా పక్కనే కూర్చున్నారు. ఓ చేత్తో నా ముఖాన్ని నిమురుతున్నారు. చెమ్మను గమనించి కన్నీటిని తుడుస్తున్నారు. ఆ స్పర్శ ఎంతో పరిచితమైందే అనిపిస్తోంది. నా గుండెలోంచి రక్తం గోదారి వరదలా ఉరకలెత్తింది.

మెల్లగా అడిగాను “ఎవరు?”

వంగి నా చెవిలో గుసగుసగా “నేను లచ్చిమిని. మెల్లిగా మాట్లాడు” అంటూనే దుప్పటి పైకి లేపి, నా పక్కన ఒదిగి పడుకుని, తిరిగి ముసుగు కప్పేసింది. ఆమె ఎవరో, జరుగుతున్నదేమిటో తెలియగానే గాయాలతో సలుపుతున్న దేహమే మంత్రం వేసినట్టు మోహానికి చిరునామా అయింది. కన్నీటి చారికలే హరివింటికి పురిటిగది అయినట్టయింది. పెనుబలంతో తీరాన్ని తాకిన కెరటంలా లక్ష్మిని వాటేసుకున్నాను. ఆనందంతో వెక్కెక్కి ఏడ్చాను. ఆమె మరోసారి నా కళ్ళు తుడుస్తూ గుసగుసగా అంది “పిచ్చోడా! నీ మనసెప్పుడో కనిపెట్టాను. నువ్వంటే నాకెప్పుడూ ఇట్టమే. కానీ. అదే మాత్రం పసిగట్టినా ఆ కిట్టిగాడు నీ మీద పగబడతాడు. అందుకే నీ వంకే సూసేదాన్ని కాదు” అఖండ గోదావరికి తాజాగా మరో జీవనది పాయ కలిసినట్టు నా ఆనందం రెట్టింపైంది. అయినా అడిగాను,”ఇందాక ఆడు నన్ను కొడతంటే, ఎందుకు రాలేదు? ‘నేనే ఎళ్లి నారిగాడి పక్కన కూసున్నా’నని ఎందుకు చెప్పలేదు?”

“పిచ్చోడా! అలా సేత్తే ఇద్దర్నీ సంపేత్తాడు. ఇద్దరం సావడం నయమా? బతికుండి ఎప్పుడో ఒక చనమైనా పేమను పంచుకోవడం నయమా?

“ఇప్పుడాడు మళ్లీ వచ్చి మనల్ని సూత్తే?”

“ఇద్దరం కలిపి ఆడిని సంపేద్దాం. సరేనా?”

వేసవిలో నడక ఆగి, నాచు పట్టిన గోదారి పాయకు అకస్మాత్తుగా వరద వచ్చినట్టూ, ఆ కెరటాలకు ఎగువనున్న అడవిలోని పూలన్నీ అద్దినట్టూ అనిపించింది. ఒళ్ళు పుండైతే అయ్యింది గానీ, మనసుకెంత తియ్యగా ఉందో!