దోనెల. విశాఖ జిల్లాలో మాడుగులకు మారుమూలగా వున్న ఓ గిరిజన గ్రామం. రాత్రి ఎనిమిదవుతోంది. డిసెంబరు నెల కావడంతో చలి ఎముకల్ని కొరకడం మొదలుపెట్టింది. ఆ ఊరికి ఆనుకుని పారే రాయిగెడ్డ ఒడ్డునగల వేపచెట్టు కింద కొందరు గ్రామస్తులు చలిమంట కాగుతూ పిచ్చాపాటిలో పడ్డారు. ఊరు ఏడింటికల్లా సద్దుమణిగిపోయినా వాళ్లు చలిమంట ముందునుంచి లేవలేకపోతున్నారు. “మళ్లా ఎలచ్ఛన్లు వొత్తున్నాయంట” చెంగయ్యదొర వైపు చూసి అన్నాడు బాలేసు. చెంగయ్యదొర ఏమీ అనలేదు. “ఎలచ్ఛన్లు వొత్తే ఏటొరుగుతాది మనకి? అయ్యి వత్తుంతాయి. పోతుంతాయి. ఎన్నొచ్చి ఎళ్లినా మన మర్రిపాడుకాడ సెక్కుడాము ఎవుళూ కట్టీది నేదుగద. అక్కడ బిటీసోడు కట్టిన ఆ రాతికట్టే మనకు దిక్కు” మంటకి వేడిక్కిపోయిన మోకాళ్ళను పాముకుంటూ నిట్టూర్చాడు బాలేసు. వెంకటేశులు అందుకుని “అచ్చంగా మన గిరిజన గ్రేమాలు ఓ పదుంతాయి. పిట్టంతేసి గ్రేమాలు. ఏ గ్రేమం సూసినా యిరవయ్యేసి ముప్పయ్యేసి ఓట్లుంతయి. మొత్తం వోట్లు ఎయ్యిలో సగంకాడికి కూడవు. ఆటికోసం నాయకులకి ఆలోసనెందుకు వుంతాదిరా. తక్కవ నోములు నోసి ఎక్కవ పలం రమ్మంతే వత్తాదా? అంతేపర! త్కవ ఓట్లేసి ఎక్కవ పయోజకం ఆశిత్తే అది కూడుతాదేటి? ఇక మర్రిపాడు డాము వూసు ఎత్తకండి” కసురుకున్నట్టు…