పెరట్లో ఒక్కసారిగా కాకులు గోలగోలగా అరవసాగాయి.
“మాయదారి కాకుల గోల పాడుగాను. మళ్ళీ ఏ కక్కో ముక్కో దొరికినట్టుందిరా దేవుడా!” రుసరుసలాడుతూ రమ పెరట్లో కెళ్తోంటే, “పోనీలేవే పాపం” అంది అత్తగారు కాత్యాయని.
“మీకేం తీర్చి కూర్చుని ఎన్నైనా చెబుతారు. చాకిరీ చేసే వారికి తెలుస్తుంది ఆ బరువేంటో. పోనీలే అంట పోనీలే”
గోడకి ఆన్చి ఉంచిన కర్ర తీసుకుని పెరట్లో కెళ్ళింది. “ష్!ష్!” అంటూ కర్రని నేలకేసి కొడుతూ కాకుల్ని అదిలించింది.
అవి ఒక చెట్టు మీంచి ఎగిరెళ్ళి మరో చెట్టు మీద వాలాయి. అయిదారు కాకులు కొమ్మల మీద కూర్చుని, తెచ్చుకున్న వాటిని కాళ్ళ కింద తొక్కి పట్టి, పొడుచుకు తింటున్నాయి.
“తమ సొంత జాగీరై పోయినట్టు ఎంత ఠీవిగా కూర్చున్నాయో, వీళ్ళమ్మ కడుపు మాడ. మీకు నేనంటే లెక్కలేదు కదూ. చూస్తాను. మీ సంగతీ చూస్తాను. నా సంగతీ చూపిస్తాను” అంటూ బెడ్డలు చేతిలోకి తీసుకుని వాటి మీదకి విసిరింది రమ.
కావు కావు మంటూ రెక్కలు టపటపలాడించి ఎగిరి పోయాయి. ఈ హడావిడిలో ఒకదాని నోట్లోంచేదో జారిపడింది.
దగ్గరికెళ్ళి పరిశీలనగా చూసింది. చేపముక్క!
ఒళ్ళు జలదరించింది. “భయపడినంతా అయ్యిందిరా దేవుడా! ఇల్లూ వాకిలీ నానా కంగాళీ చేసేస్తున్నాయ్ దేవుడా!”
“ఎవరి ఆకలి వాళ్ళది. ఎవరి తిండి వారిది. పాపం, నోటి దగ్గరి కూడు పడేయించావు కదే” అతి కష్టం మీద కాళ్ళీడ్చుకుంటూ పెరటి గుమ్మంలో కొచ్చి అంది కాత్యాయని. ఆవిడకామధ్య గుండె ఆపరేషన్ చేశారు. అప్పట్నుంచీ ఎక్కువగా గదిలోనే వుంటోంది.
“ఇలాంటి గొడవల్లో తల దూర్చడానికి మాత్రం మీకు ఎక్కడలేని సత్తువా వచ్చేస్తుంది. గుణ గుణ నడుచుకుంటూ వచ్చేస్తారు. ఇంటి పనులకైతే మాత్రం మంచం దిగనే దిగరు” దెప్పింది.
“అవి కాకులే. ఎంగిలి మెతుకులకాశపడే జీవులే” జాలి పడింది.
“ఆహా! అలాగా! అవి తిని పారేసిన చేప ముళ్ళూ మాంసాలూ ఎవరు ఎత్తి పోస్తారు? నేనే చెయ్యాలిగా! ఇంత పెద్ద పెరడు ఉంది, పది రకాల చెట్లున్నాయన్న తృప్తీ, శాంతీ లేకుండా చేసేస్తున్నాయి. ఎక్కడెక్కడ్నుంచో నానా చెత్తా పట్టుకొచ్చి బ్రాహ్మల దొడ్డి అనైనా చూడకుండా మన పెరట్లో పారేస్తున్నాయ్!”
“మన ఇల్లు గోదావరి గట్టు పక్కనుంది మరి. రేవుల్లో పెట్టే పిండాలూ శ్రాద్ధాలూ తింటానికి కాకులు చేరవూ. అవి తింటేనే పెట్టిన వాళ్ళకీ, పోయిన వాళ్ళకీ తృప్తి!”
“బాగానే వెనకేసుకొస్తున్నారుగాని, అవి అక్కడే మెక్కి చావొచ్చుగా. మన దొడ్డి అపవిత్రం చేయడం ఎందుకూ!” చేట, చీపురు తీసుకునెళ్ళి చేప ముక్కని చేటలోకి ఎత్తి గోడ అవతలకి విసిరేసింది.
“ఇవతల మనుషులున్నారు. చూసుకోకుండా విసిరేస్తే ఎలాగా” బయట్నుంచి ఎవరో అరిచారు.
గతుక్కుమంది రమ. నోరు నొక్కుకుని వెను దిరిగింది.
కాళ్ళూ చేతులూ శుభ్రంగా కడుక్కుని ఇంట్లోకెళ్తూ, “శ్రాద్ధ కర్మలకి చేపలూ మాంసాలూ పెట్టడం ఏంటి అత్తయ్యా? ఇంత అన్నం పడేస్తే చాలదూ!” అంది.
“పోయిన వారికి ఏది ఇష్టమో అది వండి పెడతారు. ఎవరి పద్ధతి వాళ్ళది”
“అదేదో వాళ్ళింట్లో చేసుకోక మన పక్క కొచ్చి చేయాలా!” నిరసనగా అంది.
“గోదారిలో అస్తికలు నిమజ్జనం చేయడం, ఒడ్డునే అన్నం అవీ వండి కాకులకు పెట్టడం, తద్దినాలకు పిండాలు పెట్టడం ఎప్పట్నుంచో వస్తున్న ఆచారాలు. ఇవాళ మనం కుదరదంటే మానేస్తారా, నీ పిచ్చిగానీ!”
“పక్కన బ్రాహ్మల ఇళ్ళున్నాయన్న ఇంగిత జ్ఞానం లేకుండా చేపలూ మాంసాలూ పెట్టడం తప్పు కదూ! అంతగా పెట్టాలనుకుంటే గోదారి దిగువ కెళ్ళి పెట్టుకోవచ్చుగా!” విసురుగా అంది రమ.
“ఎక్కడా జానెడు జాగా వదలకుండా ఒడ్డుని ఆక్రమించి మరీ ఇళ్ళు కట్టేశారాయె! ఇంకేం చేస్తారు పాపం!”
“అంటే ఏవన్న మాట. వాళ్ళేం చేసినా తప్పు లేదు, మనమే సర్దుకుపోవాలంటారు? మీ సంగతి తెలీదుగాని నేను నిప్పులు కూడా కడిగే వంశం నుంచి వచ్చాను. ఈ కంగాళీ పనుల్ని సహించలేను.” రుసరుసలాడుతూ భర్త దగ్గరి కెళ్ళింది.
“అబ్బో గొప్పలు చెబుతోంది. వీళ్ళది ఎంగిలి చేత్తో కాకుల్ని తరమని వంశమని ఎవరికి తెలీదూ!” గొణుక్కుంది ముసలావిడ.
“ఇదిగో మిమ్మల్నే! శ్రాద్ధకర్మలవీ మన ఇంటి పక్కన చేస్తున్నారనీ, మనకి చాలా ఇబ్బందిగా ఉందనీ, ఆ గోల మరో చోట జరుపుకునేలా చూడమనీ ఇవాళే ప్రభుత్వానికి మహజరు పెట్టండి”
“మామూలు ఇబ్బంది కాదు. చాలా ఇబ్బందిగా ఉంది. మొన్నో రోజున సంధ్య వార్చి సూర్యనమస్కారం చేస్తోంటే ఇంత మాంసం ముక్క తెచ్చి నా నెత్తి మీద పడేశాయి!” ముఖం అసహ్యంగా పెట్టుకునన్నాడు రామశర్మ.
“ఈ పీడ ఇంకా ఎన్నాళ్ళు భరిస్తాంగాని, ఏదోటి చేసి కాకుల ఆగడాల్ని ఆపాల్సిందే!” గట్టిగా నొక్కి చెప్పింది. “మన ఇబ్బందులు ఏకరువు పెడుతూ పిటీషన్ పెట్టొచ్చనుకో, కానీ, మన ఇంటి పక్కన వాళ్ళు కర్మకాండలు చెయ్యట్లేదనీ, రేవు పక్కనే మనం ఇల్లు కట్టుకున్నామని అంటారేమోనే!” బుర్ర గోక్కుంటూ నసిగాడు.
“అన్నింటికీ అత్తగారిలానే మీరూ ఎడ్డెం అంటే తెడ్డెం అంటారేంటి? ఇలా పెడసరంగా మాట్లాట్టం మీ వంశంలోనే ఉందా ఏంటి కర్మ!”
“అది కాదు రమా!”
“ఇక నేనేం వినను. ఆ కాకులు తెచ్చి పడేసే నానా చెత్తా నేను ఎత్తిపోయలేను. అవి పెరడును నానా ఛండాలం చేసేస్తోంటే భరించి వూరుకోవడం నావల్ల కాదు. మీరు కాగితం పెడతారా లేదా?” నిలదీసింది.
“పెడతాన్లేవే. లేకపోతే నువ్వు నిద్రపోనిస్తావా? మనది పూర్వులు కట్టిన ఇల్లు అని కూడా రాస్తాను. అంత మాత్రాన వాళ్ళేదో చర్య తీసేసుకుంటారన్న భ్రమ లేమీ పెట్టుకోకు. ఇది జనంతో, జనం నమ్మకాలతో ముడిపడ్డ వ్యవహారం!”
“అయిందా మీ ఉపన్యాసం? ఇక బయల్దేరండి. మీరా పని పూర్తిచేసొచ్చే దాకా నేను పచ్చిగంగ ముట్టను” భీష్మించింది రమ.
“ఇది మరీ బాగుంది. వెనకటికెవడో కాలువ మీద కోపం వచ్చి ఏదో కడుక్కోవడం మానేశాట్ట. అలా వుంది నీ వరస!” అత్తగారు ఎత్తిపొడిచింది.
మూతి ముప్ఫై వంకర్లు తిప్పింది రమ. “పూర్వజన్మలో ఏ శూద్రుల ఇంట్లోనో పుట్టి వుంటారు!” ఈసడింపుగా అంది.
“ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎలా బతికాం అన్నది ముఖ్యమే పిల్లా. నలుగురికి సాయం చేస్తూ పదిమందితో సఖ్యంగా వుండే వారే మనిషి అనిపించుకుంటారు తప్ప, ‘నన్ను ముట్టుకోకు నామాల కాకి’ అంటూ తోటి మనుషులకు దూరం దూరం జరిగే వారు కాదు!”
“హు. పొద్దుటే ప్రవచనాలు మొదలెట్టారు. మీకైతే పనీ పాటా లేదు. నాకు బోలెడు పనుంది. ఇంకా అలా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారేం, లేవండి. మీరేం ముగ్గులు పెట్టి వస్తారో నాకు తెలీదు. ఆ ఛండాలం ఇంకా ఇంకా భరించడం నా తరం కాదు. ఆ దినాలూ తద్దినాలూ కర్మలూ, కాష్ఠాలూ, పిండాలూ, పొత్తర్లూ ఈ రేవు నుంచి ఇంకో చోటుకి తరలించేయమని చెప్పి ఒప్పించండి చాలు”
తలాడించి స్కూటర్ బయటికి తీశాడు రామశర్మ.
తిన్నగా మున్సిపల్ ఆఫీసుకెళ్ళాడు. అంతా విని ఫలానా శాఖకు వెళ్ళమని వీళ్ళూ, మరో విభాగానికి వెళ్ళమని వాళ్లూ, మాది కానేకాదు ఇంకొకరిదని వీళ్ళూ – బంతాట ఆడుకున్నారు. కడకి ఆ సమస్య తమ పరిధిలోకి రాదని తెగేసి చెప్పారు. నిర్ణయం తీసుకోగల హక్కూ అధికారం తహసిల్దారుకే ఉందని తేల్చారు.
అక్కడ్నుంచి తహసిల్దారు ఆఫీసుకెళ్ళాడు.
రామశర్మ వచ్చిన పని తెలుసుకుని క్రింది ఉద్యోగులు నవ్వారు.
“ఇదేదో ఇండియా చైనా సరిహద్దు గొడవలా మాట్లాడతావేంటి. సర్దుకుపోవాలోయ్” అని ఒకరంటే, “ఎవరూ చూడకుండా చేపముక్కల్ని మీ కూరలో కలిపేసుకో. భలే రుచిగా ఉంటుందిలే” అన్నారింకొకరు.
అంతా ఘొల్లుమని నవ్వారు. చెవులు మూసుకున్నాడు.
ముఖం ఎర్రబడగా, “తహసిల్దారుగార్ని కలిసి విన్నవించుకుంటాను” అని పట్టుబట్టాడు.
దాంతో ఒక గంటసేపు నిరీక్షింపజేసి, లోపలికి పంపించారు.
అర్జీ చదివి ముఖం చిట్లించింది తహసిల్దారు.
“మీకు ఇబ్బందిగా వుంటే అక్కడ్నుంచి ఇంకో చోటుకి మారిపోవచ్చుగా. జనాన్ని ఇబ్బంది పెడతానంటారేంటి?”
“మాది తాత ముత్తాతల నాటి ఇల్లండి. అందుకనే పెద్ద దొడ్డి. బోల్డన్ని చెట్లు ఉన్నాయి. ఇప్పుడంత స్థలం కొనాలంటే నా వల్ల కాదండి”
“మీలాగే వాళ్ళూ మాట్లాడతారుగా. ఎప్పట్నుంచో వస్తున్న ఆచార సాంప్రదాయాల విషయంలో అందరి సెంటిమెంట్లూ గౌరవించాల్సిందే” అందావిడ.
“మీరేవిట్లో నాకు తెలీదు. మేం బ్రాహ్మలం. అందునా శ్రీ వైష్ణవులం. నీచు మాంసాల వాసన మాకు గిట్టదు. మాకు పొద్దుట లేచింది మొదలు మడి దడి, స్నానాలు ధ్యానాలు, పూజలు పునస్కారాలు అన్నీ ఉంటాయి. సూర్యనారాయణుడి దర్శనం కానిదే పచ్చి మంచినీళ్ళు కూడా గొంతులో పోసుకోదు మా అమ్మ. మీరెలాగైనా కనికరించి శ్రాద్ధ కర్మకాండలు కొంచెం దిగువలో వున్న చిన్న రేవులో చేసుకోమని ఆదేశించాలి”
“పూర్వపు పద్ధతిని హఠాత్తుగా మారిస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుంది. దూరాభారాలు పెరిగితే పురోహిత సంఘం అంగీకరించక పోవచ్చు. గోదావరి ఒడ్డు పొడుగూతా మీ ఇంటితోబాటు చాలా ఇళ్ళున్నాయి. వారెవరికీ లేని అభ్యంతరం మీకే వచ్చిందేంటి?!”
“మా ఆచార వ్యవహారాలు మైల పడుతోంటే ఎలా సహించి వూరుకోగలం చెప్పండి?”
“మీ అభిప్రాయం చెప్పారు. మిగతా వర్గాల వారేమంటారో తెలుసుకుంటాను. కాని ఒక్క మాట. మీరు మాంసాహారం తిననంత మాత్రాన అసహ్యించుకోవాల్సిన అవసరం ఉందంటారా? సహనం అలవర్చుకోలేమా? ఆలోచించండి” మరో మాట కవకాశం ఇవ్వకుండా ఫైల్లో తల దూర్చింది తహసిల్దారు.
చేతులు జోడించి నమస్కరించి వచ్చేశాడు రామశర్మ.
ఆవిడ ధోరణి బొత్తిగా నచ్చలేదతడికి. ఏదో అనుమానం తొలుస్తోంటే “ఈ తహసిల్దారు ఏమిట్లు?” అడిగాడు అటెండర్ని.
అతడి సమాధానం వినేసరికి శర్మ ముఖం నల్లగా మాడిపోయింది. ‘ఒక శూద్రురాలి ముందు చేతులు జోడించి అర్థించాల్సి వచ్చింది. ఎంత కర్మ వచ్చి పడిందీ!’ అని కుతకుత ఉడికిపోయాడు. ‘ఆవిడ చచ్చినా న్యాయం చెయ్యదు. ఇక రమ గోలని ఎదుర్కోవడం ఎలాగో!’ అనుకుంటూ ఇంటి కెళ్ళాడు.
రమ నిద్రపోతోంది. తల్లి కన్పించలేదు. ఆమెని వెదుకుతూ డాబా మీది కెళ్ళాడు. ఇన్ని మెట్లెక్కి పైకి ఎలా వచ్చిందో అని ఆశ్చర్యబోయాడు.
మత్స్యకారులు మర పడవ మీద వేటకెళ్ళి అప్పుడే వచ్చారు కాబోలు వలలో పడ్డ చేపల్నీ రొయ్యల్నీ ఒడ్డున గుట్టగా పోస్తున్నారు. ఆ చుట్టూ కాకులు చేరి గోల చేస్తున్నాయి.
అటు వైపే తదేకంగా చూస్తున్న తల్లిని చూసేసరికతడి ముఖం వికారంగా మారిపోయింది. “చేపల్ని చూస్తున్నావా అమ్మా” అతడి స్వరం అతడికే వికృతంగా విన్పిరచింది.
“వాళ్ళ కష్టాన్ని చూస్తున్నాన్రా. పాపం ఎప్పుడో తెల్లవారుజామున వేటకు వెళ్ళుంటారు”
“సరి సరేలే. మన స్థాయీ స్థానం మరచి వాళ్ళని అందలం ఎక్కించేయకు”
నవ్విందామె. “ఛండాల రూపంలో శంకరుడు శంకరాచార్యులకి ఏం ఉద్భోదించాడో ఒక్కసారి గుర్తు చేసుకోరా అబ్బాయ్. అన్నట్టు మాంసవ్యాపారం చేసిన ధర్మ వ్యాధుడి కథ చిన్నప్పుడు చదివేవు కదా!”
పెదవి కొరుక్కుంటూ అయోమయంగా చూశాడు.
ఆమె లేచి పిట్టగోడ పట్టుకుని అతికష్టం మీద మెట్లు దిగి వెళ్తోంటే రమ ఎదురొచ్చింది. “మీరు మెట్లెక్కి పైకొచ్చారా? ఇక్కడంత మునిగి పోయేదేం పడి ఉందనీ?!”
కాస్త దూరంలో గట్టు మీద గుట్టగా పోసిన చేపల రాశి కన్పించింది. ముఖం చిట్లించింది. ఆపైన ముక్కు మూసుకుంది.
“కొత్తగా ఇదొకటి మొదలెట్టారా. ఇక రోజూ చేపల కంపు కూడా భరించాలి కాబోల్రా దేవుడా!” నుదురు కొట్టుకుంది రమ.
రామశర్మ మౌనంగా దీర్ఘాలోచనలో ఉండిపోయాడు.
ఉన్నట్టుండి ఒక రోజు రాత్రి కాత్యాయనికి గుండె పోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేయాలన్నారు. కాని గతంలో ఒకసారి చేసినందున ఆవిడ తట్టుకోలేక పోవచ్చన్నారు. వారినే నిర్ణయం తీసుకోమన్నారు.
“ఇప్పుడీ వయస్సులో రెండో ఆపరేషన్ అవసరమా” అంది రమ.
లక్షలు సర్దుబాటు చేసుకోవడం కష్టమే అన్పించింది శర్మకి.
మందులిస్తే చాలన్నాడు శర్మ. ఇచ్చారు. మెల్లగా కోలుకుంది. ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపేశారు.
“ఇంకా ఎన్నాళ్ళు ప్రాప్తముందో!” గొణుక్కుంది కాత్యాయని.
మంచాన్ని అంటి పెట్టుకునే ఉంటోంది.
“ఈ కాకుల గోల ఎప్పటికి తప్పుతుందో ఏమో! నా ప్రాణాన్ని పీక్కు తింటున్నాయి. చాకిరీ చెయ్యలేక చచ్చిపోతున్నా. ఈ మాయదారి సంత ఎప్పటికి వదుల్తుందో ఏమో. సన్నెత్తలేక చేతులు పడిపోతున్నాయి” అంటూ రోజూ కాకుల్నీ, పరోక్షంగా ముసలావిడ్నీ తిట్టి పోస్తోంది రమ.
పెరట్లో కాకుల గోల. ఇంట్లో భార్య చీదరింపులు.
ఎటూ చెప్పలేక, ఏమీ చెయ్యలేక మధ్యలో నలిగిపోతున్నాడు రామశర్మ.
అకస్మాత్తుగా కాత్యాయని పరిస్థితి విషమించింది. అతికష్టం మీద ఊపిరి పీలుస్తోంది. ఒగురుస్తోంది. ఒళ్ళు చల్లబడింది.
రామశర్మ ఆందోళన పడుతోంటే వారించింది తల్లి. తనని డాబా మీదకు తీసుకెళ్ళమని కోరింది. విసుక్కుంటూనే భార్యాభర్తలిద్దరూ సాయం పట్టి మంచంతో సహా ఆమెని డాబా మీదకు తీసుకెళ్ళారు.
కాత్యాయని గోదావరి వంక ఆరాధనగా చూస్తోంటే, తల్లి గోదావరిని చూస్తోందో గోదావరిలోని చేపల్ని చూస్తోందో బోధ పడక తల గోక్కున్నాడు శర్మ.
“తల్లి గోదారికి బిడ్డలంతా సమానమేరా నాయనా. పంటలకి నీళ్ళిస్తుంది. ఆ చేతుల్తోనే చేపల్నీ ఇస్తోంది. వాటిని జలపుష్పాలంటార్రా” ఆయాస పడుతూ చెప్పింది.
“ఇప్పుడా నీచు గోల ఎందుకు? కృష్ణా రామా అని జపం చేసుకోండి” కసురుకుంది రమ.
నవ్విందావిడ. “ఒరే అబ్బాయ్. నా చివరి కోరిక తీరుస్తావుట్రా!”
“చెప్పమ్మా. తప్పకుండా తీరుస్తాను”
“ముసలోళ్ళ చివరి కోర్కెలు చిత్రంగా ఉంటాయి. అసహ్యించుకోవుగా!”
“నేనూ విన్నానమ్మా. ఒక ప్రముఖ ఇండో ఆంగ్లికన్ రచయిత తల్లి చిటికెడు విస్కీ గొంతులో పోయమందిట. మరో ప్రముఖ తెలుగు కవి కిళ్ళీ తెచ్చిమ్మన్నాడట”
“నాదీ అలాంటి కోర్కేరా. నేను పోయాక దినకర్మలప్పుడు అన్నంతో బాటు ఒక చేప ముక్కనీ చేటలో పెట్టి కాకులకు పెట్టరా. ‘వాయస గృధ్ర జలచర రూపేణ ప్రేతే యాచ పిండ బుధ్యతాం’ అన్నారు. కాకి, గ్రద్ద, చేప రూపంలో వచ్చి తింటారట. తిననీరా. వీటినీ బతకనీరా!” సజల నేత్రాలతో చెప్పింది కాత్యాయని.
దిగ్భ్రమగా చూశారు కొడుకూ కోడలూ.
“ఇదేం పిచ్చితనం? మనమేంటో మర్చిపోయారా?” రమ త్రాచులా సర్రున లేవబోతే వారించాడు రామశర్మ.
“అవి కాకులు కాదురా వాయసాలు. వాహకాలు. అవి తృప్తి పడితేనే నాకు సంతృప్తి.”
ఆమె భావం, చెప్పాలనుకున్న పాఠం అర్థమైంది. తలొంచుకునన్నాడు. “అలాగేనమ్మా. ఇక నుంచి అన్ని జీవులూ బతకాలని, బాగుండాలని కోరుకుంటానమ్మా” అంటూ తల్లి చేతిలో చేయి వేశాడు రామశర్మ.
ఒకసారి కనురెప్పలు మూసి తెరచి తృప్తిగా అఖండ గోదావరినే చూస్తూండగా ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి.∗