చెరువు పక్కనున్న ఖాళీ జాగాలో మేతకు పశువుల్ని తీసుకెళ్లాడు సూరీడు. పచ్చిగడ్డి పరకలను తెంపుకుంటూ వాటిమానాన అవి మేస్తూ ఉంటే లక్ష్మితో కబుర్లకు కూర్చున్నాడు వాడు. చెరుగ్గడలు నమిలి తింటూ ఇద్దరూ నిన్న చూసిన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. హీరో ఫైటింగులు దుమ్ము లేపేశాడని వాడన్నాడు. ‘ఆడి ముఖం. కొండముచ్చుకి కోటేసినట్టున్నాడు. ఈరోయిన్నుసూసేవా, ఎంతందంగా ఉన్నాదో. డ్యాన్సులయితే మరి సెప్పే అక్కర్నేద్దు. ఆయమ్మిని సూణ్ణానికే ఎల్తన్నారు జనాలు..’ ‘చెస్, నెగేస్. ఏటున్నాది ఆయమ్మిలోన? ఇదో ఈ చెరువువార సెట్టుక్కాసిన మునక్కాయనాగున్నాదిగాని ఆడదాన్నాగుందేటి? రెండీతలకే సచ్చిపోద్దది. అదే ఈరోను సూడు, ఇంతింత లావు కండలూ ఆడూనూ. సూత్తేనే కష్టం సేసుకు బతికీవోడని తెలస్తన్నాది కాదేటి..’ అన్నాడు. ఇంకా జట్టీ తెగేది కాదు. లక్ష్మి చేతిలోని చెరుగ్గడతో వాణ్ని కొట్టింది. ఫట్ మని తగిలింది దెబ్బ. ‘అబ్బా’ అంటూ విదిలించాడు సూరీడు. ఆ విదిలింపుతో తెలివొచ్చేసింది. ఉలిక్కిపడి చుట్టూ చూసుకున్నాడు. చెరువు లేదు, చెరువులో నీళ్లు లేవు, చెరువువారన ఖాళీ జాగా లేదు, అక్కడ తాను లేడు, లక్ష్మి అసలే లేదు. తానున్నది పల్లెటూళ్లో కాదు, నగరంలో. తల తిప్పి చూస్తే అక్కడున్నవి ఆవులూ ఎడ్లూ గేదెలూ దున్నపోతులూ…