పొద్దెక్కకనే మా ఆవుకి గడ్డికోసుకొచ్చేసి, మల్ల కడి తిందామనుకొని నోట్లో బొగ్గెయ్యకుండా కొడవలెత్తుకొని, సుట్టకి తవాలుగుడ్డ భుజాన్నేసుకొని, తూర్పు దావింటి పోతి. ఆ దావలో చింతమాను కింద బూదేవి కొక్కిరి కూచోని తలకాయ కిందకు వాలేసుకుని బుచ్చిమొకం పెట్టుకొని ఉండే. దాని చేతిలో కూడాగడ్డి కోసే కొడవలి ఉండె. మామూలు గానే ఆయమ్మ ఉన్న తావున పదిమంది ఉన్నట్టు గలగలా ఉంటుంది. కానీ ఈ పొద్దు ‘మూసిన ముత్యం దాసిన పగడమన్నట్లు’ ఉంది. దాని వాలకం చూసి,”మేయ్ భూదేవీ చింతమాను కింద కూసుంటే చింతలు జాస్తి, లేసిరా గడ్డికి పోదాం” అంటి.

ఆయమ్మ చిన్నగా లేసి నాతో పాటు వచ్చే.

“యాల అట్లుండావు?”

“ఏమీ లేదక్కా ఏలనో తలకాయ నొస్తా ఉంది”

“అయితే మాత్రన్నా మింగకూడదా?”

“మింగినానులే”

ఆ యాలకే గడ్డి చేనొచ్చే! గడ్డి కోసి,మోపులుకట్టి పక్కన పెడితిమి. పైటేల కూడా కాలే ఎండ పెట్ల కాస్తా ఉంది. నీల్ల దప్పికి నోరు పిడసరాయి అయిపోయింది.

నీల్ల కోసం దిక్కులు చూస్తిమి. ఒక పక్కన బోరుమోటారు వదిలుంటే ఆ నీల్లు కాలువంటి పోతన్నాయి. ఇద్దరం ఆడకు బొయ్యి కాలు చెయ్యి కడుక్కొని దోసిళ్ళతో ఆ నీల్లు ఎత్తుకొని కడుపునిండా తాగితిమి. పరగడుపున నీల్లు తాగేకొందికి కడుపు ఎగదన్నుకొచ్చే. పక్కనున్న కానుగమాను కింద నీడ ఉంటే చల్లగా ఉంటుందని ఇద్దరం కుసుంటిమి.

దీని మనసులో ఎదో జరిగింది అని నా మనసుకు తెలస్తా ఉంది. ఊరికే ఉండకుండా, “ఏమ్మే అట్లుండావు?” అంటి.

“ఎందిలే పోఅక్కా నా మొగుడు చెప్పే అబద్దాలకు, వాని డౌలు అరువులకి నా పానం పోతావుంది. మా అత్త వాన్ని కనేసి ఏ లగ్నాన నా నెత్తిన ఏసిందో, నెత్తి నూక నేలబడినప్పటినుంచిఒకటే అగసాట్లు. వాని గొప్పల కోసం నన్ను ఎర్రిముండను చేస్తుండాడు”

“అదేలనే బూదేవీ, నీ మొగుడే ఊరందరి మొగాల్ల కన్నా మంచోడంటారు, అందరి ఆడోల్ల కంటే నీకే సుకమనుకుంటారు” అన్నా.

“ఏందిలే అక్కా, యాది రట్టు సంసారం గుట్టు అంటారు, మానానికి ఎరుసుకొని ఉండబట్టి సరిపోతా ఉంది, ఈడు ఏ పొద్దే గాని ఐదేళ్లు ఎత్తి ఒకేటయినా ఎయలేదు, ఒక మాటైనా అనలేదు, తాగేది లేదు, ఆడేది లేదు,అదేదో చెప్పినట్టు ‘ఉరుములు లే – మెరుపులు లే ఉత్తరాది చెరువు ఊరికేనే నిండినట్టు’ వీని ఉత్త మాటలకు నా ఊపిరి పోతా ఉంది. కక్కలేను మింగలేను. ఈ మనోయాదికి మందులేదు. అదీ నా పరిస్థితి.

ఈని చేతిలో పది రూపాయలుంటే పదివేలు ఉందని బిల్డప్ ఇస్తాడు, ఊర్లో వాళ్ళ సంగతి తెల్సిందే కదా ‘ఇచ్చినోడు సచ్చేనా – మనం బతికేనా’ అనేవాళ్ళు. ఆట్లాంటి వాళ్ళు ఏడుండారా అని తారాడి వాళ్ళకే సాయం చేస్తాడు నా మొగుడు. పైసా వొరంబడి ఎక్కడనుంచి వస్తావుంది మాకు. వస్తే పలసాయంలోనన్నా రావాలి లేదంటే నేను కూలినాలి చేసి నూరో, ఇన్నూరో తినకా పుడకా ఎత్తి పెట్టుకోనుండాలి. ఎంతసేపూ నా రెక్కల కష్టంతో సంసారాన్ని తోసుకొస్తావుండా, చేస్తే సేద్యం అట్ల చేస్తాడు లేదంటే గమ్మున ఉంటాడు. ఎవరికన్నా పనికిబొమ్మంటే నేను ఒకని కిందకు పనికి బోదునా అంటాడు. ఎందుకంటే కనిపిచ్చినోల్లకల్లా నా దగ్గర లచ్చలుండాయి నాకింత పలుకుబడి ఉంది అని చెప్పుకుంటా తిరగతాడు. వాళ్ళ దగ్గర పనికిపోతే పిట్టేబు తగ్గి పోతుంది అంటాడు. ఎంతసేపూ నా రెక్కల కష్టంతో పిల్లల్ని సంసారాన్ని దొబ్బుకుంటా వస్తావుండా. పొద్దుకు మూడుమాట్లు మొగం కడగల్ల, తెల్లగా గుడ్లేసుకొని తిరగల్ల”

“అదేలనే బూదేవీ అట్లాంటావు ఊర్లో అందరికంటే ఎక్కువ డబ్బులు మీ దగ్గరే ఉండాయంటారే”

“గమ్మనుండక్కా, చెప్పుకుంటే సిగ్గుచేటు. ఈని కోతలు, అరువులతో బెక్కిడిసి పోయినాను. కుంటెమ్మ కూడబెడితే మంచెమ్మమాయం చేసినట్టు నేను ఎంత చేసినా ఏనగి నోటికి సరిపోయినట్టుంది. అరే నేను ఉప్పురాసి పని చేయనే నలుగురు బిడ్డల్ని సాకల్లే, వాళ్లకు పెళ్లిళ్లు చెయ్యల్లె, సదివిచ్చల్లే అన్న ఆలోచనే లేదు. నాకు కోపమొచ్చి తిడితే కొంచేడు కుక్కేసిన పేనే గతం గమ్మునుండేది. మల్ల డవాసాలుకొట్టుకుంటా ఉండేది ఈనికి దోడుమైనోడు ఎవరన్నా జత జేరితే ఈన చెప్పేగచ్చులకు వాడు ఉబ్బిపోయినాడంటే వాని దగ్గర అప్పుజేసేది, ఆ డబ్బులు తెచ్చి అందరి ఎదురుగా జేబులోనుంచి తీసి కనిపించేటట్టు లెక్కేస్తాడు. దుడ్డు చేతిలో మల్లాడే రెండు దినాలు ఇంట్లోకి అవసరమైనవి, అవసరం లేనివి అన్నీ తెచ్చి దుబారా చేస్తాడు. ‘ఈ డబ్బులు ఏడవి?’ అని అడిగితే, ‘ఇది నా సంపాదన. నీకు లెక్కలు చెప్పాల్సిన పని లేదు నేను అట్లా టౌన్ లోకి పోయినానంటే లచ్చలు సంపాదిస్తా’నని బిడ్ల ముందర కోతలు కోస్తాడు. నిజం చెప్పనే చెప్పడు ఏ నాడూ. అప్పులిచ్చినోడు ఈని దగ్గర వసూలు చేయలేక ఇంటికొచ్చి నన్నడిగినంత వరకు నాకు తెలియదు. నువ్వు ఏంటికి అప్పు జేసినావు అని నేను అడిగితే,’నేనేమన్నా తాగినానా?,ఆడినానా?, లంజకు బెట్టినానా?’ అని నన్నే దబాయిస్తాడు. ఆ డబ్బులు లెక్క వేస్తే ఆ అప్పు జేసినా డబ్బుల్ని కూడా ఇద్దరు ముగ్గురికి అప్పులిచ్చింటాడు. అదీ ఎట్లాంటి వాళ్ళ కంటే ఇంతకు ముందు మూడు నాలుగుసార్లు ముంచేసిన వాళ్ళకే మల్లా ఇచ్చింటాడు. నేను పది మందిలోనే బగిసనానికి ఎరుసుకొని వేరే తావున అప్పుచేసి ఈ అప్పు కట్టాల్సి వస్తోంది.ఎట్లక్కా మేము బాగు పడేది? నొప్పి తెలియకుండా నారతో గొంతు కోస్తా ఉంటే ఏమి జేసేది?

“నాకు పెండ్లయిన కొత్తలో మా అమ్మగారు ఒక వరస సొమ్ములు బెట్టింది. అవన్నీ నేను పెట్టె లో బెట్టుంటే నాకు తెలియకుండా ఆ సొమ్మును ఎత్తుకొని బొయ్యి కుదవ బెట్టేసినాడు. నేను ఊరికి బోదామని పెట్టె దెరిసి చూస్తే సొమ్ములు లేవు. ఏమైనాయంటే ‘నాకేమి దెల్సు? నేను చూళ్ళేదు’ అని తిరగబడే. లాస్టుకి దొంగలెత్తుకోని బోయినా రేమోనని ఏడ్సుకుంటా గమ్మునుండిపోతి. నాలుగైదేండ్లకు బయటపడినాడు. ఇట్లా నోరు తెరిస్తే అబద్దాలే! అబద్దం చెప్పంది వాని పానం నిలబడదు.

“ఇప్పుడు బాద ఇదంతా కాదు. నెలకు ముందు నా కూతురికి కాలేజిలో పీజు కట్టల్లని పదివేల రూపాయలు పెట్టెలో పెట్టుంటి. ఈ విషయం నా మొగునికి కూడా తెలుసు. ఆ నడుమన మల్లి గాని పెళ్ళాము నర్సి నా కాడి కొచ్చి, ‘అక్కా, నాకు పానం మీదకు వచ్చింది. అప్పులోళ్లు ఇంటిముందర మానం తీస్తున్నారు పదివేలు సాయం చెయ్యి రేపు ఈ యాల కల్లా ఇస్తాను’ అని బంగపొయ్యే. నాకు తెల్సు వాళ్ళు ఇచ్చిన సొమ్ము తిరిగియ్యరని, ‘నా దగ్గర ఒక రూపాయి కూడా లేదమ్మా నా బిడ్డకి పీజు కట్టల్ల నేనే మిమ్మల్ని అడుగుదామనుకుంటి’ అంటి. దాంతో అది ఇసురుకొని ఎలిపోయే!

“రెండురోజుల తాలి బిడ్డను కాలేజిలో జేర్సాలని పెట్టెలో చూస్తే డబ్బులు లేవు. గుండె బేజారైపోయే. నాకు మొదట నామొగునిపైనే గుమ. డబ్బులు ఏమైనాయని అడిగితే, ‘నీకు దిగులు, భయం లేదు, ఇంట్లోకి ఎవరొచ్చి పోతున్నారో, నువ్వే కదా డబ్బులెత్తి పెట్టింది, నేనెందుకు చూసినా’ అంటా అమ్మా అక్కా ఆలి అని అడగతా నన్నే దబాయించినాడు. నేను ఏడ్సుకుంటూ మొత్తుకుంటూ ఉన్నా కూడా నిజమొప్పుకోలేదు.

“మల్ల అప్పుజేసి బిడ్డను కాలేజీకి పంపిస్తిని. కానీ ఆ నెల దినాల్లో నా మొగుడు దినామూ నర్సి వాళ్ళింటికి జడి తిరిగేది. ఏమోలే అనుకున్నా. నిన్న వాళ్ళ మిందకు రచ్చకు బొయినాడు, ఏమా అని ఆరా దీస్తే నామొగుడు పదివేలు వాళ్ళకిచ్చిన విషయం బయటపడే. నేను నా మొగుణ్ణి నిలదీస్తి ఏడవి ఆ డబ్బులు ఎట్లిచ్చినావు అంటే అప్పుడు బయట పడినాడు పెట్లొ నుంచి తీసిచ్చినాడని.

“అకా, అపుడు నాకొచ్చిన కోపానికి కొలమానాలు లేవనుకో, నా తలకాయలోని నరాలు తెగిపోతాయా అనిపించింది. ఎర్రియాకోలం బట్టింది. ఈన్ని కుక్కనుకొట్టినట్టు కొట్టల్ల. ఈనిదగ్గర ఉండకూడదు అనిపించే. నా మొగుని మొకం చూసినపుడల్లా ఒళ్ళంతా నాకు బచ్చరిస్తాయి. పెండ్లీడు కొచ్చిన బిడ్లను చూసి ‘గెడివి వోరిస్తే గుణమొచ్చినట్లు’ గమ్మున ఉండిపోతి. కానీ ఆ పదివేలు పోయినాపొద్దు కంటే రాత్రినుండి నాకు కడుపులో బండెడు అగ్గి బడినట్టుంది. ఈడు ఇంక జీవితంలో మారడని అనిపిచ్చేసింది” అంటా కళ్ళనిండా నీరు బెట్టుకునింది బూదేవి.

“ఊరుకో బూదేవి, నీకొక దానికే కాదు ఈ బాధ అందరూ పడుతున్నారు. నాకు బుద్దొచ్చిన కాడ్నించి చూస్తున్నా. మనఊర్లో ఇబ్బటివరకు ఎన్ని మారినాయి. ఆడోళ్ళ బతుకుల్లో మటుకు ఎందుకు మార్పు లేదా అని ఒకటే ఆలోసన నాకు.

“మా అత్త అనేది ‘మా అంత కష్టం ఇబ్బటి ఆడౌటికి ఏడుంది మాకాలంలో అయితే గుద్దతుడుసుకోను నిమ్మలముండేది కాదు. కోడి కూసినప్పటినుంచి పడకలో ముడుక్కునేవరకు ముడ్డి నేలబెట్టేది లేదు. మాయేగతం ఫర్లాంగు దూరం బొయ్యి నీల్లు దేవల్ల, ఇబుడు ఇంటింటికీ కులాయిలు. అడివికిబొయ్యి కట్లు దేవల్ల, ఇబుడు ఇంటికొక గ్యాస్. వొడ్లుదంచల్ల, రాగులు ఇసరల్ల , ఇబుడు మిషన్లు మిక్సిలు. చెత్తిండ్లు అలకతా ఉంటిమి, ఇబుడు మిద్దిండ్లు. ఈదిలో దొడ్లు అలకతావుంటిమి, ఇబుడు సిమెంటురోడ్లు. బారెడు దూరం నడవాలన్నా ఊర్లోకి బస్సు, ఇంట్లోనుంచి కాలు బయటపెడితే బండెక్కతారు. బుడ్డీ ఎలుతురులో తారాడేపనిలే, ఇంటింటికీ కరెంటు.ఇంగేమి బింగరము ఆడౌటికి?’ అనేది.

“ఇన్ని మారినా కానీ ఆడదాని అదవబతుకు మాత్రం మారలేదే! ఇంకెన్నాళ్లు ఎల్నీదాలో చూస్తాం? పద”

అని ఇద్దరం లేసి గడ్డి మోపులెత్తుకుని దావింటి నడస్తా ఉంటే ఆ గడ్డి బరువు కన్నా నా కడుపులో బాదే ఎక్కువ బరువనిపించింది.