వేసంకాలపు చలివేంద్రం కోసం వేసినట్టున్నకొబ్బరాకుల పందిట్లో పేదోడింట శుభకార్యం జరిగినట్టుంది అక్కడి వాతావరణం. రాత్రి భోజనాలయ్యాయి. రవణమ్మ కిచెన్ లో ఉంది. “బావా కొంచేపు అలా పందిట్లో కూచుందావేటి. మనం తీరిగ్గా మాట్టాడుకొని సేన్నాలైంది” “నేనెప్పుడూ ఖాళీయే. నీకే టైము దొరకదు కద బావా. బాబూ కుర్చీలు పట్రారారా” కొడుకును కేకేశాడు రాంబాబు. వాళ్ళతోబాటు సత్యం బాబు కూడా కూర్చున్నాడు. చింత తోపుకు ఆనుకొని భవంతుల్లాంటి రెండిళ్ళు. ఒకదాని లైటింగు తోపు నిండా పరుచుకుంది. రెండోది చీకట్లో ఉంది. వాటి వైపు చూస్తూ అడిగాడు కన్నబాబు “అల్లుడూ, అంతంత పెద్దిళ్ళు లేపేసారు. ఎవరివేటీ. ఆటిల్లో దెయ్యాల కొంప కతేటి” “మా సెక్షనే మావయ్యా, వాళ్ళు మీ యూనియన్ మెంబర్లే. చూస్తే గుర్తు పడతావు” “మీ సెక్షన్ అంటున్నావు. మా వాళ్ళు అంటావున్నావు. హుదుద్ బిల్సు క్లియర్ అయిపొయ్యుంటాయి కదూ” అంతరార్థం అర్థమై నవ్వుతూ అన్నాడు సత్యం బాబు “తితలీవి కూడా క్లియర్ కావొస్తున్నాయి మావయ్యా” అల్లుడివైపు అదోలా చూసి “పనిమంతులంటే ఆల్లు. బాగ్గట్టుకున్నారు. మళ్ళీ ఫోనీ తుఫాను అంటా ఉన్నారు. ఆ వాన దేవుడు గాలి దేవుడితో కుమ్మక్కైతే సిక్కోలు జిల్లాలో ఇసువంటివి మరో పాతికైనా…