పొద్దెక్కకనే మా ఆవుకి గడ్డికోసుకొచ్చేసి, మల్ల కడి తిందామనుకొని నోట్లో బొగ్గెయ్యకుండా కొడవలెత్తుకొని, సుట్టకి తవాలుగుడ్డ భుజాన్నేసుకొని, తూర్పు దావింటి పోతి. ఆ దావలో చింతమాను కింద బూదేవి కొక్కిరి కూచోని తలకాయ కిందకు వాలేసుకుని బుచ్చిమొకం పెట్టుకొని ఉండే. దాని చేతిలో కూడాగడ్డి కోసే కొడవలి ఉండె. మామూలు గానే ఆయమ్మ ఉన్న తావున పదిమంది ఉన్నట్టు గలగలా ఉంటుంది. కానీ ఈ పొద్దు ‘మూసిన ముత్యం దాసిన పగడమన్నట్లు’ ఉంది. దాని వాలకం చూసి,”మేయ్ భూదేవీ చింతమాను కింద కూసుంటే చింతలు జాస్తి, లేసిరా గడ్డికి పోదాం” అంటి. ఆయమ్మ చిన్నగా లేసి నాతో పాటు వచ్చే. “యాల అట్లుండావు?” “ఏమీ లేదక్కా ఏలనో తలకాయ నొస్తా ఉంది” “అయితే మాత్రన్నా మింగకూడదా?” “మింగినానులే” ఆ యాలకే గడ్డి చేనొచ్చే! గడ్డి కోసి,మోపులుకట్టి పక్కన పెడితిమి. పైటేల కూడా కాలే ఎండ పెట్ల కాస్తా ఉంది. నీల్ల దప్పికి నోరు పిడసరాయి అయిపోయింది. నీల్ల కోసం దిక్కులు చూస్తిమి. ఒక పక్కన బోరుమోటారు వదిలుంటే ఆ నీల్లు కాలువంటి పోతన్నాయి. ఇద్దరం ఆడకు బొయ్యి కాలు చెయ్యి కడుక్కొని దోసిళ్ళతో ఆ నీల్లు…