“ఈసారి మీరు సబ్జక్టు మార్చాలి” అన్నాడు ఖ్యాతి వారపత్రిక సంపాదకుడు శ్రీనాథ్. చురుగ్గా చూశాను. రచయితని. కళ్లలోకి చూసి ఎదుటివాళ్ల భావాల్ని పసి కట్టగలను. అతడు కాకతాళీయంగా కాదు, ఖచ్చితంగానే అన్నాడా మాట. నేను ప్రేమ కథల స్పెషలిస్టుని. ఆ సబ్జక్టుమీద ఖ్యాతి వారపత్రికలో ఇప్పటికి నాలుగు సీరియల్సు వచ్చాయి. అన్నీ పెద్ద హిట్. వాటిలో రెండు సినిమాలుగా వచ్చి హిట్టయ్యాయి. ఒకదానికి ఓ ప్రముఖ నిర్మాణసంస్థ హక్కులు తీసుకుంది. కథా సాహిత్యంలో ప్రేమని మించిన సబ్జక్టు లేదు. అందులో నవరసాలూ పండించొచ్చు. జీవనదిలాంటి ప్రేమ ప్రవాహంలో కథాంశాలు అనంతమే కాదు, నిత్యనూతనం కూడా. అందుకే ఆదికావ్యమైన రామాయణం ఇప్పటికీ ఒక అద్భుత ప్రేమకథగా ఆకర్షిస్తోంది. అసలు మన ప్రాచీన గ్రంథాలన్నీ ప్రేమకావ్యాలే. రామాయణంలో ప్రేమ భక్తితో ముడిపడితే, మహాభారతంలో ప్రేమకి రాజకీయం అనుబంధమైంది. భాగవతంలో ప్రేమ వేదాంతసారమైంది. మన పురాణాల్ని ఔపోసన పట్టడంవల్లనే నా ప్రేమ కథలు రసవత్తరమయ్యాయని నేననుకుంటాను. ఐతే కథలకు ప్రేమ ఒక్కటే సబ్జక్టని నేనూ అనుకోను. ప్రేమ ప్రసక్తి ఏమాత్రం లేకుండా – ధనిక, మధ్య, అట్టడుగు వర్గాలనుంచి ఎన్నో ఇతివృత్తాలున్నాయి. వాటిని కొత్త కోణంలో ప్రదర్శించే అవకాశమూ ఉంది.…