“ఈసారి మీరు సబ్జక్టు మార్చాలి” అన్నాడు ఖ్యాతి వారపత్రిక సంపాదకుడు శ్రీనాథ్.
చురుగ్గా చూశాను.
రచయితని. కళ్లలోకి చూసి ఎదుటివాళ్ల భావాల్ని పసి కట్టగలను. అతడు కాకతాళీయంగా కాదు, ఖచ్చితంగానే అన్నాడా మాట.
నేను ప్రేమ కథల స్పెషలిస్టుని. ఆ సబ్జక్టుమీద ఖ్యాతి వారపత్రికలో ఇప్పటికి నాలుగు సీరియల్సు వచ్చాయి. అన్నీ పెద్ద హిట్. వాటిలో రెండు సినిమాలుగా వచ్చి హిట్టయ్యాయి. ఒకదానికి ఓ ప్రముఖ నిర్మాణసంస్థ హక్కులు తీసుకుంది.
కథా సాహిత్యంలో ప్రేమని మించిన సబ్జక్టు లేదు. అందులో నవరసాలూ పండించొచ్చు. జీవనదిలాంటి ప్రేమ ప్రవాహంలో కథాంశాలు అనంతమే కాదు, నిత్యనూతనం కూడా. అందుకే ఆదికావ్యమైన రామాయణం ఇప్పటికీ ఒక అద్భుత ప్రేమకథగా ఆకర్షిస్తోంది.
అసలు మన ప్రాచీన గ్రంథాలన్నీ ప్రేమకావ్యాలే. రామాయణంలో ప్రేమ భక్తితో ముడిపడితే, మహాభారతంలో ప్రేమకి రాజకీయం అనుబంధమైంది. భాగవతంలో ప్రేమ వేదాంతసారమైంది.
మన పురాణాల్ని ఔపోసన పట్టడంవల్లనే నా ప్రేమ కథలు రసవత్తరమయ్యాయని నేననుకుంటాను. ఐతే కథలకు ప్రేమ ఒక్కటే సబ్జక్టని నేనూ అనుకోను. ప్రేమ ప్రసక్తి ఏమాత్రం లేకుండా – ధనిక, మధ్య, అట్టడుగు వర్గాలనుంచి ఎన్నో ఇతివృత్తాలున్నాయి. వాటిని కొత్త కోణంలో ప్రదర్శించే అవకాశమూ ఉంది. ఎటొచ్చీ నా దగ్గర ఇంకా కొన్ని ప్రేమ కథాంశాలున్నాయి. అవయ్యేక ఇతర సబ్జక్ట్లలోకి వద్దామనుకుంటున్నాను.
కానీ, శ్రీనాథ్ అడుగుతున్న సబ్జక్టు వేరు. హింసకీ, పతనానికీ, దగాకీ, అసభ్యతకీ ప్రాధాన్యమిస్తూ – వాటికి ఘనత నాపాదించే దృక్కోణముంది. ఆహ్లాదకరమైన ప్రేమను వదిలి, అలాంటి సబ్జక్టుకి వెళ్లడం నాకు సుతరామూ ఇష్టం లేదు. అది శ్రీనాథ్‍కి నేరుగా చెప్పొచ్చు. కానీ, మనసులో చిన్న అనుమానం. పాఠకులకి ప్రేమకథలపై ఇష్టం తగ్గిందా? సంపాదకుడిగా అతడా విషయం గ్రహించాడా? సబ్జక్టు మార్చమనడానికి కారణం అదేనా? నేరుగా చెబితే నొచ్చుకుంటానని ఇలాగన్నాడా?
ఏదేమైనా, శ్రీనాథ్ అంత మర్యాదగా చెప్పినప్పుడు, నేను ఠకీమని కొట్టిపారెయ్యడం మర్యాదగా ఉండదు. అందుకే, “నా దగ్గర ప్రేమ విషయంలో సమకాలీన యువతని ఆలోచింపజేసే ‘ప్రేమాంతకులు’ అనే సరికొత్త కథాంశముంది. లీడ్ ఇన్సిడెంట్లు వ్రాసి తీసుకొచ్చాను. చదవండి. ఆ తర్వాత మళ్లీ మాట్లాడుకుందాం” అన్నాను.
శ్రీనాథ్ మర్యాదస్థుడు. నామీద గౌరవమున్నవాడు. అయిష్టతను దాచుకునే ప్రయత్నం చేస్తూనే నేనిచ్చిన కాగితాలు అందుకున్నాడు. నాకో నోట్ బుక్ ఇచ్చి, “ఇందులో నేను చెప్పిన సబ్జక్టుమీద ఆంగ్లంలో వచ్చిన ఓ నవలకు సినాప్సిస్ ఉంది. ఆ తరహా సబ్జక్టుని మీరైతే ఇంకా బాగా డీల్ చేస్తారని నా నమ్మకం. నేనిది చదివేలోగా, మీరది చదువుతూండండి” అన్నాడు.
తన సబ్జక్టు విషయమై శ్రీనాథ్ పట్టుదల అర్థమైంది. ఐనా నాకు నమ్మకమే, లీడ్ చదివేక శ్రీనాథ్ ఉద్దేశ్యం మార్చుకుంటాడని!
శ్రీనాథ్ ఇచ్చిన నోట్ బుక్ తెరిచాను. అది నేను చదివిన నవలే! ఈ సినాప్సిస్ ఎందుకూ – అందులోని ప్రతి సన్నివేశమూ నన్ను ఇప్పటికీ వెంటాడి వేధిస్తూనే ఉంది. ఆ సబ్జక్టుపై నాకేర్పడిన నిరసన భావానికి ఆ నవల కూడా ఒక కారణం.
నేను శ్రీనాథ్ ఇచ్చిన సినాప్సిస్ చూస్తున్నా కానీ చదవడం లేదు. నా మనసు శ్రీనాథ్ చదువుతున్న నా లీడ్సునే అనుసరిస్తోంది
2
లత, సోము ఒకే కాలేజిలో చదువుతున్నారు. కాలేజిలో సోము లతకి ఏడాది సీనియర్.
ఇద్దరూ ఒకే వీధిలో ఉంటారు. ఒకే బస్సులో కాలేజికి వెడతారు. అలా రోజూ ఒకరినొకరు చూసుకుంటూంటారు.
సోముకి లతపై ఆకర్షణ బయల్దేరింది. ఒకరోజామెను చూసి నవ్వాడు. ఆమె ముఖం ముడుచుకోలేదు. తనూ నవ్వింది. ఆ నవ్వుల పరిచయం మాటల్లోకి వచ్చింది. కొన్ని వారాలు గడిచేసరికి, సోము ఐలవ్యూ చెప్పేశాడామెకి.
కనబడినప్పుడల్లా తననీ, తన అందాన్నీ పొగుడుతూండే సోము లతకీ నచ్చాడు. ఐతే తనూ వెంటనే ఐలవ్యూ చెప్పలేదు. అలాగని దూరం పెట్టలేదు. అదే పదివేలనుకున్నాడు సోము.
ఇద్దరి పరిచయం వీధి దాటి పార్కులు, సినిమాల దాకా వెళ్లింది. నిప్పుంటే పొగొస్తుందిగా – విషయం లత అమ్మా నాన్నలకి తెలిసింది. తల వాచేలా చీవాట్లేశారు. భయపడిన లత విషయం సోముకి చెప్పి అతణ్ణి దూరం పెట్టసాగింది.
సోము వదల్లేదు. తనామెను ప్రేమించాననీ, తనతో వచ్చేస్తే పెళ్లి చేసుకుంటాననీ, అప్పుడెవరూ తమని విడదియ్యలేరనీ నచ్చజెప్పి చూశాడు. “అమ్మా నాన్నా ఒప్పుకుంటేనే మనకి పెళ్లి. మరి మన కులాలు కలవలేదు కాబట్టి వాళ్లు మన పెళ్లికి ఒప్పుకోరు. అంచేత నువ్వు నన్ను మర్చిపో” అంది లత.
సోము లతని మర్చిపోవాలని ప్రయత్నించాడు. వల్లకాలేదు. కనులు మూస్తే లత. తెరిస్తే లత. పుస్తకం తీస్తే లత. సినిమాకెడితే లత. అలా ప్రపంచమంతా లత మయమై కనబడుతోంది. లత మాత్రం కనుమరుగైపోయింది.
సోము బాగా ఆలోచించాడు. లత లేందే బ్రతకలేనన్న నిర్ణయానికొచ్చాడు. లత తనకి దక్కాలంటే ఒక్కటే మార్గం. ఆమెని ఇంకెవ్వరూ కోరకూడదు. కోరకూడదంటే ఆమె ఇంకెవ్వరికీ అందంగా కనబడకూడదు. తన ప్రేమకు రూపంతో నిమిత్తం లేదు కాబట్టి – ఆమె జీవితం నాశనం కాదు. తనామెను పెళ్లి చేసుకుని జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు.
సోము లతపై యాసిడ్ దాడికి పథకం వేస్తున్నాడు.
ప్రియ గ్రాడ్యుయేషన్ చేసి ఓ చిన్న కంపెనీలో డేటా అనలైజరుగా చేరింది. నెలకు ఇరవైవేల జీతం. అమ్మా నాన్నలతో ఉంటోంది కాబట్టి ఇంటద్దె లేదు. భోజనం ఖర్చు లేదు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అన్నయ్య, ఖరీదైన గిఫ్టులతో పాటు డాలర్లూ పంపిస్తుంటాడు కాబట్టి చేతినిండా డబ్బు. వీటన్నింటికీ మించి మితిమీరిన స్వేచ్ఛ.
ఐఫోనుంది. ఫేస్‍బుక్, వాట్సాప్ వగైరాల్లో అకౌంట్లున్నాయి. అబ్బాయిలు ఫ్రెండ్ రిక్వెస్టుకి తహతహలాడే ప్రొఫైలుంది. వాళ్లని స్క్రీన్ చెయ్యడానికి నమ్మకమైన వేరే ఫ్రెండ్ నెట్‍వర్క్ కూడా ఉంది.
ఫేస్‍బుక్ ఫ్రెండ్సులో ప్రియకి బాగా నచ్చినవాడు మురళి. స్ఫురద్రూపి. బాగా ఆర్జిస్తున్నాడు. ప్రేమకంటే ముందు పెళ్లి గురించి మాట్లాడే సంప్రదాయం పాటిస్తున్నాడు.
మురళి గురించి తన వాట్సాప్ సర్కిల్లో కొందర్ని వాకబు చేసింది ప్రియ. వాట్సాప్ సఖి నిర్మల మురళికి బ్రహ్మాండమైన సర్టిఫికెట్ ఇవ్వడంతో ప్రియకు అతడిపై నమ్మకం పెరిగి, పరిచయం ఫేస్‍బుక్ నుంచి ఫేస్ టు ఫేస్‍కి వచ్చింది. ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. “నిన్ను మా అమ్మానాన్నలకి పరిచయం చేస్తాను” అంది ప్రియ.
“ఇంకా పరిచయాలేమిటి? మన పెద్దలు పెళ్లి ప్రపోజల్సుతోనే కలుసుకోవాలని నా ఉద్దేశ్యం. ఐతే అంతకుముందు మనం అన్ని కోణాల్నించీ కంపాటిబిలిటీ టెస్ట్ చేసుకోవాలి” అన్నాడు మురళి.
ప్రియ చిన్నపిల్ల కాదు. అన్ని కోణాల్నించీ కంపాటిబిలిటీ అనడంలో అతడి ఉద్దేశ్యం అవగతమై వెంటనే, “కొన్ని కంపాటిబిలిటీస్ తెలుసుకుందుకు పెళ్లయ్యేదాకా ఆగక తప్పదు” అని కుండ బద్దలు కొట్టింది.
మురళి తడబడలేదు, “నీ సంకోచం అర్థం చేసుకోగలను. మన ఒప్పందం గురించి కాగితం వ్రాసి సంతకం పెట్టి నీకిస్తాను” అన్నాడు. ఆ అభ్యర్థనలో ఆశని పసిగట్టిన ప్రియ, “అసలిలాంటి ఒప్పందం అవసరమేమిటి?” అంది.
“ఇదే లేకుంటే – అరేంజ్డ్ మారేజికీ, మన పెళ్లికీ తేడా ఏముంటుంది?” అన్నాడు మురళి.
అతడన్న మాటలో నిజం లేకపోలేదని వయసామెకి చెప్పడం మొదలెట్టింది. ఆమె ఆలోచనలో పడిందని గ్రహించిన మురళి, “టేక్ యువర్ టైం! ఈలోగా నేనూ నీవైపునుంచి ఆలోచిస్తాను” అన్నాడు.
ఎందుకైనా మంచిదని ప్రియ తన వాట్సాప్ సర్కిల్లో మరికొందర్ని వాకబు చేసింది. మురళి గురించి ఎక్కువ తెలియలేదు కానీ, అతణ్ణి సర్టిఫై చేసిన నిర్మల గురించి బాడ్ రిపోర్ట్ వచ్చింది.
నిర్మలకు తొందరెక్కువట. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడమే కాదు – తన అనుభవాల్ని దాచిపెట్టి – తనను నమ్మిన మరికొందరికి చేతులు కాలే సలహాలిచ్చే రకంట.
ఇది తెలియగానే ప్రియ మురళితో కంపాటిబిలిటీ టెస్టుకి నో అనేసి, “నీకింకా నేనంటే ఇష్టమైతే, మీవాళ్లని తీసుకుని మా ఇంటికి రా. లేకపోతే నీకూ నీ ప్రేమకీ గుడ్ బై” అని చెప్పేసింది.
“సరే, ఆలోచిస్తాను” అని మామూలుగా బదులిచ్చినా, “ఇంతలా ప్రేమించాను. నన్ను అనుమానిస్తుందా?” అని మనసులో ఆగ్రహోదగ్రుడయ్యాడు మురళి.
ఆమెనెలాగో అలా నమ్మించి, ఆమెతో ఏకాంతం సంపాదించి, నయానా భయానా ఒప్పించాలనీ, ఒప్పుకోకపోతే కూల్‍డ్రింక్‍లో మత్తుమందు కలిపిచ్చి అత్యాచారానికి పాల్పడ్డమే ఆమెకు తగిన శిక్ష అనీ తన మనసుని నమ్మించి – అందుకు తగిన పథకం వేస్తున్నాడతడు.
సతీష్ కాలేజిలో మాథ్స్ లెక్చరర్. అందగాడు. అమ్మాయిల్లో అతడంటే కొంత క్రేజ్ ఉంది. ఆ విషయం అతడికి తెలుసు. అతడికి తన స్టూడెంట్ శాంత అంటే క్రేజ్. ఆ విషయం ఆమెకి తెలియదు.
లెక్కల్లో డౌట్లొచ్చి ఒకటి రెండు సార్లు ఆమె స్టాఫ్ రూంకి వెడితే, అతడి చూపుల్లో తేడాని పసిగట్టిందామె ఆడతనం. ఆ తర్వాతనుంచి అతడే ఆమెని ఏదో వంకన తన స్టాఫ్ రూంకి పిలవడం మొదలెట్టాడు. వేరెవ్వరూ లేని సమయం చూసి, స్నేహహస్తం చాపాడు. ఆ స్నేహంవల్ల కాలేజిలో కొన్ని ప్రయోజనాలుంటాయని గ్రహించి సరేనందామె. అలా అతడితో రెండుసార్లు కాఫీకీ, ఒకసారి సినిమాకీ వెళ్లింది. అతడా అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడు. కాఫీకి వెళ్లినప్పుడు మాటల్లో చొరవ. సినిమాకి వెళ్లినప్పుడు చేతల్లో చొరవ.
శాంత సినిమా సగంలో ఇంటికెళ్లిపోయింది. మర్నాడు సతీష్ ఆమెకు సారీ చెప్పి, “నాకు నువ్వంటే ప్రేమ. ప్రేమించడం తప్పు కాదు కదా!” అని తన చేతల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.
ఈలోగా శాంత సతీష్ గురించి కొంత వాకబు చేసిందేమో, “పెళ్లయినవాళ్లు వేరొకర్ని ప్రేమించడం తప్పే” అంది.
తను వివాహితుణ్ణని శాంతకి తెలిసినందుకు ఖంగు తిన్నా, వెంటనే తమాయించుకుని, “పెళ్లయినవాళ్లు వేరొకర్ని పెళ్లి చేసుకుంటే తప్పు. ప్రేమిస్తే తప్పు కాదు. నీకు పెళ్లయ్యేదాకా మనం ప్రేమించుకుందాం” అన్నాడతడు.
సతీష్ శాంత దగ్గర కాలేజిలో మిగతా అమ్మాయిల్ని ఆమెకంటే తక్కువ చేసి మాట్లాడేవాడు. ఆమె అందాన్ని, గుణగణాల్నీ తెగ పొగిడేవాడు. కాలేజిలో ఎన్నో ప్రేమ జంటలున్నాయన్నాడు. కాలేజి వదిలేక వాళ్లెవరూ పెళ్లి చేసుకోరన్నాడు. అందుక్కారణం ఈ వయసులో ప్రేమ ముఖ్యావసరం కావడం అన్నాడు. ఆపైన కాలేజిలో అతడివల్ల ప్రయోజనాలుండేవి. అందువల్ల ఆమెకు అతడి సాన్నిహిత్యం బాగుండేది. ఐతే స్నేహాన్ని కొనసాగించిందే తప్ప గీత దాటలేదు.
ఇంటర్ ఫైనల్ పరీక్షలయ్యేక ఒకరోజు సతీష్ ఆమెకి ఫోన్ చేసి, “లెక్కల పేపర్లు వెరిఫికేషనుకి నాదగ్గరకొచ్చాయి. నీకొచ్చిన మార్కులు 33. అంటే ఫెయిల్. గట్టెక్కాలంటే 33ని 38 చెయ్యాలి!” అన్నాడు.
“మరీ 33 రావడమేమిటి సార్! పేపరు బాగానే వ్రాశాను. కనీసం 60 మార్కులు రావాలి” అంది శాంత ఆశ్చర్యంగా.
“రాసినవాళ్లనుకున్నట్లు కాదు, దిద్దేవాడనుకున్నట్లు వస్తాయ్ మార్కులు. నీకొచ్చినవి ముప్పైపూడే. ఆ పేపరు నీ ప్రియుణ్ణి అయిన నా దగ్గరకు రావడం నీ అదృష్టం. అరవయ్యేం కర్మ! 33ని 88 చేస్తాను. రాత్రి ఎనిమిదింటికి మా ఇంటికొస్తావా?”
“ఇంటికెందుకు సార్?” అంది శాంత.
“ఇంటిదగ్గర కాకపోతే పేపర్లు కాలేజిలో దిద్దుతాననుకున్నావా? ఈ వ్యవహారం ఎంత రహస్యమో తెలుసా? వాల్యుయేషన్ అయ్యేదాకా ఇంట్లో ఎవరూ ఉండకూడదని మా ఆవిణ్ణి ఓ వారంరోజులకని పుట్టింటికి పంపేశాను”
శాంతకి విషయం అర్థమైంది. కొంచెం ఆలోచించి, “రేపు చెబుతా సార్!” అంది.
“రేపు పేపర్లు పంపెయ్యాలి. కాబట్టి వస్తే ఈవేళే రావాలి. ఐనా భయమెందుకు? నేను ప్రేమికుణ్ణి. చస్తే ప్రియురాలికి అన్యాయం చెయ్యను”
సతీష్ ఫోన్ పెట్టేసేక శాంత ఆలోచనలు పరిపరివిధాల పోయాయి. ఈ మార్కులు తనకి జీవన్మరణ సమస్య. సారుకి నిజంగా పేపర్లొచ్చాయా? రాకపోతే సరే – వస్తే మాత్రం – వర్తమానంలో వెనకాడితే, ఆతర్వాత తనకి భవిష్యత్తే ఉందదు.
శాంత లాభనష్టాల బేరీజులో ఉంది. అక్కడ సతీష్ – ఒక్కసారికి కాదు, ఎన్నిసార్లు పిలిచినా రాననలేని పరిస్థితి ఆమెకు కల్పించే పథకంలో భాగంగా తనింట్లో విడియో కెమేరా సిద్ధం చేసుకుంటున్నాడు.
“ఇక లాభం లేదు. ఈవేళ ప్రమీలని ఎటాక్ చెయ్యాలి. మిగతా ఇద్దరికీ కూడా చెప్పు” అన్నాడు ప్రదీప్ మిత్రుడు రఘుతో.
“ఎటాకేమిటి? నువ్వు ప్రమీలని ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావుగా” అన్నాడు రఘు.
“ప్రేమిస్తున్నా కానీ, వాళ్లింట్లో అందరికీ మన హిస్టరీ తెలుసు. మా నాన్న మినిస్టరని జంకారు కానీ, ఈపాటికే నామీద పోలీసు కంప్లయింటు ఇచ్చేసేవారు. నా పీడ వదుల్చుకుందుకు ప్రమీలకి తొందరగా పెళ్లి చేసెయ్యాలనుకుంటున్నారు. ఆ పెళ్లి ఆపాలంటే మనం తొందరపడాలి” అన్నాడు ప్రదీప్.
రఘుకి అర్థమయింది. తనెళ్లి గణేషుకీ, వీరేశుకీ చెప్పాలి. వాళ్లు కిడ్నాపులో, ముఖ్యంగా ఆడపిల్లల్ని కిడ్నాప్ చెయ్యడంలో సిద్ధహస్తులు. ప్రదీప్ వాళ్లతో డీల్ చెయ్యడు.
“వాళ్లు ప్రస్తుతం కాశీలో ఉన్నారు. అక్కడ గొప్పగొప్పవాళ్లు పాపాలు కడుక్కునేందుకు ఏదో యాగం జరుగుతోందిట. పనిలోపనిగా ఇలాంటివాళ్లూ దానికి వెడుతున్నారు. వాళ్లు రావాలంటే ఓ వారం రోజులైనా ఆగాలి నువ్వు” అన్నాడు రఘు.
“వారం రోజులంటే కుదరదు. రేపటిదాకా ఐతే ఫర్వాలేదు. వాళ్లని ఫ్లైట్లో వచ్చెయ్యమను” అన్నాడు.
“వాళ్లకి దేశవ్యాప్తంగా ఫాలోయింగుంది. అంత సులభంగా రారు. మంచి ఇన్సెంటివ్ ఉండాలి” అన్నాడు.
“జలజ ఫొటో వాట్సాప్ చెయ్యి. అంతకంటే ఇన్సెంటివేముంటుంది?” అన్నాడు ప్రదీప్ వెంటనే.
“జలజేమిటి? కిడ్నాప్ చెయ్యాల్సింది ప్రమీలనుగా” అన్నాడు రఘు ఆశ్చర్యంగా.
“జలజ నన్ను ప్రేమించింది. జలజని మోసం చెయ్యడం ఈజీ. ప్రమీలని నేను ప్రేమించాను. తనని మోసం చెయ్యడం కాదు, భయపెట్టాలి. జలజ గాంగ్‍రేప్‍లో మర్డరైపోతే – పోలీసులూ, న్యాయస్థానాలూ, నాన్న మద్దతుదారులూ తప్ప యావత్ప్రపంచం ఆ విషయాన్ని నమ్మితే – ప్రమీల వణికిపోతూ వచ్చి నాకు దాసోహమనదూ!” అన్నాడు ప్రదీప్.
“నీ ప్రేమ ఇంతా అంతా అనలేనంత గొప్పది” అన్నాడు రఘు. “పొగడ్తలు తర్వాత! ముందు పన్జూడు” మందలించాడు ప్రదీప్.
3
“లీడ్ చదివాను. టెరిఫిక్. థాంక్స్ – యూ కెన్ గో ఎహెడ్ విత్ ది నోవెల్!” అన్నాడు శ్రీనాథ్.
గర్వంగా నవ్వి, అతడి నోట్ బుక్ వెనక్కిస్తూ, “సినాప్సిస్ చదివాను. నవల నేను చదివిందే” అంటూ లేవబోతే, “ఒక్క నిముషం! కొత్త నవలకి నాదో చిన్న సజెషన్! లీడ్ అదే కానీ, సబ్జక్ట్ ప్రేమ కాదు. సెక్స్ అండ్ డ్రగ్ మాఫియాయే తీసుకోండి” అన్నాడు శ్రీనాథ్.
చిరాకుని మనసులోనే అణచుకొని, “సారీ! ఆ సబ్జక్టుపై నా అభ్యంతరాలు ముందే చెప్పాను. ప్రస్తుతానికి ప్రేమ సబ్జక్ట్ కొనసాగించి, తర్వాత రచనకి మరో సాంఘిక సమస్య తీసుకుంటాను. అప్పుడైతే కథాంశాన్ని మీరే సూచించొచ్చు. సెక్స్ అండ్ డ్రగ్ మాఫియాయే అంటే మాత్రం మీరు వేరే రైటరుకి చెప్పండి” అన్నాను కాస్త పట్టుదలగానే.
“మీరిచ్చిన లీడ్ చదవకపోతే, వేరే రైటర్ని అప్రోచ్ అయ్యేవాణ్ణేమో! ఎంత పకడ్బందీగా తీసుకొచ్చారు ప్లాటుని. ప్రేమని సెక్స్ అండ్ డ్రగ్ మాఫియా అనుకుంటే చాలు. నా సబ్జక్ట్ వచ్చేస్తుంది. ఆలోచించండి” అన్నాడతడు.
ఏదో అనబోయి ఉలిక్కిపడ్డాను. ఏమన్నాడు శ్రీనాథ్? హింస, పతనం, దగా, అసభ్యత – వీటికి ప్రాధాన్యముందని సెక్స్ అండ్ డ్రగ్ మాఫియా అంశాన్ని నిరసించాను. నా కథాంశంలో అవే నిండి ప్రేమని మాఫియా చేశాయని శ్రీనాథ్ అభిప్రాయం. అది నిజమే ఐతే ఆ విషయం ఇంతవరకూ నేనెందుకు గ్రహించలేదు?
సన్నివేశాలు మారాయేమో కానీ, శ్రీనాథ్ నాకిచ్చిన నవల సినాప్సిసులో అంశాలే నేను శ్రీనాథ్ కిచ్చిన లీడ్ లోనూ ఉన్నాయి.
ఆ విషయం నేను గ్రహించాలనే శ్రీనాథ్ – ఆ సినాప్సిస్ నాకిచ్చాడా? అసలతడు సబ్జక్టు మార్చమన్నదే అందుకా? రచయితలు కథాంశాన్ని సమర్థవంతంగా విశ్లేషించాలే తప్ప, కథాంశాన్నిబట్టి తమని తాము వర్గీకరించుకోకూడదన్న సందేశాన్ని అతడు నాకిస్తున్నాడా? ప్రేమ ఒక్కటే కాదు – ప్రజాసేవ, క్రీడ, కళ – చివరికి భక్తి కూడా సెక్స్ అండ్ డ్రగ్స్ మాఫియాగా మారిపోయింన విషయం నేను గుర్తించాలనుకుంటున్నాడా? అలా గుర్తించడంవల్లనే రచయిత సమాజపు దౌర్భాగ్యానికి అంతకుడు కావాలని ఆశిస్తున్నాడా?
సంపాదకుడిగా అతడు ఎదిగినట్లే ఉంది. రచయితగా నేనూ మరింత ఎదగాలని అతడి తాపత్రయం కాబోలు.
శ్రీనాథ్‍ని గంభీరంగా చూసి, “మీ ఉద్దేశ్యం అర్థమైంది. ఈ రచన నన్ను ప్రేమాంతకుణ్ణి చెయ్యాలి. అదే స్ఫూర్తితో మున్ముందు కథాంశాల ఎంపిక – ఒకో రచనని ఒకో సమాజపు దౌర్భాగ్యానికి నన్ను అంతకుణ్ణి చెయ్యాలి. అందుకు నేను ఇన్హిబిషన్సు నుంచి బయటపడాలి. ఔనా?” అన్నాను.
ఔనన్నాడో, కాదన్నాడో – చుట్టూ సమాజాన్ని తలచుకున్న నా మనసు మాత్రం తేలిక పడ్డానికి బదులు బరువెక్కింది.∗