వేసంకాలపు చలివేంద్రం కోసం వేసినట్టున్నకొబ్బరాకుల పందిట్లో పేదోడింట శుభకార్యం జరిగినట్టుంది అక్కడి వాతావరణం. రాత్రి భోజనాలయ్యాయి. రవణమ్మ కిచెన్ లో ఉంది.

“బావా కొంచేపు అలా పందిట్లో కూచుందావేటి. మనం తీరిగ్గా మాట్టాడుకొని సేన్నాలైంది”

“నేనెప్పుడూ ఖాళీయే. నీకే టైము దొరకదు కద బావా. బాబూ కుర్చీలు పట్రారారా” కొడుకును కేకేశాడు రాంబాబు.

వాళ్ళతోబాటు సత్యం బాబు కూడా కూర్చున్నాడు.

చింత తోపుకు ఆనుకొని భవంతుల్లాంటి రెండిళ్ళు. ఒకదాని లైటింగు తోపు నిండా పరుచుకుంది. రెండోది చీకట్లో ఉంది.

వాటి వైపు చూస్తూ అడిగాడు కన్నబాబు “అల్లుడూ, అంతంత పెద్దిళ్ళు లేపేసారు. ఎవరివేటీ. ఆటిల్లో దెయ్యాల కొంప కతేటి”

“మా సెక్షనే మావయ్యా, వాళ్ళు మీ యూనియన్ మెంబర్లే. చూస్తే గుర్తు పడతావు”

“మీ సెక్షన్ అంటున్నావు. మా వాళ్ళు అంటావున్నావు. హుదుద్ బిల్సు క్లియర్ అయిపొయ్యుంటాయి కదూ”

అంతరార్థం అర్థమై నవ్వుతూ అన్నాడు సత్యం బాబు “తితలీవి కూడా క్లియర్ కావొస్తున్నాయి మావయ్యా”

అల్లుడివైపు అదోలా చూసి “పనిమంతులంటే ఆల్లు. బాగ్గట్టుకున్నారు. మళ్ళీ ఫోనీ తుఫాను అంటా ఉన్నారు. ఆ వాన దేవుడు గాలి దేవుడితో కుమ్మక్కైతే సిక్కోలు జిల్లాలో ఇసువంటివి మరో పాతికైనా లేస్తాయి”

“అదేం కోరిక బావా? పైనుండి దేవతలు తధాస్తు అంటారు” రాంబాబు చిరుకోపంతో అంటూ ఉండగానే సెల్లు మోగింది.

ఫోను స్క్రీన్ మీద “హెచ్. ఎం. వేపాడ” అనే అక్షరాలు. స్పీకర్లో పెట్టి “నమస్కారం మాస్టారు” అంటూ పలకరించాడు రాంబాబు.

“నమస్తే, మనవరాలి అన్నప్రసనం అన్నారు. సొంతూర్లో సొంతోళ్ళ మధ్య ధూమ్ ధాం గా చేసుకొనుంటారు”

“స్కైప్ ఉందేటో అడుగు బావ. ఈ ఫైవ్ స్టార్ సెట్టింగులు చూపెడదారి” మొహాన్ని చిట్లిస్తూ అన్నాడు కన్నబాబు.

కన్నబాబును మాట్లాడొద్దని సైగ చేస్తూ, “చెప్పండి మాస్టారూ. ఈవేళప్పుడు ఫోన్ చేశారు”

కిచెన్ పని పూర్తి అయినట్టుంది. రమణమ్మ వచ్చి నిలబడింది.

“ఫోనీ తుఫాను అటు తిరిగి ఇటు తిరిగి సిక్కోలు శివార్లలో చిక్కుకుందట. మళ్ళీ మీ అందరికి పనిపడిందండీ”

“చూడు బావా, నేనామాట అంటుంటే పైనున్న దేవతలకు ఇనబడి తదాస్తు అనేస్తారని నా నోరు నొక్కేసావు”

“తితలీ కష్టం తీరకుండానే ఫోనీ పేరు పెట్టుకొని మళ్ళీ ఈ తుఫానొచ్చేసింది. తుఫాను కష్టాలన్నీఎప్పుడూ వాళ్ళకే పాపం”

“రాంబాబు గారు, ఏదో క్రాస్ టాకులా ఉంది. ఒక్క మాట. ఫెడరేషన్ ఆఫీసోళ్ళు మీ కోసం తెగ ఫోన్లు చేస్తున్నారండీ”

“వినపడుతోంది మాస్టారు. ఫోను బాగులేక స్పీకేర్లో పెట్టాను. ఎవరికి రిపోర్ట్ చెయ్యమంటారో ఆర్డరెయ్యండి. రెడీగానే ఉన్నాను”

“టైము రేతిరి తొమ్మిదీ. ఇయ్యాలప్పుడు రెడీ అంటాడేటి. తిక్కోడ్లా ఉన్నాడు”

“పర్లేదు మావయ్యా. హుదుద్ కీ తితలీ కి కూడా ఇంతే. అప్పుడూ ఎమర్జెన్సీ కాల్సే. రవణా. నాన్న బేగు సర్ది పెట్టు””

“ఫోనీ కోసం పది రెస్క్యు టీములటండి . అందులో ఫెడరేషన్ టీమును మీరే లీడ్ చెయ్యాలని కలెక్టర్ గారి ఆర్డర్.

“అలాగే మాస్టారు. మీరు సెలవిస్తే బయల్దేరతాను”

“దేవరాపల్లి చంద్రయ్య, వేపాడ సూర్నారాయణ బయల్దేరారట. మీ ఊరి జగ్గు నాయుడు గారు మీతో బయల్దేరతామన్నారు”

“సరే మాస్టారు” రాంబాబుకు తొందరగా ఉంది.

“అనంతారం దాలినాయుడు గారు, కోరుకొండ సూర్నాణ గారు. దెయ్యాలకు మంత్రాలవీ వేస్తారని చెప్తుంటారు. ఆయన”

“ఆ ఆ ఆయనే. అంతా మీపాత జట్టేలెండి. విజానారం కల్లెక్టరేట్ నుండి ఇచ్చాపురానికి బస్సులు బయల్దేరతాయట.

“రాంబాబు గారు. నిదానం. మీ ఆరోగ్యం గురించి మాకెవ్వరికీ బెంగ లేదు. వంద కేజీల బస్తాని వొంటి చేత్తో విసిరి పారేసిన బాడీ బిల్డరు మీరు. రెండు బస్తాలని రెండు భుజాలమీద మోసుకుని ఆయాసపడకుండా వంద మీటర్లు నడిచేవారు. కర్రసాము యెంత బాగా చేసేవారనీ. మాకింకా జ్ఞాపకమే. అలాగని దూకుడు పనికిరాదు. ఆల్ ద బెస్ట్”


“ఎలాగైనా మా బావ మొండోడు”

“అవును మా నాన్న మొండోడే. శ్రీశ్రీ గారన్నట్టు నాబోటి వాళ్ళంతా ముసులోళ్లలా ముసుగేసుకు తొంగుంటుంటే, మానాన్న వయసు వాళ్ళే రేసు గుర్రాలై రంగంలోకి దిగాల్సి వస్తోంది మరి. ఆయన దృష్టి లో “ఏజ్ ఈజ్ కౌంట్ – యంగ్ ఈజ్ ఫీలింగ్” గ్రేట్ కద మావయ్యా”

“ఆ, ఆ, గ్రేటే. మాట్టాడితే విలువలంటాడు. జన్మభూమి అంటాడు. ఋణం తీర్చుకోవాలంటాడు. చచ్చినా చెయ్యి చాచనంటాడు. అడిగినా అడగలేకపోయినా సాయం చెయ్యాలంటాడు. ఏటో మరి. యెంత గింజుకున్నా నాకైతే బుర్రకెక్కడం లేదు”

“సింగరాజు రామకృష్ణయ్య గారి వంటి మహానుభావులు చేరదీసి టీచర్ గా తయారు చేశారు. నాన్నకు అందులోనే సంతృప్తి”

“నీదీ మీ నాన్న ట్రాకే. నీ ఆఫీసు, నువ్వు డీల్ చేస్తున్న సెక్షనూ, నీ కొలీగ్స్ కట్టిన భవంతులు, నీవుంటున్నఅద్దిల్లూ, నా మనవరాలి ఫంక్షను, ఎంత గ్రాండుగ చేశావో చూశాక, మబ్బులిడిపొయ్యాయి సత్యం బాబూ”

రవణమ్మ తలదించుకుంది.

“ఎందుకే? ఎందుకే బాధపడతావు. ఊరుకో. నీకేటే తల్లీ. మనకేం ఆస్తుల్లేవా? పాస్తుల్లేవా? ఊరుకొ. మంచిదడిగి నా బంగారు తల్లి పేరుమీద నా యావదాస్తినీ బదలాయించి పారేస్తాను. నాకింకెవరుంటా. నాకొక్కూతురు. దానికొక్కూతురు”

“నేన్లేనా మావయ్యా. నా సంగతేటి”

“అల్లుడూ నాతొ ఎకసెకాలాడక. అందుకేనేటి నేనేం తెచ్చినా ఏం ఇచ్చినా తీసుకోగూడదని నాకూతుర్ని కట్టడి చేస్తున్నావట”

“బావ ఉద్దేశం అది కాదు నాన్నా”

“నువ్వాగమ్మ. ఓ కోటీస్వరుడి మనవరాలి అన్నప్రాసనం ఇంత సప్పగా జరపడం చూసి తాతగా నాకడుపు తరుక్కుపోదా”

“సాదా సీదా గా బ్రతకడం మా అందరికీ ఇష్టం మావయ్యా. మీ అమ్మాయిక్కూడా. ఆమధ్య వైజాగులో ఓ ఐ ఎ ఎస్ ఆఫీసరు గారి ఇంట్లో పెళ్ళికి ఇరవై వేల లోపలనే ఖర్చట. వినలేదా, వారినే మనవూ, మన సమాజమూ ఆదర్శంగా తీసుకోవాలి”

“బాబూ. ఈరోజుల్లో తింటాకి రోజుకు కనీసం అయిదొందలు. జాకెట్టు కుట్టటాకి ఆరొందలు. పట్టు పరికిణీ అయిదున్నర వేలు. ప్రీస్కూల్ కు లక్ష. అచ్చరాలు దిద్దుకునే పలక వొంద. జొరానికి వెయ్యి. ప్రసవానికి రెండు లక్షలు. నీ కూతురి పెళ్ళినాటికి కనాకస్టం గా పది కోట్లయినా కావాల. మీ ఇద్దరి ఆదర్సాలు ఆసారాలూ పెల్లికొచ్చినోల్లకు పప్పన్నం కూడా పెట్టలేవు. ఆ”

“నీ జోశ్యం నిజమవుద్దనే అనుకుందాం సరే. అలాగని మేం ఇపుడేం చెయ్యాలో సెలవివ్వు మావయ్య”

“ఇంచేపూ నేను ఏడిసిందదే. అంతా యినుకొని కడాకి సీతా రాములు జంటతోటి, పానకంలో పుడకలాగా, లచ్మనుడెందుకు అడివిలోకి ఎల్లాడు అనడిగితే, నేనేటి చెప్పాల?”

“నాన్నాటీ తాగుతావా” వస్తున్న నవ్వును అపుకుంటూ అడిగింది రవణమ్మ.

“పెట్టమ్మా. నెత్తి నొప్పెడుతుంది. మీ ఆయనతో ఎవ్వారం ఎంతకీ తెగదు, తెల్లారదు”

“మావయ్య, దెయ్యాల కొంప గురించి అడిగావు. సరదాగా చెప్పనా?”

“ఏటని చెప్తావు. లైట్లున్నోడు దొర నీ, రెండోవోడు సన్నాసనీ చెప్పబోతావు. అదేం శీహరికోట రాకెట్ సైన్సా. బెంగాలోడి మేజిక్కా. కాదు కదా. ఆ మొదటోడు లోకరీతి తెలిసినోడయ్యుంటాడు. ఆడు షాక్ కొట్టిందని ట్యూబ్ లైట్ ఆపేసి నూనె దీపం ఎలిగించడు. రోడ్లు రత్తాలోడుతున్నా బండి తియ్యడం మానేడు. పిడుగులు పడుతున్నా యవసాయం వొగ్గేసికోడు. ఎప్పుడో బూకంపాలొస్తాయని ఇప్పుడు మరో ఇల్లు లేపడం మానుకోడు”

“ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా, లేని వాటికోసం ఆరాటపడిపోతూ, ఎవడి ముగ్గు వాడే వేసేసుకుంటుంటాడు మావయ్యా”

“చూడు బాబూ. కాకినాడ కోటేశ్వరరావు గార్లా నాకేదో మెసేజి ఇద్దామనుకుంటున్నావేమో. వచ్చేజన్మలో కోడలిగా పుట్టాల్సి వస్తాదని ఈ జన్మలో అత్త అత్తేసాలెయ్యడం మానేస్తదా? వయసైపోయాక ఓల్డ్ ఏజ్ హోము మెట్లు ఎక్కకుండా తప్పించుకోటాకి మరదలితో సమానంగా అక్కచెల్లినీ, బామ్మర్డితో సమానంగా అన్నదమ్మున్నీ చూసుకుంటాడా. అత్తా మావతోబాటు అమ్మా నాన్నని ఏ ఎదవైనా అమెరికాకో, ఆస్ట్రేలియాకో యాత్రలు చేయిస్తడా. అదదే. ఇదిదే. దేనికదే! అల్లాగే మనవూనూ. ఎక్కడో యెవుడో సన్నాసిగాడు దొరికేశాడని మనం చేతులు ఎండగట్టేసుకొని ఉజ్జోగాలు ఎలగబెట్టేలేము”

“రోజులన్నీ ఒకే లాగుండవు కదా మావయ్యా”

“అల్లుడూ, బయాన్ని బయపెట్టేటోడే ఈరోజుల్లో సుకపడతాడు. పెళ్ళాం బిడ్డల్ని సుకపెడతాడు. రెండు మూడు తరాలకు సరిపడా మేసేసి, ‘బోర్న్ కరోర్పతీస్’ ట్యాగ్ ను తగిలించేసుకుంటాడు. ఓపాలి ఆ లెక్కలు తిరగేసి చూడు. దేశంలోని కోట్లమంది లంచాగొండుల్లో ఎసిబి వోల్లు ఎన్నివేల మందిని పట్టేసుకున్నారు. ఎన్నివందల కేసులు కోర్టు మెట్లు ఎక్కుంటాయి. ఎంతమంది జైలుకెల్లొచ్చారు. నీకు తెలిసి ఎంతమంది సన్నాసులు సస్పెండయ్యుంటారు” అని ప్రశ్నించాడు.

సత్యంబాబు నవ్వేస్తూ “తెల్లారితే మాస శివరాత్రి. గుళ్ళన్నీ సన్నాసులతో నిండిపోతాయి. ఎన్ని గంటలకు వెళ్ళాలో చెప్పు”

“చూడమ్మా. అల్లుడు గారు నామీదే సెటైర్లేస్తన్నాడు”


ఐసియు లో రాంబాబు. సెలైన్ బాటిల్ నిండుకుంటోంది. తలనుండి చాతీ వరకు బేండేజ్ చుట్టేసుంది. మొహంలో చిరునవ్వుతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తండ్రిని చూస్తూ ఉద్వేగం చెందాడు సత్యంబాబు. సేవాభావంతో హుషారుగా వెళ్లిన తండ్రికి ఎందుకిలా జరిగిందా అని కళ్ళల్లో తడి. మరోపక్క గొప్పగొప్ప ఆశయాలతో అర్థవంతంగా ఎందరికో ఆదర్శవంతుడైన తండ్రిని చూస్తే గర్వం. తండ్రి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆర్ద్రతతో చిన్నగా నొక్కాడు.

సత్యంబాబు ఐసియు నుండి బయటకు రాగానే, మిగతా వారు ఒక్కొక్కరిగా చూసొచ్చారు.

కాళ్ళకూ చేతులకూ చిన్న చిన్న కట్లు, టించర్ అద్దిన గాయాలతో తాతారావు హాల్లో కూర్చొని ఉన్నాడు.

“మొన్నటి సంఘటన గుర్తుకొస్తేనే వెన్నులో వొణుకు పుట్టుకొస్తన్నాది బాబు” చుట్టూ చేరిన వాళ్ళతో అన్నాడు.

“జనాలు వేలల్లో తిరుమల శ్రీవారి సేవలకు వెళుతుంటారు. ఆపదమొక్కులవాడు మాత్రం ప్రాణాలకు తెగించి ప్రాణాలను కాపాడే మీలాంటి ఆపద్భాంధవులనే అభిమానిస్తాడని నా విశ్వాసం తాతారావు గారు”

“ఏమో బాబూ. రాంబాబుగారి లాటి రాముడితో రాంబంటుల్లా వందలమందికి సేవలు చేసాము. పదిమంది ప్రాణాలను కాపాడే అదృష్టం దక్కింది. లీడర్ కు అర్థం ఆయనేబాబూ. ఆయనే తెగించకుండా మమ్మల్ని ముందుకు తోసేసుంటే, మాకాయేలే నూకలు చెల్లిపోయుండేవి. ఈ జన్మంతా మీ నాన్నగారికి రుణపడి ఉంటాము బాబూ” మూసుకున్న కళ్ళల్లోంచి నీటి బొట్లు.

“ఏదీ ఒకరిద్దరి వల్ల సాధ్యం కాదండీ. అంతా టీము వర్క్” అంటూ సత్యంబాబు అతని చేతిని మృదువుగా నొక్కాడు.

“తాతారావు గారూ. మిమ్మల్ని చూడ్డానికి కలెక్టర్ గారు వస్తున్నారు” ఆమాట సత్యంబాబు వెనకనుండి వినపడింది.

తాతారావు గారు తలెత్తి చూసి “వాసుదేవ రావు గారా. వొచ్చి ఎంతసేపయ్యింది”

“రాముడి గురించి రాంబంటు చెప్తూ పరవశించి పోతున్నపుడే వచ్చామండీ” అంటూ నవ్వాడు.

“సత్యంబాబూ, వాసుదేవరావుగారనీ సీనియర్ జర్నలిస్టు. హెలిపేడ్ లో వీరే రిసీవ్ చేసుకున్నారు. కలెక్టర్ గారితో మాట్లాడుతూ మాకు ట్రీట్మెంట్, తిండి ఏర్పాట్ల కోసం నానా తిప్పలూ పడ్డారు”

రెండు చేతులెత్తి “రుణపడి పోయాం సార్. రాంబాబు గారి అబ్బాయిని” అంటూ కాళ్ళకు నమస్కారం పెట్టాడు సత్యంబాబు.

వాసుదేవరావు ఆయన్ని వారిస్తూ తన వారిని పరిచయం చేశాడు “వీరంతా టీవీలకు, పత్రికలకు కథలు కథనాలు రాస్తారు. లేపనాలు పూస్తారు. లేకి వేషాలు వేసేవారికి వాతలు పెడతారు, అవసరపడితే ప్రభుత్వాలమీద పిడుగులు కురిపిస్తారు”

చిరునవ్వుతో సత్యంబాబు అందరితో చేతులు కలిపాడు

“వీరు బోను అప్పారావు గారు. మా నాన్నగారికి బాసు. వేపాడ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు”

ఇంతలో ఆసుపత్రి ఆవరణంతా ఒకటే హడావుడి. కలెక్టర్ గారు మిగతా ఆఫీసర్లూ వచ్చారు.

వారంతా సత్యంబాబు ను తీసుకొని ఐసియు లోకి వెళ్ళారు. కూడా వాసుదేవరావు వెళ్ళాడు.

రాంబాబు గారి హెల్త్ కండిషన్ను డాక్టర్లు వివరించారు.

కలెక్టర్ బయటకు రాగానే రిపోర్టర్స్ చుట్టుముట్టారు. ఆయన రాంబాబుకు ప్రాణాపాయం లేదని ప్రకటించారు.

“కాని స్పైనల్ ఇంజురీ అయిందంటున్నారు. ఇంకా వెన్నుముక వ్యవస్థకు పరీక్షలు జరగాలని డాక్టర్లు చెప్తున్నారు”

“సార్. రాంబాబు గారి తోబాటు వచ్చిన తాతారావు కోలుకున్నారు” అంటూ కలెక్టర్ గారికి పరిచయం చేశాడు వాసుదేవరావు.

“చెప్పండి తాతారావు గారు. ఇపుడు తేలిగ్గా ఉందా? ట్రీట్మెంట్ బాగుందా? ఏమైనా తీసుకున్నారా?” అంటూ ఆప్యాయంగా కుశలాలడుగుతూ ఆయన పక్కనే కూచున్నారు కలెక్టర్ గారు. సత్యం బాబు, హెచ్ ఎం గారు, విలేకర్లు ఆయనకు దగ్గరగా కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చున్నారు.

“తాతారావు గారు, ఓపికుంటే ఏం జరిగిందీ బ్రీఫ్ గా చెప్పండి. ఒడిశా ప్రభుత్వానికీ రిపోర్ట్ పంపించాలి” కలెక్టర్ గారు కోరారు.

విలేకరులంతా తాతారావు వైపే చూస్తున్నారు.

“ఫోనీ ఎఫెక్ట్ సిక్కోలుకు తప్పిందని తెలిసినాక, నాలుగు టీములను ఒరిస్సా భువనేశ్వర్ గోపాలపురం కోణార్క్ లో రిపోర్ట్ చెయ్యమన్నారు. రాంబాబు గారి టీముతో బాటు మమ్మల్ని పూరీ కి ఎయిర్ లిఫ్ట్ చేసారు. మేం పూరీ చేరేకాటికి ఎన్ డి ఆర్ ఎఫ్, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీ, పోలీసులు, స్వచ్చంద సంస్థలు ఒకటే అడావుడి.

మాకు పూరి పోలిమేర గ్రామాలు కేటాయించారు. ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్‍తో మాకో జీపు కేటాయించారు. మాలో ఎవలికీ ఒడియా రాదు. నేను కొన్నాళ్ళు చత్రపూర్లో రైల్వే లో డ్యూటీ చేశాను. చిన్న చిన్న పదాలు అర్థమవుతాయి. ‘రా’, ‘పో’ వచ్చు

పూరి చుట్టూరా బోలెడన్ని గుళ్ళూ మఠాలునూ. బాధితులందరికీ వాటిల్లోనే బస. నీళ్లు తిండీ సప్లై, మెడికల్ కేంపులూనూ”

బిస్కట్స్ టీ తెచ్చిపెట్టారు. “టీ తీసుకుంటారా?”

“చెప్పేసినాక తాగుతానండి. బ్రేకులోస్తే పాయింట్స్ మిస్సవుతానండి” అంటూ కళ్ళు మూసుకుని చెప్పసాగాడు.

“సరి సరి. మేం మధ్యలో మాట్లాడం” అనేసి వాసుదేవరావు మిగతా వారివైపు చూశాడు.

“టైం మద్యాహ్నం రెండే. ముసురు. చీకటి కమ్మేసింది. వాన దంచి కొడతావుంది. పూనకమొచ్చినట్టు చెట్లు పిచ్చి పిచ్చిగా దిశా దిక్కూ లేకుండా గాలి కొడతాఉన్నాయి. చలి ఎక్కువైంది. పూరి చుట్టుపక్కల గ్రామాల్లో మేం చేరక ముందునుండీ కరెంటు ఊసేలేదట. వెలుతురుకోసం, వేడికోసం మంటలేసుకోవాలన్నా కాలేవన్నీ నాని పోయుంటాయి. అక్కడి పల్లెల్లో పరిస్థితులు అలా ఉన్నాయి. పగోడికి కూడా వొద్దు సార్”

“ఎమోషన్ అవకుండా కంటిన్యూ చెయ్యండి”

“ఆటూ పోటుతో సముద్రపు నీరు మమ్మల్ని ముందుకు పోనివ్వడంలేదు. రోడ్డా కాలవగట్టా, గెడ్డా గోర్జా ఏం తెలియరాలేదు. ఏవూరో. పొలిమేరల్లో రెండు గుడిసెలు. గుడిసెలచుట్టూ సముద్రం. ఒకటి పూర్తిగా నీళ్ళల్లోకి ఒరిగిపోయుంది. ఆ గుడిసెల్లో జనాలు చిక్కుకొని ఉంటారని మా లీడరు అంచనా. జీపును ఆపమన్నారు. హ్యాండ్ మైకులో ‘బిత్తరీకే అచంతికి’ అనీ, ‘బాహర్కో అసంతు’ అనీ నాకొచ్చిన ముక్కల్ని అరిచాను. కనీసం రెండు కిలోమీటర్ల మేర వినిపించే పవర్ఫుల్ మైకులండి. రైల్వే వారివి. ‘తుమోకో రక్షా కోరివాకో ఆశిషు’ అనీ ‘హమోశో పూరీకో నేగూ’ అనో పిలిచి పిలిచి అలిసిపోయాను. ఎవరూ బయటకు రాలేదు”

తాతారావు చెప్పుకు పోతూనే ఉన్నాడు. ఇంటరెస్టింగ్ గా ఉంది. జర్నలిస్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకు పోతున్నారు.

“రాంబాబు గారు ఆ గుడిసెల దగ్గరికి వెళ్దామన్నారు. అక్కడెవరూ ఉండి ఉండరు. ఉంటే పలికేవారు కదండీ అన్నాం. లేటు చేస్తే సాయం అందించలేమని అనుకున్నాడో, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనుకున్నాడో ఏమో మరి, తానే రెడీ అయ్యారు”

తాతారావు తను విసువలైజ్ చేసి చెప్తున్నట్టు గా ఉంది.

“మాస్టారు కాలి అంచనాతో మోకాలి లోతుకు మించిన నీళ్ళలో ఉరుకుతున్నారు. పాములూ తేళ్ళూ మండ్రగబ్బలు ఏమైనా కొట్టుకుంటూ రావొచ్చు. కాటేయవొచ్చు. ఒక్కసారిగా అప్పారావు కేకలేసాడు. అందరం బయపడిపోయాం. రాంబాబు గారు నీళ్ళలోకి జారి పోయారు. ఒక్క ఉదుటున నలుగురమూ, అతని నడుముకు కట్టిన నైలాన్ రోపును మావైపుకు లాక్కున్నాం. రాంబాబు గారు అతి చాకచక్యంగా అవతలి వొడ్డేపు చేరి చెయ్యూపడం ఫ్లడ్ లైటులో కనబడింది”

“గ్రేట్. బ్రేవ్ మేన్” కలెక్టర్ గారు ముక్తాయిస్తూ ఉన్నారు.

“మేం మాస్టారినే ఏకదీక్షగా గమనిస్తూ ఉన్నాము. మొదటి గుడిసె తాటాకుల్లో ఓ నాలుగు పక్కకు లాగి లోపలికి చూసారు. ఎవరూ లేరని మాకు సైగలతో చెప్పారు. పక్క గుడిసెలో కూడా ఎవరూ లేకుండా ఉంటె బాగుంటాదని మా కోరిక”

“ఆ గుడిసే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా తాతారావు గారూ” అంటూ టీ కప్పు అందించాడు సత్యంబాబు.

టీ తాగేక తాతారావు మళ్ళీ మొదలు పెట్టాడు “రెండో గుడిసె దగ్గరకు వెళ్తూ కాలికి చుట్టుకున్న పెద్ద పామును చేత్తో అల్లంత దూరానికి విసిరేసారు. అది చచ్చిందో బతికున్నదో ఆయనా గమనించి ఉండరు. అమ్మయ్యా. పెద్ద గండమే తప్పింది. రాంబాబు గారు రెండో గుడిసెలోకి దూరిన రెండు నిమిషాల్లోపలె అది ఉన్నపలంగా కుప్పకూలిపోయింది, మాకందరికీ ఒకటే షాకు. అందరం హాహాకారాలు చేసాము. షాక్ నుండి తేరుకొని చూస్తే గుడిసె నేలమట్టం కాలేదు. మధ్యనున్న తాటి స్థంభం కుంగి పోలేదు. నేనూ జగన్నాధన్ ఉన్నపలంగా నీటిలోకి దూకేసాము. మిగతా వాళ్ళు లైటింగ్ ను గుడిసెమీద మా మీద ఫోకస్ చేస్తూనే ఉన్నారు. మేము గుడిసె దగ్గరకు చేరుకొని మా దగ్గరున్నపనిముట్లతో తాటి ఆకుల్ని తొలగించి చూసామా? లోపలి సీను భయంకరంగా అగుపించింది. రాంబాబు గారు వొంగిపోయి ఉన్నారు. అతని తల మెడ బుజాలు ఈపు మీద కూలిపోయిన గుడిసె బరువంతా ఆనిపోయింది. ఒరిగిపోయిన మంచె ను నీటిలోకి జారకుండా పంటి బిగువున పట్టుకున్నారు. మంచె మీద పది పన్నెండుమంది. స్పృహలో ఉన్నారో ఊపిరితోటే ఉన్నారో లేదో ఏమీ తెలీదు. ఇద్దరో ముగ్గురో చిన్నపిల్లలు. వాళ్ళ పరిస్థితి ఏటో. మాలో విపరీతమైన ఆందోలన. దూరంగా హెలికాప్టర్ శబ్దం. రాంబాబు గారికి ఆ ముక్క చెప్పి ధైర్యం గా ఉండమన్నాం. ఆకాశం లోకి చేతులు తిప్పుతూ చూపించాము. చాప్టర్ లో వాల్లకు ఇనబదేటట్టు మావాల్లు మైకులో కేకలు పెడుతూనే ఉన్నారు. నా మేరీన్ హెడ్ సెట్ తలనుండి తీసేసి లైటింగును ఆకాశం లోకి ఫోకస్ చేస్తూనే ఉన్నాను. మావాల్లు కూడా” హెలికాప్టరు మా వేపే వస్తున్నశబ్దం. మొత్తానికి వచ్చింది. వచ్చి అటేపున మా వారి తల పైన నిలబడింది. పైనుండి వల లాటి ఉట్టిని వేలాడదీశారు. వాల్లు ఎక్కడమూ మా పక్క దిగిపోవడమూ జరిగిపోయింది. అందులోంచి మావాల్ల తో బాటు నిపుణులూ దిగారు. చాప్టర్ గాల్లో తిరుగుతూనే ఉంది. గుడిసె చూరు ఎత్తి చూసాము.

మా రోజుల్లో హెర్కులెస్ గురించి చదువుకున్నాం. మాకు రాంబాబు గారు అలాగే కనిపించారు. ఆయన ఆ బరువును తీసుకోలేక దించేసుంటే, ఆ పది పన్నెండు మందీ, పిల్లాజెల్లా జీవసమాదే. మహానుభావుడు. పదిమందికి ప్రాణ దాత.

ఆయన ఎత్తి పట్టుకున్న నాలుగడుగుల సందులోనుండే అందర్నీ బయటికి లాగేసాము. అక్కడకు కొట్టుకొచ్చిన కొయ్యలతోటే నేలపాదుకట్టాము. నలుగురమూ పాక్కుంటూ లోనికి దూరి రాంబాబు గారు మోస్తున్న బరువును తీసుకొన్నాము. మరో నలుగురు రాంబాబు గార్ని మెల్లగా బయటకు పట్టారు. గంటకు పైగా అలవికాని బరువును పంటి బిగువున నిలబెట్టిన రాంబాబు గారు బయటకు రాగానే నేలమీదికి కూలబడిపోయారు.

ఉన్నపళంగా రాంబాబు గార్ని చాప్టర్ లోకి ఎక్కించారు. ఆ గుడిసేలోనించి బయటికి లాగిన వార్నీ పిల్లల్నీ ఎక్కించుకున్నారు. నన్నూ ఎక్కమన్నారు. పూరి పెద్దాసుపత్రి కి తీసుకొచ్చారు. అక్కడనుంచి ఇక్కడికి. ఆ తర్వాతివి అన్నీ వాసుదేవరావు గారే చూసుకుంటున్నారు”

తాతారావు మాటలు ముగిస్తుండగా కలెక్టర్ గారితో బాటు అక్కడున్న అందరూ చప్పట్లు కొడుతూ తాతారావు గార్ని అభినందించారు. కలెక్టర్ గారు లేచి నిలబడ్డారు “అత్యంత ధైర్య సాహసాలను కనబరిచి తన ప్రాణాల్ని పణంగాపెట్టి పది కుటుంబాల్ని రక్షించిన రాంబాబు గారిని యావద్దేశం అభినందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ‘బ్రేవరీ’ అవార్డుకు రాంబాబు గారి పేరును ప్రతిపాదిస్తున్నాము” అని చెప్పడంతో మళ్ళీ అందరూ చేతులూపుతూ తమ హర్షాతిరేకాన్ని ప్రకటించారు.

“ఈరోజు నుండే రాంబాబు గారిని ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి ప్రభుత్వం తరఫున సిఫారసు చేస్తున్నాము” అని కలెక్టర్ గారు ప్రకటిస్తూ సత్యంబాబు భుజం తట్టారు. రాంబాబు కోలుకునే వరకు ప్రభుత్వమే వైద్యసేవలు అందిస్తుంది”

తాతారావు భుజం మీద చేస్యి వేస్తూ “తాతారావు గారికి, మిగత టీం సభ్యుల వైద్యానికయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. వీరందరి సేవలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తిస్తుంది. రాంబాబు గారు తాతారావు గారు మిగతా పెద్దలందరూ మాబోటి యువతరానికి స్పూర్తిగా మిగిలిపోతారు” అని కలెక్టర్ గారు ప్రకటించారు.

సత్యంబాబును, వేపాడ హెచ్ ఎం బోను అప్పారావు ను, మిగతా టీం మెంబర్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో కలెక్టర్ గారు ఫోటోలు దిగాక అక్కడనుండి వెళ్ళిపోయారు. తర్వాత వస్తానని చెప్పి వాసుదేవరావు కలెక్టర్ కూడా వెళ్ళాడు.

ఆసుపత్రి హాల్లో టీవీ రన్నవుతోంది. అక్కడున్న అందరి దృష్టీ టీ వీ మీదే ఉంది.

లోపలికొచ్చిన సత్యం బాబుతో హెచ్ ఎం గారు చెప్పారు రాంబాబు గురించి టీ వీ లో కవ రే జ్ వస్తోంది చూడమని.

సత్యంబాబు టీవీ వైపు చూస్తున్నాడు. తండ్రి గారి హుదుద్ తితలి సైక్లోన్ నాటి ఫైల్ ఫోటోలు చూపెడుతున్నారు. ఓపక్క బాధ పడే సన్నివేశం, మరో పక్క కలెక్టర్ గారి అభినందనలు, ప్రభుత్వం వారి ప్రోత్సాహక ప్రకటనలు సాంత్వన కలిగించాయి.

ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డట్టుగా “మాస్టారూ ఈ స్క్రోలింగ్ చూడండి. మా మావయ్య ఎ సి బి వాళ్లకు దొరికిపోయాడు”

“అవునా. అయ్యో పాపం. “మేవూ అపుడపుడు అనుకునే వాళ్ళం. మీ నాన్న గారితో కూడా అనేవాళ్ళం. సారీ సత్యంబాబూ”

“ఇన్నేళ్ళకు మరో మంచి పని జరిగింది మాస్టారూ. ఒక్క మా మామయ్యను పట్టుకోడానికే పాతికేళ్ళు పట్టిందే. ఈ లెక్కన కోట్లలో ఉన్న లంచ గొండుల్ని వాళ్ళ లైఫ్ టైములో పట్టుకోలేరేమో. మా మామయ్య చెప్పింది కరెక్టే అనిపిస్తోంది”

మాస్టారు స్క్రోల్ అవుతున్న మేటర్ను పడే పడే చదువుతున్నారు. “ఉత్తరాంధ్ర నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కన్నబాబు ఆఫీసు, ఇంటిపైన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏక కాలలంలో దాడిచేసి పెద్ద మొత్తం లో నగదు నగలు భూమి కొనుగోలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తీ అందించిన సమాచారం మేరకు అ.ని.శా. ఈ దాడులు జరిపింది. కన్నబాబు ఏకైక కుమార్తె ఇంటి లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి”

“సత్యంబాబు. పాపం మీ మిస్సెస్ వొంటరిగా ఉంది కదా. తండ్రి గురించి బెంగపడుతూ ఉంటుంది. ఫోను చెయ్యరాదూ”

“చేస్తాను మాస్టారు” అని నవ్వుకుంటూ హాలు బయటికి వచ్చాడు. ఫోను ఆన్ చేసి, రవణమ్మ కు ఫోను చేశాడు.

బావా అంటూ ఏడ్చేసింది “ఎన్నిసార్లు చేసినా నీ ఫోను ఆఫ్ చేసుందనే సమాధానం వస్తున్నాది బావా”

“ఆసుపత్రి కదా. ఫోను ఆఫ్ చేసుంచాలి”

“ఏంటి బావా ఇదీ. ఎ సి బి పిచ్చి పిచ్చి ప్రశ్నలడుగుతున్నారు”

“తెలిసిన వాటికి దాపరికం లేకుండా జవాబులు చెప్పేసెయ్. తెలియని వాటికి తెలియదని చెప్పెసేయ్”

“వెంటనే రాగలవా బావా”

“నాన్న ఐ సీ యు లోనే ఉన్నారు రవణా”

“మరెలా బావా. ఒక్కదాన్నే బిక్కూ బిక్కూమంటూ బెంగగా ఉంది. ఏం తోచడం లేదు. మా నాన్న నుండి ఒకటే ఫోన్లు.

“ఎ సి బి వాళ్లకు తాళాలిచ్చేశావా. వెతుక్కోమను. నువ్వు ప్రశాంతంగా టీవీ చూస్తూ పాపతో కాలక్షేపం చేసేయ్. మీ మావయ్య గారి గురించి అన్ని టీ వీ ల్లో కవరేజ్ వస్తోంది. చూడు. పాపకు అర్ధంయ్యేటట్టు చెప్పు. గంటకోసారి ఎ సి బి వాళ్లకు టీ బిస్కట్స్ ఇస్తుండు. సరేనా. ఐ సీ యు నుండి వార్డుకు మార్చగానే నాన్న గారి ఫ్రెండ్ వాసుదేవరావు గారనీ. ఈ ఊరే. ఆయనకు అప్పజెప్పేసి వస్తాను. సరేనా!” అనేసి ఫోను పెట్టేసాడు సత్యం బాబు.