పెరట్లో ఒక్కసారిగా కాకులు గోలగోలగా అరవసాగాయి. “మాయదారి కాకుల గోల పాడుగాను. మళ్ళీ ఏ కక్కో ముక్కో దొరికినట్టుందిరా దేవుడా!” రుసరుసలాడుతూ రమ పెరట్లో కెళ్తోంటే, “పోనీలేవే పాపం” అంది అత్తగారు కాత్యాయని. “మీకేం తీర్చి కూర్చుని ఎన్నైనా చెబుతారు. చాకిరీ చేసే వారికి తెలుస్తుంది ఆ బరువేంటో. పోనీలే అంట పోనీలే” గోడకి ఆన్చి ఉంచిన కర్ర తీసుకుని పెరట్లో కెళ్ళింది. “ష్!ష్!” అంటూ కర్రని నేలకేసి కొడుతూ కాకుల్ని అదిలించింది. అవి ఒక చెట్టు మీంచి ఎగిరెళ్ళి మరో చెట్టు మీద వాలాయి. అయిదారు కాకులు కొమ్మల మీద కూర్చుని, తెచ్చుకున్న వాటిని కాళ్ళ కింద తొక్కి పట్టి, పొడుచుకు తింటున్నాయి. “తమ సొంత జాగీరై పోయినట్టు ఎంత ఠీవిగా కూర్చున్నాయో, వీళ్ళమ్మ కడుపు మాడ. మీకు నేనంటే లెక్కలేదు కదూ. చూస్తాను. మీ సంగతీ చూస్తాను. నా సంగతీ చూపిస్తాను” అంటూ బెడ్డలు చేతిలోకి తీసుకుని వాటి మీదకి విసిరింది రమ. కావు కావు మంటూ రెక్కలు టపటపలాడించి ఎగిరి పోయాయి. ఈ హడావిడిలో ఒకదాని నోట్లోంచేదో జారిపడింది. దగ్గరికెళ్ళి పరిశీలనగా చూసింది. చేపముక్క! ఒళ్ళు జలదరించింది. “భయపడినంతా అయ్యిందిరా దేవుడా!…